జిందా తిలిస్మాత్

జిందా తిలిస్మాత్ హైదరాబాదులో తయారయ్యే ప్రసిద్ధమైన యునానీ మందు. జలుబు, తలనొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులు... ఇలా అన్నింటికీ ఇది సర్వరోగనివారిణిలా పనిచేస్తుంది. ఈ మందు ఫార్ములాను కనిపెట్టింది ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ కు వలస వచ్చిన హకీం మహ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ. దాదాపు వందేళ్ల నుండి ప్రచారంలో ఉన్న ఈ ఔషధం పల్లెటూళ్లోని పచారీ కొట్టు మొదలు సిటీలోని డిపార్ట్‌మెంటల్ స్టోర్ వరకు ఎక్కడైనా దొరుకుతుంది. దేశీయ వైద్యవిధానానికి ప్రజలలో ఉన్న ఆదరణకు ఇది ఒక ఉదాహరణ.[1]

చరిత్ర మార్చు

హకీం మహ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ యునానీ కోర్సు చేశాడు. షికాగో మెడికల్ కాలేజీ ఆఫ్ హోమియోపతి నుంచి హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సు చేశాడు. ఇతడికి పరిశోధనలంటే ఇష్టం. హైదరాబాద్ మోతీ మార్కెట్‌లోని ఇతని ఇంట్లోనే ఆసుపత్రిని ఆరంభించాడు. ఒకవైపు పేదలకు వైద్యం చేస్తూనే మరోవైపు ఔషధ తయారీకి శ్రమించాడు. మందు కనిపెట్టడం ఒక ఎత్తయితే అది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడం మరో ఎత్తు. ఫలితాలను అంచనావేసి మందు తయారీలో మార్పులు చేర్పులు చేసేవాడు. అలా సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ ఫార్ములాను కనిపెట్టాడు. దానితో పాటు ఫారుఖీ పళ్లపొడి ఫార్ములాను కూడా కనిపెట్టాడు.

వినూత్నంగా ప్రచారం మార్చు

అప్పట్లో ఏ వస్తువుకైనా ప్రచారమంటే అంత తేలిక కాదు. పగలంతా వైద్యం చేసి చీకటి పడగానే మహ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ ఏదో గ్రామానికి వెళ్లేవాడు. ఈ మందు వాడండి. మీ ఇంటిల్లిపాదికీ సర్వరోగ నివారిణి... అంటూ ఇంటింటా ప్రచారం చేసేవాడు. గ్రామాల్లో గోడలపై ఆయనే ప్రకటనలు వ్రాసేవాడు. ప్రయాణాల్లో పక్కనున్నవారికి ఉచితంగా జిందా తిలిస్మాత్ ఇచ్చేవాడు. గాలిపటాలపై కూడా వ్రాయించేవారు. ఆయన శ్రమ ఫలించింది. ప్రతి ఇంట్లోనూ తప్పక ఉండాల్సిన సర్వరోగ నివారిణిగా జిందా తిలిస్మాత్ అవతరించింది. జిందా తిలిస్మాత్, ఫారూఖీ పళ్లపొడి మందులకు తయారీదారు.. ప్రకటనకర్త.. అమ్మకందారు.. కార్మికుడు.. యజమాని అన్నీ మొయిజుద్దీన్ ఫారూఖీయే.

విశ్వవ్యాప్త మార్కెట్ మార్చు

ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ఈ ఔషధం ప్రస్తుతం ఒక బ్రాండ్‌గా కార్ఖానా జిందాతిలిస్మాత్ పేరుతో పెద్ద కంపెనీగా అవతరించింది. మహ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ తనయుడు మహ్మద్ ఓవైసుద్దీన్ ఫారూఖీ ఈ కంపెనీని నడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ 12 కోట్ల రూపాయలు. ఈ కంపెనీ ఉత్పత్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మధ్య ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, యూఎస్, సౌదీ, దుబాయ్, అబుదాబిలలో విక్రయింపబడుతున్నాయి. ఈ సంస్థలో 85 మంది కార్మికులు ఉన్నారు. ఈ సంస్థలో యంత్రాలను ఉపయోగించపోవడం ప్రత్యేకత.

నీగ్రో బొమ్మ మార్చు

జిందా తిలిస్మాత్ బాటిల్‌పై ఆఫ్రికన్ నీగ్రో బొమ్మ లోగో ఉంటుంది. అది చూసి అప్పట్లో... ఎవరో ఒక ఆఫ్రికన్ ఫారూఖీకి ఈ ఫార్ములా చెప్పి ఉంటారనే ప్రచారం జరిగింది. కానీ నీగ్రో బొమ్మ పెట్టడం వెనుక ఓ కారణముంది. అప్పట్లో నిజాం ఆర్మీలో ఆఫ్రికన్లుండేవారు. వాళ్లు చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంటారు. అప్పట్లో ఆరంభించిన సంస్థ కాబట్టి వీళ్ల బొమ్మనే ముద్రిస్తే ప్రజలకు సులువుగా అర్థమవుతుందని నీగ్రో బొమ్మను ఉంచారు.

సేవా కార్యక్రమాలు మార్చు

ఈ సంస్థ యజమాను దీనిని ఒక వ్యాపారంలా కాక ఇదో సేవా కార్యక్రమంలా భావిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వీరి వంతుగా జిందా తిలిస్మాత్, ఫారూఖీ పళ్లపొడి ఉచితంగా పంపిణీ చేస్తారు. ఏటా హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి కూడా దీన్ని బహుమతిగా ఇస్తారు.

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు