నయనార్లు సా.శ. 5, 10వ శతాబ్దాల మధ్య తమిళనాడు రాష్ట్రంలో నివసించినట్లుగా చెప్పబడుతున్న 63 మంది గొప్ప శివ భక్తులు. వీరి గురించి 13 వ శతాబ్దంలో రచించబడిన తమిళ ప్రబంధం పెరియపురాణంలో విపులంగా వ్రాయబడి ఉంది. వీరు భక్తి ద్వారా మోక్ష సిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. వీరు భగవంతుని తల్లిగా, స్నేహితునిగా, కొడుకుగా, యజమానిగా, ప్రేయసిగా భావించి పూజించారు. విష్ణుభక్తులైన 12 మంది ఆళ్వార్లతో కలిసి వీరిని దక్షిణభారతదేశపు భక్తి దూతలుగా వర్ణిస్తారు.

శివభక్తులు

ఈ నయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవులవరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి.

చరిత్ర మార్చు

సా.శ.4,5 శతాబ్దములవరకున్ను దేశములో బౌద్ధ, జైన మతములు సుస్థిరపడినవి. వాటిమూలమున వైదికమతమునకు గొప్ప దెబ్బ తగిలినది. జైన బౌద్ధములకు పూర్వము తమిళదేశములో నుండిన మతములెట్టివో తెలియదుకాని, ఉత్తరమునుంచి బ్రాహ్మణులు వలసవచ్చిననాటినుంచిన్ని వాటిని వైదికమతముతో సంబదించినవాటిగా మార్చడానికి ప్రయత్నించి ఉంటారు. ఈ ఉత్తరవైదికమతముకున్ను, దక్షిణాత్యమతములుకున్ను కలిగిన సమ్మేళనము వలన క్రొత్త సంప్రదాయము లీ ప్రాంతములలో ఏర్పడినవి. ఇవియే తమిళశైవ సంప్రదాయము, తమిళవైష్ణవసంప్రదాయము అనేవి. తమిళశైవ సంప్రదాయము నాయనార్ల మూలమునను, తమిళవైష్ణవ సంప్రదాయము ఆళ్వార్ల మూలమును వ్యాప్తిచెందినవి.

బౌద్ధ, జైన మతములు స్థిరపడడానికి తోడ్పడిన ముఖ్యవిధానము "ఆహార-అభయ-భైషజ్య-శాస్త్రదానము". వీటిలో ఆహార-అభయ-భైషజ్యములు జనులకు నిత్యమున్ను కావలసినవే. మిషనరీ లందరూ ఏమతమువారైనా ఈమూడింటిని వినియోగించే తమ మతమును వ్యాప్తిలోనికి తెచ్చుకొనేది. ఆపద్ధతినే అవలంబించకపోతే శైవమతమును వ్యాప్తిలోనికి వచ్చి బౌద్ధజైనమతప్రచారము నిలువదని ఆకాలములో తోచింది. దానికి తోడు కేవలము శాస్త్రముగాక భక్యవేశముకూడా పుట్టిస్తేగాని మొదటి మూడున్ను నిష్ప్రయోజనములు అవుతాయని తోచింది. ఈపద్ధతులన్నింటినీ ఆనాటి శైవమతావేశాపరు లాచరణలోనికి తెచ్చారు. అందులో భక్తివ్యాప్తికి భక్తచరిత్రములు చాలా ఉపయోగపడినవి. ఆశైవభక్తులకే "నాయనార్లు" అనిపేరు.

నాయనారు అంటే పూజ్యుడు అని అర్ధము. శివభక్తులెవరినా పూజ్యులే. అయినా, వారిలో ఎక్కువ ప్రసిద్ధిపొదినవారి పేళ్ళు జనశ్రుతిలో స్థిరముగా నిలచినవి. అసంఖ్యాతమహేశ్వరులలో అరవైముగ్గుర పేళ్ళు మాత్రము రానురాను జనుల వాడుకలోను, శైవప్రచారములోను నిలిచినవి. వీరినే అరవత్తుమూవురు (అఱుబత్తుమూవర్) అని అంటారు.

నాయనార్ల సంఖయ్ 63గా ఏర్పడడానికి కారణములేకపోలేదు. జైనబౌద్ధమత ప్రచారమును అరికట్టడానికి పూనుకొనిన మతప్రచారకులు వాతిలో ఉన్న పోలికలతో నూతన మతనిర్మాణములోనికి దిగుమతిచేసి జనులకు నమ్మకము పుట్టించి ఉంటారు. ఒకప్పుడున్న పేరునట్లే ఉంచి తత్సంబధమైన కథను వేరేగా చెప్పబడింది.

జైన సంప్రదాయములో త్రిషష్టిశలాకా పురుషులున్నారు. ఈత్రిషష్టినటులే శైవులు ఉపయోగించుకునారు. త్రిషష్టి సలాకా పురుషులలో 24 తీర్ధంకరులు, 12 గురు చక్రవర్తులు, 9 గురు బలదేవులు, 9 గురు వాసుదేవులు, 9 గురు ప్రతివాసుదేవులు చేరినారు. మొతాం 63 మంది అయినారు. ఈ సంఖ్యను తప్పిస్తే కార్యములేదు. కాబట్టి తమిళనాయనర్లు మొత్తం 63 మంది. వీరిలో 24 గురు తీర్ధంకరులలో మొదటివాడు ఋషభుడు. ఇతడు శైవములో బసవడైనాడు.మూడోవాడు శంభవుడు. ఇతడు నాయనార్లలో శంభుచిత్తుడైనాడు. నాలుగోవాడు అభినందనుడు. ఇతడే అభిరాముడనే నాయనరయినాడు. ఇతడే నందుడుగకూడా మారి ఉంటాడు. 7వ తీర్ధంకురడైన సుపార్స్వనకును, 23 వవాడైన పార్స్వునకును మారుగా పూసలనాయనా ఏర్పడినాడు. ఇతడు తొమ్మిదో తీర్ధంకురుడైన పుష్పదంతునికి కూడా శాఇవప్రతినిధి కావచ్చును. చంద్రపభుడనే 8వ తీర్ధంకుడే చండేశనాయనారయి ఉంటాడు. 15వ తీర్ధంకరుడు ధర్ముడు. ఇతడు నాయనార్లలో ధర్మభక్తుడైనాడు. 17 వ తీర్ధంకరుడైన కుంధు అనేవాడు కుత్తవనాయనారుగా అయి ఉండవచ్చును.

