పల్లకి అనగా పురాతన కాలంలో మనుషుల ప్రయాణానికి వాడే సాధనం. దీనికి చక్రాలుండవు. ఇద్దరు లేదా నలుగురు మనుషులు మోస్తారు. చైనా, భారతదేశం, కొరియా, ఇంగ్లండ్ దేశాల చరిత్రలో దీనికి ప్రత్యేకమైన స్థానముంది. పూర్వకాలం రాజకుటుంబీకులు ప్రయాణానికి వీటిని వాడేవారు. క్రీ.పూ 250 సంవత్సరానికి చెందిన రామాయణంలో కూడా పల్లకీ గురించిన ప్రస్తావన ఉంది.

పల్లకి

ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో యుద్ధంలో గాయపడిన సైనికులను గుడారాలను చేర్చడానికి ఒక రకమైన పల్లకీ లను వాడేవారు. ఇంకా జమీందార్లు తమ కూతుళ్ళను అత్తవారింటికి పంపించేటపుడు పల్లకీ పైనే పంపించేవారు. పల్లకీ మోసిన వారిని బోయీలు అంటారు. పల్లకి ఎక్కువ భారంగా ఉంటే వీటిని భుజాల మీద మోస్తారు. ప్రాచీన చైనా దేశంలో పల్లకీలు చాలా పెద్దవిగా ఉండటం చేత వాటిని మోయడానికి సుమారు డజను మంది మనుషులు అవసరమయ్యేవారు.

మోటారు వాహనాలు లేని కాలంలో మహిళలు, ధనవంతులు చిన్న చిన్న దూరాల నుంచి సుదూర ప్రాంతాలకు కూడా వీటిలోనే ప్రయాణించేవారు. ఎక్కువ దూరాలు ప్రయాణించేటపుడు ఒక పల్లకిలో వ్యక్తులను మోసుకెళితే దాని వెనుక మరో పల్లకిలో వారికి కావాల్సిన సామాగ్రిని పట్టుకెళ్ళేవారు. ప్రయాణించే వాళ్ళ అభిరుచులను బట్టి కవులు, గాయకులు, కథకులు, నాట్య కళాకారులు కూడా వీరి వెంట వెళ్ళేవారు. ప్రయాణంలో విసుగు చెందకుండా ఇటువంటి ఏర్పాట్లు చేసుకునేవారు.

వీటికి ఇంధనం అవసరం లేదు. మంచి రోడ్లు అవసరం లేదు. కలుషిత వాతావరణం ఉండదు. ప్రమాదాలు కూడా చాలా తక్కువ. భారతదేశంలోని పల్లకీలు ఎంతో మంది విదేశీ యాత్రికులను ఆకర్షించాయి. డొమింగో పేస్ (సా.శ. 1522) సీజర్ ఫ్రెడరిక్ (1567-68), పీటర్ ముండీ (1632), ఎడ్వర్డ్ టెర్రీ (1652-60), కెప్టెన్ బసిల్ హాల్ (1822) వంటి వారు పల్లకీ ప్రయాణంలో తాము పొందిన ఆసక్తికరమైన అనుభవాలను తమ రచనల్లో పొందుపరచారు. పల్లకీ మోసే బోయీలు చాలా నిజాయితీ పరులుగా, శ్రమజీవులుగా పేర్కొన్నారు. వీరికి మంచి పారితోషికం కూడా లభించేది.ఎటువంటి వాతావరణంలోనైనా, ఎగుడు దిగుడు నేలమీద కూడా వీరు సాఫీగా సాగిపోయేవారని పేర్కొన్నారు. ఇవి మోసే టప్పుడు వీరికి శ్రమ తెలియకుండా ఉండటానికి బృందగానం కూడా చేసేవారు. విజయ నగర సామ్రాజ్యం కాలంలో ఆడవాళ్ళు కూడా అంత:పురం లోపల బోయీలుగా పనిచేసేవారు.[1]

ఇప్పటికీ పురావస్తు ప్రదర్శన శాలల్లో రంగు రంగుల పల్లకీలను సందర్శించవచ్చు. కొన్ని దేవాలయాలు, మఠాలలో వారి పీఠాధిపతులు, మఠాధిపతులు వాడిన పల్లకీలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పల్లకి&oldid=3499622" నుండి వెలికితీశారు