ద్రాక్ష (స్పానిష్, పోర్చుగీస్ Uvas, ఫ్రెంచ్ Raisins, ఆంగ్లం Grapes, జర్మన్ Trauben) ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది పుష్పించే మొక్కలైన వైటేసి కుటుంబంలోని వైటిస్ ప్రజాతికి చెందినది. ద్రాక్షలో ఇంచుమించు 60 జాతులున్నాయి. ఇవి ఎక్కువగా ఉత్తరార్ధ గోళంలో ఎక్కువగా పెరుగుతాయి. ద్రాక్ష పండ్లను అలాగే తినవచ్చును లేదా వాటి నుండి పానీయాలు, సలాడ్లు, వైన్ తయారుచేయవచ్చును. ద్రాక్ష తోటల పెంపకాన్ని 'వైటికల్చర్' అంటారు.

ద్రాక్ష
ద్రాక్ష పండ్లు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
వైటిస్
జాతులు

చరిత్ర మార్చు

ద్రాక్ష పండ్లు అతి ప్రాచీనమైన కాలం నుండి సాగుచేస్తున్న పండ్లు. వీటి సాగు క్రీస్తు పూర్వం ఐదువేల ఏళ్ల కిందటే ఆసియా ప్రాంతంలో జరిగేది. అయితే అప్పుడు ఇప్పట్లా తినడానికి కాకుండా మధువు తయారీలో వాడేవాళ్ళు. ఇంకా ఇప్పుడు వీటితో జామ్‌లు, జెల్లీలు, కిస్మిస్‌లు తయారుచేస్తున్నారు.

ప్రాచీన గ్రీకు, రోమన్‌ నాగరికతలలో ఇవి వైన్‌ తయారీకి పెట్టింది పేరు. క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో జర్మనీలోని రైన్‌లోయలో కేవలం మధువు తయారీకే వీటినిప్రత్యేకంగా సాగు చేసేవారు. అప్పటికే ఇవి సుమారు తొంభై వెరైటీలలో వుండేవి. యూరోపియన్ల ద్వారా ఇవిఅంతటా వ్యాపించాయి. అమెరికాలో పదిహేదవ శతాబ్దంలో ప్రవేశించాయి. అప్పుడు మెక్సికోలో కాలూనినా, వెంటనే కాలిఫోర్నియాలో స్థిరపడిపోయాయి. వీటికి ఎన్నో చీడపీడల దాడి సామాన్యం. అందులోనూ సాగులో విస్తృతంగా మందులు వాడవలసి వుంటుంది.

భారతదేశంలోనూ వీటి చరిత్ర ఘనమైనదే. క్రీస్తుపూర్వం పదమూడు, పన్నెండు శతాబ్దాల మధ్య రచించబడిన సుశ్రుత సంహిత, చరక సంహితలలో వీటి ఔషధీయ లక్షణాల గురించి వివరణ ఉంది. క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్దంలోని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో కూడా వీటి సాగుకు అనువైన నేల ప్రస్తావన చేశాడు. హిమాలయ పర్వత పాదాల చెంత అడవి రకాలుగా విస్తృతంగా పెరిగేవి. అయితే సాగుచేసినా వీటి రకాల ప్రవేశం క్రీస్తు శకం పదమూడు వందల కాలంలో పర్షియన్ల ద్వారా జరిగింది. వారు వీటిని ఔరంగాబాద్లోని దౌలతాబాద్‌లో పరిచయం చేశారు. అక్కడినుండి క్రైస్తవ మిషనరీల ద్వారా ఇవి సాలెం, మధురై ప్రాంతాలకు పాకాయి. ఇరవైయ్యవ శతాబ్దపు తొలి కాలంలో నిజాం వీటిని హైదరాబాదు‌ తీసుకువచ్చాడు.

ఇక వీటి నుండి తీసిన మధువు మామూలు మందులా కాకుండా నిజంగా మందులానే పనిచేస్తుంది. గుండె ఆరోగ్యానికి ద్రాక్షరసం (మధువు) సేవించాలని అంటారు. ఫ్రెంచ్‌వారు ద్రాక్ష మద్యాన్ని (రెడ్‌వైన్‌) ఎక్కువగా సేవిస్తారు. వారి భోజనంలో కొవ్వు విపరీతంగా వుంటుంది. అయినా వారు గుండె జబ్బుల బారిన పడకపోవడమే కాదు, దీర్ఘకాలం జీవిస్తారు కూడా. అందుకు కారణం వారు తాగే రెడ్‌వైన్‌ అని ఇప్పుడు పరిశోధకులు అంటున్నారు. ప్రాచీన గ్రీకులు, రోమన్లు ద్రాక్షరసానికి దైవత్వాన్ని ఆపాదిస్తే, నవీన ఫ్రెంచ్‌వారు వైన్‌ తయారీని కళ స్థాయికి తీసుకెళ్లారు. ఈనాటికీ ప్రపంచంలో అత్యున్నత ద్రాక్షమధ్యం ఫ్రెంచ్‌వారి తయారీనే.

స్థూలంగా అమెరికన్‌, యూరోపియన్‌, ఫ్రెంచ్‌ రకాలుగా వీటిని వర్ణించినా, వీటిలో యాభై జాతులు, సుమారు ఎనిమిది వేల రకాలు ఉన్నాయి. వాటిలో దాదాపు అయిదారు వందల రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అవన్నీ సంకర జాతి రకాలే. ఒకప్పుడు అనాబ్‌ షాహి అనే రకం బాగా లభించేది. చిన్న సైజు ఉసిరి కాయంత ఉండే ఆ రకం ద్రాక్ష ఇప్పుడు దాదాపు కనుమరుగై పోయింది. వాటిలో గింజలుండేవి. ద్రాక్షలో గింజలు పంటికింద రాయిలా రుచిని దెబ్బతీస్తాయని, గింజలులేని రకాల రూపకల్పన జరిగింది. ఇప్పుడైతే విత్తులేని ద్రాక్షలే ఎక్కువ కనిపిస్తాయి. అప్పట్లో గింజల్ని ఊసేస్తే, ఇప్పుడు తొక్కల్ని ఊస్తున్నారు. ప్రస్తుతం థామ్సన్‌ సీడ్లెస్‌, రెడ్‌ ప్లీం వంటివి కనిపిస్తాయి.

ఉపయోగాలు మార్చు

వీటిలో ఉండే పోషక పదార్థాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితనం పెరుగుతుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడవు. అజీర్తి, మల బద్ధకం తగ్గుతుంది. నోరు, గొంతు ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. వీటిలోని అనేక విటమిన్లు, ఖనిజాలు మీ ఆరోగ్యానికి పూర్తి రక్షణ కలిగిస్తాయి. ఏనుగు బతికినా చచ్చినా విలువే అన్నట్లు ఇవి ఎండిన తర్వాత కిస్మిస్‌గా కూడా పోషక విలువలను కోల్పోవు. కేవలం నీటిని తప్ప. వీటిలోని పాలిఫినాల్‌లు కొలెస్టాల్‌ని అదుపు చేయడంలో, క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో సహకరిస్తాయి. వీటిలోని సోడియం, కొవ్వు పదార్ధాలు చాలా తక్కువ. విటమిన్‌ సి, కే చాలా ఎక్కువ.

వైన్‌ మార్చు

ద్రాక్షరసం (వైన్‌) లో రెండు రకాలున్నాయి. రెడ్‌వైన్‌ ఇంకా వైట్‌వైన్‌. నీలం ద్రాక్షల నుండి ఎరుపు వైన్‌ చేస్తే, పచ్చ రకాల నుండి వైట్‌వైన్‌ చేస్తారు. యూరోపియన్లు భోజనంలో మంచి నీళ్ల బదులు రెడ్‌వైన్‌ తాగడం పరిపాటే. అందులో ఆల్కహాల్‌ శాతం తక్కువగా వుండి ఇతర మధ్యాల ప్రభావాన్ని కలిగించదు.

ఆహారపు విలువలు మార్చు

తేమ శాతం - 92 శాతం, కార్బోహైడ్రేట్స్ - 7 శాతం, కాల్షియం - 20 మి.గ్రా, పాస్ఫరస్ - 20 మి.గ్రా, విటమిన్ సి - 31 మి.గ్రా, విటమిన్స్ - ఎ.బి.కాంప్లెక్స్

ఔషధ గుణాలు మార్చు

అరుగుదల శక్తి తక్కువ ఉన్నవారికి సత్వరం శక్తిని అందించే ఆహారాల్లో ద్రాక్ష ముఖ్యమైనది.

  • మలబద్దకం: ద్రాక్షలో ఉన్న సెల్యూలోజ్ గుణం వలన మంచి విరేచనకారిగా పనిచేస్తుంది. అన్నప్రేవును మెరుగు పరచును. రోజూ కనీసం 350 గ్రాముల ద్రాక్ష తీసుకోవటం మంచిది.
  • అజీర్ణం : అజీర్ణాన్ని కలిగించే పదార్థాలను ద్రాక్ష బయటకు నెట్టివేసి శరీరంలో వేడిని తగ్గించి మంచి అరుగుదలను పెంచును.
  • ఆస్మా: ద్రాక్ష ఆస్మా వలన కలిగే ఆయాసంతగ్గించి, ఊపిరితిత్తుల బలం పెంచును.
  • గుండె జబ్బులు: గుండెను బలాన్నిస్తాయి. నొప్పి వలన, దడ వలన కలిగే ఒత్తిడి ప్రభావం గుండెమీద తగ్గిస్తాయి.
  • మెగ్రయిన్: ప్రతి రోజు ద్రాక్షరసం తాగడం వలన మైగ్రేయిన్ తగ్గడానికి ఎంతగానో అవకాశం ఉంది.
  • మూత్ర పిండ సమస్యలు : ద్రాక్షలో గల పొటాషియం వలన మూత్రపిండాల వ్యాధులు చక్కగా తగ్గుతాయి. ఉబ్బు కామెర్లు, మూత్ర పిండాల లోని రాళ్లు తగ్గించటానికి ద్రాక్ష పనిచేయును.
  • లివర్ సమస్యలు : కాలేయానికి ఉత్తేజ పరచును. పైత్య రసమును సరిగ్గా తయారుచేయుటలో ఉపకరించును.
  • పిల్లల వ్యాధులు: రక్త కణాల తయారగుటలో ద్రాక్ష ఉపయోగపదుతుంది. పిల్లలకి పళ్ళు వచ్చే టపుడు వచ్చే సమస్యలకి ద్రాక్ష రసం చాలా మంచిది.
  • కురుపులు: కురుపుల మీద ద్రాక్ష రసం పోసి గాజు కక్షాలో పరచి ఉంచితే కురుపులు త్వరగా మానతాయి.
  • దంత వ్యాధులు: చీము పట్టిన దంతాలు చిగుర్లు ద్రాక్ష వాడకం వలన క్రమేణా మాని, ఆరోగ్యంగా తయారవుతాయి.
  • ఆల్కాహానిజం :ద్రాక్ష రసం అలవాటు చేసుకుంటే క్రమంగా ఆల్కహాలు మీద ఆశ తగ్గి ద్రాక్ష లోని శక్తిని పొంది, రక్త శుద్ధి జరుగును.
  • అల్జీమర్స్:జ్ఞాపకశక్తి లోపించడం,వయసు పెరిగే కొద్ది విన్న విషయాలు అప్పుడే మర్చి పోవడం వంటి లక్షణాలను నివారిస్తుంది.

