కాఫీ అనేది ఒక ఉత్తేజపానీయము. కాఫీ చెట్ల పండ్ల నుండి లభించే గింజలను ఎండబెట్టి, వేగించి, పొడి చేసి, కాఫీ తయారీకి ఉపయోగిస్తారు. కాఫీగింజలను దాదాపు 70 దేశాలలో పండిస్తున్నారు. కాఫీ పంటను ముఖ్యముగా లాటిన్ అమెరికా, దక్షిణా ఈశాన్య ఆసియా, ఆఫ్రికా ప్రాంతాలలో విస్తారంగా పండిస్తున్నారు. వేగించని పచ్చి కాఫీ గింజల వాణిజ్యము ప్రపంచంలో అత్యధికంగా జరిగే ప్రసిద్ధ వాణిజ్యాలలో ఒకటి. కాఫీ గింజలలో ఉన్న కాఫి అనే పదార్ధము మానవులను ఉత్తేజపరుస్తుందని ఊహించబడుతుంది. కాఫీ ప్రపంచంలో అత్యధికంగా సేవించే ఉత్తేజపానీయము. కాఫీ అనేది ఒక ప్రసిద్ధ పానీయం. ప్రపంచ వ్యాప్తంగా అన్నిప్రాంతాలలో దొరికే ఈ పానీయం, పెద్దల నుండి పిన్నల వరకు అనేకులు అలవాటు పడిన ఉత్తేజపానీయము. కాఫీ గింజలను సువాసన వచ్చేవరకు వేగించి, పొడిచేసి, దానిని నీటితో మరిగంచి, ఆ నీటిని వడకట్టి కాఫీ డికాక్షన్ తయారు చేస్తారు. కాఫీ డికాక్షన్ లో పంచధారను చేర్చి పానీయంగా వేడిగా త్రాగుతారు. మనదేశంలో కాఫీ డికాక్షన్ లో పాలను చేర్చి త్రాగే అలవాటు ఉంది కాని అమెరికా, ఐరోపా లాంటి దేశాలలో పాలను చేర్చకుండా అధికంగా త్రాగుతుంటారు. కాఫీని అతి వేడిగానూ, అతి చల్లగానూ త్రాగడం చాలా మందికి అలవాటు. కాఫీ ఒక ఉత్సాహ పానీయం. దీనిని అనేకంగా ఉదయపు వేళలో ఉట్టిది గానూ, మిగిలిన సమయాలలో అల్పాహారంతోనూ త్రాగడం అలవాటు. ప్రస్తుతం స్నేహితులు బంధువులు వచ్చినపుడు కాఫీతో మర్యాదచేయడం సాధారణం అయింది. విందులు వినోదాలలో కాఫీలు అతి ముఖ్యం అయ్యాయి. ఉత్తర అమెరికాలో 1688లో కాఫీ సేవించిన ఘటన పేర్కొనబడింది. కాఫీ అనేక సమాజాలలో వారి సంస్కృతిలో ప్రధాన పాత్ర వహిస్తూ జీవనశైలిలో, ఆహారపుటలవాట్లలో ఒక భాగం అయిపోయింది.

కాఫీ ( నిశివర్ణస్థోతకము )
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
జాతులు

Coffea arabica - Arabica Coffee
Coffea benghalensis - Bengal coffee
Coffea canephora - Robusta coffee
Coffea congensis - Congo coffee
Coffea dewevrei - Excelsa coffee
Coffea excelsa - Liberian coffee
Coffea gallienii
Coffea bonnieri
Coffea mogeneti
Coffea liberica - Liberian coffee
Coffea stenophylla - Sierra Leonian coffee

A cup of coffee.

