Dabur red paste Butter.jpg|thumb|భారత దేశములో స్వాతంత్ర్య పూర్వమే స్థాపించబడిన పోల్సన్ బ్రాండు యొక్క వాణిజ్య ప్రకటన. పిల్లలు పోల్సన్ వెన్నని ఇష్టపడతారని, వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి సర్వత్రా లభించే అత్యుత్తమమైన పోల్సన్ వెన్ననే వాడమనే సందేశం ఆంగ్లంలో చూడవచ్చును. ఒక చిన్ని పాప బ్రెడ్డు ముక్క పై సంతోషంగా వెన్నని రాయటం, నేపథ్యంలో ఒక హోటల్ కి వచ్చిన జంటకి వెయిటర్ (బహుశా) పోల్సన్ కాఫీనే తీసుకురావటం ఈ ప్రకటనలో చూడవచ్చును. 70వ దశకం వరకూ పోల్సన్ బ్రాండుని వాడేవారు సంపన్న వర్గాలుగా గుర్తింపబడేవారు.]]

ప్రకటన (ఆంగ్లం: Advertising) అనేది సాధారణంగా ఒక వ్యాపారాత్మక/రాజకీయ/సైద్ధాంతిక సమర్పణకి సంబంధించి వీక్షకులని ఒక చర్యని చేపట్టటానికి లేదా అప్పటికే చేపట్టిన చర్యనే కొనసాగించటానికి ఒప్పించే విపణీకరణలో భాగమైన ఒక రకమైన భావప్రకటన.

ప్రకటన అనగా ఒక సంస్థ లేదా ప్రభుత్వము, అధికారికంగా ప్రజలవద్దకు చేర్చే సమాచారం. ఏ సంస్థ అయినా ప్రజలకు తెలియజేయవలసిన విషయాన్ని కొన్ని మాధ్యమాల ద్వారా ప్రజలవద్దకు తీసుకుపోయే ప్రక్రియ ప్రకటనా ప్రక్రియ. ప్రకటన ముఖ్య ఉద్దేశం, విషయ పరిజ్ఞానాన్ని ప్రజలకు తెలియజెప్పడం. పూర్వపుకాలంలో ప్రభుత్వపరమైన, లేదా అధికారిక పరమైన విషయాలను, ప్రజలకు తెలియజేసేందుకు "దండోరా" వేయించేవారు. ఇదొక ప్రకటనా మాధ్యమం. మనం తరచూ వార్తాపత్రికల్లోనూ లేక టీవిలోను ఈ ప్రకటనలను చూస్తూ ఉంటాము.

ల్యాటిన్ లో ad vertere అనగా "ఒక వైపుకి తిరగటం". ప్రకటన వీక్షకులని తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆంగ్లంలో దీనికి Advertisment అనే పేరు వచ్చింది. సంస్థ యొక్క నమ్మకాన్ని పెంపొందించుకొనటానికి, దాని యొక్క విజయాలు ఉద్యోగుల, వాటాదారుల కంటబడటానికి కూడా ప్రకటనలని వాడుకొనవచ్చును. వార్తాపత్రికలు, వారపత్రికలు, టెలివిజన్, రేడియో, బహిరంగ ప్రదేశాలు, ఈ-మైయిల్ వంటి సాంప్రదాయిక ప్రసార మాధ్యమాలతో బాటు, బ్లాగులు, వెబ్ సైట్లు, సోషల్ నెట్వర్కింగ్ వంటి ఆధునిక ప్రసార మాధ్యమాలలో కూడా ప్రకటనల సందేశాలని మనం నిత్యం చూస్తూ ఉంటాము.

బ్రాండింగ్ (ఒక ఉత్పత్తి యొక్క పేరు లేదా చిత్రానికి వినియోగదారులలో కావలసిన లక్షణాలని ఆపాదించటం) ద్వారా వాణిజ్య ప్రకటనలు తమ ఉత్పత్తుల లేదా సేవల వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తాయి. రాజకీయ పార్టీలు, ప్రత్యేక ఆసక్తి సమూహాలు, మత సంబంధ సంస్థలు, ప్రభుత్వ మంత్రాంగాలు వాణిజ్యేతర ప్రకటనదారులుగా పరిగణించవచ్చును. వాణిజ్యేతర ప్రకటనదారులు చాటింపులు, లాభాపేక్ష లేని సేవలని అందించటం ద్వారా ప్రకటనలు చేస్తూ ఉంటారు.

