నగీనా (1986 హిందీ సినిమా)

నగీనా 1986లో విడుదలైన భారతీయ ఫాంటసీ సినిమా. ఈ చిత్రాన్ని హర్మేష్ మల్హోత్రా నిర్మించి దర్శకత్వం వహించాడు. దీనికి జగ్‌మోహన్ కపూర్ కథను అందించగా, రవి కపూర్ స్క్రీన్‌ప్లే వ్రాశాడు. దీనిలో శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా కథ రజని అనే ఒక నాగకన్య ఒక మానవున్ని పెళ్ళి చేసుకుని తన జతగాడిని చంపిన దుష్ట మాంత్రికునిపై ప్రతీకారం తీర్చుకొనడం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ఇంకా రిషి కపూర్, అమ్రిష్ పురి, సుష్మ సేథ్, ప్రేం చోప్రాలు నటించారు.

నగీనా
దర్శకత్వంహర్మేష్ మల్హోత్రా
రచనఅచలా నాగర్
స్క్రీన్ ప్లేరవి కపూర్
కథజగ్‌మోహన్ కపూర్
నిర్మాతహర్మేష్ మల్హోతా
తారాగణంశ్రీదేవి
రిషి కపూర్
అమ్రిష్ పురి
ప్రేమ్‌చోప్రా
ఛాయాగ్రహణంవి.దుర్గాప్రసాద్
కూర్పుగోవింద్ దల్వాది
సంగీతంలక్ష్మీకాంత్ - ప్యారేలాల్
నిర్మాణ
సంస్థ
ఎం.కె.ఎంటర్‌ప్రైజస్
పంపిణీదార్లుఎం.కె.ఎంటర్‌ప్రైజస్
విడుదల తేదీ
28 నవంబర్ 1986
దేశంభారతదేశం
భాషహిందీ

ఈ సినిమా విడుదల కాగానే విజయవంతమయ్యింది. 1986లో విడుదలైన హిందీ సినిమాలలో ఎక్కువ వసూళ్లు చేసిన రెండవ సినిమాగా నిలిచింది. ఈ సినిమా స్త్రీ ప్రధాన సినిమా అయినప్పటికీ వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఈ సినిమాకు 1989లో తరువాయిగా నిగాహే: నగీనా పార్ట్ -2 విడుదలయ్యింది. భారతదేశంలో ఒక సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మొట్టమొదటి సినిమా అది. అయితే అది వాణిజ్యపరంగా తుడిచి పెట్టుకుపోయింది. నేడు నగీనా ఒక ఉత్తమ భక్తి చిత్రంగా, శ్రీదేవి అత్యున్నత నటన ప్రదర్శించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తెలుగులో "నాగిని"గా డబ్ చేయబడింది.

