1832-1833లో గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చిన మహా కరువును డొక్కల కరువు, నందన కరువు లేదా గుంటూరు కరువు అని పిలుస్తారు. 1831లో కురిసిన భారీ వర్షాల కారణంగా, కొత్త పంటలు వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. దాని తరువాతి సంవత్సరంలో (1832) తుఫాను వచ్చి వేసిన కొద్ది పంటను నాశనం చేసింది. అలా కొనసాగి 1833లో అనావృష్టి పెరిగిపోయింది. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవి[1]. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లా లోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు కూడా సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు బీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అని కూడా అన్నారు.

కరువు - ప్రతీకాత్మక చిత్రం

కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు (ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు [2]. అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేసేవాళ్ళు.

దాతలు మార్చు

పలువురు మహనీయులు డొక్కల కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు తమవంతు కృషి చేసి చరిత్రలో నిలిచిపోయారు. వారిలో కొందరి పేర్లు:

  •  
    సి.పి.బ్రౌన్
    సి.పి.బ్రౌన్ : 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు.
  • ఏనుగుల వీరాస్వామయ్య : ప్రవృత్తి రీత్యా యాత్రాచరిత్రకారుడు, పుస్తకప్రియుడు, వృత్తి రీత్యా చెన్నపట్టణం సుప్రీంకోర్టులో ఇంటర్‌ప్రిటర్ అయిన వీరాస్వామయ్య నందన కరువులో చాలామంది పేదలకు అన్నవస్త్రాలిచ్చి ఆదుకున్నారు.[3]
  • కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై : చెన్నపట్టణంలో సంపన్నుడు, విద్యాదాత, సంస్కరణాభిలాషి అయిన శ్రీనివాసపిళ్ళై దాతృత్వంతో ఈ కరువు నుంచి కొందరిని కాపాడి చరిత్రలో నిలిచారు.[3]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. మంగళగిరి చరిత్ర వ్యాసంలో డొక్కల కరువు ప్రస్తావన. - సేకరించిన తేదీ: జూన్ 28, 2007.
  2. కులానికి వ్యతిరేకంగా రాసిన ఒక జీవిత చరిత్ర సంగ్రహంలో డొక్కల కరువు ప్రస్తావన పదొవ పేరా Archived 2011-07-18 at the Wayback Machine లో చూడండి. - సేకరించిన తేదీ: జూన్ 28, 2007.
  3. 3.0 3.1 వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.

వెలుపలి లంకెలు మార్చు