ఎవరిస్టీ గాల్వా

ఎవరిస్టీ గాల్వా ఫ్రాన్సుకు చెందిన ప్రఖ్యాత గణితశాస్త్రజ్ఞడు.

ఎవరిస్టీ గాల్వా (Évariste Galois)
గాల్వా 15 ఏళ్ళప్పుడు
జననం(1811-10-25)1811 అక్టోబరు 25
ఫ్రాన్స్
మరణం1832 మే 31(1832-05-31) (వయసు 20)
పారిస్
రంగములుగణిత శాస్త్రము
ప్రసిద్ధిWork on the theory of equations and Abelian integrals
ప్రభావితం చేసినవారుAdrien-Marie Legendre
Joseph-Louis Lagrange
సంతకం

జీవిత విశేషాలు మార్చు

గాల్వా సా.శ. 1811సం.లో అక్టోబరు 25న బోర్గీలారినీ అనే పట్టణంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. గాల్వా తండ్రి సాహితీప్రియుడు. తత్త్వశాస్త్రం చదువుకొని రాజకీయాలలో ప్రవేశించి బోర్గిలారినీ మేయరై ఆ పదవిని చాలాకాలం నిర్వహించాడు. గాల్వా తల్లి ఒక న్యాయ శాస్త్రాచార్యుని కుమార్తె. 12ఏళ్ళ ప్రాయం వచ్చేసరికి గాల్వా తల్లితండ్రులు ప్రాపును వదిలి పారిస్ లోని లూయీ లే గ్రాండ్ కళాశాలలో ప్రవేశించాడు. వయసుకు మించిన జ్ఞాన పరిమితి కలవాడని ప్రవేశించిన కొద్ది రోజులకే తోటివారికి తెలిసిపోయింది. తరగతికి నిర్ణయించిన పాఠ్య పుస్తకాలు అతని తృష్ణను తీర్చలెక పోయినవి. ప్రాథమిక బీజగణిత గ్రంథాలు చదవలేక చీదరించుకొనేవాడు. తన జ్ఞానస్థాయికి సరిపడే పుస్తకాలకోసం వెదకి వాటిని సేకరించి చదవడం ప్రారంభించాడు. ఆరోజుల్లో గణిత శాస్త్రంలో లబ్ధ ప్రతిష్ఠులు లేగ్రాంజి, కోషీలు. చిరుప్రాయంలోనే గాల్వా వీరి రచనలను జీర్ణించుకున్నాడు. గాల్వా చేతుల్లో ప్రౌఢులైన గణిత గ్రంథాలను చూచి ఆచార్యులలో కొందరు కోపంతో చురచుర చూచేవారు.