కథ మార్చు

రాజీవ్ (రిషికపూర్) ఒక ధనిక జమీందారీ కుటుంబానికి చెందిన వాడు. అతడు తన తల్లి (సుష్మాసేథ్)తో కలిసి రాజభవనం లాంటి పెద్ద భవంతిలో నివసిస్తూ ఉంటాడు. తల్లికి తన కొడుకు రాజీవ్ ఠాకూర్ అజయ్ సింగ్ (ప్రేం చోప్రా) యొక్క అందమైన కుమార్తె విజయకు ఇచ్చి పెళ్లి చేయాలని ఉంటుంది. అయితే రాజీవ్ రజని (శ్రీదేవి) అనే అనాథపిల్లను ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అతని తల్లి మొదట నిరాకరించినా రజనిని చూసిన తర్వాత తన మనసు మార్చుకుంటుంది. రాజీవ్, రజనిల వివాహం జరిగి వారి జీవితంలోకి భైరవనాథ్ (అమ్రిష్ పురి) ప్రవేశించే వరకూ సుఖంగా ఉంటారు. సాధు రూపంలో వచ్చిన భైరవనాథ్ రాజీవ్ తల్లికి రజని మానవరూపంలో ఉన్న ఒక నాగకన్య అని ఆ నాగకన్య జతగాడైన మగపామును రాజీవ్ చిన్నతనంలో చంపివేశాడని, దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ నాగకన్య రజని రూపంలో వచ్చిందని చెబుతాడు. ఆమెను ఇంటినుండి తరిమివేయడానికి భైరవనాథ్, అతని శిష్యులు బూరను ఊదుతూ నాగనృత్యం చేసి రజనికూడా నాగిని నృత్యం చేసేటట్లు చేస్తారు. ఈ లోగా రాజీవ్ ప్రవేశించడంతో భైరవనాథ్ ప్రయత్నం విఫలమౌతుంది. నాగకన్యకు మాత్రమే తెలిసిన నాగమణిని తస్కరించి ప్రపంచాన్ని జయించాలన్న దుష్ట ఆలోచనను రాజీవ్ పసిగడతాడు. రాజీవ్ భైరవనాథ్‌తో పోరాడతాడు. చివరకు భైరవనాథ్‌ను రెండు పాములు కాటువేయగా అతడు మరణిస్తాడు. రాజీవ్, రజని తర్వాత సుఖంగా జీవిస్తారు.

స్పందన మార్చు

ఈ చిత్రం విడుదలైన ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. [1][2] ఈ సినిమాలోని డైలాగులు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి.[3]ఇది హిందీలో పాములతో తీసిన సినిమాలలో ఉత్తమ పది సినిమాలలో ఒకటిగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.[4] శ్రీదేవి చేసిన క్లైమాక్స్ నృత్యం "మై తేరీ దుష్మన్" బాలీవుడ్ సినిమాలలోని "సర్పనృత్యాల"లో ఉత్తమమైనదిగా నిలిచిపోయింది.[5] ఈ సినిమాలోని శ్రీదేవి నటనకు 2013లో ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేక బహుమతి లభించింది.

నటీనటులు మార్చు

  • శ్రీదేవి - రజని/నాగిని
  • రిషి కపూర్ - రాజీవ్
  • అమ్రిష్ పురి - భైరవ్‌నాథ్
  • సుష్మాసేథ్ - రాజీవ్ తల్లి
  • ప్రేం చోప్రా - ఠాకూర్ అజయ్ సింగ్
  • గుడ్డి మారుతి - భానుమతి

పాటలు మార్చు

ఈ సినిమాకు లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ సంగీతాన్ని సమకూర్చగా, ఆనంద్ బక్షి పాటలకు సాహిత్యాన్ని అందించాడు.

క్ర.సం. పాట గాయకుడు (లు)
1 "తూ నె బెచైన్ ఇత్నా జ్యాదా కియా" మొహమ్మద్ అజీజ్, అనూరాధా పౌడ్వాల్
2 "మై తేరీ దుష్మన్, దుష్మన్ తు మేరా" లతా మంగేష్కర్
3 "బల్మా తుమ్‌ బల్మా హో మేరె ఖాలీ నామ్‌ కే" కవితా కృష్ణమూర్తి
4 "భూలీ బిస్రీ ఏక్ కహానీ" అనూరాధా పౌడ్వాల్
5 "ఆజ్ కల్ యాద్ కుచ్ ఔర్ రహతా నహీ" మొహమ్మద్ అజీజ్

మూలాలు మార్చు

  1. http://www.bollywoodhungama.com/movies/features/type/view/id/3705
  2. Boxofficeindia.co.in. "Worth Their Weight In Gold!(80s)". Archived from the original on 2016-01-11. Retrieved 2018-04-02.
  3. "Sridevi - The child woman". Archived from the original on 2007-09-27. Retrieved 2018-04-02.
  4. Times of India. "Top Ten snake films".
  5. MidDay. "The best of Sridevi".

బయటి లింకులు మార్చు