భారతదేశం లోని కొన్ని ప్రముఖ ప్రకటన సంస్థ (Advertising agency) లు

 • ఒగిల్వీ అండ్ మాథర్ (Ogilvy & Mather)
 • డిడిబి ముద్ర గ్రూప్ (DDB_Mudra)
 • లోవ్ లింటాస్ (Lowe Lintas)
 • లియో బర్నెట్ (Leo Burnett)
 • జే వాల్టర్ థాంప్సన్ (JWT)
 • హవాస్ వర్ల్డ్ వైడ్ (Havas Worldwide)
 • ఆర్ కే స్వామి బి బి డి ఓ (RK Swamy BBDO)
 • రీడిఫ్యూజన్ డి వై ఆర్ (Rediffusion DYR)

చరిత్ర

మార్చు
 
సాంగ్ రాజవంశం (960 - 1279) యొక్క లియు కుటుంబం రూపొందించే సూదుల వాణిజ్య ప్రకటనలని ముద్రించేందుకు రూపొందించబడ్డ కాంస్య ఫలకం. ముద్రిత ప్రకటన మాధ్యమాలలో ఇప్పటి వరకూ కనుగొనబడ్డ అతి పురాతానమైనది ఇదే.దీని పై ఒక కుందేలు బొమ్మతో బాటు "జినాన్ లియు సూదుల విక్రయశాల" అనీ, "మీ ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించేలా ఉన్నత శ్రేణి సూదులని మేము కొనుగోలు చేసే అత్యుత్తమ ప్రమాణాలు గల ఉక్కు కడ్డీలతోనే చేస్తాం" అని పైనా, క్రిందా రాయబడింది.

గోడల పై బొమ్మలని వేసి ప్రకటనలు చేయటం భారతదేశంలో క్రీ.పూ. 4000 నుండే ప్రారంభమైనది. ఆసియా, ఆఫ్రికా దక్షిణ అమెరికా లలో ఇప్పటికీ ఈ తరహా ప్రకటనలు చెలామణిలో ఉన్నాయి. చైనాలో మిఠాయిలని అమ్మటానికి పిల్లనగ్రోవులని ఊదుతూ ప్రకటనలు చేసేవారు. తర్వాత కాలంలో ఒక చతురస్రాకార కాగితం పై తాము రూపొందించే సూదులని వాడమని ప్రకటించే కాంస్య పతకం చైనాలో కనుగొనబడింది. ఐరోపాలో మధ్య యుగాలలో నిరక్షరాస్యత వలన లిఖితపూర్వక ప్రకటనలకి బదులుగా చిత్రాలు వాడబడేవి. పాదరక్షల ప్రకటనలు బూట్లతో, తిరగలి విసరే వారి ప్రకటనలు పిండి బస్తాతో, దర్జీల ప్రకటనలు దుస్తులతో, కమ్మరి ప్రకటనలు గుర్రపు లాడాలతో సూచించబడేవి.

భారతదేశంలోనే మొట్టమొదటి వారపత్రిక 1780లో కలకత్తాలో జేమ్స్ అగస్టస్ హికీ ఒక ఆంగ్లేయుడు నెలకొల్పాడు. శనివారాలు మాత్రమే అచ్చయ్యే ఈ పత్రిక హికీ'స్ బెంగాల్ గజెట్ పేరుతో విడుదలయ్యేది. ఈ పత్రిక అమ్ముడుపోయే ఖర్చు కంటే ముద్రణకి అయ్యే ఖర్చే ఎక్కువగా ఉండటంతో హికీకి నష్టాలేదురయ్యాయి. అప్పుడే ఆయన పత్రికలో కొంత భాగాన్ని ప్రకటనలకి వదిలివేశాడు. అప్పట్లో ప్రకటకనలు వర్గీకరణ (Classifieds) చేయబడి, కేవలం సాధారణ సందేశాలతో, ఒక ఉత్పత్తి కావాలంటే ఏ తపాలా అడ్రసుని సంప్రదించాలో తెలుపబడి ఉండేవి. ఈ నాటి క్లాసిఫైడ్ లకి కూడా ఇదే నాంది. వివిధ వ్యాధులకి అప్పట్లో వాడబడే పేటెంట్లుగల లేపనాలు, కషాయాలు ఈ పత్రికలో ప్రకటించబడేవి. తపాలా ద్వారా ఉత్పత్తులని బట్వాడా చేయించుకోవటం అదివరకే తెలిసిన, భారతదేశంలో జీవించే బ్రిటీషు వారిని, ఐరోపా జాతియులని లక్ష్యంగా చేసుకొని మద్రాసు లోని స్పెన్సర్స్ (Spencer's), కలకత్తాకి చెందిన వైట్వేస్ & లెయిడ్లా (Whiteways & Laidlaw) వంటి డిపార్ట్ మెంటల్ స్టోర్ లు, నౌకాదళ, రక్షణ దళ ప్రకటనలు కూడా ఇందులో కనబడేవి.

