అల్ఫ్రెడ్ టెన్నిసన్ (ఆగష్టు 6, 1809 - అక్టోబరు 6, 1892) బ్రిటన్‌కు చెందిన అత్యంత ప్రసిద్ధి చెందిన ఆంగ్ల కవి. ఆంగ్ల భాషలో షేక్స్‌పియర్ తరువాత ఎక్కువగా ఉదహరించబడిన వ్యక్తి టెన్నిసనే.[1] టెన్నిసన్ రచనలు ఎక్కువగా సంప్రదాయ పౌరాణిక (classical mythology) విషయాలపై వ్రాసినవి. ఇన్ మెమోరియం ( In Memoriam ) అనేది ఒక్కటి మాత్రం ఈ కోవకు చెందనటువంటి రచన. ఇన్ మెమోరియాన్ని సెరిబ్రల్ హేమరేజ్ కారణంగా మరణించిన అతని స్నేహితుడు, సోదరికి కాబోయే భర్త అయిన ఆర్థర్ హాలమ్ స్మృతి చిహ్నంగా వ్రాసినాడు. Idylls of the King ఐడిల్స్ ఆఫ్ ద కింగ్ అనునది టెన్నిసన్ రచనలలో బహు ఖ్యాతి వహించినటువంటిది. ఇందులోని కవితలన్నీ కింగ్ ఆర్థర్ కథలే! ఈ సంపుటిని విక్టోరియా రాణి భర్త అయిన అల్బర్ట్ రాకుమారునికి అంకితమిచ్చాడు. టెన్నిసన్ నాటకాలు కూడా వ్రాయడానికి ప్రయత్నించాడు కానీ ఇతను వ్రాసిన నాటకాలు తన జీవితకాలములో కూడా అంతగా ఆదరణ పొందలేదు. టెన్నిసన్ నిష్పాదించిన (లేదా వ్రాసిన) చాలా పంక్తులు ఆంగ్ల భాషలో సాధారణ వాడుకలుగా స్థిరపడినాయి. ఉదాహరణలు: "nature, red in tooth and claw", "better to have loved and lost", "Theirs not to reason why,/Theirs but to do and die", and "My strength is as the strength of ten,/Because my heart is pure".

అల్ఫ్రెడ్ టెన్నిసన్

అల్ఫ్రెడ్ , లార్డ్ టెన్నిసన్
జననం: (1809-08-06)1809 ఆగస్టు 6
సోమర్స్‌బై , లింకన్‌షైర్ , ఇంగ్లాండ్
మరణం:1892 అక్టోబరు 6(1892-10-06) (వయసు 83)
వెస్ట్‌మాస్టర్ అబ్బీ
వృత్తి: కవి

తొలినాళ్లు మార్చు

టెన్నిసన్ లింకన్‌షైర్ (Lincolnshire) లోని సోమర్స్‌బై లో (Somersby) ఒక రెక్టర్ (ఓ విధమైన మతాధికారి) 12 మంది సంతానంలో నాల్గవ కుమారునిగా జన్మించాడు. మూడవ ఎడ్వర్డ్ రాజుగారి వంశానికి చెందినవానిగా గుర్తించారు. ఈయన తండ్రి జార్జ్ క్లేటన్ టెన్నిసన్ (1778 - 1831). తాత, జార్జ్ టెన్నిసన్ (1750 - 1835).

జార్జ్ క్లేటన్ టెన్నిసన్ విలక్షణమైన వ్యక్తిత్వం, బహుముఖమైన ప్రజ్ఞాపాటవాలు కల వ్యక్తి. ఇతను శిల్పము, చిత్ర లేఖనం, సంగీతం, కవిత్వం మున్నగు విషయాలలో ఎన్నదగిన ఫలితాలు సాధించాడు.[2] ఇతను తనకున్న ధనం జాగ్రత్తగా వాడుతూ తన కుటుంబంతో (పెద్ద కుటుంబం!) వేసవి శలవులు ఇంగ్లాండు తూర్పు తీరంలోని మాబుల్‌థ్రోప్, స్కాగ్నెస్ (Mablethorpe and Skagness) లందు గడిపేవాడు.[2]. కానీ మరికొందరు చెప్పడమయితే ఇతను విపరీతమైన ఆర్థిక ఇబ్బందులకు లోనయినాడని, తత్కారణమున త్రాగుబోతుగా మారి మానసికంగా నిలకడలేకుండా తయారయినాడని చెప్తారు.