లూయీ లే గ్రాండ్ కళాశాలలో విద్యాభ్యాసం ముగించుకొని పదునేడేండ్ల వయస్సులో గాల్వా ఎకోల్ పాలిటెక్నిక్ లో చేరేందుకు వెళ్ళాడు. ఆరోజుల్లో అది అగ్రశ్రేణి గణితశాస్త్రశాల. అక్కడ గాల్వాకు ప్రవేశం లభించలేదు. మొదటి ప్రయత్నం విఫలమయింది. మరుసటి సంవత్సరం 1829లో మళ్ళీ ప్రయత్నించి విఫలుడైనాడు. గాల్వా తన గణిత జ్ఞానానికి నిదర్శనంగా అప్పుడే Gergonne's Annales De Mathematique లో తాను ప్రచురించిన సమీకరణ సమస్యలను చూపించినా ఆతనికి ప్రవేశం లభించలేదు. అటుపై Memoir ను సైన్సు అకాడమీ వారికి పంపించాడు. చాలా రోజులు వేచినప్పటికీ ఎన్నో ఉత్తరాలు వ్రాసినప్పటికీ Memoir అతీగతీ తెలియలేదు. చివరికి అది లభించలేదని వార్త అందినది. చివరిసారిగా మరలా అదే సంవత్సరంలో గాల్వాకి ఎకోల్ నార్మల్ లో ప్రవేశించాడు. అప్పటికి అతని వయస్సు పదునెమిదేళ్ళు. అక్కడకూడా తన పురోగమనాన్ని సహించని శక్తులు ఎదురైనాయి. అయినా సాహసంతో ఓటమిని అంగీకరించక ఆరు గణితవ్యాసాలను ప్రచురించాడు. దురదృష్టవశాత్తు ఆ పాఠశాల అధికారులకు గాల్వాకు రాజకీయంగా భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. విద్యాసంస్థ డైరక్టరు గాల్వాను పాఠశాలనుండి బహిష్కరించాడు. ఆ సమయంలో గాల్వా నిరుపేద. అందుకని ఒక పుస్తకాల కొట్టులో ఉపన్యాసాలిచ్చే ఉద్యోగాన్ని ఎలాగోలా సంపాదించాడు. దీనికి తగ్గట్టు అతని ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఒంటరితనం మనిషిని మరీ క్రొంగదీసింది. చిన్న చిన్న పూటకూళ్ళ ఇళ్ళలో అర్ధ భోజనం అలవాటు చేసుకొన్నాడు. రోడ్ల ప్రక్కన ఎక్కడ ఖాళీ బల్ల కనబడితే చాలు అక్కడ రాత్రుల్లు నిద్రపోవటం నేర్చుకున్నాడు. అప్పుడు అతను సైన్సు అకడమీ వారికి మరొక Memoir ను పంపించాడు. అదీ ఏమీ ఉపయోగపడలేదు. అటువంటి సమయంలో గాల్వాకు విఖ్యాత గణితశాస్త్రజ్ఞడు పాయిసన్ పరిచయంతో అకాడమీలో ఉన్న గాల్వా మెమెర్‌లన్నీ పరిశీలించి ఎన్నో ఉత్తర ప్రత్ర్యుత్తరాలు చేశాడు. అర్ధము కాలేదు అని పాయిసన్ రాసిన చివరి ఉత్తరంతో విసిగిన గాల్వా గణితాన్ని తాత్కాలికంగా ఆపి రాజకీయ సుడిగండంలోకి ఉరికినాడు. రివల్యూషనరీ లిబరలిజం కోసం గద్దెలెక్కి గొంతు చించుకొని ఉపన్యాసాలిచ్చాడు. బూర్జువా నాయకత్వం బూడిదపాలు కావాలని బల్లగుద్ది గర్జించాడు. ఒక సభలో మాటపై మాటలో కోపావేశంలో లూయీ ఫిలిప్పును హతమారుస్తాను అనేశాడు. తత్ఫలితంగా గాల్వా ఖైదు చేయబడ్డాడు. విచారణలో క్షమాభిక్ష కోరుకుంటే విడుదల చేస్తానని అధికారులు కోరితే అత్మాభిమానంతో గాల్వా ఆడిన మాటను దాటలేదు. అయినా ఒక సాంకేతిక అంశంపై విడుదల చేయబడ్డాడు. రెండు నెలల తరువాత మళ్ళీ ప్రమాదకరమైన విప్లవాలు లేవతీయగలడు అన్న పట్టంతో మరలా కారాగారంలోకి తోయబడ్డాడు. తరువాత కొన్ని నిబంధనలతో విడుదల చేయబడ్డాడు.

ఇంతకు పూర్వమే పూర్తిగా విసిగిపోయిన గాల్వాకు ఇప్పుడు జీవితంపై ఒక ఏహ్యభావం కలిగింది. జీవితంలో అన్నీ దుస్సాధ్యాలే అనే నమ్మకం తీవ్రపడింది. నిరాశావాదిగా మారినాడు. ఆ రోజుల్లోనే అతనికి ఒక స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఈ వ్యక్తితో గాల్వాకు ఎటువంటి సంబందం ఉందో ఎవరికీ కచ్చితంగా తెలియదు. కానీ ఈమె అతని మరణానికి కారణభూతమయింది. ఆవిడంటే గాల్వాకు ప్రాణం. ఆమెకు మామయ్య అనీ ఒకడు, ప్రియుడని మరొకడు ఇరువురు అకస్మాత్తుగా వచ్చి గాల్వాతో పేచీపెట్టుకున్నారు. నిజానికి వాళ్ళు ఆవిడతో కులికే విలాసపురుషులే కానీ ఎటువంటి బంధుత్వం లేదు. ఆ పేచీ ముదిరి పిస్తోలుతో కొట్లాటకు దారితీసింది. ప్రతిష్ఠ, పరిస్థితుల మధ్య ఇరుక్కొని ఆ సవాలుకు అంగీకరించక తప్పిందికాదు గాల్వాకు, తాను పోటీలో మరణించడం తథ్యం అని తెలిసి కూడా ఒప్పుకున్నాడు. 1832 మే 25,27 తారీఖులలో పోటీ జరగవలసిందని నిర్ణయించుకున్నారు. డైరీలో "విధిలేక నిర్బంధం మీద నేను ఈ డ్యూయల్ కు ఒప్పుకున్నానని దేవుడేసాక్షి. డూయల్ ఆపుదామని ఎంత ప్రయత్నించినా నిష్ప్రయోజనమైనదని" అని వ్రాసుకున్నాడు.