పేరు, చరిత్ర మార్చు

కాఫీ ఇథియోపియా గొర్రెల కాపరులచే 9వ శతాబ్దములో కనిపెట్టబడింది. ఇథియోపియా కొండ ప్రాంతాలలో మేతమేస్తున్న గొర్రెలు ఒక విధమైన మొక్కలలో ఉన్న పండ్లను తిని ఉత్సాహంతో గంతులు వేస్తుండటం గమనించి, ఆపండ్లలో ఏదో వింతైన శక్తి ఉన్నట్లు గ్రహించి, వాటిని ఉపయోగించడము ప్రారంభించి, దానికి కాల్ది అని నామకరణము చేశారు. తరువాతి కాలంలో ఇది ఈజిప్ట్, యెమన్ దేశాలలో వ్యాప్తి చెందింది. 15 వ శతాబ్దానికి ఇది మధ్య తూర్పు ప్రాంతాలైన ఉత్తర ఆఫ్రికా, పర్షియా, టర్కీలని చేరింది.1585 వ సంవత్సరములో లెయాన్ హార్డ్ ర్యూవుల్ఫ్ (Leonhard Rauwolf) అనే జర్మన్ వైద్యుడు తన పది సంవత్సరాల తూర్పు దేశ వాసము పూర్తిచేసి తిరిగి జర్మనీ చేరుకున్న తరువాత కాఫీని నరాల బాధా నివారిణిగా తీసుకొమ్మని రోగులకు సలహా ఇచ్చాడు.ఇదీ దాని సారాంశము

బున్ను అనే మొక్కల పండ్లతో నీటిని చేర్చి తయారుచేసిన ఇంకులా ఉండే నల్లని ద్రవము ఉదయము ఒక పార్సిలియన్ కప్ నిండా త్రాగాలి. ఇది నరాల బలహీనతను ముఖ్యముగా కడుపుకి సంబధించిన బాధని దూరము చేయటానికి ఉపయోగంగా ఉంటుంది

ముస్లిమ్ దేశాలనుండి కాఫీ ఇటలీ దేశానికి వ్యాప్తి చెందింది.క్రమంగా కాఫీ ఉత్తర ఆఫ్రికా, వెనిస్, ఈజిప్ట్, మధ్యప్రాచ్యదేశాల మధ్య ముఖ్యమైన వాణిజ్య వస్తువైంది. వెనిస్ నుండి మిగిలిన ఐరోపా ఖండములో ఇది వ్యాప్తి చెందటము ప్రారంభించింది. 8వ పోప్ క్లెమెన్ట్ దీనిని క్రైస్తవ పానీయంగా గుర్తించడంతో ఇది క్రైస్తవుల అంగీకారాన్ని పొంది వారి సంప్రదాయ పానీయంగా చోటు చేసుకుంది. యురోపియన్ మొట్టమొదటి కాఫీశాల 1645 లో ఇటలీలో ప్రారంభించబడింది. కాఫీని పెద్ద మొత్తంగా డచ్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. అరబ్ దేశాలు కాఫీ మొక్కలను, పచ్చి కాఫీ గింజలను ఎగుమతి చేయడంపై నిషేధం విధించడంతో డచ్ కాఫీ మొక్కల పెంపకాన్ని జావా,సిలోన్ లలో ప్రారంభించింది.ఈస్టిండియా కంపనీ వలన కాఫీ ఇంగ్లండ్ లో వ్యాప్తి చెందింది తరువాత ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, పోలెండ్, వియన్నాలలో వ్యాప్తి చెందింది.ఉత్తర అమెరికాలలో కాలనీల కాలంలో ప్రారభమైన కాఫీ వాడకము ఐరోపాలా ప్రారంభంలో అమెరికన్లను ఆకర్షించకపోయనా కాఫీకి అమెరికన్ల మధ్య కొంత చోటు మాత్రం లభించింది.తరువాతి కాలంలో అవసరానికి కావలసినంత సరుకు లభించని కారణంగా వ్యాపారులచే కాఫీ ధర విపరీతంగా పెంచబడింది. 1812 లో జరిగిన యుద్ధానంతరము టీ దిగుమతులు ఇంగ్లండ్ తాత్కాలికంగా నిలిపి వేయడంతో అమెరికాలో కాఫీ వాడకం ఊపందుకుంది. కాఫీ పొడి తయారీలో సాంకేతిక నైపుణ్యము మెరుగుపడసాగింది. తరువాతి కాలంలో అమెరికన్లకు కాఫీ తప్పనిసరి ఆహార పానీయాలలో ఒకటిగా మారింది.

