అమరావతి కథలు

అమరావతికథలు

అమరావతి కథలు సత్యం శంకరమంచి రచించిన తెలుగు కథాసంపుటి . అమరావతి గ్రామం, అక్కడి ప్రజలు ఇతివృత్తంగా రచించిన ఈ 100 కథలు మొదట ఆంధ్రజ్యోతి వారపత్రికలో సుమారు రెండు సంవత్సరాలు 1975-77 మధ్య ప్రచురించబడ్డాయి. ఏ కథా కూడా ఒక పేజి కంటే ఎక్కువ ఉండేది కాదు. అప్పట్లో ముద్రణ కాగితం కరువు ఉండేది. ఆ కారణాన, ఆంధ్రజ్యోతి పత్రిక ప్రస్తుతపు వారపత్రిక సైజులో కాకుండా అందులో సగం సైజులో అంటే చందమామ మాసపత్రిక సైజులో కొన్నాళ్ళు వచ్చింది. కారణమేమయినా, కథలన్నీ కూడా రచయిత చక్కగా కుదించి వ్రాశారు. అంత చిన్నకథలో కూడా ఎంతో కథా శిల్పాన్ని ప్రదర్శించిన రచయిత సత్యం శంకరమంచి అభినందనీయులు. శంకరమంచి సత్యంచక్కని తేట తెలుగులో, సరళమైన భాషలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించుతూ, ప్రజల వేషభాషలు, ఆచారవ్యవహారాలు, కష్టసుఖాలు, జీవన విధానం గురించి విపులం వ్రాసాడు .

అమరావతి కథలు
రచయిత(లు)సత్యం శంకరమంచి
బొమ్మలుబాపు
ముఖచిత్రంబాపు
దేశంభారతదేశం
భాషతెలుగు
Set inఅమరావతి
ప్రచురణ కర్త, నవోదయ పబ్లిషర్స్
ప్రచురించిన తేది
2016 (10 వ ఎడిషన్)
పుటలు399
పురస్కారాలుసాహిత్య అకాడమీపురస్కారం

ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. సినీ దర్శకులు శ్యామ్ బెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక 1994-1995 లో జాతీయ దూరదర్శన్ నెట్వర్క్ లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక అమరావతిలోనే చిత్రీకరించబడటం విశేషం. తెలుగులో తరంగ సుబ్రమణ్యం తరంగ ఫిల్మ్స్ బేనర్ పై ధారావాహికగా చిత్రీకరించాడు. ఇది రాష్ట్ర దూరదర్శన్ లో ప్రసారమైంది.

రచనా నేపథ్యం మార్చు

తెలుగు కథ
తెలుగు కథా సాహిత్యం
కథ
తెలుగు కథా రచయితలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు
వేలూరి శివరామశాస్త్రి కథలు
కాంతం కథలు
చలం కథలు
మా గోఖలే కథలు
నగ్నముని విలోమ కథలు
అమరావతి కథలు
అత్తగారి కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
మా పసలపూడి కథలు
దర్గామిట్ట కథలు
కొ.కు. కథలు
మిట్టూరోడి కథలు
ఇల్లేరమ్మ కథలు
ఛాయాదేవి కథలు
మధురాంతకం రాజారాం కథలు
కా.రా. కథలు
బలివాడ కాంతారావు కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
రా.వి. శాస్త్రి కథలు
ముళ్ళపూడి వెంకటరమణ కథలు
కేతు విశ్వనాధరెడ్డి కథలు
ఇంకా ... ...
తెలుగు సాహిత్యం

