కాశీనాథుని నాగేశ్వరరావు

విద్యావేత్త, వ్యాపారవేత్త, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు

కాశీనాథుని నాగేశ్వరరావు (1867 - 1938) పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. అతనును 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు. దేశోధ్ధారక, విశ్వదాత అని అతనును అంతా గౌరవించేవారు. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అతనును 'కళాప్రపూర్ణ' బిరుదుతో సత్కరించింది.[1][2] ఆయనకి ఆంధ్ర మహాసభ వారు దేశోధ్ధారక అని బిరుదు ఇచ్చారు.[3]

కాశీనాథుని నాగేశ్వరరావు
విశ్వదాత, దేశోద్ధారక
జననంమే 1, 1867
ఎలకుర్తి
మరణం1938 ఏప్రిల్ 11(1938-04-11) (వయసు 70)
ప్రసిద్ధివ్యాపారవేత్త,
పాత్రికేయుడు,
స్వాతంత్ర్య సమర యోధుడు,
దానశీలి
తండ్రిబుచ్చయ్య
తల్లిశ్యామలాంబ

నాగేశ్వరరావు పెద్ద చదువులు చదవలేదు. పదవులు ఆశించలేదు. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం సంస్థలను అతను స్థాపించాడు. ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసేడు. అతను స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసేడు.

అతనుకు విశ్వదాత, దేశోద్ధారక అనే బిరుదులు ఉన్నాయి. అతను తలచుకొంటే లక్షలపై లక్షలు ఆర్జించి కోట్లకి పడగలెత్తేవాడు. ఆడంబర రాజకీయాల జోలికి పోలేదు. అమృతాంజనం ద్వారా గణించిన డబ్బును పేద విద్యార్థులకి వేతనాలుగా ఇచ్చేసేవాడు. అతను దేశభక్తినీ వితరణశీలాన్నీ గాంధీ మహాత్ముడు కూడా మెచ్చుకున్నాడు[ఆధారం చూపాలి].

చెన్నై లోని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ లోనే చారిత్రాత్మక శ్రీబాగ్‌ ఒడంబడిక కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

జీవిత విశేషాలు మార్చు

 

కాశీనాధుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఎలకుర్రు గ్రామంలో 1867లో మే 1న జన్మించాడు. తల్లిదండ్రులు: శ్యామలాంబ, బుచ్చయ్య. స్వగ్రామంలోనూ, తరువాత మచిలీపట్నంలోనూ విద్యాభ్యాసం కొనసాగింది. 1891లో 'మద్రాసు క్రిస్టియన్ కాలేజి'లో పట్టభద్రుడయ్యాడు. ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం అతనుపై బడింది. వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం వ్యాసాలు కూడా అతనును ప్రభావితం చేశారు

వ్యాపారం మార్చు

నాగేశ్వరరావు కొద్దికాలం మద్రాసులోనూ, కలకత్తాలోనూ, బొంబాయిలోనూ ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించాడు. వ్యాపారంపైన ప్రత్యేక ఆసక్తితో 1893లో అమృతాంజన్ లిమిటెడ్ స్థాపించాడు. అతను స్వయంగా రూపొందించిన అమృతాంజనం అతి కొద్దికాలంలో అద్భుతమైన ప్రజాదరణ పొందింది.

పత్రికా రంగం మార్చు

1907లో సూరత్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత అతను తెలుగువారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించాడు. పత్రికా రంగంలో నాగేశ్వరరావు ప్రవేశం పాశ్చాత్య దేశాలలో పులిట్జర్ ప్రయత్నంతో పోల్చవచ్చును. అప్పుడే విస్తరిస్తున్న దేశీయ పత్రికలపై ఆంగ్లేయుల ప్రభుత్వం ధోరణి వ్యతిరేకంగా ఉండేది. కనుక దేశీయ పత్రికలు నడపడానికి ధైర్యము, అంకితభావం చాలా అవసరం.

సెప్టెంబరు 1908లో బొంబాయినుండి అతను ప్రారంభించిన ఆంధ్ర పత్రిక వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు వ్యాసాలు అతను సామాజిక చేతనా దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై అతను అవగాహననూ ప్రతిబింబించాయి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర పత్రిక దిన పత్రికను ప్రారంభించారు. 1914 ఏప్రిల్ 1న మద్రాసునుండి ఈ పత్రిక తొలిసారిగా వెలువడడం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణాధ్యాయం. 1924లో భారతి అనే సాంస్కృతిక, సాహితీ పత్రికను ప్రారంభించాడు. తెలుగు సాహితీప్రియులకు ఇది చాలాకాలం అభిమాన పత్రికగా నిలచింది.

దేశోద్ధారక మార్చు

మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి అరంభదశనుండి నాయకులుగా ఉన్నవారిలో నాగేశ్వరరావు ఒకడు. ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. ఈ విషయంలోనూ, తెలుగు భాష, సంస్కృతిలకు సంబంధించిన ఇతర విషయాలలోనూ అతను తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు అతనును దేశోధ్ధారక అని సత్కరించారు.