ఇది మన టెన్నిసన్ నాన్నగారి గుఱించి నాలుగు ముక్కల్లో. ఇహ వీరి అమ్మగారు ఎలిజబెత్ ఫైచ్ (1781 - 1865), హార్కాజిల్, లౌత్ ల మధ ఉన్న చిన్న పల్లెటూరయిన విత్‌కాల్ యొక్క రెక్టర్ అయిన స్టీఫన్ ఫైచ్ (1734 - 1799) యొక్క కుమార్తె. ఈ స్టీఫన్ ఫైచ్ లౌత్‌కు కూడా వికార్‌ (మతాధికారి)గా కూడా పనిచేసాడు.

మరొక ముఖ్యమైన విషయమేమిటంటే టెన్నిసన్ నాన్నగారు తను పిల్లల విద్యాభ్యాసంపై శ్రద్ధాసక్తులు చూపినారు.[2].

నూనూగు మీసాల నూత్న యవ్వనమునాటికే టెన్నిసన్, అతని ఇద్దరు అన్నలు, చార్లెస్ టెన్నిసన్ టర్నర్, ఫెడ్రిక్ టెన్నిసన్ కవిత్వం వ్రాయడం ప్రారంభించారు. టెన్నిసన్ పదిహేడేండ్ల ప్రాయం నాటికే వీరి కవితా సంపుటి ప్రచురించబడింది. వీరిలో చార్లెస్ టెన్నిసన్ టర్నర్ లూసియా సెల్వుడ్‌ను వివాహమాడినాడు. ఈమె సోదరినే తరువాత కాలములో టెన్నిసన్ వివాహమాడినాడు.

చదువు, మొదటి ప్రచురణ మార్చు

టెన్నిసన్ మొదట లౌత్ గ్రామర్ స్కూల్ (లౌత్ వ్యాకరణ పాఠశాల)[2]లో నాలుగు సంవత్సరాలు చదివినాడు (1816 - 1820). ఆ తరువాత స్కైట్‌క్లిఫ్ పాఠశాల (Scaitcliffe School), ఎంగిల్‌ఫీల్డ్ గ్రీన్ (Englefield Green), లౌత్ లోని ఆరవ ఎడ్వర్డ్ రాజు వ్యాకరణ పాఠశాలలో చదివినాడు. 1828న కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కళాశాలలో ప్రవేశించాడు. ఇక్కడ ఉండగా కేంబ్రిడ్జ్ అపోస్తలులు అను రహస్య సంస్థనందు చేరినాడు. ఇక్కడనే ఆర్థర్ హెన్రీ హాలమ్ను కలుసుకున్నాడు. వీరిద్దరూ మంచి స్నేహితులయినారు.

"పోయమ్స్ బై టూ బ్రదర్స్" అనే పేరుతో తనూ, తన ఇద్దరు సోదరులు వ్రాసిన కవితా సంపుటి 1827లో ప్రచురితమయినది. ఇది ఇతని తొలి ముద్రణ.

1829లో టింబక్టూ (Timbuctoo)అను ఇతని రచనకు కేంబ్రిడ్జ్ ఛాన్సలర్ నుండి బంగారు పతకం (ఛాన్సలర్స్ గోల్డ్ మెడల్) బహుమతిగా లభించింది.[3][4] ఇరవై సంవత్సరాల చిరు ప్రాయంలో ఈ బహుమతి గెల్చుకోవడం గొప్ప విషయం[2] .

1830లో ఇతను ప్రచురించిన కవితా సంపుటం Poems Chiefly Lyrical (1830+)లోని కవితలు "Claribel", "Mariana" తరువాత ప్రసిద్ధి పొందినాయి. కొందరు విమర్శకులు ఓవర్ సెంటిమెంటల్ అని పెదవి విరిచినా, అతి త్వరలోనే ఇతని కవితలు ప్రసిద్ధి చెందినాయి. తద్వారా ఆ కాలంలోని గొప్ప రచయితల దృష్టిలో పడ్డాడు. శామ్యూల్ టేలర్ కొలెరిడ్జ్ కూడా వారిలో ఒకరు.