18వ శతాబ్దానికి ఇంగ్లాండులో ప్రకటనలు వారపత్రికలలో ముద్రితమయ్యేవి. పుస్తకాలని, ఇతర పత్రికలని ప్రకటించటంతో మొదలయ్యి రోగాల బారిన పడిన ఖండం కావటం వలన ఔషధాల ప్రకటనల వరకూ ప్రకటనా రంగం విస్తరించింది. బూటకపు ఔషధాలు కూడా ప్రకటించబడటంతో, సమస్యలని అధిగమించటానికి ప్రకటనలని నియంత్రించవలసి వచ్చింది.

19వ శతాబ్దం

మార్చు

థామస్ జె బారాట్ "ఆధునిక ప్రకటన పితామహుడి"గా కొనియాడబడ్డాడు. పియర్స్ సబ్బుకి ఆయన చేసిన ప్రకటనలు విపరీతమైన జనాదరణకి నోచుకొన్నవి. చూడచక్కని చిత్రాలు, వినసొంపైన ఉపశీర్షికలతో ఆయన ప్రకటన రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. Good morning. Have you used Pears' soap? (శుభోదయం. మీరు పియర్స్ సబ్బుని వాడారా?) అనే ఉపశీర్షిక నాటికీ, నేటికీ అదే జనాదరణతో వాడబడుతోన్నది. మధ్య తరగతికి చెందిన చిన్న పిల్లలని చక్కగా అలంకరించి వారి చిత్రాలని ప్రకటనలలో పొందు పరచటం, పియర్స్ సబ్బుని వాడేవారు గొప్పింటి ఆశయాలు కలవారని సందేశాత్మకంగా తెలపటం వంటి కిటుకులని ఉపయోగించటమే పియర్స్ సబ్బు యొక్క ప్రకటనల విజయానికి రహస్యమైనది. ఆ నాటి శాస్త్రవేత్తలని, ఇతర రంగాలలో ప్రముఖులని తన ప్రకటనలని బలపరిచేందుకు వినియోగించుకొన్నాడు. ఇంతటి విజయవంతమైన ప్రకటనలని రూపొందించిన బారాట్ పద్ధతులు -

 • పియర్స్ కి విశిష్టమైన దాని బ్రాండ్ ఇమేజ్ యొక్క ప్రాముఖ్యతని నిత్యం నొక్కి వక్కాణించటం
 • విపణిలో మారుతున్న అభిరుచులని నిరంతరం తెలుసుకొనటం
 • వినియోగదారునికి ఎల్లప్పుడూ పియర్స్ సబ్బు లభ్యమయ్యేలా అందుబాటులో ఉంచటం

అందుకే కాబోలు 1907 లో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. అభిరుచులు మారుతూ ఉంటాయి, ఫ్యాషన్ లు మారుతూ ఉంటాయి, వాటితో బాటు ప్రకటనదారు కూడా మారుతూ ఉండాలి. పాతతరపు ఆలోచనా పద్ధతులు ఈ తరానికి పని చేయవు, పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తాయి, వాటి వలన లాభమూ ఉండదు. ఈ నాటి ఆలోచన పాత తరపు ఆలోచన కంటే మెరుగైనది అని కాదు గానీ, ఇది కొత్తగా ఉంటుంది - ఇప్పటి నాడిని పడుతుంది.

భారతదేశం

మార్చు
 
లక్స్ సబ్బు వినియోగాన్ని సినీతారల సబ్బుగా ప్రోత్సహించిన మొట్టమొదటి సినీతార లీలా చిట్నీస్