ఆంధ్ర గ్రంధమాల మార్చు

పత్రికా రంగంలోనే కాక ప్రచురణా రంగంలో కూడా నాగేశ్వరరావు తన కృషిని విస్తరించాడు. 1926లో 'ఆంధ్ర గ్రంథమాల' అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ 20 పైగా పుస్తకాలు ప్రచురించింది. వాటిలో 27 వ పుస్తకం, తిరుమల వెంకట రంగాచార్యులు సంకలనం చేసిన పారిభాషిక పదకోశము.[4] ఇంకా అనేక ప్రాచీన గ్రంథాలను పునర్ముద్రించింది. సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఈ పుస్తకాల వెలను చాలా కొద్ది మొత్తంగా నిర్ణయించారు. తెలుగునాట గ్రంథాలయోద్యమానికి నాగేశ్వరరావును పితామహునిగా వర్ణించవచ్చును. కాలక్రమంగా 120 పైగా గ్రంథాలయాలు తెలుగునాట వెలశాయి.

రాజకీయాలలో మార్చు

టంగుటూరి ప్రకాశం సమకాలీనుడైన నాగేశ్వరరావు 1924 - 1934 మధ్యకాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఉన్నాడు. ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును, సహకారాన్ని అందించాడు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో అతను ఒకడు. నాగేశ్వరరావుపై ప్రజలకు ఎంతో అభిమానం, నమ్మకం ఉండేవి.

భగవద్గీత మార్చు

ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా 1931లో ఒక సంవత్సరం జైలులో ఉన్నపుడు నాగేశ్వరరావు భగవద్గీత గురించి వ్యాఖ్య వ్రాసాడు. గీత ఒక మతానికి పరిమితమైనది కాదనీ, దాని సందేశం సమస్తమానవాళికీ వర్తిస్తుందనీ అతను వివరించాడు.

విశ్వదాత మార్చు

నాగేశ్వరరావు అసమాణ దానశీలి. అతను ఇల్లు ఎప్పుడూ అతిధులతోనూ, అర్ధులతోనూ కళకళలాడుతుండేది. వివిధ సేవఅ కలాపాలకు ధారాళంగా అతను సహాయం చేస్తుండేవాడు. అతను ఇంటినుండి వట్టిచేతులతో ఎవరూ వెళ్ళేవారు కాదు. అతను దాతృత్వానికి అబ్బురపడి మహాత్మా గాంధీ అతనును విశ్వదాత అని కొనియాడాడు.

తెలుగు భాషకు అతను సేవ మార్చు

 
ఆంధ్రనాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యుల ఛాయాచిత్రంలో కాశీనాథుని నాగేశ్వరరావు, 1929

కాశీనాథుని నాగేశ్వరరావు యొక్క తెలుగు భాషాభిమానము, సాహిత్యము, విజ్ఞానశాస్త్రములలో ఆసక్తి అతను ఆయారంగములో వివిధ పత్రికల ప్రచురణకు చేసిన విశేషకృషి వలన విదితం. ఇతను భారతి, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు, ఆంధ్ర గ్రంథమాల వంటి ప్రచురణలు, ఉగాది ప్రత్యేక సంచికలు వెలువరించాడు. ఆంధ్ర గ్రంథమాల ద్వారా అతను తెలుగు భాషలో అనేక భాషా, సాహితీ, విజ్ఞాన శాస్త్ర విషయాలపై గ్రంథాలను పరిచయం చేసి శాస్త్ర, సాహిత్య విజ్ఞానాభివృద్ధికి దోహదం చేశాడు. ఇతను బసవపురాణం, పడింతారాధ్య చరిత్ర, జీర్ణ విజయనగర చరిత్ర, తంజావూరాంధ్ర నాయకుల చరిత్ర మొదలగు పూర్వపు గ్రంథాలను, మాలపిల్ల, మహాత్మాగాంధీ ఆత్మకథ మున్నగు ఆధునిక గ్రంథాలనేం ప్రచురించాడు. ఇతను అనేక విషయాలపై వ్యాసాలు, అనేక గ్రంథాలకు పరిచయవాక్యాలు, ప్రవేశికలు కూడా రాశాడు. 1938లో కొమర్రాజు వెంకటలక్ష్మణరావు యొక్క ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము యొక్క మూడు సంపుటాలు ముద్రించాడు. తెలుగు నాటకరంగానికి కూడా అతను పలురకాల సేవలు చేశారు. తెలుగు నాటకం అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర నాటక కళా పరిషత్తును 1929లో స్థాపించిన నాటకరంగ ప్రముఖుల్లో అతను కూడా ఒకరు.[5]

మరణం మార్చు

కాశీనాథుని నాగేశ్వరరావు 1938లో మరణించాడు. తెలుగు జాతికీ, తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ అతను సేవ ఎనలేనిది. వీరు అల్లుడు శివలెంక శంభు ప్రసాద్ పంతులు గారి తదనంతరం ప్రముఖ పత్రికలు చాలా కాలం నడిపి అభివృద్ధి చేశారు. శివలెంక శంభు ప్రసాద్ గారి కుమారుడు శివలెంక రాధాకృష్ణ ఆంధ్రపత్రిక నడిపేరు.

మూలాలు, బయటి లింకులు మార్చు

  1. Report on Public Instruction, Madras (India : State). Education Dept, 1936.
  2. ప్. 280, Who's who on Indian stamps, Mohan B. Daryanani, 1999
  3. p. 188, Salt Satyagraha in the Coastal Andhra, Ch. M. Naidu, Mittal Publications, First Edition, 1989.
  4. పారిభాషిక పదకోశము ఇంటర్నెట్ ఆర్కైవ్ నకలు
  5. సురభి సప్తతి స్వర్ణోత్సవ సంచిక (1 ed.). హైదరాబాద్: సురభి నాటక కళాసంఘము. 1960.