లింకన్‌షైర్ పునరాగమనం, రెండవ ప్రచురణ మార్చు

1831 వసంతంలో టెన్నిసన్ తండ్రి మరణించాడు. దానితో డిగ్రీ చేతికి రాకముందే ఇంటికి తిరిగిరావలసి వచ్చింది. ఆ తరువాత ఆరు సంవత్సరాలు ఇక్కడనే గడిపి తన తల్లి, తోబుట్టువుల ఆలనా పాలనా చూసుకున్నాడు. వేసవి శెలవులకు లింకన్‌షైర్ వచ్చిన టెన్నిసన్ స్నేహితుడు ఆర్థర్ హాలమ్, టెన్నిసన్ సోదరి ఎమిల్లా టెన్నిసన్తో పెళ్ళి నిశ్చయం చేసుకున్నాడు.

1833వ సంవత్సరంలో టెన్నిసన్ తన రెండవ పుస్తకాన్ని ప్రచురించాడు. దీనిలో ఇతని ప్రసిద్ధ కవిత అయిన ది లేడీ ఆఫ్ షలాట్ (The Lady of Shalott) కూడా ఉంది. ఇది ప్రపంచాన్ని అద్దంలో మాత్రమే చూడగలిగే ఒక రాకుమారి కథ. విమర్శకులు ఈ ప్రచురణను తీవ్రంగా విమర్శించారు. దానితో మనస్తాపమునకు గురైన టెన్నిసన్ ఆ తరువాత పది సంవత్సరాలు ఎటువంటి ప్రచురణలూ చెయ్యలేదు. అయితే, వ్రాయడం మాత్రం ఆపలేదు.

1833వ సంవత్సరంలోనే వియన్నా శలవులపై వెళ్ళిన మిత్రుడు హాలమ్ సెరిబ్రల్ హామరేజ్తో మరణించాడు. టెన్నిసన్ కి ఈ వార్త అశనిపాతంలా తగిలింది. కానీ ఈ సంఘటనే గొప్ప కవితలు వ్రాయడానికి ప్రేరణగా మిగిలింది. ఈ కవితల్ని ప్రపంచంలోనే గొప్ప కవితలుగా పరిగణిస్తారు. కానీ ఆ తరువాత పది సంవత్సరాలు టెన్నిసన్ కవితా జీవితంలో నిశ్శబ్దం రాజ్యమేలింది.

టెన్నిసన్, అతని కుటుంబ సభ్యులు రెక్టర్ ప్రాంగణంలో కొంత కాలం ఉండి, ఆ తరువాత ఎస్సెక్స్‌కు తరలివెళ్ళారు. ఇక్కడ ఓ చెక్కల నగిషీ పరిశ్రమలో పెట్టుబడి పెట్టాలన్న తెలివితక్కువ నిర్ణయంవల్ల కుటుంబపు ఆస్తిని చాలామటుకు కోల్పోయారు.

మూడవ ప్రచురణ, గుర్తింపు మార్చు

1842లో లండన్లో ఓ మాదిరిగా జీవిస్తున్నప్పుడు టెన్నిసన్ రెండు కవితా సంపుటాలను ప్రచురించాడు. మొదటి దానిలో కొన్ని కొత్తవి, మరికొన్ని పునర్ముద్రించిన కవితలు ఉన్నాయి. రెండవ సంపుటంలో అన్నీ కొత్త కవితలే ఉన్నాయి. ఇవి వెనువెంటనే విజయం సాధించినాయి. 1847లో స్త్రీవిద్య పై ఓ వ్యంగ్యాస్త్రమైన కవిత, ది ప్రిన్సెస్ : ఎ మెడ్లీ (The Princess: A Medley) ప్రచురితమై ప్రాచుర్యం చెందినది. ఈ వ్యంగ్యాస్త్రాన్ని డబ్ల్యూ.యస్.గిల్బర్ట్ , ది ప్రిన్సెన్, ప్రిన్సెస్ ఐడా అనే రెండు పేరడీలు వ్రాయడంలో ఉపయోగించుకున్నాడు. ఈ మూడవ ప్రచురణలోని టెన్నిసన్ కవితలయిన లాక్స్‌లీ హాల్ (Locksley Hall), టితోనస్ (Tithonus), యూలిసిస్ (Ulysses) టెన్నిసన్ కీర్తిని అజరామరం చేశాయి.

