ఎ. వి. గురవారెడ్డి

ఎముకల శస్త్ర చికిత్సా నిపుణుడు

గురవారెడ్డి గా పేరు పొందిన డాక్టర్ అన్నపరెడ్డి వెంకట గురవారెడ్డి ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ వైద్యుడు, రచయిత.[2] ఆయన కీళ్ళవ్యాధులకు చికిత్స చేయడంలో సిద్ధహస్తుడు.[3]హైదరాబాదులోని సన్ షైన్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టరు. అంతకు మునుపు ఇంగ్లండులో పదేళ్ళు, అపోలో ఆసుపత్రిలో కొంత కాలం పనిచేశాడు. కిమ్స్ ఆసుపత్రిని స్థాపించిన వారిలో ఆయన కూడా ఒకడు. ఒక్క ఏడాదిలో 4000 శస్త్రచికిత్సలు చేసి ఆసియా రికార్డు నెలకొల్పాడు.[4] ఆయన అనుభవాలను గురవాయణం అనే పేరుతో పుస్తకం రాశాడు. ఆయన భార్య భవాని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాం కుమార్తె. ఆమె కూడా వైద్యురాలే. కుమార్తె కావ్య లిటిల్ సోల్జర్స్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు అయిన గుణ్ణం గంగరాజు ఈయనకు తోడల్లుడు.

గురవారెడ్డి
జననం
అన్నపరెడ్డి వెంకట గురవారెడ్డి

(1958-09-29) 1958 సెప్టెంబరు 29 (వయసు 65)[1]
జాతీయతభారతీయుడు
విద్యఎంబీబీఎస్
డి.ఎన్.బీ (ఆర్థో)
ఎఫ్.ఆర్.సి.యస్
విద్యాసంస్థగుంటూరు వైద్యకళాశాల
పుణె వైద్య కళాశాల
వృత్తివైద్యులు
జీవిత భాగస్వామిభవాని
పిల్లలుఆదర్శ్
కావ్య
తల్లిదండ్రులు
  • సత్యనారాయణ రెడ్డి (తండ్రి)
  • రాజ్యలక్ష్మి (తల్లి)

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఆయన గుంటూరులో పుట్టాడు. తల్లి రాజ్యలక్ష్మి. తండ్రి సత్యనారాయణ రెడ్డి బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆచార్యుడు. వారిది ఒక మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఉద్యోగరీత్యా వారి కుటుంబం బాపట్లకు తరలి వెళ్ళింది. ఆయన పదోతరగతి దాకా బాపట్ల మునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదివాడు. అక్కడే ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తయింది. బాపట్లలోని యార్లగడ్డ కృష్ణమూర్తి అనే వైద్యుడి స్ఫూర్తితో ఆయన కూడా వైద్యుడు కావాలనుకున్నాడు. ఇంటర్మీడియట్ పూర్తి కాగానే వైద్య ప్రవేశ పరీక్ష రాశాడు కానీ అందులో ఆయనకు వచ్చిన మార్కులకు వైద్య కళాశాలలో సీటు లభించలేదు. ప్రత్యామ్నాయ మార్గంగా తండ్రి బోధిస్తున్న వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీయెస్సీలో చేరి ప్రవేశ పరీక్ష మరో మూడు సార్లు రాసి చివరి ప్రయత్నంలో గుంటూరు వైద్య కళాశాలలో ప్రవేశం దక్కించుకున్నాడు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత పుణె లో కీళ్ళవైద్యంపై పీజీ చేశాడు.[2]

వైద్యవృత్తి మార్చు

పుణెలో పీజీ చేసిన తర్వాత గుంటూరులో ఆసుపత్రి ప్రారంభించాలనుకున్నాడు కానీ మిత్రుడైన డాక్టర్ సతీష్ కుట్టి సహకారంతో ఇంగ్లండు వెళ్ళాడు. పదేళ్ళపాటు అక్కడే పనిచేశాడు. అక్కడ మోకాలు శస్త్రచికిత్సలు చేస్తూనే మూడు ఎఫ్.ఆర్.సి.యస్ లు, ఎం.ఆర్.సి.యస్ చేశాడు. 1999 లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. కొద్ది రోజులు హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో పనిచేశాడు. 2004 లో ఆయన తోడల్లుడు డాక్టర్ భాస్కరరావుతో కలిసి కిమ్స్ ఆసుపత్రి ప్రారంభించాడు. స్వల్ప వ్యవధిలోనే ఆ ఆసుపత్రికి మంచి పేరు వచ్చింది.