19వ శతాబ్దానికి గానీ భారతదేశంలో వినియోగదారులని ఆకర్షించటానికి సరియైన పత్రిక ద్వారా సరియైన పాఠకులకి ఎంచుకోవాలని, ప్రకటనలకి ఆకర్షణీయమైన కాపీ అవసరమని ఎవరూ గుర్తించలేకపోయారు. భారతదేశపు మొట్టమొదటి ప్రకటన సంస్థ బి. దత్తారాం'స్ లాభాల పట్టటంతో 1920 కల్లా గుజరాత్ అడ్వర్టైజింగ్, విదేశీ సంస్థలైన ఆల్లీడ్ అడ్వర్టైజింగ్, ఎల్. ఏ. స్ట్రోనాచ్, డి. జె. కైమర్ లు స్థాపించబడ్డాయి. 1926 లో జనరల్ మోటార్స్ ప్రకటనల కొరకు మొదటి బహుళ జాతీయ ప్రకటన సంస్థ జె వాల్టర్ థాంప్సన్ స్థాపించబడింది. ఎల్. ఏ. స్ట్రోనాచ్ ని నార్విక్సన్ అడ్వర్టైజింగ్ సొంతం చేసుకోగా, కీమర్ ని బెన్సన్ కైవసం చేసుకొని బోమాస్ గా మారినది. చివరకు ఇదే ఒగిల్వీ అండ్ మాథర్ గా అవతరించింది. లీవర్ తన ఉత్పత్తులని ప్రకటించటానికి సొంత ప్రకటన సంస్థ లింటాస్ (Lever's International Advertising Service) ని స్థాపించింది.

విదేశీ బ్రాండ్ లైన లక్స్, పియర్స్ సబ్బులు మొట్టమొదట భారతదేశంలో స్థానీకరించబడినవి. సినీ తారల సబ్బుగా ముద్ర వేయబడ్డ లక్స్ సబ్బు 1941 లో లీలా చిట్నిస్ ని తమ ప్రకటనలో మాడల్ గా వినియోగించుకొన్నది. ఈ నాటికి కూడా లక్స్ ని వినియోగదారులు సినీ తారల సబ్బుగానే చూడటంలో వారిపై ప్రకటనల ప్రభావం ఎంతగా ఉందో తెలియజేస్తుంది. లింటాస్ వనస్పతికి చేసిన డాల్డా బ్రాండింగ్ ప్రకటనల చరిత్రలోనే చిరస్మరణీయమైనది. ఒక వ్యానులో అందరికీ కనబడేంత పెద్ద డాల్డా క్యానుని ఉంచి బొంబాయి, కలకత్తా, మద్రాసు, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలలో చక్కర్లు కొట్టించారు. పసుపుపచ్చని క్యాను పై ఆకుపచ్చ రంగులో తాటి చెట్టు యొక్క బొమ్మ భారతీయుని హృదయాంతరాలలో నాటుకు పోయింది. వనస్పతి అంటే డాల్డా నే అనేంతగా దేశ ప్రజలలో ఇమిడి పోయింది. (ఇప్పటికీ వనస్పతి అంటే తెలియని వారు, డాల్డా అని చెబితేనే అర్థం అయ్యేవారు లేకపోలేదు. ఇదే శైలి ఫోటోకాపీ, జిరాక్స్ బ్రాండ్ లో గమనించవచ్చును.)

అటు తర్వాత ప్రసార మాధ్యమాలలో విప్లవాలు తెచ్చిన రేడియో, టీవీ, ఇంటర్నెట్ లలో కూడా ప్రకటనలు చోటు చేసుకొన్నాయి.

80వ దశకంలో రేడియోలో చార్మినార్ సిమెంటు రేకుల ప్రకటనలో ఇద్దరి సంభాషణ:

 • మొదటి వ్యక్తి: ఏమిటి రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?
 • రామయ్య: ఏం లేదు, మా ఇంటి పైకప్పుకి ఏ రేకులు వేద్దామా అని?
 • మొ.వ్య: ఇందులో ఆలోచించవలసినది ఏముంది? చార్మినార్ రేకులనే వేయించు. నమ్మికకీ, నాణ్యతకీ చార్మినార్ రేకులనే వాడండి.

90వ దశకంలో కేబుల్ టీవీ వచ్చేవరకు, యావత్ భారత్ దేశం వీక్షించే ఏకైక ఛానెల్, దూరదర్శన్. ప్రతి బుధవారం ప్రసారమయ్యే హిందీ చిత్రగీతాల కార్యక్రమమైన చిత్రహార్, ప్రతి శనివారం సాయంత్రం ఒక హిందీ చిత్రం, ప్రతి ఆదివారం ప్రొద్దుటే వచ్చే రామాయణ, మహాభారతాలు, సాయంత్రం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రసారం చేసే ప్రాంతీయ భాషా చలనచిత్రాల కొరకు మొత్తం దేశం ఎదురు చూసేవారు. ఈ కార్యక్రమాల ముందు, మధ్యలో, తర్వాత ప్రకటనలు చొప్పించబడేవి. కొన్ని ప్రకటనలు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉండేవి.