స్వర్ణ యుగం మార్చు

1850వ సంవత్సరంలో టెన్నిసన్ తన రచనా వ్యాసంగంలో శిఖరాన్ని చేరుకున్నాడు. ఈ సంవత్సరం విలియం వర్డ్స్‌వర్త్కి వారసునిగా పోయేట్ లారేట్గా (Poet Laureate ) నియమించబడినాడు. ఇదే సంవత్సరం ఇన్ మెమోరియం (In Memoriam A.H.H.) , తన మితృడు హాలం స్మృతి చిహ్నంగా ప్రచురించాడు. ఈ సంవత్సరమే, జూన్ 13న ఎమిలీ సెల్‌వుడ్ (Emily Sellwood, ) అను తన బాల్య పరిచయస్తురాలు, షిల్పకె Shiplake గ్రామ నివాసినిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇరువురు కుమారులు. హాలమ్ (ఆగష్టు 11, 1852, తన స్నేహితుని పేరు పెట్టుకున్నాడు, లియోనెల్ (మార్చ్ 16, 1854).

 
ఫారింగ్‌ఫోర్డ్ - టెన్నిసన్ నివాసం on the Isle of Wight

ది పోయెట్ లారేట్ మార్చు

1850వ సంవత్సరము నుండి మరణించే వఱకూ పోయెట్ లారేట్ (Poet Laureate )పదవిలో ఉన్నారు. ఈ కాలంలో మంచి కవిగా రాణించారు, కానీ అప్పుడప్పుడూ సామాన్యమైన, పేలవమైన కవిత్వం చెప్పినారు భవిష్యత్తులో రాజు కానున్న ఎడ్వర్డ్ ఆరును పెళ్ళాడటానికి డెన్మార్క్ నుండి వచ్చిన అలగ్జాండ్రాను సంబోధిస్తూ వ్రాసిన కవిత ఇటువంటి పేలవమైన కవితకు ఓ ఉదాహరణ. 1851వ సంవత్సరంలో ది చేంజ్ ఆఫ్ లైట్ బ్రిగేడ్ (The Charge of the Light Brigade) అనేది తన రచనల్లో అతి ప్రసిద్ధి చెందినది. దీన్ని క్రిమియన్ యుద్ధంలో 1854 అక్టోబర్ 25న అశ్విక దళంపై చేసిన మోసపూరిత <?> దాడికి నాటకీయ ఫక్కీలో సాగిన ప్రశంస. Ode on the Death of the Duke of Wellington, Ode Sung at the Opening of the International Exhibition, ఇతను లారేట్ గా ఉన్నప్పటి ప్రముఖ రచనలు.

 
టెన్నిసన్ విగ్రహం, ట్రినిటీ కాలేజి కీంబ్రిడ్జ్ .

విక్టోరియా మహారాణి టెన్నిసన్ అబిమాని. అతన్ని 1884వ సంవత్సరంలో బారన్ గా చేసింది.

ఎనభయ్యేళ్లు పైబడిన వయసులో కూడా టెన్నిసన్ రచనలు చేస్తూ ఉండినాడు. ఇతను 83 ఏళ్ళ వయసులో అక్టోబర్ 6 1892 న మరణించాడు. రెండవ బారన్‌గా ఇతని కుమారుడు హాలం వారసునిగా వచ్చాడు, ఇతనే టెన్నిసన్ జీవిత కథ వ్రాసినాడు. ఆ తరువాత ఈ హాలం ఆస్ట్రేలియాకు గవర్నర్ జనరల్గా వెళ్ళినాడు.

టెన్నిసన్ కవితా నైపుణ్యం మార్చు

టెన్నిసన్ పలు విధాలయిన విషయాలపై కవితలు వ్రాసినారు. మధ్య యుగపు గాథల నుండి మొదలుకొని పౌరాణిక కథల వరకూ, ప్రాంతీయ స్థితిగతుల నుండి ప్రకృతి విషయాల వఱకూ!, ఇతని బాల్యానికి ముందు, బాల్యంలోనూ ప్రచురించిన జాన్ కీట్స్, ఇతర సరస కవుల ప్రభావం ఇతనిపై బహుమెండు. ఇతని కవితల్లోని భావావేశము, సాహిత్యంలోని చిక్కదనము ఈ విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. ఇతను లయ (rythm)మీద కూడా చక్కని పట్టు సాధించాడు. ఉదాహరణకు Break, Break, Break అని ఒకే పదాన్ని పలుమార్లు లయబద్ధంగా వాడి చెప్పదలచుకున్న విషయంలోని విషాదాన్ని, అందులోని తీవ్రతను పాఠకులకు అందేలా చేయడంలో టెన్నిసన్ దిట్ట. తన రచనల్లో భావాలను, లయను పలికించడానికి పదాల్లోని శ్రావ్యలక్షణాలను వాడుకోవడంలో టెన్నిసన్ దిట్ట. "I come from haunts of coot and hern" లోని భాష కూడా ఆ కవితలో వర్ణించిన ప్రవాహంలాగే లయబద్ధంగా, అలలు అలలుగా సాగుతుంది. అతడు సందర్భానికి తగిన ధ్వనిని సూచించే పదాలను ఎంచుకోవడంలో, శబ్దాలంకారాలను ప్రయోగించడంలో, ప్రాసను పలికించడంలో ఎంతటి సమర్థుడో చెప్పడానికి "Come down O maid from yonder mountain height" లోని చివరి రెండు పాదాలు చక్కటి ఉదాహరణలు:

The moan of doves in immemorial elms
And murmuring of innumerable bees.

