పింగళి వెంకయ్య

స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త.

పింగళి వెంకయ్య, (1876 ఆగష్టు 2 - 1963 జూలై 4), స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.

పింగళి వెంకయ్య
పింగళి వెంకయ్య విగ్రహం
జననం1876 ఆగస్టు 2
మరణం1963 జూలై 4 (వయస్సు 86)
భారతదేశం
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత జాతీయపతాకం rupa kartha

ఉద్యమాలలో పాత్ర మార్చు

19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతన్న రెండవ బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశాడు. గాంధీతో వెంకయ్యకు ఏర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధశతాబ్దం పాటు నిలిచింది.

అభిమాన విషయం మార్చు

ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యనే అభిమాన విషయంగా పెట్టుకొని, దాని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించాడు. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై, నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరిపాడు. 1916లో "భారతదేశానికొక జాతీయ జెండా" అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించాడు. ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్రమంత్రి సర్ బి.ఎన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక రాసాడు.

త్రివర్ణ పతాక ఆవిష్కరణ మార్చు

 
1921 విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ సెషన్‌లో పింగళి వెంకయ్య మహాత్మా గాంధీకి జాతీయ జెండాను అందచేస్తున్న చిత్రరూపం.

1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే, ఒక జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు, సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు.[1]

గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణపతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింప చేస్తుందన్నాడు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.

1947, జూలై 22భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం.

జాతీయ ఉద్యమంలో పాత్ర మార్చు

పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నాడు. వందేమాతరం, హోమ్‌రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమంలాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అతను బెంగుళూరు, మద్రాసులలో రైల్వే గార్డుగా పనిచేశాడు. ఆ తరువాత కొంత కాలం బళ్లారిలో ప్లేగు అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం చేశాడు. వెంకయ్యలో ఉన్న దేశభక్తి అతనిని ఎంతో కాలం ఉద్యోగం చేయనివ్వలేదు. జ్ఞానసముపార్జనాశయంతో లాహోరు లోని ఆంగ్లో - వేదిక్ క‌ళాశాలలో చేరి ఉర్దూ, జపనీస్ భాషలను నేర్చుకున్నాడు. అతను "ప్రొఫెసర్ గోటే" ఆధ్వర్యంలో జపనీస్, చరిత్రలను అభ్యసించాడు.

జెండా వెంకయ్య మార్చు

 
2009లో వెంకయ్య జ్ఞాపకార్థం విడుదల చేసిన భారత తపాలా ముద్ర చిత్రం
 
వెంకయ్య విగ్రహానికి పూలమాల వేస్తున్న వెంకయ్యనాయుడు

ఒక జాతికీ, ఆ జాతి నిర్వహించే ఉద్యమానికీ ఒక పతాకం అవసరమన్న గొప్ప వాస్తవం వెంకయ్యకు 1906 లోనే కలిగిందని అనవచ్చు. కారణం కలకత్తా కాంగ్రెస్‌ సభలు.1916 నుంచి 1921 వరకు ఎంతో పరిశోధన చేశారు. 30 దేశాల పతాకాలను అతను సేకరించాడు. 1918 సంవత్సరం మొదలు, 1921 వరకు జరిగిన కాంగ్రెస్‌ సమావేశాలలో వెంకయ్య జెండా ప్రస్తావన తీసుకువస్తూనే ఉన్నారు. ఆఖరికి కాకినాడ కాంగ్రెస్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు (1921 మార్చి 31) తొలిసారి అతని ఆశ నెరవేరింది. అంతకు ముందు కలకత్తా సమావేశాల సందర్భంగా ఒక పతాకం తయారయింది. దానిని ఆ నగరంలో బగాన్‌ పార్సీ పార్కు దగ్గర ఎగురవేశారు. అందుకే దానిని కలకత్తా జెండా అనేవారు. మేడమ్‌ బైకాజీ కామా, అనిబీసెంట్, సిస్టర్‌ నివేదిత భారత దేశానికి ఒక పతాకాన్ని రూపొందించాలని తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ ఆ అవకాశం వెంకయ్యకు లభించింది. 1921లో గాంధీజీ బెజవాడ వచ్చినప్పుడు వెంకయ్య కలుసుకున్నాడు.