 • నిర్మా
 • లిరిల్ సబ్బు (జలపాతాలలో పరవశంతో స్నానం చేసే ఒక యువతి)
 • రస్నా (ప్రతి వేసవిలో పిల్లలతో చిత్రీకరించబడే ప్రకటన, పిల్లలు అందులో ఉపయోగించే ఉపశీర్షిక I love you Rasna)
 • మ్యాంగో ఫ్రూటీ - ఫ్రెష్ అండ్ జ్యూసీ
 • బాంబే డైయింగ్ ప్రకటనలు
 • విమల్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ (ఒన్లీ విమల్)
 • సియారామ్స్
 • రెనాల్డ్స్ - ప్రపంచం కోరే పెన్ను
 • లెహర్ 7 అప్ కి కనబడే తమాషా ఫైడో డైడో కార్టూన్ పాత్ర
 • లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది
 • విక్కో టర్మెరిక్, విక్కో వజ్రదంతి
 • డాబర్ చ్యవన్ ప్రాశ్, డాబర్ ఎర్ర పళ్ళపొడి
 • తాజ్ మహల్ టీ (వాహ్ ఉస్తాద్, వాహ్! అరె హుజూర్ వాహ్ తాజ్ బోలియే!!!)

స్వతంత్ర భారతంలో ప్రకటన కాలావధులని నాలుగుగా విభజించవచ్చునని విల్లియం మాజెరెల్లా అనే నృశాస్త్రవేత్త పేర్కొన్నాడు.

 • స్వాతంత్ర్య సిద్ధి నుండి 60వ దశకం వరకు: భారతీయ ప్రకటనలపై బ్రిటీషు ప్రభావం తీవ్రంగా ఉండేది. వాస్తవికతకి దగ్గరగా, ఏ మాత్రం సృజనాత్మకత లేనివిగా ఈ దశలో ప్రకటనలు ఉండేవి.
 • 60 నుండి 80 వ దశకం వరకు: మునుపటి శైలికి పూర్తి విరుద్ధంగా ఇందులో బ్రిటీషు వాసన ఏ మాత్రం లేని సృజనాత్మకత పాళ్ళు ఎక్కువగా ఉండే ప్రకటనలు ఈ దశలో ఉండేవి.
 • 80 వ దశకం నుండి: ఇందులో రెండు శైలులు ఉన్నవి
  • యావత్ దేశాన్ని ప్రభావితం చేయగలిగే విపణీకరణ ప్రసారమార్గాలని (Marketing Channels) ని నెలకొల్పటం
  • ప్రస్తుత కాలావధి విపణీకరణ యంత్రీకరణలని (Marketing Mechanisms) క్రోడీకరించి సృజనాత్మక తారాస్థాయిగా ఉంటున్న ప్రకటనల దశ

ప్రకటనలలో రకాలు

మార్చు

ప్రకటనలను మూడు రకాలుగా విభజించ వచ్చును. అవి

 1. వ్యాపార ప్రకటనలు
 2. ప్రభుత్వ ప్రకటనలు,
 3. ఇతర ప్రకటనలు

వ్యాపార ప్రకటనలు

మార్చు

వీటి యొక్క ముఖ్య ఉద్దేశం వినియోగదారులను ఆకట్టుకోవడం. వ్యాపార ప్రకటనలను ప్రసారం చేయుటకు మీడియా ఎంతో సహకరిస్తుంది. ఉదాహరణ: సబ్బులు, చాక్లెట్లు ప్రకటనల వంటివి.

ప్రభుత్వ ప్రకటనలు

మార్చు

ప్రజలకు కావలసిన సమాచారమును అందించుటకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. భారతదేశంలో ప్రభుత్వ ప్రకటనలకి ప్రముఖ వార్తాపత్రికలు, టీవీ అద్భుతమైన వేదికలయ్యాయి. టీవీలో ప్రసారమైన కొన్ని ప్రభుత్వ ప్రకటనలు. ఉదా:

 • పోలియో నిర్మూలనకి అమితాబ్ బచ్చన్ వంటి వారు ఈ ప్రకటనలలో కనబడి శ్రమించారు. సరైన సమయంలో టీకాలు వేయించి పోలియోని దేశం నుండి తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
 • భారతీయ ప్రర్యాటక శాఖకి సంబంధించి కూడా అమితాబ్ బచ్చన్ పనిచేశారు. ప్రత్యేకంగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల పర్యటనని ఆయన ప్రోత్సహించారు.
 • భారతదేశపు గౌరవాన్ని నిలబెట్టటం కోసం, పరిసరాల పరిశుభ్రత కై అమీర్ ఖాన్ ఈ ప్రకటనలలో కనబడి శ్రమించారు. భారతీయులలో నరనరాన జీర్ణించుకోబడ్డ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయటం, వ్యర్థాలని ఎక్కడ పడితే అక్కడ విసిరేయటం, బహిరంగ మల/మూత్ర విసర్జనని చేయటం విడనాడే సమయం ఆసన్నమైనదని ఆయన ప్రబోధించారు.
 • ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం తప్పని సరి అని, ఇదే స్త్రీ గౌరవానికి సూచిక అని విద్యా బాలన్ ప్రకటనల ద్వారా తెలియజేశారు.
 • భారత సైన్యం, భారత నౌకా దళాలలో చేరమని యువతకి సందేశాన్నిచ్చే ప్రకటనలు ఇప్పటికీ టీవీలో చూడవచ్చును.

వాణిజ్యేతర ప్రకటనలు

మార్చు

భిన్నత్వంలో ఏకత్వం

మార్చు

80 వ దశకంలో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని పుణికిపుచ్చుకొన్నదని తెలియజేయటానికి రెండు ప్రకటనలు జరిగాయి.

ఇతర ప్రకటనలు

మార్చు

ఇటు వ్యాపార వర్గం నుండి గాని, అటు ప్రభుత్వం నుండి కాకుండా స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ప్రచురించే ప్రకటనలను ఈ వర్గం కిందకు చేర్చవచ్చు. ఎవరైనా పెద్ద మనిషి విదేశయానానికి వెళ్తున్నప్పుడుగాని, తిరిగి వస్తున్నాప్పుడుగాని, లేదా షష్టిపూర్తి, జన్మ దినం వేడుకలకు గాని వ్యక్తిగత ప్రకటనలు వెలువడటం మనం చూస్తుంటాము. అలాగే స్వచ్ఛంద సంస్థలు, రక్త దానం గురించి, కన్ను దానం గురించి, కంటి బాంకు గురించి, సమాజంలోని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగాను ప్రకటనలు ఇస్తూ ఉంటాయి.

వ్యక్తిగత ప్రకటనలు

స్వచ్ఛంద సంస్థల ప్రకటనలు

న్యాయస్థానాల ప్రకటనలు న్యాయ స్థానాలు ప్రభుత్వంలో విభాగాలైనప్పటికికీ, వీరు ఇచ్చే ప్రకటనలు ప్రభుత్వ ప్రకటనల కిందికి రావు. వివాదంలో ఉన్న ఆస్తుల గురించి, ఆస్తుల అమ్మకం, వేలం గురించి, తెరిగొచ్చిన కోర్టు సమన్ల గురించిన ప్రకటనలు, న్యాయస్థానాలు వార్తా పత్రికలలో ప్రకటిస్తాయి.

బ్యాంకుల ప్రకటనలు న్యాయ స్థానాల లాగానే, బాంకులు కూడా కొన్ని ప్రకటనలు ఇస్తూ ఉంటాయి. తమకు తనఖా పెట్టబడి, ఋణం తీర్చని కారణాన, తాము స్వాధీన పరుచుకున్న ఆస్తుల గురించి, కనపడకుండా పోయిన ఋణగ్రస్తుల గురించి, న్యాయస్థానంలో వ్యాజ్యం వెయ్యబొయ్యే ముందు, ఇంకా అనేక ఇటువంటి సందర్భాలలో ప్రకటనలు ఇస్తూ ఉంటాయి. బాంకులు తమ ఋణ లావాదేవీలు, వాటిలో వచ్చే వివాదాలు/వ్యాజ్యాల గురించిన ప్రకటనలు ఇతర ప్రకటనలకింద వస్తాయి. ఇవే బ్యాంకులు, వారి డిపాజిట్ పథకాలు, వారి ఋణ పథకాలగురించి ప్రకటనలు ఇస్తే అవి వ్యాపార ప్రకటనలు అవుతాయి.

