ఫెర్రానియా (ఆంగ్లం FILMferrania), ఇటలీ దేశానికి చెందిన సుప్రసిద్ధ ఫిలిం తయారీదారు. ఫిలిం ఫెర్రానియా 1917 లో స్థాపించబడినది. ఫెర్రానియా ఫిలిం తయారు చేసే కార్మాగారం పేరు Laboratori Ricerche Fotografiche (LRF) అనగా Photo Research Labarotory.[1] ఫెర్రానియా కేవలం ఫిలిం యే కాక, ఫోటోగ్రఫిక్ కాగితం, పరికరాలు, కెమెరాలను కూడా ఉత్పత్తి చేసేది. కాల ప్రవాహంలో ఫెర్రానియా సంస్థ అనేక చేతులు మారింది. డిజిటల్ విప్లవంతో 2009లో మూతబడిన తర్వాత లిగురియాలో ఉన్న కార్మాగారంలో కొన్ని భాగాలను ఉపయోగిస్తూ, మరల ఫిలిం ఉత్పత్తి చేయటానికి దీనిని 2013లో పున:ప్రారంభించారు.

ఫెర్రానియా
తరహా
స్థాపన1923
ప్రధానకేంద్రముకాయిరో మోంటెనేట్, ఇటలీ
పరిశ్రమరసాయనాలు, తయారీ
ఉత్పత్తులుఫిలిం
వెబ్ సైటుhttp://www.filmferrania.it/
1962 లో నెదర్లాండ్స్ లోని మాస్త్రిష్ట్ లోని ఒక బజారు. ఎడమ వైపు ఫెర్రానియా ఫోటో-సినీ అనే హోర్డింగ్ ను చూడవచ్చును

మొత్తం ప్రపంచంలో బ్లాక్ అండ్ వైట్, కలర్ ఫీలిం ల పై పరిశోధన, అభివృద్ధి, స్వంతంగా తయారు చేసే మూడు సంస్థలలో ఫెర్రానియా ఒకటి. కేవలం ఫిలిం మాత్రమే తమ వర్తక సరుకు గా ఉండే సంస్థ, ఫెర్రానియా ఒక్కటే.[2] తాజా ముడిపదార్థాలతోనే ఫెర్రానియా ఫిలిం ను తయారు చేస్తుంది. మిగిలిపోయిన ముడిపదార్థాలను వాడదు. ఇతర బ్రాండుల ఫిలింను కొనుగోలు చేసి వినియోగదారులకు తమ బ్రాండు పేరుతో అమ్మదు. [3]

చరిత్ర మార్చు

 
ఫెర్రానియా ఇన్స్టామ్యాటిక్ ఫిలిం

స్థాపన మార్చు

ఇటలీలోని లిగురియా ప్రాంతానికి చెందిన కారియో మాంటినెట్టి అనే గ్రామంలో బోర్మిడా నది ఒడ్డున, 1882లో పేలుడు పదార్థాలను తయారు చేసే Italian Society of Explosive Products (Società Italiana Prodotti Esplodenti లేదా SIPE) స్థాపించబడింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బాగా విస్తరించి ఫెర్రానియా అనే కుగ్రామంలో క్రొత్త కార్మాగారాన్ని స్థాపించింది.[4] యుద్ధం ముగిసిన తర్వాత పేలుడు పదార్థాల తయారీకి కావలసిన ముడిపదార్థాలు భారీ ఎత్తున మిగిలిపోవటం, అప్పటి ఫోటోగ్రఫిక్ ఫిలిం తయారీకి ఇవే ముడిపదార్థాలు వినియోగించబడుతూ ఉండటంతో SIPE ఐరోపా ఖండంలో ఫోటోగ్రఫిక్ పరికరాలను తయారు చేసే, ఫ్రాన్సు కు చెందిన పాథే సోదరులతో చేతులు కలిపి, Italian Fabrication and Lamination - Milan (Fabbrica Italiana Lamine Milano లేదా FILM) అని పేరును మార్చుకొంది. 1920 లో ఫిలిం ను తయారు చేసి పరీక్షించటం జరిగింది కానీ ఆర్థికంగా లాభాలను ఆర్జించలేకపోయింది. ఆశలు వదులుకొని పాథే సోదరులు Credito Italiano అనే బ్యాంకుకు తమ వంతు షేర్లను అమ్మివేశారు. అప్పటికే నష్టాలలో కూరుకుపోయిన, మిలాన్ కు చెందిన ఫోటోగ్రఫిక్ ప్లేట్ ల తయారీదారు క్యాపెల్లీ (Capelli) ని కూడా క్రెడిటో ఇటాలియానో సొంతం చేసుకొంది.