వీర శైవము తలదూపినదాక బసవడులేడు. బసవేశ్వరునికి పూర్వసంప్రదాయములో అతడు ఋషభునికి నామాంతరమైన ఆదినాధునికి దగ్గర ఉచ్చారణ గల అతిభక్తుడు అనేపేరుతో నిలిచాడు. ఈఅతిభక్తుడే ఆడిభర్త, అతిపత్తార్ అనేనామాంతరములతో కనబడుతున్నాడు. ఇదిగాక నాయనార్లలో కొందరికి జైనమతముతోడి సంబంధము శాఇవసంప్రదాయములో కూడా విస్మృతము కాలేదు. వాగీశనాయనారనే నామాంతరము గల అప్పరుకు ధర్మసేనుడనే పేరుకూడా ఉంది. అప్పరు అనేక జైనగ్రంధములనుకూడా వ్రాసినాడు. జైన మతమునకున్న, శైవమునకున్ను గల ఇట్టి పోలికలనింకా విస్తరించి వ్రాయవచ్చును. ఇట్లే బౌద్ధముతోడి పోలికలుకూడా ఈ శైవములో కనబడుతున్నవి. శాక్యనాధుడనే నాయనారు స్వయముగా శాక్య నాధుడైన బుద్ధభగవానుని ప్రతిబింబమే. అట్టి పోలికను మరుగుపెట్టడానికాపేరును సాంఖ్యతొండుడుగా మార్చుకొన్న సాంఖ్య తొండడే శాక్యనాధుడనే స్మృతి శైవసంప్రదాయము నుంచి తొలగిపోలేదు.

నాయనార్లెందరో మనకు చరిత్రలో కనబడతారు. కాని వీరందరున్ను అరవత్తుమూవురలో చేరలేదు. అరవైమూడు అనేసంప్రదాయము మొదట తమిళనాడులో పుట్టినది. తమిళము పేళ్ళాకు సంస్కృతనామములు కల్పించి సంస్కృత గ్రంథములలో చేర్చారు. ఇదే తరువాత కర్ణాటకకు, తెలుగు దేశానికి వ్యాపించింది. ఈ వ్యాప్తిలో ఆయా తమిళపు పేళ్ళు అనేక వికారములకులోనై వివిధరూపములను పొందినవి. ఈ పేళ్ళు పట్టిక ఒక్కో భాషలో ఒక్కో గ్రంథములో మారుతూ వచ్చినవి.

తమిళము : పెరియపురాణము: పేక్కిలారు విరచితము. 19 వ శతాబ్దములోనిది.

సంస్కృతము: 1.స్కాందోపురాణము 2. శివరహస్యము 3. శివభక్త మాహాత్మ్యము 4. హాలాస్య మాహాత్మ్యము 5. భువనకోశము

కన్నడము : 1. అరవత్తు మూరవ పురాతన చరిత్ర (వచనము) 2. త్రిషష్టి పురాతన చరిత్ర (చంపూ కావ్యము) 3. అరవత్తు మూరవ పురాతనశరణ చరిత్ర (విరూపాక్షకవి విరచితము, పద్య కావ్యము) 4. బసవపురాణము

తెనుగు: 1.హాలాస్య మాహాత్మ్యము 2.బసవపురాణము 3. పండితారాధ్య చరిత్రము

పెరియ పురాణము నయనార్లు మార్చు

 
కన్నప్ప నయనారు
  1. అనయ నయనారు
  2. ఆదిపత్త నయనారు
  3. అయ్యడిగల్ కడవర్కాన్ నయనారు
  4. అమరనీది నయనార్
  5. అప్పుది అడిగళ్
  6. అరివట్టయ నయనారు
  7. చండీశ్వర నయనారు
  8. దండియదిగళ్ నయనారు
  9. ఎనటినాథ నయనారు
  10. ఎరిపాత్త నయనారు
  11. అయ్యర్కాన్ కాలిక్కామ నయనారు
  12. గణనాథ నయనారు
  13. ఇడన్ గాజి నయనారు
  14. ఇలయాన్ కుడిమారనాయనారు
  15. ఇయర్ పగై నయనారు
  16. కలికాంబ నయనారు
  17. కాలియ నయనారు
  18. కానమ పుల్ల నయనారు
  19. కన్నప్ప నాయనారు

20 కన్నప్ప తెలుగు వాడు.. రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈయన స్వస్థలం..ఆప్రాంతానికి నాగడు అనే ఒక బోయరాజున్నాడు. అతని ఇల్లాలు పేరు దత్త. వీరిరువురూ సుబ్రహ్మణ్యస్వామి భక్తులు.స్వామి దయవలన వీరికి కలిగినపుత్రుడుకి తిన్నడు అనేపేరు పెట్టుకొన్నారు. నాగడికి తిన్నడు సకలవిద్యలు నేర్పించి రాజుగా చేశాడు. తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. బోయవానిగా తన కులధర్మముననుసరించి వేటాడినా - తిన్ననికి అన్ని జీవులయెడ - కరుణ, ప్రేమలు పుట్టుకనండి అభివృద్ధినొందాయి. జంతువులలో పిల్లలని, ఆడవాటిని, రోగాలతో ఉన్నవాటిని వేటాదేవాడు కాదు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద మాత్సర్యాలను జయించాడు.

ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు ఒక పంది అతని వల నుంచి తప్పించుకుని పారిపోజూచింది. తన అనుయాయులైన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు. దానికి అలసట వచ్చి, చెట్టుముందర ఆగింది. తిన్నడు దాన్ని చంపాడు. అందరూ అలసిపోయారు, దప్పికైంది. దాన్ని మోసుకుని స్వర్ణముఖీనదీ తీరానికి పోయారు. కాళహస్తి కొండ, దేవాలయము కన్పించాయి.