జెండా గురించి ప్రస్తావన వచ్చింది. తన పరిశోధనను, ప్రచురణను వెంకయ్య గాంధీజీకి చూపించాడు. గాంధీజీ కూడా సంతోషించాడు. ఉద్యమానికి అవసరమైన పతాకం గురించి అతను వెంకయ్యకు సూచించాడు. స్థలకాలాలతో సంబంధం లేకుండా అందరినీ ఉత్తేజితులను చేయగలిగిన జెండా కావాలని గాంధీ ఆకాంక్ష. మువ్వన్నెలలో గాంధీజీ తెల్లరంగును, వెంకయ్య కాషాయం ఆకుపచ్చ రంగులను సూచించారు. దీనికి ఆర్యసమాజ్‌ ఉద్యమకారుడు లాలా హన్స్‌రాజ్‌ ధర్మచక్రాన్ని సూచించాడు. ‘‘ఒక జాతికి పతాకం అవసరం. పతాకాన్ని రక్షించుకునే పోరాటంలో లక్షలాది మంది కన్నుమూస్తారు. జెండా విగ్రహారాధన వంటిదే అయినా, చెడును విధ్వంసం చేసే శక్తి ఉంది. బ్రిటిష్‌ వాళ్లు వారి జెండా యూనియన్‌ జాక్‌ను ఎగురవేస్తే అది వారికి ఇచ్చే ప్రేరణ గురించి చెప్పడానికి మాటలు చాలవు.’’ అన్నారు గాంధీజీ. ఆఖరికి ధర్మచక్రంతో కూడిన  త్రివర్ణ పతాకాన్ని 22 జూలై, 1948న జాతీయ పతాకంగా భారత జాతి స్వీకరించింది. అందుకే అతను జెండా వెంకయ్య.

‘మన జాతీయ పతాకం’ పేరుతో యంగ్‌ ఇండియా పత్రికలో గాంధీజీ రాసిన మాటలు ప్రత్యేకమైనవి. ‘‘మన జాతీయ జెండా కోసం త్యాగం చేసేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో పనిచేస్తున్న (అప్పటికి పింగళి అక్కడ అధ్యాపకుడు) పింగళి వెంకయ్య ఒక పుస్తకం ప్రచురించారు. అందులో వివిధ దేశాల జెండాల నమూనాలు ఉన్నాయి. అలాగే మన జాతీయ పతాకం నమూనా ఎలా ఉండాలో కూడా ఆయన సూచించారు. జాతీయ పతాకాన్ని ఖరారు చేయడానికి కాంగ్రెస్‌ సభలలో ఆయన పడిన శ్రమ, తపనలకు నేను అభినందిస్తున్నాను. నేను విజయవాడ వెళ్లినప్పుడు ఆకుపచ్చ, ఎరుపు – ఆ రెండు రంగులతో పతాకాన్ని రూపొందించవలసిందని వెంకయ్యగారికి సూచించాను. పతాకం మధ్యలో ధర్మచక్రం ఉండాలని కూడా సూచించాను. తరువాత మూడు గంటలలోనే వెంకయ్యగారు పతాకం తెచ్చి ఇచ్చారు. తరువాత తెలుపు రంగు కూడా చేర్చాలని భావించాం. ఎందుకంటే ఆ రంగు మన సత్య సంధతకీ, అహింసకీ ప్రతీకగా ఉంటుంది.’’ అని గాంధీజీ తన పత్రికలో రాశారు.

'పత్తి' వెంకయ్య మార్చు

1906 నుండి 1922 వరకు జాతీయోద్యమాలతో పాటు మునగాల పరగణా నడిగూడెంలో జమీందారు రాజా బహదూర్ నాయని రంగారావు కోరిక మేరకు నడిగూడెంలో నివాసముండి పత్తి మొక్కలలోని మేలురకాలు పరిశోధనలో వినియోగించాడు. నడిగూడెంలో వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించాడు. ఈ పరిశోధనలలో కంబోడియా పత్తి అను ఒక ప్రత్యేక రకమైన పత్తి మీద విశేష కృషి చేశాడు. ఇతని కృషిని ఆనాటి బ్రిటీషు ప్రభుత్వం గుర్తించడంతో పత్తి వెంకయ్య అని పేరు వచ్చింది. నడిగూడెంలోనే నేటి ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించి స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి 1921 మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీలలో బెజవాడలోని కాంగ్రెస్ మహాసభలో సమర్పించాడు.