కాఫీ యథియోపియన్ల ద్వారా కాకతాళీయంగా కనిపెట్టబడినదే అయినా దీనిని పంటలుగా పండించి అభివృద్ధిచేసిన ఘనత మాత్రము అరేబియనులదే. 15వ శతాబ్ద మధ్యకాలంలో కాఫీని సేవించినట్ల ఆధారాలు లభ్యమౌతున్నాయి. దక్షిణా అరేబియా ఏమన్ చెందిన సూఫీలు దీనిని సేవించినట్లు ఆధారాలు లభ్యమౌతున్నాయి. ముస్లిమ్ దేశాల నుండి ఇది ఇటలీకి విస్తరించింది. తరువాత ఇండోనేషియా, తూర్పు ఐరోపా మరియూ అమెరికాలకు విస్తరించింది.

కాఫీ చెట్లు వాడని పచ్చదనాన్ని కలిగిన చిన్న చెట్లు. ఇవి సాధారణంగా కొండ ప్రాంతాల్లో నాటబడతాయి. ఇవి 3-9 మీటర్ల ఎత్తువరకు పెరుగుతాయి. ఇవి సామాన్యంగా సంవత్సరానికి ఒకసారి ఆకుపచ్చ గింజల రూపంలో వికసిస్తాయి. ఎనిమిదవ సంవత్సరంలో ఇది వాణిజ్యమైన మంచి దిగుబడిని ఇవ్వగలుగుతుంది. కాఫీ పానీయాన్ని తాగుతున్నప్పుడు అందులో ఉన్న కెఫిన్ (ఆల్కలాయిడ్) మనకు కావలసిన ఉత్సాహాన్నిచ్చి మానసిక స్థితిని ఒక ఉచ్ఛ దశకు తీసుకెళ్తుంది. అందులో ఉన్న మరో పదార్థం కాఫీయోల్ చాలా హాయినిచ్చే రుచి సువాసలనలు కాఫీకి అందజేస్తుంది. కాఫీకి చికోరీ చేర్చడం వలన ఒక విధమైన రుచి వస్తుంది. కాఫీ తీసుకోవడం ద్వారా అల్జీమర్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని దక్షిణ ఫ్లోరిడా యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. కాఫీలోని కఫేన్‌లు శరీరంలోని రక్తపు స్థాయిని పెంచుతుందని ఆ అధ్యయనంలో వెల్లడైంది. కాఫీ గింజల్లోని కఫేన్‌ల ద్వారా జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధులు కూడా నయమవుతాయని తెలియవచ్చింది. కఫెనేటెడ్ కాఫీ సాధారణంగా రక్తపు గ్లూకోజ్ స్థాయిని పెంచుతుందని యూఎస్ఎఫ్ న్యూరోసైంటిస్ట్ చవాన్‌హయ్ కో తెలిపారు. అలాగే కాఫీ తాగడం వల్ల ఉత్సాహం, చురుకుదనం కలగడమే కాకుండా గుండెకు మేలు జరుగుతుంది. కెఫిన్‌ గుండెకు రక్షణ కల్పిస్తుంది. క్రమం తప్పకుండా కాఫీ సేవించడం వల్ల గుండె క్రమబద్ధంగా పనిచేస్తుందని సర్వేలో తేలింది. కెఫిన్ కాపీ తాగడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుందని చవాన్ వెల్లడించారు. ఒక రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగితే పక్షవాతం వంటి వ్యాధులు దరిచేరవని స్వీడన్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అదేసమయంలో ఇష్టానుసారంగా తాగితే మాత్రం బీపీ వంటి రోగాలు కొని తెచ్చుకున్నట్టేనని వారు హెచ్చరిస్తున్నారు. స్వీడన్‌లోని పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన వివరాలను పరిశీలిస్తే.. 1960 నుంచి స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు దాదాపు ఐదు లక్షల మంది కాఫీ ప్రియులపై ఈ అధ్యయనం చేసినట్టు తెలిపింది. కాఫీ తాగితే మెదడులో రక్తం గడ్డ కట్టడాన్ని 14 శాతం తగ్గిస్తుందని వారు తెలిపారు. అలాగే, కాఫీ ద్వారా చెడ్డ కొలస్ట్రాల్ నుంచి మెదడును కాపాడవచ్చు. అయితే కాఫీ మోతాదు ఎక్కువైతే రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరించారు. ఈ విషయాలన్నీ అమెరికన్ జర్నల్‌లో ప్రచురితం చేశారు. కాఫీ తాగే వారిలో కెఫీన్ ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఇది రక్తపు పోటును పెంచుతుందని తద్వారా ధమనులు మొద్దుబారుతాయన్నారు. పైపెచ్చు.. గుండె వేగాన్ని పెంచే ఒత్తిడి హార్మోన్‌ స్థాయిలను పెంచుతుందన్నారు. ఈ విషయం అమెరికాకు చెందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు 400 మంది గుండెపోటు బాధితులపై జరిపిన సర్వేలో వెల్లడైనట్టు డైలీ టైమ్స్ పత్రిక పేర్కొంది.