తిన్నడికి ఆ పర్వతమెక్కి - గుడిని చూడాలని విపరీతంగా అనిపించసాగింది. అక్కడ పరమేశ్వరుడు కుడుము దేవారు (పిలకవున్న దేవుడు) అని నాముడు చెప్పాడు. కాముడు పందిని వచనము చేయ మొదలుపెట్టాడు. ఆ కొండఎక్కుతుండగానే తిన్ననిలో అంతకుముందెన్నడు తనకు అనుభవంగాని అలౌకికానంద పరవశుడవసాగాడు. అది పూర్వ జన్మసంస్కార ఫలితము. తన మీదనుంచి ఏదో బరువు తగ్గుతున్నట్లనిపించసాగింది..దేహస్పృహకూడా మందగించసాగింది.. అక్కడ శివలింగమును కనుగొనగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది. ఆ లింగమును కావలించుకున్నాడు..ముద్దులు గుమ్మరించాడు..ఆనందబాష్పాలు రాలటంతో, శివునితో ' ఈశ్వరా! ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారము ఎలా వస్తుంది? నీకు తోడెవరుంటారిక్కడ? నేను నీతోనే ఉంటాను. అయ్యో! నా తండ్రీ ఆకలిగా ఉందేమోకదా నీకు..ఉండు ఆహారం తీసుకువస్త్తాను' అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేక, వెళ్ళలేకపోయాడు...చివరికి శివుని ఆకలిదీర్ఛుటకు వెంటనే కొండదిగాడు. కాముడు పచనము చేసిన పందిమాంసమును రుచి చూచి మంచిది శివునికి వేర్పరిచాడు. 'నాముడు ఈశ్వరునికి ఆహారము సమర్పించే ముందు ప్రతిదినము నీటితో అభిషేకింపబడుతాడని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు. అది విన్న తిన్నడు నదినుండి నోటినిండా నీళను పుక్కిలి బట్టి సేకరించిన పూలను తనతలమీద వుంచుకొని పచనము చేసిన మాంసమును చేతిలో వుంచుకొని, విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్లాడు. అక్కడ పుక్కిలిబట్టిన నీరును శివునిపై వదిలాడు. అది అభిషేకమైంది. తలమీద వున్న పూలతో శివుని అలంకరంచాడు. అది అర్చన అయింది. తర్వాత తాను తెచ్చినపందిమాంసమును దేవునిముందు పెట్టాడు. అది ఆయనకు నివేదన అయింది. ద్వారము వద్ద ఎవరిని, ఏ జంతువులను రానీకుండా కాపలా కాశాడు... ఆ బోయవాని మూఢభక్తి భోళాశంకరుడైన ఆ కైలాసనాథున్ని కదిలించింది.... మరునాడు ప్రొద్దున మళ్లీ ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్లాడు. నాముడికి కాముడికి మతిపోయింది. తిన్నడులో వచ్చిన మార్పును మతిభ్రమణమేమోనని భావించి వెంటనే వెళ్లి తిన్నని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు. వారు తిన్నని ఇంటికి తీసికొని పోజూచారు. తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్లలేదు.

తిన్నడు దేవునికాహారము సేకరించటానికి వెళ్ళగా, ఆలయ అర్చకుడు సివగోచారి శివుని దైనందికార్చనకు వచ్చాడు. ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు, నిర్ఘాంతపోయాడు. ఆగమాల్లో ఆ అర్ఛకుడు నిష్ణాతుడు. అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వానిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోషణ్ గావించి మళ్లీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖీ జలముతో అభిషేకము చేసి, పూలతోనలంకరించి విభూతినలిమి, తెచ్చిన పళ్లు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్లాడు. పూజారి వెళ్లగానే, తిన్నడు మళ్లీ దేవుని నివేదనకై వేటాడిన మాంసమును తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజాద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజచేశాడు. ఈవిధంగా ఐదు రోజులు జరిగాయి. పూజారి ఈక ఉండబట్టలేకపూయాడు. రోదిస్తూ పరమశివుని ప్రార్థంచాడు. "ఈ ఘోరకలిని ఆపుస్వామి..." అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివగోచారికి తిన్నని భక్తిప్రపత్తులను చూపదలచాడు. అర్చకునకు కలలో కనిపించి "నీవు లింగము వెనుక దాగి యుండు. బయటకు రాక అక్కడ ఏమిజరుగబోతోందో గమనించు" అని ఆదేశించాడు.

ఆరవ రోజున యథావిధిని తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తుండగా తిన్ననికి కొన్ని దుశ్శకునాలు గోచరించాయి. ఏదో శివునకు ఆపద జరిగిందని భావించాడు. శివునికి ఆపద జరుగగలదా అని తనని గూర్చి మరచిపోయాడు. గుదికి పరుగెత్తి వెళ్ళాడు. వెళ్లిచూడగానే - శివుని కుడికన్ను నుండి రక్కము బయటకి వస్తోంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు క్రింద పడిపోయాయి. బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పనిచేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికావైద్యం చేశాడు. కాని రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఊయ కలిగింది. 'కన్నుకు కన్ను' సిద్ధాంతముగా స్ఫురించింది. సంతోషించాడు. నృత్యం చేశాడు. నృత్యము చేస్తుండగానే - ఇప్పుడు శివునికి ఎడమ కన్ను నండి నెత్తురు బయటకు రావడం గమనించాడు. భయము లేదు మందు తెలిసిందిగా, కాని ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను గూడ తీసిన శివుని కన్ను కనుగొనుట ఎలా? అందుకని గుర్తెరుగుటకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై బెట్టి - తన ఎడమ కన్నును పెకళించబోయాడు.

పరమ శివుడు వెంటనే ప్రత్యక్షమయి తిన్నని చేతిని పట్టుకొని ఆపాడు. " నిలువుము కన్నాప్పా! కన్నప్పా! నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిరతిశయ భక్తిని మునుపెన్నడు చూచి ఎరుగను. పంచాగ్నుల మధ్య నిలిచి తపమొనర్చిన మునుల ఆంతర్యము కన్న నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణానందము కలిగించినది నీవొక్కడివే కన్నప్పా! " అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్పా అని మూడుమారులు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును మూడింతలుగా పొందాడన్నమాట.

