ది గుడ్, ది బాడ్ అండ్ ది అగ్లీ

ద గుడ్, ద బాడ్ అండ్ ది అగ్లీ (ఇటాలియన్ పేరు: ఇల్ బ్యూనో, ఇల్ బ్రూటో, ఇల్ కాటివో, అనువాదం. "మంచివాడు, చెడ్డవాడు, నీచుడు") సెర్గియో లీన్ దర్శకత్వంలో, క్లింట్ ఈస్ట్ వుడ్, లీ వాన్ క్లీఫ్, ఎలి వాలచ్ వరుసగా టైటిల్ రోల్స్ లో (గుడ్, బాడ్, అగ్లీగా) నటించిన 1966 నాటి ఇటాలియన్ చిత్రం.[1] ఈ సినిమా స్పాగెట్టీ వెస్టర్న్ శైలి (సబ్-జాన్రా) లో కావ్యస్థాయిని అందుకున్న గొప్ప చలన చిత్రం. సినిమా స్క్రీన్ ప్లే ఏజ్ & స్కార్పెల్లీ, లూసియానో విన్సెంజోని, లీన్ రాశారు (అదనపు స్క్రీన్ ప్లే మెటీరియల్, డైలాగులు సెర్గియో డోనటి క్రెడిట్స్ లేకుండా రాశారు), [2] స్క్రీన్ ప్లేని విన్సెంజోని, లీన్ రాసిన కథ ఆధారంగా రాశారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ టోనియో డెల్లి కొల్లి సినిమాలో అద్భుతమైన వైడ్ స్క్రీన్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎన్నియో మారికోన్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇటలీ, స్పెయిన్, పశ్చిమ జర్మనీ, అమెరికా దేశాలకు చెందిన కంపెనీల సంయుక్త నిర్మాణంలో సినిమా తయారైంది.

ది గుడ్ ది బ్యాడ్ అండ్ ది అగ్లీ

సినిమాలో లీన్ ఉపయోగించిన లాంగ్ షాట్స్, క్లోజప్స్ సినిమాటోగ్రఫీ, హింస, టెన్షన్, స్టైల్ కలగలిసిన తుపాకుల పోరాటాల విశిష్ట ప్రయోగానికి ప్రేక్షకులకు, సినిమా రంగానికి గుర్తుండిపోయింది. కథ అమెరికా కాన్ఫెడరేట్ దాచిపెట్టిన బంగారం కోసం ముగ్గురు గన్ ఫైటర్లు పోటీపడడం, అమెరికన్ అంతర్యుద్ధం (ముఖ్యంగా 1862 నాటి న్యూ మెక్సికో కాంపైన్) నాటి గందరగోళం, వాటి మధ్య రకరకాల తుపాకీ పోరుల చుట్టూ తిరుగుతుంది.[3] లియోన్, క్లైంట్ ఈస్ట్ వుడ్ లు కలిసి తీసిన సినిమాల్లో ఇది మూడోది కాగా, వారితో లీ వాన్ క్లీఫ్ కూడా కలిసి పనిచేసిన సినిమాల్లో రెండవది.

ద గుడ్, ద బ్యాడ్ అండ్ ది అగ్లీ డాలర్ ట్రయాలజీ సీరీస్ లో ఎ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డాలర్స్, ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్ సినిమాల తర్వాత మూడవదీ, చివరిదీ అయిన సినిమా. 25 మిలియన్ డాలర్లు సాధించి ఆర్థికంగా విజయవంతమైన చిత్రంగా నిలిచింది. అప్పట్లో విమర్శకులు స్పాగెట్టీ వెస్టర్న్ తరహా చిత్రాలను అంతగా ఆదరించని కారణంగా సినిమాకు విడుదలైన కొత్తల్లో విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన కనిపించింది, అయితే తర్వాతి రోజుల్లో విమర్శకుల నుంచి అనుకూల స్పందన పొందింది. ద గుడ్, ద బ్యాడ్ అండ్ ది అగ్లీ ఈనాడు అత్యంత ప్రభావశీలమైన వెస్టర్న్ తరహా చిత్రంగా పరిగణింపబడడమే కాక, సార్వకాలిక అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా మన్ననలు అందుకుంటోంది.

మూలాలు మార్చు

  1. Variety film review; 27 December 1967, page 6.
  2. Sir Christopher Frayling, The Good, the Bad and the Ugly audio commentary (Blu-ray version).
  3. Yezbick, Daniel (2002).