కాఫీ మరీ అనారోగ్యకరమైన వ్యసనమేమి కాదని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. కాఫీతో కొన్ని ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది. టైప్‌ 2 డయాబెటిస్‌, గుండె సంబంధింత వ్యాధులు, సమస్యలతో బాధపడేవారికి కాఫీ మేలు చేస్తుందని తెలిసింది. కానీ కొన్ని సైడ్‌ ఎఫెక్ట్‌లు కూడా ఉన్నాయని తేలింది. కాఫీలోని కెఫీన్‌ మూలంగా శరీరంలో ఒకరకమైన వ్యాధి నిరోధక శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. ఫలితంగా ఈ శక్తి కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు, క్యాన్సర్‌, టైప్‌2 డయాబెటిస్‌ సమస్యలను నివారిస్తుంది. కాఫీలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కప్పు కాఫీలో 6 కేలరీలు ఉంటే అందులో కలిపే చక్కెరలో 23 నుంచి 27 కేలరీలు ఉంటాయి. కాఫీలో చక్కెర కలపకుంటే కేలరీలు పెరిగే సమస్యే ఉండదు.

లో (low) బ్లడ్‌ ప్రెషర్‌తో బాధపడే వారికి కాఫీ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని సేవిస్తే బ్లడ్‌ ప్రెషర్‌ లెవెల్స్‌ క్రమ,క్రమంగా పెరుగుతాయి. కానీ ఎక్కువగా కాఫీ తీసుకుంటే శరీరంలో యాంటిఆక్సిడెంట్స్‌ పెరుగుతాయి. ఫలితంగా గుండెలో మండినట్టవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయి. కాఫీ ఎక్కువగా తీసుకుంటే ‘కాఫీ జిట్టర్స్‌’ అనే స్థితికి చేరుకుంటారు. కెఫీన్‌ ఎక్కువగా శరీరంలో చేరడం వల్ల యాంగ్టిటీతో పాటు నిద్రలేమి సమస్యలు కూడా ఏర్పడతాయి. ఎక్కువగా దీన్ని సేవిస్తే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాఫీని అవసరమైన మేరకు సేవిస్తేనే మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కాఫీలోని మంచి గుణాలు మార్చు