తన కన్నును ఈశ్వరునికర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్పనాయనారు అయ్యాడు. నేత్రేశనాయనారు అనునది సంస్కృతనామము. శివుడు తన రెండు చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసొకొని ప్రక్కకు చేర్ఛుకున్నాడు. కన్నప్పకు చూపువచ్చింది. సాక్షాత్తూ శివుని వలె జీవించాడు. శివగోచారికి తిన్నని అపురూపమైన శివభక్తి గోచరమైంది. మహాభక్తుడైన తిన్నడు తన కళ్లనే పెకలించి శివునికిచ్చుటలో తిన్నని సంపూర్ణశరణాగతి ఆత్మనివేదన గోచరిస్తుంది. అంతకన్నా అనితరమైన భక్తితత్పరత కనిపించదు. వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింప చేసింది. ఇలా వేదం, నాదం, యోగం, శాస్త్రాలు, పురాణాలు ఏవీ ఎరుగని ఒక మామూలువ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుని ప్రసన్నంచేసుకున్నాడు. ఈ భక్తిసామ్రాజ్యరారాజు..ఒక్క శైవులకే కాదు.. తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీయుడు.

21 కరైక్కల్ అమ్మయ్యారు (కారక్కాల్ అమ్మ)

22 కజ్ హార్ సింగ నయనారు

23 కఝరిత్రరివార్ (చేరమాన్ పెరుమాళ్ నయనారు)

24 కోచెన్ గాట్ చోళ నయనారు

25 కూత్రువ నయనారు

26 కోట్పులి నయనారు

27 కులాచిరాయి నయనారు

28 మనకంచార నయనారుగుగ్గులు కలశ నయనారు

29 మంగయార్ కరశియార్

30 మెయ్ పొరుల్ నయనారు

31 మూర్ఖ నయనారు

32 మూర్తి నయనారు

33 మునైయడువారు

34 మురుగ నయనారు

35 నామినంది అడిగళ్

36 నరసింగ మునియారయ్యరు

37 నేశ నయనారు

38 నిన్రాఋషి నెడుమర నయనారు

39 పెరుమిజహలాయి నయనారు

40 పూసలార్ నయనారు

41 పూగల్ చోళ నయనారు

42 పూగజ్ తునాయి నయనారు

43 సక్కియ నయనారు

44 సదయ నాయనారు

45 సత్తి నయనారు

46 శేరుతునాయి నయనారు

47 శిరప్పులి నయనారు

48 శిరుతొండ నయనారు

49 సోమశిర నయనారు

50 సుందర్రామ్మూర్తి — (సుందరారు) ఈయన భగవంతుని తన స్నేహితునిగా భావించాడు. కొన్ని సందర్భాల్లో ఆయనపై కోపగించుకుంటాడు కూడా. 8 వ శతాబ్దంలో తమిళనాడులోని తిరునవలూర్ లో ఒక ఆధ్యాత్మిక గురువుల ఇంట్లో జన్మించాడు. ఈయన ఎక్కడికి వెళ్ళినా శివుని కీర్తించే తెవరాన్ని అద్భుతంగా గానం చేసేవాడు.

51 తిరుజ్ఞాన సంబంధారు

52 తిరుకురిప్పు తొండనయనారు

53 తిరుమూల నయనారు

54 తిరునాలై పోవార్ నయనారు (నందనారు)

55 తిరునవుక్కరసారు నయనారు

56 తిరునీలకంఠ నయనారు

57 తిరునీలకంఠ యాజ్ పనార్ నయనారు

58 తిరునీలనక్కార్ నయనారు

59 రుద్రపశుపతి నయనారు

60 వాయిలారు నయనారు

61 విరాల్ మిండ నయనారు

62 ఇయర్ కాన్ కలికామ నయనారు

63 కరి నయనారు

64 ఇసై జ్ఞాననియారు

నంజుండేశ్వరాలయము నాయనార్లు మార్చు

మైసూరు ఇలాకా నంజంగూడు గ్రామములోని నంజుండేశ్వరాలయములో Nanjangud ఈ 63 నాయనార్ల విగ్రహములు నిలుపబడి యున్నవి. ఇవి శిలావిగ్రహములుగాను, వాటికి ఉత్సవ విగ్రహములైన లోహవిగ్రహములుగాను రెండు విధములగ ఉన్నాయి. శిలావిగ్రహములపైన మైనముపట్టి వాటి అమదము మరుగుపడినది. ఈవిగ్రహములు ఏకాలమునాటివో నిర్ణయించబడలేదు. కాని వాటి తీరును బట్టి 15వ శతాబ్దము నాటివని అని కొందరు అంటారు.ఈ విగ్రహముల అడుగు భాగమున ఆయా నాయనార్ల పేర్లు కూడా వ్రాయబడియున్నది.కాని ఈ విగ్రహములు అక్కడ 66 ఉన్నవి వాటిలో ఒకదానికి పేరు చెక్కబడలేదు.ఈ అరవైఆరింటిలో ఏమూటిని నాయనార్ల విగ్రహములు కావో నిర్ణయించడము కష్టము.

హాలాస్యమాహాత్మ్యములో 63 రు నాయనార్ల చరిత్ర ఉన్నది కాని, ఈ నాయనార్లు మధూనేలిన రాజులనిన్ని, వారి చరిత్రములు శివుని 63 లీలలని చెప్పబడినవి. కాని, నాయనార్లందరు రాజులుగా తక్కిన గ్రంథములలో చెప్పబడిలేదు. అందుకే ఇది ప్రామాణికముగా తీసుకొనలేము.ఇక పాల్కూరికి సోమనాధుడు పండితారాధ్యచరిత్రములో అతడు 64రు సంఖ్యను చెప్పి 53 పేర్లను మాత్రమే ఇచ్చాడు.

