కాన్‌స్టాంటిన్ ద గ్రేట్

కాన్‌స్టాంటిన్ ద గ్రేట్ (సా.శ. 272 ఫిబ్రవరి 27 నుంచి 337 మే 337) సా.శ. 306 నుంచి 337 వరకూ పరిపాలించిన రోమన్ చక్రవర్తి. ఇతన్ని మొదటి కాన్‌స్టాంటిన్ అని కూడా పిలుస్తారు. డాసియా మెడిటెరానియాలోని నైసస్‌లో (నేటి సెర్బియాలోని, నీష్ నగరం) జన్మించాడు. కాన్‌స్టాంటిన్ తండ్రి ఫ్లావియస్ కాన్‌స్టాంటియస్ ఇలిరియన్[నోట్స్ 1] ప్రాంతానికి చెందిన సైన్యాధికారిగా జీవితం ప్రారంభించి రోమన్ సామ్రాజ్యపు టెట్రార్కీ విధానంలో నలుగురు చక్రవర్తుల్లో ఒకడయ్యాడు.[నోట్స్ 2] అతని తల్లి హెలెనా గ్రీకు జాతీయురాలు, సామాన్య కుటుంబంలో జన్మించింది. డియోక్లెటైన్, గాలెరియస్ చక్రవర్తులు ఇద్దరి నాయకత్వంలోనూ కాన్‌స్టాంటైన్ సేనా నాయకునిగా విశిష్టమైన సేవలందించాడు. ఇందులో భాగంగా తూర్పు ప్రావిన్సుల్లో బార్బేరియన్లు, పర్షియన్లపై పోరాడాడు. సా.శ. 305లో అతని తండ్రి అధీనంలో బ్రిటన్‌లో పోరాడడానికి వెనక్కి పిలిచేదాకా తూర్పు ప్రావిన్సుల్లో సేనా నాయకునిగా పనిచేశాడు. 306లో ఇతని తండ్రి మరణించాకా ఎబోరాకం (ఈనాడు ఇంగ్లాండ్‌లోని యార్క్ నగరం) సైన్యం కాన్‌స్టాంటిన్‌ను చక్రవర్తిగా ప్రకటించింది. ఇతర చక్రవర్తులైన మాక్సెంటియస్, లిసినియస్‌లపై అంతర్యుద్ధాల్లో పోరాడి 324 నాటికల్లా రోమన్ సామ్రాజ్యపు ఏకైక పరిపాలకుడిగా నిలిచాడు.[నోట్స్ 2]

ఇంగ్లాండు లోని యార్క్ వద్ద కాన్‌స్టాంటిన్ ద గ్రేట్ ఇత్తడి విగ్రహం

కాన్‌స్టాన్‌టిన్ చక్రవర్తిగా సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడానికి పరిపాలన, ఆర్థిక, సామాజిక, సైనిక రంగాల్లో సంస్కరణలను అమలు చేశాడు. పౌర, సైనిక అధికారులను వేరుచేస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని పునర్నిర్మించాడు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి అతను కొత్త బంగారు నాణెం అయిన సాలిడస్‌ను ప్రవేశపెట్టాడు. ఇది బైజాంటైన్, యూరోపియన్ కరెన్సీలకు వెయ్యి సంవత్సరాలకు పైగా ప్రామాణికంగా నిలిచింది. కామిటాటెన్స్‌లు అన్న పేరుతో సంచార యూనిట్లు, లిమిటానై అన్న పేరుతో కోటలో నిలిచివుండే స్థిరమైన యూనిట్ల కింద సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించాడు. తద్వారా అంతర్గత ప్రమాదాలను, బార్బేరియన్ల దండయాత్రలను కూడా ఎదుర్కోగలిగేలా ఈ యూనిట్లు ఉపయోపడ్డాయి. రోమన్ సరిహద్దుల్లోని ఫ్రాంకులు, అలమాన్ని, గోథ్‌లు, సర్మాటియాన్లు వంటి జాతులపై విజయవంతంగా దండయాత్రలు చేశాడు. అతను ఆక్రమించిన భూభాగాల్లో రోమన్ సామ్రాజ్యం మూడవ శతాబ్దపు సంక్షోభం ఎదుర్కొంటుండగా తన పూర్వ చక్రవర్తులు వదిలిపెట్టిన ప్రాంతాలు కూడా ఉన్నాయి.

గమనికలు మార్చు

  1. ఇలీరియా అన్నది ఆగ్నేయ ఐరోపాలోని బాల్కన్ ద్వీపకల్పంలో భాగం ఇక్కడి ప్రజలను ఇలీరియన్లు అని వ్యవహరించేవారు. ఈ ఇలీరియా అన్నది ఈనాటి ఉత్తర, మధ్య ఆల్బేనియా దేశంలో భాగం.
  2. 2.0 2.1 టెట్రార్కీ లేక టెట్రా ఆర్కీ అన్నది సా.శ.293 నుంచి 324 వరకూ కొనసాగిన రోమన్ పరిపాలన వ్యవస్థ. ఇందులో భాగంగా నలుగురు చక్రవర్తులు రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు. వారిలో ఇద్దరిని ఆగస్టస్ అనీ, ఇద్దరిని సీజర్ అనీ పిలుస్తారు. వీరు సామ్రాజ్యంలో తూర్పు, పశ్చిమ భాగాలు తమలో విభజించుకుని పరిపాలిస్తారు. ముందు 285 నుంచి 293 వరకూ ఇద్దరు చక్రవర్తులతో డైయార్కీగా ప్రారంభమైన ఈ వ్యవస్థ, 293 నాటికి టెట్రార్కీ అయింది. రోమన్ చక్రవర్తి డయాక్లెటియాన్ మూడవ శతాబ్దంలో 50 సంవత్సరాల పాటు సాగిన అరాచకత్వాన్ని, రాజకీయ అస్థిరతను చక్కదిద్దేందుకు ఈ పద్ధతి తీసుకురాగా, కాన్‌స్టాంటిన్ ద గ్రేట్ తన తోటి చక్రవర్తులను అంతర్యుద్ధంలో ఓడించి ఏకైక చక్రవర్తిగా నిలవడంతో ముగిసిపోయింది.