దీర్ఘకాలము రోజూ కాఫీ తాగితే గుండెజబ్బులు, మధుమేహము వచ్చే అవకాశము తగ్గుతుంది . కాఫీ వాడకం వల్ల వృద్ధాప్యము దూరమవుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కాఫీ లోని కెఫిన్‌ .. న్యూరొట్రాన్స్మిటర్స్ అయిన " నార్ ఎడ్రినాలిన్‌ , అసిటైల్ కొలిన్‌ , డోపమైన్‌" స్థాయిలను పెంచుతుంది. వీటిమూలాన పనిలో ఏకాగ్రత, చురుకుతనము, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. కెఫిన్‌ తక్కువమోతాదులో ఉత్సాహాన్ని పెంచి ... అలసటను తగ్గిస్తుంది. కెఫిన్‌ మెటబాలిక్ రేట్ ను పెంచి ....తాత్కాలికంగా హుషారుగా ఉండేటట్లు చేస్తుంది .కెఫిన్‌ క్యాస్సర్ వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు . కెఫిన్‌ " పార్కిన్సనిజం " జబ్బు వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు .కెఫిన్‌ " టైప్ 2 మధుమేహము " వచ్చే రిస్క్ తగ్గిస్తుందని ఆధారాలు ఉన్నాయి. కెఫిన్‌ కొన్ని కాలేయ క్యాన్సర్లు రానీయదని పరిశోధనలు ఉన్నాయి .

కాఫీలోని చెడు గుణాలు మార్చు

కెఫిన్‌ " రక్తనాళాలను కుదించడం (vasoconstriction) వలన రక్తపోటు పెరిగే అవకాశము ఉన్నది . హై బ్లడ్ ప్రషర్ వలన అనేక గుండె జబ్బులు ... స్ట్రోక్ లు,రక్తనాళాలు మూసుకుపోవడము ... వచ్చే అవకాశము ఉన్నది . కెఫిన్‌ శరీరములో చలన కదలికలు (Motor movements) నియంత్రించడము వలన చేతులు వణకడము అనే గుణము కలుగవచ్చును .కెఫిన్‌ Diuretic గా పనిచేయడం ద్వారా అతిమూత్రము కలుగజేయును .కెఫిన్‌ కార్టిసాల్ (cortisol) తయారీ ఎక్కువ చేయడం వల్ల cortisol Tolerence పెరుగును.కెఫిన్‌ ఎక్కువమోతాదులో గాబరా (anxiety) ని కలుగుజేయును .కెఫిన్‌ అలవాటుగా మారి అది త్రాగడం మానివేసే పక్షములో విత్డ్రాల్ (withdrawal) లక్షణాలు .. తలనొప్పి, అలసట, నీరసము, సమయస్ఫూర్తి లోపము కలుగును . కెఫిన్‌ ఎక్కువైతే నిద్రలేమి కలిగి ... తత్సంబందిత దుష్పరిణామాలు కలుగును . కాఫీ పరిమితములో తాగితే తప్పులేదుగాని .... ఇది ఒక అలవాటుగా మారును.

స్త్రీలకు కాఫీ మంచిది మార్చు

రోజుకు రెండు (2) కప్పులు కాఫీ తాగితే స్త్రీల ఆరోగ్యము మెరుగ్గా ఉంటుందని తాజా పరిశోధనలు, ముఖ్యముగా గుండె ఆరోగ్యము చెడిపోయే ప్రమాదము, పక్షవాతము వచ్చే అవకాశాలు తగ్గుతాయి అని అంటారు . కాఫీ సేవనము వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదము 22-25 శాతం ఆడవారిలో తగ్గిందని స్వీడెన్‌ పరిశోధకులు తేల్చిన అంశము. కాఫీ వల్ల ఇన్సులిన్‌ సెన్సిటివిటీ మెరుగవుతుంది . ఆక్షిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది . ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుతుంది . దాదాపు 35 వేలమంది స్త్రీలమీద 10 సం.ల కాలం పాటు జరిపిన పరిశోధనల ఫలితం అని అంటున్నారు .