ఆరోగ్యానికి మార్చు

 
పచ్చ ద్రాక్షలు
  • ద్రాక్ష పండ్లలోని టన్నీస్‌, పాలిఫినాల్స్‌ క్యాన్సర్‌ సంబంధిత కారకాలపై పోరాడుతాయి. శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి.
  • ఇందులో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతేకాదు.. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా సాయపడుతూ గుండె కవాటాల పనితీరును మెరుగుపరుస్తాయి.[1]
  • ద్రాక్ష గింజల్లో ఉండే ప్రొనాంథోసైనిడిన్‌ అనే పదార్థం కాలేయాన్ని సంరక్షిస్తుంది. పెద్దవయసు వారిలో సహజంగా తలెత్తే దృష్టి లోపాన్ని నియంత్రించి కంటిచూపును మెరుగుపరుస్తుంది.[2]
  • తలనొప్పితో బాధపడేవారికి ద్రాక్షలోని సుగుణాలతో ఉపశమనం లభిస్తుంది.
  • సౌందర్యం ద్రాక్ష పండ్లలోని పాలిఫినాల్స్‌ శరీరంలో కొల్లాజిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. మేనిని కాంతిమంతం చేస్తుంది.
  • వీటిల్లోని పైటోకెమికల్స్‌ కణాల క్షీణతను తగ్గించటంతో పాటు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి వేస్తాయి.
  • ద్రాక్షలో రాగి, ఇనుము, మాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలు ఏర్పడటానికి, బలంగా తయారవడానికి సహాయపడతాయి.[3]
  • ద్రాక్ష polyphenols అనే శక్తివంతమైన అనామ్లజనకాలు కలిగి ఉంటుంది. ఇది అన్నవాహిక, ఊపిరితిత్తుల, నోరు, కంఠం, గర్భాశయ, ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్, పెద్దప్రేగు వచ్చే అనేక రకాల క్యాన్సర్స్ ని తగ్గిస్తుంది.[4]
  • జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. వాటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాలకు పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. దాంతో శిరోజాలకు మంచి నిగారింపు వస్తుంది.
  • చర్మ సంరక్షణకు ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపకరిస్తాయి. అందుకే వీటిని స్క్రబ్‌, మాయిశ్చరైజర్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. తాజా ద్రాక్షలను గుజ్జులా చేసి మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉపయోగాలున్నాయని అతిగా తినడం, సౌందర్య పోషణకు వినియోగించడం మంచిది కాదు. తగిన మోతాదు వాడకంతోనే అన్ని విధాలా ఆనందం. తెల్లద్రాక్ష, నల్లద్రాక్ష... రంగేదైనా కానివ్వండి. తినడానికి రుచిగా ఉండటమే కాదు సౌందర్యపోషణలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. ద్రాక్షపండ్లు సహజక్లెన్సర్లుగా పనిచేసి చర్మంపై ఉండే మురికిని పోగొడతాయి కాబట్టి సౌందర్యనిపుణులు వీటిని చర్మసంరక్షణలో భాగంగా అనేక రకాలుగా ఉపయోగిస్తారు.
  • ఎండల్లో ఎక్కువగా తిరిగితే ముఖం వాడిపోయినట్టవుతుంది. అలాంటి సమయంలో ఒక కప్పు తెల్లద్రాక్ష తీసుకుని వాటిని మెత్తగా చిదిపేసి ఆ గుజ్జులో టేబుల్‌స్పూన్‌ తేనె వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. మురికి పోయి ముఖం తేటగా అవుతుంది.
  • సైజులో పెద్దగా ఉండే గింజలేని తెల్లద్రాక్షను తీసుకుని సగానికి కొయ్యండి. ఆ ముక్కతో ముఖమంతా సున్నితంగా రాయండి. కళ్లకిందా పెదవుల చివర... ఇలా ముడతలు పడటానికి ఎక్కువ అవకాశం ఉండే ప్రదేశాల్లో ఇంకొంచెం ఎక్కువ సేపు రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని పొడిగుడ్డతో తుడుచుకోవాలి. వయసు పెరగడం వల్ల వచ్చే ముడతల్ని సమర్థంగా నిరోధిస్తాయి.
  • రెండు చెంచాల ద్రాక్షరసానికి ఒక టేబుల్‌స్పూన్‌ చొప్పున పెరుగు, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రుద్దండి. పావుగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగెయ్యండి. ఈ మాస్క్‌ ముఖచర్మాన్ని శుభ్రపరచి మృదువుగా ఉంచుతుంది.
  • ఒక టేబుల్‌స్పూన్‌ ద్రాక్ష రసంలో గుడ్డులోని పచ్చసొన బాగా కలిపి ముఖానికి రాయండి. పదినిమిషాల తర్వాత చల్లటినీళ్లతో కడుక్కోండి. పొడిచర్మం గలవారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. అదే, మీది జిడ్డు చర్మమైతే పచ్చసొన స్థానంలో తెల్లసొన వాడితే సరిపోతుంది.

జాగ్రత్తలు మార్చు

ద్రాక్షకు త్వరగా పాడయ్యే గుణం ఉండటం వలన బజారు నుండి తెచ్చిన వెంటనే వాడుకోవటం మంచిది.

సూచికలు మార్చు

  1. ""Las Uvas"". Archived from the original on 2017-10-03. Retrieved 2016-12-20.
  2. ""Alimentação Saudável e Nutrição - Uvas"". Archived from the original on 2017-03-30. Retrieved 2016-12-20.
  3. ""Las Uvas"". Archived from the original on 2016-11-08. Retrieved 2016-12-20.
  4. "Grapes: Health Benefits, Nutritional Information"

యివి కూడా చూడండి మార్చు

యితర లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ద్రాక్ష&oldid=3887301" నుండి వెలికితీశారు