గార్‌ఫీల్డ్ సోబర్స్

గార్‌ఫీల్డ్ సోబర్స్ (Garfield St Auburn Sobers) వెస్ట్‌ఇండీస్కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. టెస్ట్ క్రికెట్‌లో 57.78 సగటుతో 8032 పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్‌లోనూ 34.03 సగటుతో 235 వికెట్లు పడగొట్టాడు. 1936, జూలై 28న బార్బడస్ లోని బ్రిడ్జిటౌన్లో జన్మించిన సోబర్స్ 1953లో తన 17 వ ఏటనే టెస్ట్ క్రికెట్లో ప్రవేశించాడు. ఆ తర్వాత ఐదేళ్ళకే టెస్ట్ ఇన్నింగ్సులో 365 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. (ప్రస్తుతం ఈ రికార్డు 400* పరుగులు సాధించిన వెస్ట్‌ఇండీస్‌కే చెందిన బ్రియాన్ లారా పేరిట ఉంది) . ఈ మహా ఇన్నింగ్సు అతనికి తొలి సెంచరీ కావడం విశేషం. 614 నిమిషాల పాటు ఆడి 38 బౌండరీల ద్వారా పాకిస్తాన్ పై సాధించిన ఈ స్కోరులో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం అతని జాగ్రత్తను సూచిస్తుంది. ఈ రికార్డు 36 సంవత్సరాల పాటు కొనసాగింది. బ్రియాన్ లారా దీనిని అధిగమించిననూ తొలి సెంచరీలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ గా ఇతని రికార్డు ఇంకనూ కొనసాగుతోంది. 1968లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సోబర్స్ ఒకే ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు [1]. నాటింగ్‌హామ్‌షైర్ కెప్టెన్‌గా సోబర్స్ గ్లామోర్గన్ పై ఆడుతూ మాల్కం నాష్ బౌలింగ్‌లో ఈ ఘనతను సాధించాడు. 1974లో ఇంగ్లాండుపై ట్రినిడాడ్లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడినాడు. 1975లో రెండో ఎలిజబెత్ రాణి సోబర్స్ కు నైట్‌హుడ్ బిరుదంతో సత్కరించింది. 1980లో తన వివాహంతో సోబర్స్ బార్బడోస్ - ఆస్ట్రేలియాల ద్వంద్వ పౌరసత్వాన్ని పొందాడు.[2][3]

సర్ గారీ సోబర్స్ , 2012

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "BBC Archive - 1968 footage of Sir Garfield Sobers hitting six sixes in one over". Archived from the original on 2007-03-28. Retrieved 2007-12-27.
  2. Telegraph, 19 June 2001, Sobers bat that hit six sixes is up for sale
  3. Reuters:Cricket, 9 June 2003, Australia honours Steve Waugh in Queen's Birthday list