జ్ఞాపకశక్తిని పెంచే కాఫీ మార్చు

 
Roasted coffee beans

కాఫీలు, టీలు కడుపు నింపుతాయా, ఆరోగ్యాన్నిస్తాయా అని చాలా మంది సణుగుతూ ఉంటారు. దానికి కారణం దాని వల్ల ఆరోగ్యానికి ఏదైనా హాని జరుగుతుందేమోనన్న భయంతో. కానీ ఇప్పుడు భోజనాన్ని తగ్గించి మరీ రోజుకోసారైనా కాఫీ తాగండీ, ఆరోగ్యాన్ని కాపాడుకోండని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా వరకు చూస్తే కొంతమంది జ్ఞాపక శక్తి తగ్గిపోతోందని బాధపడుతుంటారు. అయితే ఇక నుంచి కాఫీ తాగండి. నడుం కొలత పెరిగిపోతోందని దిగులు పడుతున్న వారు కూడా కాఫీ తాగితే వారి బాధ తగ్గిపోతుంది. ఈ వాస్తవాలన్నీ ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయ్యాయి. రాత్రి పూట భోజనం మితంగా తీసుకుని ఒక కప్పు కాఫీ తాగితే జ్ఞాపక శక్తి పెరగడంతోపాటు నడుం కూడా సన్న బడుతుందట. మెదడు చురుగ్గా పనిచేయాలంటే అప్పుడప్పుడు కడుపును మాడ్చుకుంటే మంచిదని కూడా డాక్టర్లు చెబుతున్నారు. ఇలా ఉపవాసం ఉండటం వల్ల ఒంట్లోని క్యాలరీలు ఖర్చయి ఆరోగ్యవంతంగా ఉండడంతోపాటు ఆయుర్దాయం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. క్యాలరీలు బాగా ఖర్చయితే జ్ఞాపకశక్తికి, పరిజ్ఞాన శక్తికి అవసరమైన మెదడులోని సీఆర్‌ఈబీఐ అనే ప్రోటీన్ బాగా ఉత్పత్తి అవుతుందని వైద్య పరిశోధనలో తేలింది. ఇలా చేయడం వల్ల రోజుకు సుమారు 600 క్యాలరీలు ఖర్చవుతాయట. అందువల్ల కాఫీలు తాగితే ఆరోగ్యం చెడిపోతుందన్న అపోహలు వదిలేసి మితాహారం, కప్పు కాఫీతో మీ రాత్రి మెనూ సిద్ధం చేసుకోండి.

కాఫీ తోటలు మార్చు

1820లో వాణిజ్య పరంగా బ్రిటిష్‌ ప్రభుత్వపాలనా కాలంలో ప్రారంభించారు. 19వ శతాబ్దం చివరికంతా పడమటి కనుమల్లో కాఫీ తోటలు విస్తరించాయి. ప్రస్తుత కాలంలోనూ ఇవి భారత కాఫీ పరిశ్రమలో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. సంప్రదాయ రీతుల్లో పండించే తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలు దేశంలో కాఫీ పంటలో 98% పంటను అందిస్తాయి. దేశీయ కాఫీ ఉత్పత్తులలో 68% కర్నాటక రాష్ట్రంలో పండిస్తారు. ఇటీవలి కాలంలో ఆంధ్రా, ఒరిస్సాకు చెందిన గిరిజనులు తూర్పు కనుమల్లో కాఫీ తోటల పెంపకం ప్రారంభించారు. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు నూతనంగా కాఫీతోటల పెంపకం ప్రారంభించారు. ఇవి వ్యాపార సంస్థలు పెద్ద మొత్తంలోనూ మరికొన్ని చిన్నచిన్న తోటల్లోనూ కాఫీ గింజలు పండిస్తున్నారు. అమెరికాలో 1720లో కాఫీ తోటల పెంపకం ఆరంభించినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా కాఫీ ఉత్పత్తి బ్రెజిల్ దేశంలో జరుగుతుంది. ప్రస్తుతం కాఫీ పంటను 60 దేశాలు పండిస్తున్నాయి. వీటిలో అధికం వర్ధమాన దేశాలే కావడం విశేషం. ప్రపంచంలో కాఫీ వినియోగంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా తరువాతి స్థానాలలో జపాన్, యురేపియన్ దేశాలున్నాయి.