పాశ్చాత్య దేశాలలో ప్రకటనలు

మార్చు

భారతదేశంలోని సంఘసంస్కృతుల వలన, ఇక్కడి ప్రకటనలు ఒక మోస్తరుగా ఉన్ననూ, పాశ్చాత్య దేశాలలో ప్రకటనలలో మాత్రం విచ్ఛలవిడితనం పాళ్ళు ఎక్కువే. ఈ విచ్ఛలవిడితనమే అక్కడి ప్రకటనా రంగాన్ని అనేక విమర్శల వైపు నడిపించినదనటంలో అతిశయోక్తి లేదు. కండోం వంటి లైంగిక ఉత్పత్తులని ప్రకటించటానికి భారత్ లోని ప్రకటన సంస్థలు ఎంతగానో ఆలోచించి, శృంగారం పాళ్ళు మోతాదు మించకుండా జాగ్రత్తపడి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటనలతో వాటి వినియోగాన్ని పెంచటంలో సఫలీకృతులయ్యారు. అయితే పాశ్చాత్య దేశాలలో స్నానపు సబ్బు, పర్ఫ్యూం, జీన్స్ లేదా పత్రికల వంటి సాధారణ ఉత్పత్తులకి కూడా అనవసర లైంగికతని వినియోగించిన సందర్భాలు కోకొల్లలు. ఒక్కోమారు ఈ లైంగికత శృతి మించి అశ్లీలతగా అవతరించింది. వినియోగదారుని అవసరాలు గుర్తించి వారికి సరియైన ఉత్పత్తి/సేవలని సూచించవలసిన ప్రకటనలు, అక్కడి భావప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగపరచి లైంగికత/అశ్లీలలత మధ్య ఉన్న సన్నని గీతని చెరిపివేయటం, వినియోగదారుని మానసిక బలహీనతలని కూడా ప్రకటనలలోకి చొప్పించటం మూలాన అక్కడి ప్రజాసంఘాలు వీటిని గుర్తించి ప్రకటన రంగం పై తీవ్రమైన వ్యతిరేకతని సృష్టించారు. స్త్రీ-పురుషుల అర్థనగ్న/నగ్న చిత్రాలని ఒక్కోమారు విడివిడిగా, ఒక్కోమారు ఇరువురినీ కలిపి ప్రదర్శించటం, స్వలింగ సంపర్కుల, అసాధారణ శృంగార పోకడలని చిత్రించటం వంటివి చేశారు. ఇది ఎంతవరకు సబబు అనేది నిర్థారించటం కష్టతరమే. పాశ్చాత్య దేశాలలో ప్రకటన రంగం నిత్యం భావవ్యక్తీకరణ స్వేఛ్ఛకి, ప్రకటనల విపరీత పోకడలకి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది.

భారతదేశంలో విమర్శలకు గురైన ప్రకటనలు

మార్చు

హాస్యానికై కిట్ప్లై తాము రూపొందించిన వాణిజ్య ప్రకటనలో శోభనం నాడు కిర్రుమంచాన్ని వేసినందుకు వధువు వరుణ్ణి చెంపదెబ్బ కొట్టటం సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ విమర్శించింది.[1] కారణాలను ఈ విధంగా పేర్కొన్నది:

 • ఇది గృహహింసను పెంపొందించే విధంగా ఉన్నది
 • కిట్ప్లైకు ఇది హాస్యాస్పదం కావచ్చు, కానీ పురుషులకు కాదు, కాబట్టి
 • ఏ రకమైన గృహహింసనూ ప్రోత్సహించరాదు, భర్త పై కూడా, కాబట్టి
 • ఇది పురుషులను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బాధిస్తుంది కాబట్టి
 • ఇదే ప్రకటనలో పాత్రల స్థానాన్ని మార్చి దానిని కిట్ప్లై ప్రసారం చేస్తే అది ఒక విప్లవాన్నే సృష్టిస్తుంది కాబట్టి
 • భర్తను చెంపదెబ్బ కొట్టటంలో తప్పేమీ లేదు, అనే సందేశాన్ని ఈ ప్రకటన పంపుతుంది కాబట్టి
 • ఇటువంటి ప్రకటనల వలనే, భర్త స్థానంలో ఉన్న పురుషులు, ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి

ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు -

There is a big hue and cry if a wife is hurt by her husband, but a blind eye is turned when there’s a public display of a wife hitting her husband. Any sort of violence between the spouses is considered illegal and termed as domestic violence or gender violence across the world. Depicting violence on national TV is unacceptable.
(భర్త చే భార్య హింసించబడ్డదని తెలిస్తే లబోదిబోమని కొట్టుకొనే వారు, అదే భార్య చే భర్త హింసించబడినట్లు కంటికెదురుగా కనబడుతున్నా చూసీ చూడనట్లు వెళ్ళిపోతారు. జీవిత భాగస్వాముల మధ్య ఏ రకమైన హింస అయినా గృహ హింస గానే ప్రపంచవ్యాప్తంగా పరిగణించబడుతోంది. యావద్దేశం వీక్షించే టీవీ లో హింస ఆమోదయోగ్యం కాదు.)

