ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
===దేశ, కాల, సంస్కృతులని పరిరక్షించటం===
ఇరవై ఒకటవ శతాబ్దంలో ఈ ప్రపంచం సమతలంగా మారుతోందని ఉత్ప్రేక్షిస్తున్నారు. ఇక్కడ “సమతలం” అంటే దేశకాల పరిస్థితుల వల్ల కాని, ఆర్ధిక భేదాల వల్ల కాని, రాజకీయ సిద్ధాంత ధోరణులవల్ల కాని బాహ్యంగా ప్రస్పుటమయే అడ్డుగోడలని పగులగొట్టి ప్రపంచం అన్ని చోట్లా ఒకేలా కనిపిస్తోందని భాష్యం చెప్పుకోవచ్చు. ఎన్ని అడ్డు గోడలని ఛేదించినా మాట్లాడే మాట, రాసే రాత అనే గోడ ఇంకా బలంగానే ఉందని చెప్పడానికి రెండు ఉదాహరణలు: (1) సెల్ ఫోను సౌకర్యం ప్రపంచమంతటా పాకిపోయింది. మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి, సర్వులూ వాడుతూన్న పరికరం ఇది. వీరందరికీ ఇంగ్లీషు రావాలంటే ఎలా? ఈ పరికరాన్ని వాడుకునే విధివిధానాలు వారికి తెలుగులో చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంగ్లీషు మోజులో పడిపోయిన వారికి ఆ అవసరం కనబడక పోయినా నోకియా వాడికి కనబడింది. (2) తెలుగువాళ్లు తండోపతండాలుగా విమానాలలో ప్రయాణాలు చేస్తున్నారు. వీరిలో తెలుగు తప్ప మరొక భాషతో వెసులుబాటు లేని వాళ్లు ఉంటూనే ఉన్నారు. వీరు విమానంలో కక్కసు దొడ్లోకి వెళ్ళి అక్కడ పాయిఖానా వసతులని వాడుకోవటం తెలియక వాటిని పాడు చేస్తున్నారు. మనమీద అభిమానం కొద్దీ కాకపోయినా వాడి విమానం శుభ్రంగా ఉండాలని ఎమిరేట్స్ విమానం కంపెనీ కక్కసు ఎలా వాడుకోవాలో తెలుగులో (తమిళంలో లేదు, మళయాళంలో లేదు, మరాఠీలో లేదు) సూచనలు రాసేరు. ఇంగ్లీషుని తెలుగులోకి మార్చి వాడవలసిన అవసరం [[నోకియా]] వాడికీ, ఎమిరేట్స్ వాడికీ కనబడింది.
 
ఇంగ్లీషుని తెలుగులోకి మార్చే సందర్భాలలో కొన్ని సాంస్కృతిక మైన ఇబ్బందులు కూడ ఉంటాయి. ఉదాహరణకి ఇంగ్లీషులో "మై మదర్, యువర్ మదర్" అన్న పదబంధాలు ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించేటప్పుడు యడాగమసంధితో "నాయమ్మ, నీయమ్మ" అని అనువదిస్తే నీచ్యార్థం ధ్వనించే అవకాశం ఉంది. మూలంలో బహువచనం లేకపోయినా, తెలుగు నుడికారానికి తల ఒగ్గి, వీటిని "మా అమ్మ, మీ అమ్మ" అని మార్చితేనే బాగుంటుంది.
 
అమెరికాలో బేస్‌బాల్ బహుళ జనాదరణ పొందిన ఆట. అమెరికావారు మాట్లాడే భాషలో ఈ ఆటకి సంబంధించిన ఉపమానాలు, రూపకాలు అనేకం. వాటిని యథాతథంగా ఇంగ్లీషులోనే ఉంచినా, భావం తెలుగువారికి అర్థం కాదు – ఆటతో పరిచయం లేకపోవటం వల్ల. ఉదాహరణకి “హి హిట్ ఎ హోం రన్” (He hit a home run) అంటే “వాడి ప్రయత్నం బాగా ఫలించింది” అని అర్థం. “ఎ బాల్ పార్క్ ఫిగర్” (a ball park figure) అంటే “అంచనా,” లేదా సుమారుగా చెప్పినది. “గొ టు బేట్ ఫర్ సంవన్” (go to bat for someone) అంటే మరొకరి తరఫున వకాల్తా పుచ్చుకుని సమర్ధించటం అని కాని, మరొకరికి చేయూత ఇవ్వటం అని కాని అర్థం. వీటిని సమానార్థకాలైన ఏ [[క్రికెట్]] పరిభాషలోనో అనువదించాలి లేదా పైన ఉదహరించిన మాదిరి తెలుగు నుడికారంతో అనువదించాలి.
 
అదే విధంగా తేదీ, నెలా రాసే పద్ధతి ప్రపంచం అంతా ఒకే ఒరవడిలో లేదు. వీటిని మనకి అలవాటైన రీతిలో రాసుకోవాలి. మూలంలో ఉన్న కొలమానాలని మెట్రిక్ పద్ధతిలోకి మార్చి రాయాలి. మిలియన్లని, బిలియన్లని లక్షలు, కోట్లు అని మార్చటమే కాకుండా సున్నలని గుంపులా విడగొట్టి, కామాలు పెట్టే తీరులో తేడాని గమనించాలి. (ఒక మిలియనుని 1,000,000 అని రాస్తారు కాని పదిలక్షలుని 10,00,000 అని రాయాలి.) డాలర్లని రూపాయలలోకి మార్చి చూపదలుచుకుంటే వాటి మారకపు విలువ కూడ ఇస్తే వ్యాసం కాలదోషానికి గురి కాదు. ఈ విషయాలు ప్రధానాంశాలు కాకపోయినా ఇటువంటి జాగ్రతలు పాటిస్తే అనువాదం రాణిస్తుంది, రక్తి కడుతుంది.