లాభాల బాట పట్టిన ఫెర్రానియా మార్చు

ప్యాథే సోదరుల ప్రక్కకు తప్పుకొన్న తర్వాత 1923లో సంస్థ యొక్క నూతన యాజమాన్యం ఫిలిం అమ్మకాల పెరుగుదలకు బాగా కృషి చేసింది. తొలుత కలిగే నష్టాలను ఖాతరు చేయకుండా ఫిలిం ధరలను తగ్గించింది. అటు పిమ్మట ఫిలిం తయారీకి అయ్యే ఖర్చును తగ్గేలా చూసుకోవటం తో ఫిలిం అమ్మకాలు పెరిగాయి.

1924లో Leica కెమెరాల ఆగమనం ఫోటోగ్రఫిక్ ప్లేట్ లకు చరమగీతం పాడటంతో FILM Ferrania రొట్టె విరిగి నేతిలో పడింది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొంటూ ఎక్స్-రే, 16mm సినిమా, 35mm/120 ఫిల్మ్ వంటి పలు ఫార్మాట్ లలో ఫిలిం తయారీ/అమ్మకాలు చేసింది.

కెమెరాల తయారీ మొదలు పెట్టిన ఫెర్రానియా మార్చు

1932లో మిలాన్ కు చెందిన ఫోటోగ్రఫిక్ ప్లేట్ తయారీదారు క్యాపెల్లీ (Capelli) ని సొంతం చేసుకొని, క్యాపెల్లీ-ఫెర్రానియా గా చెలామణి అయ్యింది. 1936 నుండి మిలాన్ కార్మాగారంలో కెమెరాల తయారీ మొదలైంది. 1938 నాటికి మరల ఫెర్రానియా చేతులు మారింది. టెన్సీ అనే మరో ఫోటోగ్రఫిక్ ప్లేట్ తయారీదారును కూడా సొంతం చేసుకొని FILM Ferrania నుండి మరల Ferrania గా మారింది. క్యాపెల్లీ తో ఉన్న సంబంధం కనుమరుగైంది.

మార్పు అభిరుచులకు, కళావధులకే; ఫెర్రానియాకు కాదు మార్చు

 
సినిమాను, ఫోటోగ్రఫీని ఉర్రూతలూగించిన ఫెర్రానియా P30 ఫిలిం

30వ దశకం నుండి, 40వ దశకం వరకూ, ఇటలీలోని ఫాసిస్టు ప్రభుత్వం, అక్కడి సర్వతంత్ర సార్వభౌమాధికారం ఫెర్రానియా తప్ప మరే ఇతర ఫిలిం కు చోటు ఇవ్వలేదు. ఆ కాలంలో నిర్మించే చలనచిత్రాలు నమ్మశక్యం కానంత అనుకూలంగా, అధిక నిర్మాణ విలువలతో, కాల్పనిక పాత్రల కలిగి ఉండి నిర్మించబడేవి.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945 నుండి ఫెర్రానియా బాగా విస్తరిస్తూ, చాలా ప్రజాదరణ పొందింది. నవతరం దర్శకులు ముక్కుసూటిగా, పట్టణ వాతావరణానికి అద్దం పడుతూ ఉండే నియోరియలిజం అనే శైలికి దగ్గరయ్యారు. వీరికి వేరే గత్యంతరం లేక కాదుగానీ, ఫెర్రానియా పై చలనచిత్రం ఆవిష్కృతమయ్యే తీరు వీరికి నచ్చి, దానికే అంటిపెట్టుకున్నారు.

50/60వ దశకాలలో సైతం సినీ దిగ్గజాలు ఫెర్రానియా పైనే చలన చిత్రాలు చిత్రీకరించారు. తరాలు మారినా, అభిరుచులు మారినా, కళావధులు మారినా, భావజాలాలు మారినా, ఫెర్రానియా మాత్రం మారలేదు.