ఈ కథలు తను ఎలా వ్రాసారో, సత్యం శంకరమంచి, తన కథా సంపుటి మొదటిలో కృతజ్ఞతలులో ఈవిధంగా తెలియ చేసారు- "ఓ సాయంవేళ పురాణం సుబ్రహ్మణ్య శర్మ (అప్పటి ఆంధ్రజ్యోతి వారపత్రిక సంచాలకులు) ఉన్నట్టుండి మీరు అమరావతి కథలు అని ఎందుకు రాయకూడదు? అన్నారు ఓ క్షణం అవాక్కయి పోయాను. ఎప్పటిమాట! పన్నెండేళ్ళ క్రితం జైపూర్ లో పని చేసేటప్పుడు అమరావతి కథల పేరిట కొన్ని కథలు రాద్దామని నోట్సు రాసుకోటమేమి, ఇప్పుడు ఎవరో చెప్పినట్టు ఈయన అడగటమేమి! తేరుకుని వరసగా నాలుగు కథలు ఆశువుగా చెప్పాను." ఆ తరువాత జరిగినది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ముఖ్య సంఘటన అనగా 100 వారాలపాటు అమరావతి కథలు ఆంధ్ర జ్యోతి వార పత్రికలో ప్రచురించబడి ఎంతగానో ప్రజాదరణ, సాహిత్యవేత్తల గౌరవం పొందటం.[1]

"అమరావతి కథలులో అతని స్వంతవూరి సాంఘిక జీవనంతో బాటు తాను తిరిగిన మట్టి వాసన, తన జన్మ వాసన కూడా పెన వేసుకొని ఉన్నాయి. గతానుభవాల అందమయిన సంస్మరణ ఈ కథలకు ప్రేరేపణ. .. ఈ కథలకు 20 సంవత్సరాలు ముందుగా "కార్తీక దీపాలు" అనే కథ సంపుటి వచ్చింది. అందులో కూడా అమరావతి వాతావరణమే స్పష్టంగా కొంత, అస్పష్టంగా కొంత కనుపిస్తుంది. అమరావతి కథలలోని పాత్రలు ముప్పాతిక భాగం నిజమయిన వ్యక్తులే. వాస్తవ వ్యక్తులు, వాస్తవ సంఘటనల చుట్టూ కాల్పనికత, సంస్మరణ మాధుర్యంతో కొత్త తివాచీ అల్లాడు శంకరమంచి[2]

అమరావతి కథలు అన్న పేరు ఎందుకు?

రచయిత సత్యం శంకరమంచి పుట్టి పెరిగింది అమరావతి గ్రామంలో. ఆయన చిన్నతనంలో ఉన్న సామాజిక పరిస్థితులు, జీవన విధానాలతో పాటు, ఆ ప్రాంత చరిత్రలో పరిశోధన చేసి వ్రాసిన కథలు అమరావతి కథలు. అన్ని కథలు అమరావతిలో జరిగినవే. ఊహాజనిత గ్రామమో లేక పట్టణమో తన కథలకు వేదికగా రచయిత సత్యం తీసుకోలేదు. తనకు తెలిసిన అమరావతి గ్రామం తరువాత పట్టణమయినా, తన కథలన్ని అక్కడజరిగిన సంఘటనలుగానే తీర్చి దిద్దారు. అందుకనే, ఈ కథలకు మరే పేరు నప్పదు, అమరావతి కథలే సరయిన పేరు. ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ అన్నట్టు, "అమరావతి కథలు అపురూప శిల్పాలు".[3]

కథా వస్తువు మార్చు

ఈ కథలలోని పాత్రలు రాజులున్నారు, స్వాములవార్లు ఉన్నారు, దొంగలు, భక్తులు, నాస్తికులు, దాతలు, లోభులు ఒకరేమిటి మనకు సామాన్యంగా ప్రతిరోజు తారసపడే వారందరూ ఈ కథలలో పాత్రలే. కథలన్నీ కూడా చాలా చిన్న చిన్నవి. మరింత ఉంటే బాగుండునేమో అనిపించేవే. ఎంతటి సామాన్య ప్రజలను పాత్రలు చేసి కథలు వ్రాసినా, కథాంశం మనిషిలోని ఔన్నత్యాన్ని మాత్రం వదిలి పెట్టదు [3]