డ్యూయల్‌కు ముందు రోజు మూడు ఉత్తరాలు వ్రాసినాడు గాల్వా: అందులో ఒకటి మిత్రుడైన అగస్టీ కేవిలియర్ కు. స్వల్ప జీవితకాలంలో తాను సాధించిన గణితశాస్త్ర సత్యాల సింహావలోకనం ఆ ఉత్తరంలో ఉందంతం. అదృష్టవశాత్తు ఆ ఉత్తరం కాలగర్భంలో కలసిపోక ఈనాటికీ జాగ్రత్తగా కాపాడబడి ఉంది.

డ్యూయల్ జరిగింది. పిస్తోలు గుండు గాల్వా కడుపు చీల్చి వెళ్ళినాయి. నిస్సహాయ స్థితిలో గాల్వా మూడురోజులు మరణయాతన అక్కడ పొలంలో అనుభవించాడు. ఎవరూ అతనిని గమనించలేదు. 30వ తారీఖున ఒక రైతు ఆ బీభత్సాన్ని చూచి హాస్పిటలో చేర్చాడు. చేర్చిన వెంటనే గాల్వా మరణించాడు. గాల్వా భౌతిక శరీరాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు దాదాపు 3000 మంది రిపబ్లికన్లు చేరినారట. పోలీసు బందోబస్తు కూడా అమరింది.

గాల్వా మరణించిన కొన్నేళ్ళకు ప్రపంచం ఆతనిని గుర్తించింది. ఆతని రచనల వైశిష్ట్యాన్ని విఖ్యాత గణితవేత్త జొర్డాన్ ప్రపంచానికి పరిచయం చేసాడు. నేడు గాల్వా ప్రావీణ్యతను ఎవరూ శంకించరు. విశ్వ విఖ్యాత గణిత సత్యాలయినాయి. కానీ ఆతని జీవితం బాధాకరమైన విషాదగాధగా నిలిచిపోయింది.

గణిత శాస్త్రపరిశోధనలు మార్చు

పూర్వులైన గణిత శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి విజయం సాధించని అంశాలపైన గాల్వా తన 13ఏళ్ళ వయస్సు నుంచి పరిశోధనలు సాగించేవాడు. గాల్వా సర్వ సాధారణ పంచమ ఘాత సమీకరణాన్ని (General Fifth Degree Equation) సాధించేందుకు ఫలితంపైన నమ్మకం కుదరనప్పటికీ పూనుకున్నాడు. నిర్విరామంగా పరిశోధనలు చేస్తూ ఒక స్థాయిలో సాధించేశానని నమ్మినాడు! అది అసాధ్యమైనదని తెలిసికూడా. ఈ సమస్యా పూరకానికి పూనుకొని గాల్వా అమూల్యమైన జ్ఞానాన్ని ప్రోగుచేసాడు గణితానికి. తత్ఫలితమే నేడు మన కందిన గణితజ్ఞాన నిక్షేపము (Theoryl of Algebriac Solution of Equations). ఈసిద్ధాంత చర్చలో ఒకచోట పంచమఘాత సమీకరణాన్ని సాధించ వీలుకాదు అనే విషయం నిర్ణయించుకున్నాడు.

మూలాలు మార్చు

  • 1976 భారతి మాస పత్రిక. వ్యాసము: గణిత చరిత్రలో ఒక విషాదగాధ. డా. విశ్వనాధ అరుణాచలం.