- అని తెలిపారు.

కొన్ని స్త్రీ సంఘాలు కూడా ఈ వాదనను సమర్థించాయి.

ఇలాగే పాండ్స్, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ప్రకటనలు కూడా వివాదాస్పదమయ్యాయి. చెన్నయ్ కు చెందిన ఇందియా కుడుంబ పాదుగాప్పు ఇయాకం కు చెందిన సురేష్ రాం -

The Ponds ad terms husbands as wife beaters and the ICICI ad portrays verbal and economical abuse against men.
(పాండ్స్ ప్రకటన భర్తలనందరినీ భార్యను కొట్టేవారిగా, ఐసీఐసీఐ ప్రకటన పురుషు దూషణను, పురుషులను ఆర్థికపరంగా దుర్వినియోగపరిచే విధానాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నవి.)

- అని తెలిపారు.

మాధ్యమాలు

మార్చు

మారుతున్న కాలంతో బాటు ప్రసార మాధ్యమాలు మారుతూ వచ్చాయి. ప్రసార మాధ్యమాలకి అనుగుణంగా ప్రకటన చేసే విధానాలు కూడా మారుతూ వచ్చాయి.

ఉదా:

 • ముద్రణ మాధ్యమమైన దిన, వార, మాస పత్రికలు
 • బహిరంగ ప్రదేశాలు (హోర్డింగ్/ఫ్లెక్సీలు, డిజిటల్ సైనేజ్ లు)
 • రేడియో
 • టీవీ
 • ఆన్లైన్ (గూగుల్, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటివి)

ప్రకటనల వల్ల దుష్ఫలితాలు

మార్చు

ప్రకటనలు ఎక్కడ ఉండవచ్చు, ఎంత మేరకు ఉండవచ్చు వంటి అనేక విషయాల పై చర్చ పాశ్చాత్య దేశాలలో చాలా పెద్ద చర్చలే జరిగాయి.

ప్రకటనా కాలుష్యం

మార్చు

ప్రకటనలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ధ్వని/దృశ్య కాలుష్యాలని పెంచుతాయి అనే వాదన ఉంది. ప్రకటనలు ఖాళీ స్థలాలని ఆక్రమించటం వలన, వ్యక్తిగత పరిధిని ముట్టడించటం వలన చాలా మంది ప్రజలు ప్రకటనలపై విసుగు పడే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచంలో ప్రకటన లేని ప్రదేశం లేదంటే అతిశయోక్తి లేదేమో. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, సినిమా హాళ్ళు, అమ్యూజ్ మెంట్ పార్కులు, షాపింగ్ మాల్ లు, ATM లు, వంతెనలు, చివరకు చెత్త డబ్బాలు, మరుగుదొడ్ల పై కూడా ప్రకటనలు ఉన్నాయి.

ఇవీ చూడండి

మార్చు

'ప్రకటన' పేరుగల కొన్ని విషయాలు :

 • బైబిల్ లోని చివరి గ్రంథం పేరు ప్రకటన. అంత్యదినాల్లో ఏమేమి జరుగుతాయో దైవదూతలు మానవాళికి చేసిన ప్రకటనలు ఈ గ్రంథంలో ఉన్నాయి.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
 1. పురుషద్వేషాన్ని పెంపొందించే వ్యాపార ప్రకటనలను ఖండించిన భారతదేశ పురుష హక్కుల సంఘాలు (డి ఎన్ ఏ - 16 సెప్టెంబర్ 2008)
 1. ప్రకటనలు, సంఘము గురించి తెలిపే http://muse.jhu.edu/journals/advertising_and_society_review/v009/9.3.o-barr.html
 2. భారతదేశంలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీల చరిత్ర గురించి తెలిపే https://web.archive.org/web/20150627134111/http://www.pitara.com/science-for-kids/5ws-and-h/how-did-advertising-start-in-india/
 3. సాధారణ ప్రకటనలకి అనవసరంగా లైంగికత చొప్పించే విదేశీ ప్రకటనా రంగం https://web.archive.org/web/20151012021958/http://muse.jhu.edu/journals/advertising_and_society_review/v012/12.2.o-barr.html
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రకటన&oldid=3964190" నుండి వెలికితీశారు