ఆర్ధోపెడిక్స్ కు సంబంధించి ఇంకా మంచి ఆసుపత్రిని ప్రారంభించాలనే ఉద్దేశంతో కిమ్స్ నుంచి బయటకు వచ్చి 2009 లో సన్ షైన్ ఆసుపత్రి ప్రారంభించాడు. అది 2016 నాటికి 450 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందింది. జాతీయ స్థాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా పేరు తెచ్చుకుంది.[2] ఆయన రోగులను చూడటమే కాకుండా ప్రతి యేటా సుమారు 30 మంది వైద్యులకు శిక్షణ ఇస్తుంటాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉపన్యాసాలు కూడా ఇస్తుంటాడు.

రచయితగా మార్చు

ఆయన పాఠశాలలో చదువుతున్నప్పటి నుంచి భాషమీద మమకారం ఉండేది. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో బహుమతులు కూడా సాధించాడు. వైద్యకళాశాలలో ఉన్నపుడు తెలుగు పత్రికకు సంపాదకుడిగా కూడా ఉన్నాడు. అందులో స్నేహితుల ప్రోత్సాహంతో కథలు రాసేవాడు. తరువాత సాక్షి లాంటి వార్తా పత్రికల్లో కూడా కొన్ని వ్యాసాలు రాశాడు.[5] ఆయన అనుభవాలను గురవాయణం అనే పేరుతో గ్రంథస్థం చేశాడు. ఆయనకు సంగీతంలో కూడా ఆసక్తి ఉంది. రోజూ రాత్రి రేడియోలో పాతపాటలు వినడం ఆయనకు అలవాటు. [6]

కుటుంబం మార్చు

ముగ్గురు అన్నదమ్ముల్లో ఆయనే పెద్ద. పెద్ద తమ్ముడు హరి ఐఐఎంలో చదివాడు. చిన్న తమ్ముడు బుజ్జి ఐఐటీ లో చదివాడు. ఆయన భార్య పేరు భవాని. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రియైన భవనం వెంకట్రామ్ కుమార్తె.[7] ఆమె కూడా వైద్యురాలే. 1986లో వారి వివాహం జరిగింది. వారిది ప్రేమ వివాహం. వారిద్దరి కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉంది. ఆయన గుంటూరులో చదువుతున్నప్పుడు ఆమె విజయవాడ సిద్ధార్ధ వైద్యకళాశాలలో చదువుతుండేది. పదేళ్ళు ప్రేమించుకున్న తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి పేరు ఆదర్శ్. అతను కూడా ఆర్ధోపెడిక్ సర్జన్. అమ్మాయి పేరు కావ్య. కావ్య చిన్నపుడు గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించిన లిటిల్ సోల్జర్స్ అనే సినిమాలో నటించింది. గంగరాజు గురవారెడ్డికి తోడల్లుడు.[2]

మూలాలు మార్చు

  1. ముడుంబై. "డిఫరెంట్ డాక్టర్!ఇక్కడ జబ్బులు పోవును.. నవ్వులు పూయును!". namasthetelangaana.com. అల్లం నారాయణ. Archived from the original on 25 అక్టోబరు 2015. Retrieved 3 October 2016.
  2. 2.0 2.1 2.2 2.3 "అలాంటి రోజొస్తే రిటైరవుతా..." ఈనాడు. 2 October 2016. Archived from the original on 2 October 2016. Retrieved 2 October 2016.
  3. Staff Reporter. "Ceramic hip replacement a boon for young patients". The Hindu.
  4. విలేఖరి. "చైతన్య స్ఫూర్తి". sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 2 October 2016.
  5. "అమ్మ చేతిలో చెయ్యేసి..." sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 2 October 2016.
  6. "కళల డాక్టర్లు..!". namasthetelangaana.com. అల్లం నారాయణ. Archived from the original on 20 సెప్టెంబరు 2014. Retrieved 3 October 2016.
  7. స్వాతి, శర్మ. "This Love has no Boundary". newindianexpress.com. ఇండియన్ ఎక్స్ప్రెస్. Archived from the original on 25 మే 2016. Retrieved 2 October 2016.

బయటి లింకులు మార్చు