టెన్నిసన్ ఒక నైపుణ్యం గల కవి. ఈతను తన చిత్తు ప్రతులను పలుసార్లు మార్పులు చేర్పులు చేసి, పాలిష్ చేసాడు. ఇతని లాగా ఇన్ని రకాలుగా శైలులను కేవలము కొద్ది మంది కవులు మాత్రమే ఉపయోగించారు. ఇతను ఛందస్సు చక్కగా అర్థం చేసుకున్నాడు. ఇతను విక్టోరియన్ కాలంనాటి జ్ఞాన తృష్ణ, క్రమ వర్తనాభిలాష, నైతిక విలువలు వంటి లక్షణాలకు చక్కని దర్పణము. విక్టోరియా కాలపు రచయితల మతము, శాస్త్రముల మధ్య మానసిక ఘర్షణకు ప్రతిబింబము. ఇతని వ్యక్తిత్వం ఇతని రచనలలో ప్రస్ఫుటముగా కనిపిస్తుంది. టెన్నిసన్ ఒక కవికి ఉండవలసిన శక్తివంతమైన బలాలు కలిగి ఉన్నాడు; చాలా రచనలు పెద్దవిగా వ్రాసినాడు, అటువంటి వాటిలో బహు ప్రసిద్ధి చెందినవి: మౌడ్ (Maud), ఐడిల్స్ ఆఫ్ ద కింగ్ (Idylls of the King).

ఇతని రచనల్లో కొన్నింటి చిట్టా మార్చు

  • From Poems, Chiefly Lyrical (1830): (పోయెమ్స్ చీఫ్లీ లిరికల్ (1830) నుండి: )
    • The Dying Swan (ది డయ్యింగ్ స్వాన్)
    • The Kraken (ది క్రాకెన్)
    • Mariana (మరియాన)
  • Lady Clara Vere de Vere (1832) (లేడి క్లారా వియర్ డి వియర్)
  • From Poems (1833): (పోయెమ్స్ నుండి (1833)):
  • From Poems (1842): (పోయెమ్స్ 1842 నుండి:)
  • The Princess (1847) (ది ప్రిన్సెస్ 1847)
    • "Tears, Idle Tears" (టియర్స్, ది ఐడిల్ టియర్స్)
  • In Memoriam A.H.H. (1849) (ఇన్ మెమోరియం)
  • Ring Out, Wild Bells (1850) (రింగ్ అవుట్ వైల్డ్ బెల్స్)
  • The Charge of the Light Brigade (1854) - an early recording exists of Tennyson reading this
  • Maud (1855/1856) (మౌడ్)
  • Enoch Arden (1862/1864) (ఎన్కో ఆర్డెన్)
  • Flower in the crannied wall (1869) (ఫ్లవర్ ఇన్ ది క్రానీడ్ వాల్)
  • The Window - Song cycle with Arthur Sullivan. (1871)
  • Harold (1876) - began a revival of interest in King Harold
  • Idylls of the King (composed 1833-1874) ( ఐడిల్స్ ఆఫ్ ద్ కింగ్)
  • Locksley Hall Sixty Years After (1886) (లాక్స్లే హాల్ సిక్ష్టీ యియర్స్ ఆఫ్టర్)
  • Crossing the Bar (1889) (క్రాసింగ్ ద బార్)
  • The Foresters - a play with incidental music by Arthur Sullivan (1891) (ది ఫొరెస్టెర్స్)

జ్ఞాపికలు మార్చు

  1. The Oxford Dictionary of Quotations, 5th ed. OUP 1999
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Poems of Alfred Lord Tennyson. Eugene Parsons (Introduction). New York: Thomas Y. Crowell Company, 1900.
  3. Enjoying "Timbuctoo" by Alfred Tennyson
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-08-31. Retrieved 2007-10-03.

బయటి లంకెలు మార్చు