 
విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటలు

తూర్పు కనుమల్లో అరకు కాఫీ మార్చు

1898లో ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కనుమల పరిధిలోకి వచ్చే తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో బ్రిటిషు అధికారి ‘బ్రాడీ’ చేత కాఫీ పంట ప్రారంభమైంది.  అక్కడ నుంచి తూర్పుగోదావరిజిల్లా పుల్లంగి, విశాఖ జిల్లా అరకు, చింతపల్లి, గూడెం గిరిజన ప్రాంతాల్లోకి కాఫీ పంట సాగు విస్తరించింది. 1920 ప్రాంతాకి కాఫీ తోట సాగు అరకు లోయలోని అనంతగిరి, చింతపల్లి ప్రాంతానికి విస్తరించినా అది విస్తృత వ్యాప్తికి నోచుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10,100 ఎకరాల్లో అభివృద్ధి చేసారు. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పచెప్పారు.1956 లో గిరిజన సహకార సంస్ధ (జిసిసి) ఏర్పడ్డాక కాఫీ బోర్డు వారు ఈ సంస్ధని కాఫీ తోట అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాని ఉద్దేశించారు.  ఆ రకంగా గుర్తింపబడి, గిరిజనుల ద్వారా కాఫీ తోట పెంపంకంలో జిసిసి కృషి చేయడం ప్రారంభమైంది.  1975 నుంచి 1985 వరకు జిసిసిలో ఒక ప్రత్యేక కాఫీ తోట అభివృద్ధి విభాగం పనిచేస్తూ సుమారు 4000 హెక్టర్ల కాఫీ తోట పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదయ్యింది. ఈ రకంగా సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనుల చేత అరకులోయలో పండుతున్న  కాఫీకి ‘అరకుకాఫీ’ అనే పేరు స్ధిరపడింది.

1985 తర్వాత జిసిసి ఆధ్వర్యంలో అరకు కాఫీ అభివృద్ధి కోసం గిరిజన సహకార కాఫీ అభివృద్ధి సంస్ధ (గిరిజన కోఆపరేటివ్‌ ప్లాంటేషన్‌ డెవప్‌మెంట్‌ కార్పోరేషన్‌) స్థాపించబడింది.  ఈ రకంగా ‘జిసిసి’ ద్వారా, జిసిపిడిసి ద్వారా అభివృద్ధి చేసిన కాఫీ తోటల్ని గిరిజన రైతుకు ఒక్కో కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున పంచి ఇవ్వడం జరిగింది. 2015 సంవత్సరంలో గిరిజన కోఆపరేటివ్‌ ప్లాంటేషన్‌ డెవప్‌మెంట్‌ కార్పోరేషన్‌ వారు ఈ అరకు కాఫీని అందరికి అందుబాటులో తీసుకురావటానికి ఆన్ లైన్లో అమ్మడం మొదలు పెట్టారు.

1997 జూలైలో జిసిపిడిసి సంస్ధ కార్యకలాపాలను సిబ్బందితో సహా ఐటిడిఎలో విలీనంచేసి కాఫీ అభివృద్ధి కార్యక్రమాలను పంచవర్ష ప్రణాళికబద్ధంగానూ,  ఉపాధి హామీ నిధుల సహాయంతో నిర్వహించి ఈ నాటికి లక్ష ఎకరాలకు చేరిన కాఫీ తోటలు గిరిజన రైతుల ద్వారా సాగుచేయబడుతున్నాయి.