ఇవన్నీ కేవలం కథలే కావు. .. అతి క్లుప్తమైన పరిధిలో చాలా పెద్ద చరిత్ర చెప్పినవి ఉన్నాయి. .. శబ్దాలలో అద్భుత చమత్కారాన్ని చూపిన ఇంద్రజాలాలున్నాయి. వేమన పద్యాల నిరాడంబరత, సూటిదనం ఉన్నాయి. వాడితనం, పనివాడితనం కలబోసిన అపురూప శిల్పాలు ఎన్నో ఉన్నాయి.... కృష్ణానదీ జలాలమీద కథల కెరటాలు మలచారు. .. కొన్ని చోట్ల ఒక్కమాటతో, ఒక్క అక్షరంతో ఓ కథకు ప్రాణప్రతిష్ఠ చేశారు .. అమరావతి కథలు తెలుగు సాహిత్య పీఠంలో కలకాలం నిలబడి గౌరవం, ఆదరణ పొందే ఒక మహోజ్వల సృష్టి. ఎన్నటికీ ఆరని అఖండ జ్యోతి. పాఠకులకూ, కళాకారులకూ ఎన్నిసార్లు ఆస్వాదించినా తనివి తీరని అమృత కలశం. అక్షయమైన అక్షరపాత్ర. శిల్ప సౌందర్యానికి పరమావధి. ప్రపంచ సాహితీ వీధిలో తెలుగువారు సగర్వంగా ఎగురవేయగల మహాపతాకం.[3]

కథలకు బాపు బొమ్మలు మార్చు

"బంగారానికి చక్కటి సువాసన అబ్బితే" అని సామెత చెప్పుకుని ఆశ పడే వారు, ఈ కథా సంపుటిలోని కథలను, వాటికి ప్రముఖ సినీ దర్శకుడు, చిత్రకారుడయిన బాపు వేసిన బొమ్మలు చూసిన తరువాత ఈ సామెత నిజమవ్వచ్చు అనుకోవటంలో తప్పు లేదు. ప్రతి కథకు మొదట బాపు వేసిని బొమ్మ, కథను దాదాపు చెప్పకనే చెప్తుంది. కథ చదివిన తరువాత చూస్తే ఆ బొమ్మ తప్ప మరే బొమ్మయిన వెయ్యగలమా అని చూస్తే ఎమీ తట్టదు. కథలకు బొమ్మలు అంత బాగా సరిపొయ్యాయు. ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన బుడుగుకు చక్కటి బొమ్మలు వేసి చిన్నలనే కాక పెద్దలనే ఎక్కువ అలరించిన చిత్రకారులు బాపు, ఈ కథలకు తన ప్రతిభకు పూర్తి తార్కాణంగా, బొమ్మలను వేసి చదువరులను అలరించాడు.

కథాసంపుటి ముఖ చిత్రం చూస్తేనె తెలుస్తుంది బాపు చిలిపితనం, నిండుతనం. రచయిత, పార్వతీ పరమేశ్వరుల సరసన కూర్చుని, చాలా సావకాశంగా, వారికి తన కథలను వినిపిస్తున్నట్టు, తన ఆజ్ఞకానిదే చీమనుకూడ కుట్టనివ్వని పరమేశ్వరుడు, పార్వతీ సమేతుడయి చిద్విలాసంగాను, నందీశ్వరుడు, గోపన్నలు పారవశ్యంగానూ, వింటున్నట్టు చిత్రీకరించారు. అమరావతిలోని అదిదేవుడయిన అమరేశ్వరుడే దిగివచ్చి ఈ కథలు వింటున్నాడని స్పురింప చేశారు.

అమరావతి కథల జాబితా మార్చు

అమరావతి కథా సంగ్రహం మార్చు

దాదాపు అన్ని కథలూ మణిపూసలే. ప్రతి కథ గురించి, ఆ కథలోని పాత్రలు, బాపు బొమ్మ ఆందం, ముఖ్యంగా రచయిత చెప్పిన విషయాలమీద సంక్షిప్తంగా నాలుగు ప్రత్యేక వ్యాసములు వ్రాయబడినవి.

