గొల్లపూడి మారుతీరావు: కూర్పుల మధ్య తేడాలు

సినీ నటుడు, రచయిత, విలేఖరి, వ్యాఖ్యాత
కొత్త పేజీ: '''గొల్లపూడి మారుతీరావు''' (Gollapudi Maruthi Rao) తెలుగు సినిమా రంగంలో మాటల ర...
(తేడా లేదు)

21:51, 20 మే 2007 నాటి కూర్పు

గొల్లపూడి మారుతీరావు (Gollapudi Maruthi Rao) తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగానూ నటుడిగానూ పరిచితుడు. సినిమాల్లోకి రాకముందు రచయితగానూ, రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు.

దస్త్రం:Gollapudimaruthirao.jpg
గొల్లపూడి మారుతీరావు

జీవిత విశేషాలు

ఏప్రిల్ 14, 1939ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం లో జన్మించాడు. అన్నపూర్ణ, సుబ్బారావు ఈయన తల్లిదండ్రులు. సి.బి.ఎమ్ హైస్కూలు, ఎ.వి.ఎన్ కళాశాల మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయము - వీటిలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది.

మారుతీరావు రాసిన తొలి కథ ఆశాజీవి ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక రేనాడు లో 1954 డిసెంబరు 9న వెలువడింది.

చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరున ఆయనొక నాటక బృందాన్ని నడిపేవారు. ఆడది (పినిశెట్టి), కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం (రావి కొండల రావు), రిహార్సల్స్ (సోమంచి యజ్ఞన్న శాస్త్రి), వాపస్ (డి.వి.నరసరాజు), మహానుభావులు (గొగొల్ An Inspector Calls ఆధారంగా సోమంచి యజ్ఞన్న శాస్త్రి రచన) నాటకాలకు నిర్మాణము, దర్శకత్వము వహించడంతోపాటు, ప్రధానపాత్రధారిగా నటించాడు.

యూనివర్సిటీ థియేటర్‌లో పట్టభద్రుడయ్యాడు. అక్కడ శ్రీవాస్తవ రచించగా ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె.వి.గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాలగది నాటకంలోనూ, భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోనూ నటించాడు. మనస్తత్వాలు నాటకాన్ని ఐదవ అంతర విశ్వవిద్యాలయ యవజనోత్సవాలలో భాగంగా కొత్తఢిల్లీలోని తల్కతోరా ఉద్యానవనంలో ప్రదర్శించారు. మారుతీరావుకు తన రచన అనంతం ఉత్తమ రేడియో నాటకంగా అవార్డును తెచ్చింది. అప్పటి సమాచార-ప్రసార శాఖామాత్యుడు డాక్టర్ బి.వి.కేశ్‌కర్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకొన్నాడు. మనస్తత్వాలు నాటకాన్ని ఆంధ్ర అసోసియేషన్, కొత్తఢిల్లీ వారికోసం ప్రదర్శించారు. దానికి వి.వి.గిరి అధ్యక్షుడు.

1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా పనిచేయనారంభించాడు. 1960 జనవరి 1వ తేదీ చిత్తూరులో మరో ఎడిషన్ ప్రారంభించారు. రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికయ్యాడు. చైనా ఆక్రమణ పై తెలుగులో మొట్టమొదటి నాటకం రచించి, చిత్తూరు మదనపల్లె నగరిలలో ప్రదర్శించగా వచ్చిన నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి ఇచ్చాడు.

మారుతీరావు వివాహం 1961 నవంబరు 11న విద్యావంతులు సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందరితో హనుమకొండలో జరిగినది. సి.నారాయణ రెడ్డి కాళోజి నారాయణ రావు వంటి ప్రముఖులకు ఆమె తండ్రిగారు ఉపాధ్యాయులు. ప్రముఖ రచయితా విమర్శకుడు డా. శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి, మనోధర్మ సంగీతం బాణీ ప్రముఖుడు పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి ఆమెకు సమీప బంధువులు.

మారుతీరావుకు ముగ్గురు మగసంతానం - సుబ్బారావు, రామకృష్ణ మరియు శ్రీనివాస్.

సినిమా ప్రస్థానం

1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. మారుతీరావుకు అది మొదటి ప్రయత్నం. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్సిన నంది అవార్డు లభించింది.

ఆకాశవాణి హైదరాబాదు, విజయవాడలలో పనిచేశాడు. కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతిపోంది సంబల్‌పూర్ వెళ్లాడు. ఆ తరువాత చెన్నై, కడప కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉప-డైరెక్టరుగా పదోన్నతి పొందాడు. సినిమాలలో నటించడం మొదలయ్యాక తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

మారుతీరావు నటునిగా ప్రధానపాత్ర పోషించిన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఘనవిజయం సాధించిన తరువాత వెనుదిరిగి చూడవలసిన అవసరం కలుగలేదు. 250 చిత్రాలకు పైనే వివిధ పాత్రలలో నటించాడు.

1992 ఆగస్ట్ 12న మారుతీరావు చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ తొలిసారిగా ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చిత్రీకరణ సమయంలో ప్రమాదవశాత్తు మరణించాడు. అతని పేరిట గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్ఢు నెలకొల్పి, ప్రతి యేటా ఉత్తమ నూతన సినిమా దర్శకునికి రూ. 1.5 లక్షలు నగదుబహుమతి, ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు రూపొందించిన బంగారపు జ్ఞాపికనూ ప్రదానం చేస్తారు. సినిమాకు సంబంధించిన ఏదేని అంశంపై విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖునికి గౌరవసూచకంగా రూ.15,000 గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ లెక్చర్ పేరిట బహూకరిస్తారు.

మారుతీరావు ఇద్దరు కుమారులు సుబ్బారావు, రామకృష్ణలు మారుతీ ఎయిర్‌లింక్స్ అనే ట్రావెల్ ఏజన్సీని నడుపుతున్నారు.

మూలాలు, వనరులు


బయటి లింకులు