భారతదేశంలో పశ్చిమ కనుమల ప్రాంతం కాఫీ తోటల పెంపకంలో గత శతాబ్ది కాలంలో బాగా అభివృద్ధి చెందితే, తూర్పుకనుమల ప్రాంతం కాఫీ పంటలో ఇంకా అభివృద్ధి చెందుతూనేవున్నది.  ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని  విశాఖజిల్లా గిరిజన ప్రాంతాల్లో అరకు, చింతపల్లి ప్రాంతాల్లో అరేబికా రకం  ప్రసిద్ధి చెందింది.  పనస, సిల్వర్ఓక్‌,, అరటి చెట్ల నీడలో పెరిగే ఈ కాఫీ సేంద్రియ పద్ధతుల్లో సాగుచేయబడుతున్నది. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన  కుటుంబాలలో లక్షకు పైగా గిరిజన రైతులు ఈ కాఫీ పంట ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఈ ప్రాంత గిరిజనులు తాము సాంప్రదాయకంగా చేసే పోడు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ తోటల పెంపకాన్ని ఆశ్రయిస్తున్నారు. అరకులోయలో పండుతున్న కాఫీ సుమారు 900 నుంచి 1100 మీటర్ల ఎత్తున పండినదైనందువలన ఇక్కడి నేలలో మిళితమైన క్షారగుణం కలిగినందువల్ల ఇక్కడి పండే కాఫీకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏర్పడ్డాయి. కాఫీ గింజ పరిమాణం లోగాని, నేలసారం వలన కలిగే గుణాల వలన, మిళితమైన పుల్లటి జీర జిహ్వకి తగులుతూ, స్పష్టమైన గాఢతర, సువాసన, నాలుకకి తగలగానే నరాల్ని కదిలించే క్షారగుణంతో ‘అరకు కాఫీ’ ఒక ప్రత్యేకమైన రుచి గల కాఫీగా గుర్తించబడుతోంది.

1956లో గిరిజన సహకార సంస్థ ప్రారంభంతో గిరిజన కాఫీ అభివృద్ధి కూడా వేగవంతం అయింది. 2015-16 సంవత్సరంలో గిరిజన సహకార సంస్థ 1400 టన్నుల కాఫీని గిరిజన రైతుల నుంచి సేకరించి అంతర్జాల వేలం ద్వారా విక్రయించడం ద్వారా అంతర్జాతీయ కాఫీ ధరను గిరిజన రైతుకి అందించడం విశేషం. గిరిజన సహకార సంస్థ అరకు వ్యాలీ కాఫీ, వైశాఖి కాఫీ అనే పేరుతో రెండు కాఫీ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తున్నది. 

కాఫీతోటలలో రకాలు మార్చు

కాఫీతోటలు ప్రధానంగా రెండు రకాలు.ఒకటి అరేబియా రెండవది రోబస్టా.అరేబియా రకం ఎత్తైన ప్రాంతాలలోనూ రోబస్టా రకం దిగువ ప్రాంతాలలోనూ బాగా పెరుగుతాయి.

కాఫీ షాపులు మార్చు

ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి కాఫీ షాపు వెనిస్ నగరంలో 1683లో స్థాపించబడింది. మక్కాలో స్థాపించబడిన కాఫీ షాపులను "కవే కేన్స్" అని పిలువబడ్డాయి. చదరంగం ప్రదేశాలలో, ముచ్చటించుకునే బహిరంగ ప్రదేశాలలో, విహార సమయాలలో కాఫీ షాపులు విజయం సాధించాయి. పాతకాలంనుండి కాఫీ షాపులను అందంగా అలంకరించడం అలవాటు. కాఫీ షాపులలో సామాజిక, వాణిజ్య సమావేశాలు చోటు చేసుకున్నాయి.ప్రపంచంలో పెద్దది లండన్ కి చెందినది అయిన ఇన్సూరెన్స్ మార్కెట్ లాయిడ్స్ సంస్థ కాఫీ షాపులో రూపు దిద్దుకున్నట్లు కథనం.

కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కాఫీ&oldid=4184419" నుండి వెలికితీశారు