పాల్కూరి సోమనాధుని పట్టిక మార్చు

1. ఆదిభర్త

ఇతనికి తమిళములో అతిపత్తరనిన్ని, సంస్కృతములో అతిభక్త అని పేళ్ళు.పండితారాధ్యచరిత్రములో ఇతనిపేరుమాత్రమున్నది గని ఇతని వృత్తాంతము పెద్దగాలేదు. ఇతడు బెస్తవాడని, తనకు ప్రతిదినమున్ను దొరికిన మొదటి చేపను శివుని కర్పించేవ్రతము కలవాడని, తనకొకనాడు బంగారుచేపదొరకగా సంకోచింపక శివునకు సమర్పించి నాడని, దానికి మెచ్చి శివుడతనికి కైలాసవాసమిచ్చినాడని తమిళ గ్రంథములు తెలుపు చున్నవి.

2.అమరనీతి

ఇతని ఇంటికొకనాడు వృద్ధశైవభక్తుడొకడు వచ్చి తనరెండు గోచీగుడ్డలను దాచనిచ్చాడు.అందులో ఒకటి పోయింది. దానికిబదులుగా మరొకటి ఇస్తానంటే అది తనదానికంటె బరువు తక్కువదని హఠము పట్టినాడు.అందుచేత రెండోగోచీ అంతబరువు సరిగా ఉండడానికి దానిని త్రాసులో నొకప్రక్కనుంచి రెండో ప్రక్క క్రొత్తగోచీ నుంచి తూచారు.తుదకు అమరనీతిని, అతని పెండ్లాము కూడా తక్కెడలో క్రూచుంటే గని అది సరితూగినదికాదు.ఇట్లు వారిద్దరుని ఆముసలవానికి బానిసలై పనిచేయవలసివచ్చింది. ఈకథ పెరియపురాణములోనిది. సోమనాధుడు అమరనీతిపేరును అరువత్తుమూవురులో చేర్చాడు గాని కథను చెప్పలేదు.

3.అరివాళు

ఇతనికి తమిళములో అరివాళ్ తొండనాయనారని, సంస్కృతములో సంకులాదాయుడని పేరు. పండితారాధ్యచరిత్రములో ఇతని కథ సంపూర్ణముగా లేదుగాని ఇతడు శూద్రుడని, శివుని ఊరేగింపుకోసమితని భార్య అన్నమును తలపై పెట్టు కొనిపోతూ ఉండగా దారిలో పెద్దవర్షము వచ్చి; ఆమె బురదలో కాలుజారి పడడముచేత అన్నము అంతా బురదలో కలిసిపోయింది. ఈవిషయము అరివాళుకి తెలిసి తనతలనే కోసుకొని శివునకు సమర్పింప ఉద్యుక్తుడైనాడు. శివుడు ప్రత్యక్షమై అతనిభక్తికి మెచ్చి కైలాసవాసమును అనుగ్రహించిడట అని పెరియపురాణపు కథ. తెనుగు బసవపురణములో కథ ఇట్లున్నది: అరివాళుడు త్రికాలములలూను శివునికి రాజనపుబియ్యపుటన్నమును ఆరగింప బెట్టుతూ ఉండేవాడు. ఇంటిలో బియ్యమైపోయినవి. అప్పట్నుంచి కొడవలి పట్టుకొని కూలికిపోయి రాజనములను సంపాదించి తనవ్రతమును కొనసాగిస్తూ ఉండేవాడు.కొన్నాళ్ళకు ఆకూలికూడ దొరకలేదట. అందుచేత 5 దినములు పస్తులున్నాడట. మరుచటి దినమెట్లో రెండు కుంచముల రాజనములు కూలి దొరికినదట. వాటిని సంభ్రముతో ఇంటికి తెస్తూ ఉండగ కాలుజారి అవి క్రింద బురదలో పడినవి. అప్పుడతడు కొడవలితో గొంతుక కోసుకోవడానికి ఉద్యుక్తుడు కాగా, శివుడు ప్రత్యక్షమై అతనిని వారించి కైలాసవాసమిచ్చినాడట.

4. అళియదంగుళినాయనారు

ఇతనికే మహాధనుడనికూడా పేరున్నది. తెనుగు బసవపురాణ, పండితారాధ్యచరిత్రములోను ఈపేరున్నట్లు ఉంది. ఇతడొక శూద్రుడు. ఒకానొక వృద్ధశైవభక్తుడు అర్ధరాత్రివేళ వర్షములో వడవడ వణుకుతు ఆకలితో ఇంటికి రాగా, అతని ఆదరించి ఆఉదయమే పొలములో రాను చల్లిన వడ్లనేరితెచ్చి, దంచి, అన్నమువండిపెట్టి ఆకలితీర్చినాడట. ఆశైవభక్తుడు అన్నముతిని అతడుండిన పాకను కాల్చి తెల్లవారేసరికి అదృశ్యుడైనాడట. పాకను కాల్చిన విషయము పెరియపురాణములో లేదు. ఈ నాయనారి విగ్రహము నంజుడేశ్వరాలయములో లేదు. ఈ అళియదంగుళినాయనారు, ఇదంగళి నాయనారు ఒక్కరేనా? ఇదంగళినాయనారు పేరు పెరియపురాణములో ఉంది. సంస్కృతములో ఇదనికి ఇదంకృషి అనిపేరు. ఇతడొక చోళరాజు. ఇతడు తనధాన్యపుకోట్లలోని ధాన్యము నొకదొంగ ఎత్తుకొనిపోగ వానిని రాజు ఎదుటికి తెచ్చారు. రాజతనిని దండించక తనధాన్యపు కొట్లను, భండారమును శైవవభక్తులు యధేచ్చగ వినియోగించుకోవలసినదని చెప్పి దొంగతనమే అనావశ్యక మయ్యేటట్టు చేసాడు.