P30 ఫిలిం మార్చు

60వ దశకం నుండి ఫెర్రానియా యొక్క బ్లాక్ అండ్ వైట్ ఫిలిం P30కి అంతర్జాతీయ గిరాకీ ఏర్పడింది. సోఫియా లోరెన్ వంటి నటీమణుల అందచందాలు, విట్టోరియో డి సికా వంటి ఇటాలియన్ దర్శకుల చేతులలో P30 ఫిలింపై హాలీవుడ్లో చిత్రీకరించిన చలనచిత్రాలకు అకాడమీ అవార్డుల పంటలు పండాయి. Two Women, Bicycle Thieves, వంటి చిత్రాలు P30పై అద్భుతంగా ఆవిష్కృతమై, సినీ చరిత్రలోనే మైలురాళ్ళుగా మిగిలిపోయాయి. [5]

ఫెర్రానియా కలర్ మార్చు

 
ఫెర్రానియా కలరి స్లైడ్ ఫిలిం

ఒక ప్రక్క మొట్టమొదటి కలర్ ఫిలిం 'ఫెర్రానియా కలర్' 1952 లో విడుదల చేయబడినను, ఛాయాగ్రాహక నిర్దేశకులు దీని పై పెదవి విరిచారు. అదివరకు ఫిలింలో గల సున్నితత్త్వం కలర్ ఫిలిం పై లేదని వారు అభిప్రాయపడ్డారు. కలర్ ఫిలింలో ఆగ్ఫా, కొడాక్ ల స్థాయి నాణ్యతా ప్రమాణాలను చేరుకోవటానికి ఫెర్రానియాకు దశాబ్దాలే పట్టింది.

60వ దశకానికి ఫెర్రానియా సినిమాకు, ఫోటోగ్రఫీకి పర్యాయపదంగా మారిపోయింది. ప్రతి ఇటాలియన్ ఇంటిలో Olivetti టైపురైటర్, Fiat కారు, ఎంత సాధారణమో; ఫెర్రానియా కెమెరా, ఫిలిం లు అంతే సాధారణమయ్యాయి.

ఫెర్రానియా 3M సొంతం మార్చు

1964 లో 3M అనే సంస్థ ఫెర్రానియాను సొంతం చేసుకొని ఫెర్రానియా-3M గా పేరు మార్చుకొంది. ఫోటోగ్రఫీలో పరిశోధనలు, ఫోటోగ్రఫిక్ పరికరాల ఆధునికీకరణ, సిబ్బందికి శిక్షణ ఇప్పించటానికి ఒక భవనం నిర్మించింది. ఇదే LRF భవనం. 1983 లో అత్యధిక ఫిలిం వేగం గల కలర్ స్లైడ్ ఫిలిం ను కనుగొంది. ఈ ఆవిష్కరణ, ఎప్పటికీ ఒక మైలురాయే. ఎక్స్-రే ఫిలిం యొక్క నాణ్యతతో 3M పెంచిన ప్రమాణాలు, దాని వినియోగంలో సౌలభ్యాన్ని తీసుకువచ్చాయి. LRF భవనం మరింత విస్తరించింది.

అమెరికా లో చుక్కెదురు మార్చు

3M అప్పటికే పలు ఇతర బ్రాండులతో ఫిలిం ను విక్రయిస్తూ ఉండేది. చక్కని సాంకేతికత, విద్యాధికులైన మంచి ఉద్యోగులు ఉన్ననూ, అమెరికాలో అప్పటికే వేళ్ళూనుకొన్న కొడాక్ ను మాత్రం 3M ఢీ కొనలేకపోయింది. గోరుచుట్టు పై రోకటిపోటు అన్నట్లు, బ్రిటన్ కు చెందిన ఇల్ఫోర్డ్, జపాన్ కు చెందిన ఫూజీఫిల్మ్, జర్మనీకి చెందిన ఆగ్ఫా లు తమ తమ ఫిలిం లతో అమెరికా ను ముంచెత్తాయి. అయినా 3M 90వ దశకం వరకు పలు ఇతర బ్రాండులకు తమ ఫిలిం ను సరఫరా చేసేది.

జూలై 2008 లో కలర్ ఫిలిం తయారీని ఆ ఏడాది తర్వాత తాము నిలిపివేస్తున్నామని ఫెర్రానియా తెలిపినను, మార్చి 2009 వరకు తయారీ కొనసాగినట్లు కంపెనీ యొక్క వినియోగదారుల సేవా విభాగం తెలిపింది. 2010 నాటికి కార్మాగారం మూసివేయబడింది. అక్టోబరు 2012లో ఫెర్రానియా లో ఉన్న 230 ఉద్యోగులలో 198 తొలగించబడ్డారు.