అమరావతి కథా సంగ్రహం 1-25,
అమరావతి కథా సంగ్రహం 26-50,
అమరావతి కథా సంగ్రహం 51-75,
అమరావతి కథా సంగ్రహం 76-100

అభిప్రాయాలు మార్చు

  • ముళ్ళపూడి వెంకటరమణ-"అమరావతి కథలు అపురూప శిల్పాలు....ఊత్తమశ్రేణి ఆధునిక కథావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే.....వేయిపుటల వేయిపడగల కథలో సత్యనారాయణగారు చిత్రించిన తెలుగుజీవన విశ్వరూపానికి మూడు వాక్యాలో-మూడు మాటలలో ఈ కథలు అద్దం పట్టి చూపాయి......త్యాగరాజస్వామి - కీర్తనలతో, స్వరాలతో, అక్షరాలతో, స్వరాక్షరాలతో, రాగభావాలతో కీర్తనలు అల్లి రామచంద్రుడిని అలంకరించుకున్నట్టే ఈయన అంత జాగ్రత్తగా, ప్రేమతో అమరేశ్వరుడిని, ఆయనను సేవించుకునే తెలుగువాడిని అర్చించారు.....పట్టరాని అనందం కొద్దీ మనసులో వెయ్యి పేజీలు రాసుకున్నాను. చదివిన ప్రతివాళ్ళూ పదివేల పేజీలు రాసుకోగలరు కూడా......తెలుగు సాహిత్య పీఠంలో కలకాలం నిలబడి గౌరవం, ఆదరణ పొందే ఒక మహోజ్వల సృష్టి. ఎన్నటికీ ఆరని అఖండజ్యోతి పాఠకులకూ, కళాకారులకూ ఎన్నిసార్లు ఆస్వాదించినా తనివి తీరని అమృత కలశం, అక్షయమైన అక్షరపాత్ర. శిల్ప సౌదర్యానికి పరమావధి, పపంచ సాహితీ వీధిలో తెలుగువారు సగర్వంగా ఎగరేయగల పతాకం.
  • వావిలాల సుబ్బారావు".....అమరావతి కథలలో చదివిన కథను మరొక్కరికి తిరిగి చెప్పగలిగినవి చాలా కొద్దిగానే దొరుకుతాయి. తిరిగి మరొక్కరికి చెప్పగలిగేదే కథ. .. అనుభవంలోకో ఆలోచనలోకో జార్చేది కవిత.. అమరావతి కథలలో చాలా భాగం ఈ హద్దుకు అటొక్క కాలు, ఇటొక్క కాలు వేసి నుంచుంటాయి. అందుకనే వీటిని భావకవిత్వం లాంటి "లిరికల్ కథలు" అనుకుంటాను. వీటిలో సౌకుమార్యం ఉన్నంతగా కథా సంఘర్షణ ఉండదు... అమరావతి కథలు వస్తువుకన్నా కథా శిల్పానికే ఎక్కువ దోహదం చేశాయి. వ్రాసే నేర్పుంటే ఏదయినా కథా వస్తువేనని, మనోలాలిత్యం, శిల్పనైపుణ్యం, కవితాకోణంతో కూడా అందమయిన కథలు వ్రాయొచ్చని సత్యంగారు నిరూపించారు" .[2]
  • ఎమ్వీయల్ పుస్తకం చివరలో "మారేడు దళం" అనే పద్య రూప ప్రశంసలో [4] శంకరమంచి అమరావతి కథలు.....విశ్వరూప సాక్షాత్కారం........ప్రతి కథలోనూ చివరిలో ఉండే కొస మెరుపే కథలకి మకుటం......తెలుగుదేశ చరిత్ర.....తెలుగు వారికి దొరికిన మహా ప్రసాదం....కథలన్న కథలా! ఎలాంటి కథలవి!......అతగాడి రాత బాపుగీత వెలుగు వెన్నెల కలనేత.

మూలాలు మార్చు

  1. "అమరావతి కథలు" ముందుమాట "కృతజ్ఞతలు"లో రచయిత
  2. 2.0 2.1 "వావిలాల సుబ్బారావు" రేడియో ఉపన్యాసం - "శత వసంత సాహితీ మంజీరాలు" అనే పుస్తకంలో ఇవ్వబడింది - ప్రచురణ : ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం, సర్వోత్తమ భవనం, విజయవాడ (2002) .
  3. 3.0 3.1 3.2 "అమరావతి కథలు" కు "అమరావతి కథలు - అపురూప శిల్పాలు" అనే ముళ్ళపూడి వెంకటరమణ ముందుమాట
  4. పుస్తకంలో చివరిమాటగా "మారేడు దళం"

బయటి లింకులు మార్చు