5. ఇరువదాండారి

ఇతనికి సాహసప్రియుడని పేరు. ఇతనికి ఇరువత్తుడని పేరున్నది. ఇరువోతు అనేభక్తుడు కూడా ఇతడేనేమో! తమిళములో ఇతనికి ఇరిపత్తునాయనార్, ఇరిభక్త అని, సంస్కృతములో వీరభక్త అనిపేళ్ళు. పండితారాధ్యచరిత్రములో ఇతనిపేరుమాత్రమున్నది. తెలుగు బసవపురాణములో ఇతని కథ: ఇతడు శివద్రోహరగండ బిరుదాంకితుడు. శివద్రోహపాతకులను కారణములేకుండానే చంపుతాననే వ్రతము గలవాడు. ఒకనాడొక భక్తుడు శివపూజార్ధమై పూవులను తీసుకొనిపోతూ ఉండగా ఆఊరి రాజైన కరయూరిచోడనిఏనుగ అతనికెదురై, తొండముతో పైకెత్తి, క్రిందకిపడవైచి దంతములతో పొడిచింది. అతని ఆర్పును ఇరువదాండారి వినివచ్చి ఏనుగును, దానిమావటిని చంపినాడు. రాజీవార్త వినివచ్చి భృత్యాపరాధమునకు స్వామియే దండనక్ర్హుడని తానే ఆత్మవధ కుద్యుక్తుడు కాగా శివుడు ప్రత్యక్షమై రాజునకును, ఇరువదాండారికిని కైలాసప్రాప్తి కలుగజేసినాడు. తమిళ పెరియపురాణములోని కథలో రాజుపేరు పాగళ్చోడుడని ఉంది. పొగళ్చోళునికి మనుచోళుడు, అనపాయచోళుడు అనేవి నామాంతరము లయినట్లు తమిళగ్రంధములవలన తెలుస్తున్నది.

6 ఎళ్పఘ (అభూతచరుడు)

ఇతడెన్నడూ, ఎవ్వరూ చేయదలచుకోని కార్యములను చేసేవాడు కావడముచేత అభూతచరుడని పేరువచ్చిఉంటుంది. ఈపేరుకి దగ్గరగా ఉన్న నాయనారి పేరు తమిళములో ఇహప్పగ అనేది ఉంది. ఇతనికథ బసవపురాణ పండితారాధ్యచరిత్రములలో లేదు. సంస్కృతములో ఇతనికి ఇహికరిపు, స్వభావరిపు అనే పేర్లు ఉన్నాయి.ఇతడొక రాజని, వైశ్యుడని కొన్ని గ్రంథములలో ఉంది. ఒక శాఇవభక్తునికి మనసుకాగా ఇతడు తనభార్యనే అతని కొప్పజెప్పి వెనుదీయలేదనిన్ని, తన బంధువులు వారింపగా వారిలో చాలా మమదిని చంపినడని పెరియపురాణములో ఉంది. ఇతని విగ్రహము నంజుడేశ్వరాలయములో లేదు.

7 ఏణాధినాధుడు

దీనులకు గృహదానము భూమిదానము అభిమతదానము ఇచ్చే భక్తులలో ఇతడొకడని పండితారాధ్యచరిత్రములో వ్రాయబడింది. బసవపురాణములో ఇతని కథ ఈరీతిగ ఉన్నది: ఇత డేలాపురమౌనకు రాజు.దేశములను జయిస్తూ కప్పములను తీసుకుంటూ ఉంటే ఆదేశములవారు ఒక దళవాయిని పంపినారు. ఏణాధినాధుడు అతడిని ఎదుర్కొన్నాడు. కాని అతని భూతి రద్రాక్షధారణమును చూచి ఖడ్గమును విడిచి అతనికాళమీదపడినాడు. వాడూరుకోకుండా ఖడ్గముతో నరుకుతూ ఉంటే 'శివ, శివ' అంటూ ఉండగా అతని కఠములో పూల దండపడినవి. శివుడతనికి ప్రత్యక్షమై అక్షరత్వము నిచ్చాడు.

8. ఓణుమూర్తి

దీనికి ఎణుమూర్తి అని బసవపురాణపాఠము.ఒణుమూర్తియే అణుమూర్తి అయిఉంటాడు.ఇతడే స్కందనాధుడు.ఇతనికథ తమిళపెరియపురాణములో లేదు. బసవపురాణములో ఇతని కథ ఈరీతిగ ఉన్నది: ఇతడు తన ప్రాణలింగమునకు ప్రతిదినము మేలిచందనము అర్పించే వ్రతము కలిగి దానిని ఆచరింస్తూ ఉండగా దగ్గరనున్న ధనము అంతా అయిపోయింది. తన వ్రతమును నిలుపుకొనడానికి అతడు తన మోచేతిని సానమీద నూరి అర్పిస్తే అదే శ్రీచందనమైనది. ఈభక్తికి మెచ్చి శివుడతనిని తనవిమానములో కైలాసమునకు తీసుకొని పోయినాడట. ఇతని విగ్రహము నంజుడేశ్వరాలయములో లేదు.

9 కడమలనంబి

ఇతడు శివునకు నిత్యము వేయి దీపముల వ్రతము కలవాడై ధనము అంతా వెచ్చించి మరేమిన్ని లేకపోగా తనజుట్టుకు నిప్పంటంచుకొని తానే అఖండ దీపముగ వెలిగినాడని బసవపురాణములో ఈతని కథ చెప్పబడియున్నది. ఇతడే పెరియపురాణములో ఉదహరింపబడిన కణ్ణంపాల నాయనారు.దీపదకళియారు కథకూడా ఇటువంటిదే.

10. కన్నప్ప

ఇతడు తెలుగువాడు. ఇతడు శ్రీకాళహస్తివాసుడు. పైన ఇతని కథ వ్రాయబడియున్నది.

11. కరయూరి చోడుడు

ఇతనికే ప్రతాపశురుడనిపేరు.ఇతడె మనుచోళి, అనపాయచోళి, పొగళ్ చోళ అనే పఏర్లు ఉన్నాయి. ఇతడు 12వ శతాబ్దము నాటివాడు.ఇతడు శివశాసనధరులను తన ప్రాణలింగములుగా భావిస్తూ ఉండేవాడు.ఒకనాడీరాజు శత్రువులను చంపి వారి తలలను తేగా ఆతలలలో ఒకటి హరభక్తుని తలవలె జడలతో కనిపించింది.అదిచూచి రాజు తనతలను కోసి ఆతలపై ఉంచగా శివుడతనిని కైలాసమునకు తీసుకుపోయినాడు.ఇదే కొంచెము మార్పులతో పెరియపురాణములో ఉంది.