ఫెర్రానియాకు చావుదెబ్బ మార్చు

14 నవంబరు 1995 న 3M సంస్థ పునర్నిర్మాణాన్ని ప్రకటించటంతో ఫెర్రానియాకు చావుదెబ్బ తగిలింది. ఫిలిం విభాగాన్ని ఇమేషన్ (Imation) కు తరలించటం తో ఫెర్రానియాతో వినియోగదారుడి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఇమేషన్ కూడా 1999 వరకే మనగలిగింది. మరొక పెట్టుబడుల సంస్థలు ఇమేషన్ అమ్ముడుపోయినా, డిజిటల్ ఫోటోగ్రఫీ అప్పటికే ప్రజలలోకి చొచ్చుకుపోయింది. లోమోగ్రఫీ, కొనికా వంటి సంస్థలకు ఫెర్రానియా ఫిలిం ను విక్రయిస్తూనే ఉన్నా, ఐ-ఫోన్ రాకతో ప్రజలలో ఫిలిం పై ఆసక్తి పూర్తిగా చచ్చిపోయింది.

ఫార్మసీ, సోలార్ ప్యానెల్ విభాగాలు లాభాలను గడిస్తున్నా, ఫిలిం విభాగం మాత్రం నత్తనడకన సాగింది. చివరకు 2010లో ఫిలిం విభాగం యొక్క తలుపులకు తాళం వేయబడించి.

ఇటాలియన్ ప్రభుత్వం అప్పటి నుండి రెండేళ్ళు, LRF భవనాన్ని కాపాడుకొంది. అందులోని సామాగ్రి దొంగల బారిన పడకుండా జాగ్రత్తపడింది.

FILM Ferrania ఒక నూతన శకం మార్చు

2011లో సినీ రంగానికి చెందిన నికోలా బాల్డినీ, మార్కో పాగ్నీ 8mm, 16mm మోషన్ పిక్చర్ లను తయారు చేయాలని నిర్ణయించుకొన్నారు. కానీ దీనికి కావలసిన ముడి పదార్థాలు వారికి లభ్యం కాలేదు. యాదృచ్చికంగా ఫ్లారెన్స్ లోని Alinari Museum of Photography లో ఫెర్రానియా సమర్పించిన ఫిలింకు రంధ్రాలు చేసే యంత్రం వారికి కనబడింది. దానిపైన 86 అని ముద్రించి ఉండటంతో, కనీసం 85 యంత్రాలు ఇంకెక్కడో ఉన్నాయని వారు నిర్ధారించుకొన్నారు.[6] ఫెర్రానియా కార్మాగారానికి ఫోను చేసిననూ ఎవరూ దానిని ఎత్తకపోవటంతో, ఆపసోపాలు పడి అక్కడికి చేరుకొన్నారు. కానీ ఫ్యాక్టరీ మూసి ఉంది.

పాత కాలం సినిమాల నిర్మాణం పై డాక్యుమెంటరీ తీస్తున్నామన్న నెపంతో చుట్టుప్రక్కల వారిని అందరినీ కదిలించి, ఫెర్రానియా కార్మాగారంలో మిగిలి ఉన్న సామాను విక్రయించటానికి నియమించబడ్డ నిర్వాహకుడిని కలుసుకొన్నారు. స్థానికులు, ఫెర్రానియా తిరిగి పనిచేయాలనే ఎప్పటికీ కోరుకోవటంతో బాల్డినీ, పాగ్నీలకు ఫ్యాక్టరీ పునర్నిర్మాణం లో పూర్తి సహకారం లభించింది.