‘డైమండ్’ వెంకయ్య మార్చు

జియాలజీలో పట్టభద్రుడైన అతను ఆంధ్రప్రదేశ్‌లో వజ్రాల తవ్వకాలలో రికార్డు సృష్టించాడు. అందుకే 'డైమండ్ వెంకయ్య' అని పిలిచారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వెంకయ్య నెల్లూరులో స్థిరపడి నవరత్నాల మీద అనేక పరిశోధక వ్యాసాలు రాశాడు. ఈ విషయంలో అతను భారత ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేశాడు. జాతిరత్నాలు, వాటిని పోలి ఉండే రాళ్లు దేశంలో చాలా చోట్ల దొరుకుతాయని అతను చెప్పేవాడు. నెల్లూరు చేరి 1924 నుండి 1944 వరకు అక్కడే ఉంటూ మైకా (అభ్రకం) గురించి పరిశోధన చేశాడు. కొలంబో వెళ్లి సీనియర్‌ కేంబ్రిడ్జ్‌ పూర్తి చేసుకుని వచ్చాడు. భూగర్భశాస్త్రం అంటే అతనికి అపారమైన ప్రేమ. ఆ అంశంలో అతను పీహెచ్‌డీ చేశారు. దీనితో పాటు నవరత్నాల మీద కూడా అధ్యయనం చేశాడు. వజ్రకరూరు, హంపి లలో ఖనిజాలు, వజ్రాలు గురించి విశేషంగా పరిశోధనలు జరిపి ప్రపంచానికి తెలియని ‘‘వజ్రపు తల్లిరాయి’’ అనే గ్రంథం రాసి 1955లో దాన్ని ప్రచురించాడు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ పరిశోధకశాఖ సలహాదారుగా నియమించింది. ఆ పదవిలో అతను 1960 వరకు పనిచేసాడు. అప్పటికి అతని వయస్సు 82 సంవత్సరాలు.

జపాన్ వెంకయ్య మార్చు

ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తరువాత మొదట తీవ్ర జాతీయవాదులతో కలసి బ్రిటిష్‌ రాజ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అప్పుడు అతను ఏలూరులో ఉండేవారు. 1913లో ఒక సందర్భంలో అతను బాపట్లలో జరిగిన సభలో జపాన్‌ భాషలో ప్రసంగించవలసి వచ్చింది. పూర్తి స్థాయిలో అతను ఆ భాషలో ప్రసంగించి ‘జపాన్‌ వెంకయ్య’ అని కీర్తి గడించాడు.

విద్య, శాస్త్రీయరంగాలలో సేవలు మార్చు

వెంకయ్య బందరు లోని జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. వ్యవసాయ శాస్త్రం, చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపుస్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవాడు. అప్పట్లో చైనా జాతీయ నాయకుడైన 'సన్ యత్ సేన్ ' జీవిత చరిత్ర వ్రాశాడు.

ఆఖరి సంవత్సరాలు మార్చు

వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు అతనిని చుట్టుముట్టాయి. మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో అతను చిన్న గుడిసె వేసుకొని దారిద్ర్య జీవితాన్ని గడపవలసి వచ్చింది. అతను ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. జాతీయపతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో, భారత పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని వ్రాశారే కాని, వెంకయ్య పేరుని సూచించకపోవడం విచారకరం. తెలుగువారు తమ వారిని గౌరవించటంలో ఏనాడూ ముందంజవేయలేదు.

జీవితాంతం దేశం కొరకు, స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు 'త్రివేణి' సంపాదకులు భావరాజు నరసింహారావు పేర్కొన్నాడు. అంతిమదశలో విజయవాడలో కె.ఎల్.రావు, టి.వి.ఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 1963 జనవరి 15న వెంకయ్యను సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తరువాత ఆరు నెలలకే 1963, జూలై 4 న వెంకయ్య దివంగతుడయ్యాడు.

కన్నుమూసేముందు అతను చివరి కోరికను వెల్లడిస్తూ "నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక" అన్నాడు.

జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య. అతనిని ప్రజలు మరచిపోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై అతని కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి అతని దర్శన భాగ్యం ప్రజలకు లభింపజేసింది.

కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం మార్చు

వెంకయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకొడుకు పరశురాం జర్నలిస్టుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో పనిచేశాడు. రెండవ కుమారుడు చలపతిరావు సైన్యంలో పనిచేస్తూ చిన్నవయసులోనే మరణించాడు. కూతురు సీతామహలక్ష్మి మాచర్లలో నివసిస్తుంది.[2]

మరణానంతరం జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరాడు. రాష్ట్రంలో 75 వారాల పాటు జరిగే "ఆజాదీ కా అమృత్ మహోత్సవం" ప్రారంభోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్లలో నివసిస్తున్న దివంగత వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని అతను సన్మానించాడు. సీతామహాలక్ష్మికి "ఆజాదీ కా అమృత్ మహోత్సవం" సందర్బంగా ముఖ్యమంత్రి  75 లక్షలు అందజేసి, మరణానంతరం వెంకయ్యకు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశాడు.[2]

విజయవాడలో తిరంగా పరుగు మార్చు

భారత జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య స్మృత్యర్థం విజయవాడలో ఆదివారం 2008 ఫిబ్రవరి 3 న తిరంగా (త్రివర్ణ) పరుగు నిర్వహించారు. సుమారు లక్షమంది ఈ పరుగులో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

మూలాలు మార్చు

  1. "History of Indian Tricolor". Government of India. Archived from the original on 22 May 2011. Retrieved 15 October 2012.
  2. 2.0 2.1 "Andhra Chief Minister Seeks Bharat Ratna Award For Designer Of Indian Flag". NDTV.com. Retrieved 2021-09-30.

వెలుపలి లంకెలు మార్చు