12 కలగణనాధుడు

ఇతనిపేరు మాత్రము పండితారాధ్యచరిత్రములో పఠింపబడింది.బసవపురాణములో లేదు. పెరియపురాణము ప్రకార మితడు శైవభక్తులకు నిరతాన్నదానము చేసేవాడని, తిరుజ్ఞానసంబంధరుకు సమకాలికుడు.

13. కలికామదేవుడు

ఇతడొక చోళరాజు సేనానాయకుడు. మానకంజనదీశుని అల్లుడు.పరమ శివభక్తుడు.

14. కళియంబ

పెరియపురాణములో ఇతనిపేరు కలికంబ, కలికంప అని ఉంది.ఇతడొకచోళరాజు. ఇతడు కులమును విచారించకుండ, శివభక్తుడైవడైనా సరే కాళ్ళు కడిగి పూజించేవాడు.ఒకనాడితని సేవకుడే శివభక్తులతో కూడి రాగా రాజతని కాళ్ళు కడుగడానికుద్యుక్తుడై భార్యను నీళ్ళుపోయమన్నాడు. ఆమే నిరాకరింపగా అతడామె రెండుచేతులను నరికించి తానే కాళ్ళు కడిగి అందరితో బాటు వానికిన్ని విందుచేసాడు. ఈకథ బసవపురాణము, పండితారాధ్యచరిత్రములోను ఉంది.

15 కారినాయనార్

ఇతనికి కారినాధుడని సంస్కృతపు పేరు. ఇతదు భిక్షాటనము చేసితెచ్చిన ధనముతో చాలా శివాలయములను కట్టించాడు. కారి అనే పేరు బాగుండదనేమో గాని నంజుడేశ్వరాలయములోని విగ్రహమును చెక్కిన శిల్పి అవికారి అనే చక్కని పేరు కల్పించాడు.

16 కాళవ్వ

ఈమెకు కరికాళవ్వ అనికూడా పేరున్నది. తమిళములో కరికాళమ్మొయార్ అని, సంస్కృతములో పూతవతి అని పేరు. శివుడు ఈమ ఇంట మామిడపండుల మరుగున నమలినాడట. పెరియపురాణము ప్రకారము ఈమె వైశ్యస్త్రీ. భర్తతనకిచ్చిన రెండుమామిడిపండ్లను గంపలకొద్దీ పండ్లనుగామార్చి శివుని కారగింపబెట్టినది. శివభక్తిమూలముగా గొప్పశక్తులను సంపాదించింది.

17 కీర్తినాధుడు

ఇతనికి పొగళ్తుణెనాయనారని తమిళపుపేరు. ఇతడు బ్రాహ్మణ శైవభక్తుడు. దేశములో కరవుపట్టి, తిండిలేక బలహీనుడై, లింగమునకు అభిషేకము చేస్తూ, బిందెను మోయలేక లింగముమీద ఎత్తివేసినాడట. దీనికి శివుడు సంతోషించి అతనికి కైలాసవాసమును అనుగ్రహించినాడట.

18. కుత్తువనాయనార్

ఇతనికి కృతాంతకుడని సంస్కృతపుపేరు. నంజుడేశ్వరాలయము విగ్రహముమీద శిల్పి పురాంతక అని చెక్కినాడు. ఇతడొక చోళరాజు. ఇతడు దిగ్విజయముచేసి రాజ్యమును విస్తరింపజేసి రాజ్యములోని బ్రహ్మణులందరినీ ఆహ్వానించి పూర్వచోళరాజుల శైవకిరీటమును తన శిరస్సున నుంచవలసినదని ప్రార్థించగా వారట్లు చేయక దేశమును విడిచి పోయినారు. శివుడే అతనికలలోకివచ్చి ఆకిరీటమును శిరస్సున నుంచినాడట.ఈవిషయము బ్రాహ్మణులకు తెలియగా వారు కేరళనుంచి తిరిగివచ్చి కిరీటమును తామే ఉంచినారట.

19. కులపక్షుడు

ఇతనికి కులబరై నాయనారని తమిళపుపేరు. ఇతడు మధురరాజైఅన కుబ్జపాండ్యునికి మంత్రియై అతనిని శైవునిగా మార్చడానికి తిరుజ్ఞాన సంబంధరుకు తోడ్పడినాడు.

20. కులుచ్చిరియారు

బసవపురాణములో ఇతనిపేరు కులచ్చిరియారు అని ఉంది. పిళ్ళనాయనారు జైనుల నోడించి మధురరాజుకు శివదీక్షనిచ్చి జైనుల నినుపశూలములతో పొడిపించినప్పుడాశూలములను బాగుగా కాల్చి అందిచ్చిన మహాశివభక్తురాలు అని బసవపురాణకథ.ఈతనిపేరు పెరియపురాణములో లేదు. కాని ఈమెయే మంగయక్కరసి. ఈమె సుందరపాండ్యుని భార్య. తన భర్తను శాఇవునిగా చేయుటలో తిరుజ్ఞానసంబంధురకు తోడ్పడినది.

21. కోల్పులి

ఇతని పేరుకు బసవపురాణ పీఠికలో కోళ్వులి అని ఉంది. పెరిఅయపురాణములో ఇతని పేరు కొట్పురినాయనార్, సంస్కృతములో వీరశార్దూలుడు. ఇతడొక చోళరాజుక్రింద మండలేశ్వరుడు. ఇతడు శివభక్తులకోసము గాదెలతో ధాన్యమును నిలువచేసి యుద్ధమునకు పోయియుండగా, అతనిభార్య కరువుపట్టుట వలన ఆధాన్యమును తన బంధువులకు ఉపయోగించింది. అతడు తిరిగి ఇంటికి వచ్చి వృత్తాంతమును తెలుసుకొని భార్య రెండు చేతులను తెగగొట్టించాడు.