2013లో ఫిలిం తయారీ విభాగాన్ని సొంతం చేసుకొన్న మిత్రద్వయం FILM Ferrania s.r.l పేరుతో ఫెర్రానియా తయారీ పరికరాలను, LRF భవనాన్ని, 2012 లో తొలగించబడ్డ ఉద్యోగులను సమిష్టిగా పనిలో పెట్టారు. చలనచిత్ర రంగానికి వినియోగించే మోషన్ పిక్చర్, ఛాయాచిత్రాలకు కావలసిన ఫోటోగ్రఫిక్ ఫిలిం ను తయారు చేయటం మొదలు పెట్టింది. చారిత్రక ఫోటోగ్రఫిక్ కలర్ ఫిలింలు అయిన 'Solaris FG-100 Plus' (నెగిటివ్), 'Scotch Chrome 100' (స్లైడ్) లను మరల ఉత్పత్తి చేసే ఆలోచన ఉన్నట్లు ఫిలిం ఫెర్రానియా తెలిపింది. నూతన సంస్థ యొక్క ఉన్నతాధికారి నికోలా బాల్డిని ఒక ముఖాముఖిలో చారిత్రక ఫెర్రానియా P30 ను కూడా మరల ఉత్పత్తి చేసే ఆలోచన తమకు ఉన్నట్లు స్పష్టం చేశారు.

పునర్నిర్మాణానికి నిధులు కోరిన ఫెర్రానియా, ఎగబడి విరాళాలను ఇచ్చిన ఫిలిం ప్రేమికులు మార్చు

సెప్టెంబరు 2014 లో 100 MORE YEARS OF ANALOG FILM (ఫిలిం మరో వందేళ్ళు జీవించుగాక!) అనే ప్రచారాన్ని నిర్వహించింది. ఈ ప్రచారం ద్వారా ఫిలిం తయారీ పునర్వవస్థీకరణకు తొలి అడుగుగా అవసరమయ్యే సామాగ్రిని కొనటానికి $ 2,50,000 విరాళాలను కోరింది.[7] ఫిలిం ప్రేమికులు ధారాళంగా విరాళాలు ఇవ్వటంతో $ 3,22,420 సమకూరాయి.[8] దాతలకు కృతజ్ఙతగా మొదట తయారయ్యే ఫిలిం లు అందజేయబడతాయని ఫిలిం ఫెర్రానియా ప్రకటించింది.

P30 పునరాగమనం మార్చు

1 ఫిబ్రవరి 2017 న ఫిలిం ఫెర్రానియా తాము మరల తయారు చేసిన P30 ని పరీక్షకై ప్రవేశపెట్టింది. వినియోగదారుల అభిప్రాయ సేకరణ తర్వాత దానిని మరింత అభివృద్ధి చేయటానికి నడుం కట్టింది.[9] P30 ISO 80 ఫిలిం వేగం కలిగి ఉన్న బ్లాక్ అండ్ వైట్ మోషన్ పిక్చర్ ఫిలిం అని, 60వ దశకంలో దీనిని స్టిల్ ఫోటోగ్రఫీకి కూడా ఉపయోగించటం జరిగిందని ఫెర్రానియా తమ వెబ్-సైటులో పేర్కొంది. సినిమా శైలిలో ఫోటోలు రావటం, ఫిలిం గ్రెయిన్ బహుతక్కువగా ఉండటం, సిల్వర్ పాళ్ళు ఎక్కువగా ఉండటం వలన ఒక ప్రత్యేక శైలిలో ఫోటోలు వస్తాయని ఆధునిక అనలాగ్ ఫిలిం విపణిలో ఇటువంటి ఫిలిం లేదని ఫెర్రానియా స్పష్టం చేసింది. [10]

LRF ని పూర్తిగా సొంతం చేసుకొన్న ఫెర్రానియా మార్చు

16 ఆగస్టు 2018 న ప్రభుత్వం చేతిలో ఉన్న LRF భవనం ఫెర్రానియా కు పూర్తిగా సొంతం అయ్యింది. [11]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. LRF పూర్తి పేరు
  2. ఫిలిం ఫెర్రానియా - About వెబ్ సైటు
  3. ఫిలిం తయారీలో ఎక్కడా రాజీపడని ఫెరానియా
  4. ఫెర్రానియా చరిత్ర[permanent dead link]
  5. P30 ఫిలిం పై చిత్రీకరించిన చలనచిత్రాలకు ఆస్కార్ పంట
  6. 86వ యంత్రం
  7. తొలి అడుగుగా విరాళాలు కోరిన ఫిలిం ఫెర్రానియా - Kickstarter వెబ్ సైటు
  8. అవసరమయ్యే నిధులకు మించి దానం చేసిన ఫిలిం ప్రేమికులు
  9. P30 పునరాగమనం
  10. P30 లక్షణాలను తెలిపిన ఫెర్రానియా
  11. LRF భవనాన్ని సొంతం చేసుకొన్న ఫెర్రానియా