సైనిక చర్యల్లో, ఆర్థిక యుద్ధం అంటే యుద్ధ సమయంలో పాటించే ఆర్థిక విధానం. ఇది యుద్ధకాలపు కోవర్టు ఆపరేషన్లలో భాగం. కీలకమైన ఆర్థిక వనరులు చేజిక్కించుకుని సైనిక, గూఢచారి సంస్థలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నిర్వహించడం లేదా శత్రువు యొక్క కీలకమైన ఆర్థిక వనరులకు గండికొట్టి వారిని సక్రమంగా యుద్ధం చేయనీకపోవడం ఆర్థిక యుద్ధం యొక్క లక్ష్యం. జాతీయ రాజ్యాల నడుమ వివాదాల్లో, ప్రత్యేకించి కేవలం శత్రుదేశపు సైనిక బలగాలే కాక ఆ దేశంలోని ఆర్థిక వ్యవస్థను కూడా మొత్తంగా యుద్ధ యత్నాలవైపు నడిపించే పూర్తిస్థాయి యుద్ధాల్లో, ఆర్థిక యుద్ధం ఎక్కువగా వర్తిస్తూంటుంది. అటువంటి స్థితిగతుల్లో, శత్రువు యొక్క ఆర్థిక స్థితికి చేసే నష్టం శత్రువు యుద్ధం చేయగల సామర్థ్యాన్ని నేరుగా దెబ్బతీస్తుంది. దిగ్బంధించడం(సరుకులు, మార్కెట్లు), బ్లాక్ లిస్ట్ చేయడం, ముందస్తు కొనుగోళ్ళు, రివార్డులు, శత్రువు ముఖ్యమైన ఆస్తులను ముట్టడించి చేజిక్కించ్చుకోవడం వంటివి ఆర్థిక యుద్ధంలో అనుసరించే కొన్ని రకాల విధానాలు.

చారిత్రిక ఉదాహరణలు మార్చు

 
ఎలిజబెత్ I చిత్రపటం

రెండవ ప్రపంచయుద్ధంలో మిత్రరాజ్యాలు ఈ పద్ధతులను అనుసరించి అక్షరాజ్యాల ఆర్థిక వ్యవస్థల కీలకమైన వనరులను దెబ్బతీయడం ఆర్థిక యుద్ధానికి స్పష్టమైన ఉదాహరణ. మరోవంక, అక్షరాజ్యాలు మిత్రరాజ్యాల యుద్ధ ప్రయత్నాలను దెబ్బకొట్టేందుకు జలాంతర్గామి పోరాటం ద్వారా, సరుకులు, ముడిపదార్థాలు, యుద్ధ సంబంధిత పరికరాలు తీసుకువచ్చే రవాణా నౌకలను ముంచేసేందుకు ప్రయత్నించాయి.

మొదటి ఎలిజబెత్ రాణిని 1558లో పదవీభ్రష్టురాల్ని చేసేందుకు స్పెయిన్ చక్రవర్తి రెండవ ఫిలిప్ యుద్ధ సన్నాహాలు ప్రారంభించాడు. క్రొత్తగా స్థాపించబడిన స్పెయిన్ వలస రాజ్యాల నుంచి ఆ సామ్రాజ్యానికి అవసరమైన ఆర్థిక స్తోమత వస్తోందని, దానికీ ఆ రాజ్యాల స్థాపనకు అవసరమయ్యే ఆర్థిక సంపత్తి కోసం చేసిన అప్పులకు యూరోపియన్ రాజ్యాల బాంకుల్లో ఫిలిప్ కట్టవలసిన డబ్బుకూ ముడివుండడమనే బలహీనమైన స్థితిపై మొదటి ఎలిజబెత్ రాణి దెబ్బతీశారు. స్పెయిన్ సంపదను తీసుకువచ్చే ఓడలపై సముద్రపు దొంగల దోపిడీలు చేయించి, తద్వారా స్పెయిన్ ఇంగ్లాండుపై తలపెట్టిన యుద్ధాన్ని వెనక్కినెడుతూ వచ్చింది. ఆ దాడుల ద్వారా స్పెయిన్ ను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీసింది.[1] దానివల్ల దాదాపు 20 ఏళ్ళ తర్వాత చివరకు 1588లో యుద్ధంలో కూడా స్పానిష్ ఆర్ముడాగా పేరొందిన భారీ సైన్యాన్ని చిన్న ఫైర్ షిప్ ల ద్వారా చీకాకు పరిచి, దాడిని పూర్తిగా తిప్పికొట్టింది.[2]

మూలాలు మార్చు

  1. Greene, Robert (2006). 33 Strategies of war. pp. 100–103.
  2. John A. Wagner (2010). Voices of Shakespeare's England: Contemporary Accounts of Elizabethan Daily Life: Contemporary Accounts of Elizabethan Daily Life. ABC-CLIO. p. 91.