22.గుగ్గుళుకళియారు

ఇతడే మానధనుడు. ఇతనికి తమిళములో కుంకుళినాయనార్ అనిపేరు. బసవపురాణములో ఇతని కథ ఇటులున్నది. ఇతడు త్రికాలములలోనూ శివునికి గుగ్గులుధూపము వేసేవ్రతము కలవాడై, ధనమంతా వ్యయముకాగా తనాఅలిమంగళిసూత్రమును కూడా అమ్మివేసినాడు. తిరుపరంధామ అనేపురములో ఉరగేశ్వరలింగముముందర ఉరగ కన్యకలు పాడగా పారవశ్యముచేత లింగము ముందునకు వ్రాలినది. లింగమును సరి చేయటానికెన్నో ప్రయత్నములు జరుపగా చివరికి ఇతడు రాజు దగ్గరకు పోయి తనకు సరిపడ గుగ్గిలము ఇస్తే తను సరిజేస్తానని చెప్పినాడట. రాజొక గుగ్గిలపు రాశినివ్వగా, కళియారొక బట్టను చించి దాని ఒకకొనను లింగమునకు, రెండోకొనను ఖడ్గమునకు కట్టి, ఖడ్గమును మెడమీదపెట్టుకొని వెనుకకు నిగుడడమును చూచి ఆ నాగేశుడు ఈపటివలే లేచాడు.

23. గోనాధుడు

ఇతడే పేరియపురాణములో తెలుపబడిన చొక్క నాయనారు. ఇతడొక అలకాపరి. తన పిల్లనగ్రోవిమీద శివగీతములను పాడుతూ పశువులను మేపేవాడుట.

24. చండేశుడు

ఇతడు బ్రాహ్మణుడు. ఆవులకాపరు ఆవులను హింసించడమును సహించక తానే ఆవులకాపరిగా మారి వాటిని తీసుకొపోయి వాటిపాలను లింగముపై పిండి అభిషేకము చేశ్తూ ఉండేవాడు.ఆవుల కాపురి అతని తలితండ్రులతో మొరపెట్టుకొనగ తండ్రి పోయి చండుని మమదలించాడుట. చండునికి కోపము వచ్చి తండ్రి అని గమనింపక అతని తలనుతెగవేసినాడు. శివుడు మెచ్చుకొన్నాడు.

25. చిరుతొండడు.

ఇతడు సుప్రసిద్ధ శివభక్తుడు. సెట్టికులమువాడు.ఒక చోళరాజు సేనానాయకుడు.పశ్చిమచాళుక్యుల రాజధాని అయిన వాతాపి (బాదామి) దుర్గమును పట్టుకొని, దాని రాజు అయిన రెండవ పులకేశిని తనరాజు కప్పగించాడు. ఇతని కొడుకు శ్రీలాలుడు, లేక సిరియాలుడు. చిరుతొండడు శివుని కోరికమేరకు పసివాడాయిన కొడుకును చంపి అతనిమాంసము నారగింపుచేసాడు. అనిశ్చల భక్తిని మెచ్చి శివుడు సిరియాలుని బ్రదికించి చిరుతొండనుకి కైలాసప్రాప్తి ననుగ్రహించాడు. ఇతనికి సంస్కృతములో భద్రభక్తుడని పేరు. శైవేతరులు వెక్కిరింపుగా ఇతనిని దభ్ర భక్తుడని అంటారు. శైవులున్ను అదేపేరుతో పిలువడమే వింత. నంజుడేశ్వరాలయము విగ్రహముపై ఇతని పేరు ధర్మకేతుడని ఉంది.

26. చిరుత్తాణ

తమిళములో నరసింగనాయనార్ అనిపేరు. సమస్కృతములో రణమిత్రుడని పేరు. నరసింహముని శివభక్తుడయిన రాజనిన్ని, సుందరనంబిని కొడుకుగా పుంచుకున్నాడని తమిళపురాణము చెప్పుచున్నది. పెరియపురాణములో శివభక్తుడుగా తెలుపబడిన కళర్చింగనాయనారు కూడా ఈ నరసింగనాయనారే. ఇతడే కాంచీ పురాధీశుడయిన పల్లవరాజు నరసింహవర్మ. ఇతనికి సింహాంక, పాదసింహ, పంచపాదసింహ అని పేర్లు. ఇతని భార్య శివ నిర్మాల్యమైన పూలదండను చేతితోతీసి మూర్కొనగా ఆదోషమునకు భార్య చేతులను నరకి వేసినాడు.

27 చిరుపులి

తమిళములో శిరుపులి అని, సంస్కృతములో నిరూధశార్దూలుడని ఇతనికి పేర్లు. ఇతడు తన ఇంటికి వచ్చిన శివభక్తులందరికిన్ని నిరతాన్నదానము చేసే వ్రతము గలవాడు.

28. చీరాలదేవుడు

మరియొక పేరు ధర్మకేతనుడు. శైవధర్మస్థాపనకై కేతనిమెత్తుచేత ఇతనికి ఆపేరు వచ్చింది. ఇతడు చిరుతొండని కొడుకు. తండ్రి వలెనే గొప్ప శివభక్తుడును, సేనానాయకుడు, శైవమత విస్తారకుడు.తంజావూరు జిల్లా సన్నిలంతాలూకా తిరుచ్చంగాట్టంగుడి గ్రామములో సీరాలదేవుని మంటపమున్నది. చిరుతొండ డీగ్రామమువాడట. జ్ఞానసంబంధురునకు సమకాలికుడట.చిరుతొండడి విగ్రహము తంజావూరిలో ప్రతిష్ఠింపబడింది.

29 చెన్నయ్య

ఇతడే సత్యార్ధుడై ఉంటాడు. ఈతనిపేరు పండితారాధ్యచరిత్రములో మాత్రము అరువత్తుమూవుర పట్టికలోని కెక్కినది. చెన్నయ్య ఇంటిలో శివుడు పులియంబకళమును జుర్రినాడట.

మూలాలు మార్చు

* భారతి 1946 Vol 23 Issue 5
 
ఆదిభర్త నాయనారు
 
అమరనీతి నాయనారు
 
అరివాళు
 
అళియదంగుళినాయనారు
 
ఎళ్పఘ (అభూతచరుడు)
 
కడమలనంబి
 
కన్నప్ప
 
కారినాయనార్
 
కులపక్షుడు
 
గుగ్గుళుకళియారు
 
చిరుతొండడు
 
చిరుత్తాణ
 
చీరాలదేవుడు