బాల్టిక్ దేశాలు

బాల్టిక్ సముద్రానికి తూర్పు తీరాన ఉన్న 3 దేశాలు -ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా

బాల్టిక్ దేశాలు లేదా బాల్టిక్ రాజ్యాలు, ఆధునిక అనధికారిక భౌగోళిక రాజకీయ పదం. బాల్టిక్ సముద్రపు తూర్పు తీరాన ఉన్న ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా అనే మూడు సార్వభౌమ దేశాలను కలిపి బాల్టిక్‌ దేశాలు అంటారు. వీటిని "బాల్టిక్ రిపబ్లిక్లు", "బాల్టిక్ ల్యాండ్స్" లేదా బాల్టిక్స్ అని కూడా అంటారు. ఈ పదాన్ని సాంస్కృతిక ప్రాంతాలు, జాతీయ గుర్తింపు లేదా భాష సందర్భంలో వాడరు. ఎందుకంటే లాట్వియా, లిథువేనియాలో ఎక్కువ మంది ప్రజలు బాల్టిక్ ప్రజలు కాగా, ఎస్టోనియాలో ఎక్కువ మంది ఫిన్నిక్ ప్రజలు. [1] మూడు ప్రభుత్వాలూ పరస్పర సహకారంతో ఉంటాయి. విదేశీ విధానం, భద్రతా విధానం, రక్షణ, ఇంధన, రవాణా రంగాల్లో వీటి మధ్య సహకారం ఉంటూ ఉంటుంది. [1]

బాల్టిక్ దేశాలు
దేశాలు Estonia (blue)
 Latvia (red)
 Lithuania (yellow)
Time zones

మూడు దేశాలూ నాటో, యూరోపియన్ యూనియన్, యూరోజోన్, OECD లలో సభ్యులుగా ఉన్నాయి. ఎస్టోనియా 2020, 2021లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యురాలు. ప్రపంచ బ్యాంకు ఈ మూడింటిని అధికాదాయ ఆర్థిక వ్యవస్థలుగా వర్గీకరించింది. వీటిలో మానవ అభివృద్ధి సూచిక చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. [2]

ప్రపంచ బ్యాంకు మూడు బాల్టిక్ దేశాలనూ అధిక-ఆదాయ ఆర్థిక వ్యవస్థలుగా వర్గీకరించింది. వీటి మానవ అభివృద్ధి సూచిక చాలా ఎక్కువ. [3]మూడు ప్రభుత్వాల మధ్య ప్రభుత్వ, పార్లమెంటరీ స్థాయిలో పరస్పర సహకారం ఉంది. విదేశీ, భద్రతా విధానం, రక్షణ, ఇంధనం, రవాణాలో కూడా వీటి మధ్య తరచుగా సహకారం ఉంది.[4]

చరిత్ర మార్చు

సారాంశం మార్చు

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, రష్యన్ సామ్రాజ్యం నుండి స్వాతంత్ర్యం పొందిన బాల్టిక్ సముద్ర తీరం లోని దేశాలను "బాల్టిక్ రాష్ట్రాలు" అనే పదం సూచిస్తుంది. ఈ పదంలో ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా లు భాగం. మొదట్లో ఫిన్లాండ్‌ను కూడా ఇందులో చేర్చినప్పటికీ, ఆ తరువాత దాన్ని నార్డిక్ దేశాలలో చేర్చారు.

బాల్టిక్ రాష్ట్రాల ఉనికిలో వివిధ ప్రాంతీయ, సామ్రాజ్య పాలనలను చూసాయి. 18వ శతాబ్దంలో రష్యన్ సామ్రాజ్యం విస్తరించినప్పుడు వారు మొదటిసారిగా దాని పాలనలోకి చేరాయి. ఎస్టోనియా, లాట్వియా భూభాగాలను స్వీడన్ విడిచిపెట్టింది. 1721లో గ్రేట్ నార్తర్న్ యుద్ధం ముగింపులో రష్యన్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. అయితే ఇప్పుడు లిథువేనియాలో ఉన్న చాలా భూభాగం 1795 లో పోలాండ్ దేశపు మూడవ విభజన తర్వాత రష్యన్ పాలనలోకి వచ్చింది. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం చివరి దశ వరకు ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియాలు తమ సార్వభౌమాధికారాన్ని పొందే వరకు బాల్టిక్ దేశాలలోని పెద్ద భాగాలు రష్యన్ సామ్రాజ్యంలో ఉండేవి. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకూ ఈ మూడు దేశాలు స్వతంత్రంగానే ఉన్నాయి. 1940లో, మూడు దేశాలు స్టాలినిస్టు సోవియట్ యూనియన్‌ ఆక్రమించింది. 1941లో నాజీ జర్మనీ లిథువేనియా, లాట్వియా, ఎస్టోనియా లను ఆక్రమించింది. 1944-1945లో రెడ్ ఆర్మీ తిరిగి వీటిని ఆక్రమించి 1991 వరకు మూడు దేశాలపై సోవియట్ యూనియన్ రాజ్యం చేసింది. బాల్టిక్ దేశాలలో సోవియట్ పాలన 1989-1991లో ముగిసింది, మూడు దేశాల కొత్తగా ఎన్నికైన పార్లమెంటులు సోవియట్ ఆక్రమణను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాయి. 1991 ఆగస్టులో మూడు దేశాల స్వాతంత్ర్యాన్ని పూర్తిగా పునరుద్ధరించడంతో ఇది ముగిసింది.

సోవియట్, జర్మన్ ఆక్రమణలు, 1940-1991 మార్చు

 
1939 నవంబరులో ఉత్తర ఐరోపాలో భౌగోళిక రాజకీయ స్థితి [5]

1939 నాటి మోలోటోవ్-రిబ్బన్‌ట్రాప్ ఒప్పందంలోని రహస్య ప్రోటోకాల్‌కు అనుగుణంగా, సోవియట్ సైన్యం 1939 సెప్టెంబరులో తూర్పు పోలాండ్‌పై దాడి చేసింది. స్టాలినిస్ట్ సోవియట్ ప్రభుత్వం ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియాలను లొంగదీసుకుంది. జర్మనీ సోవియట్‌ల మధ్య కుదిరిన పరస్పర సహకార ఒప్పందాలకు అనుగుణంగా ఈ దేశాలలో సైనిక స్థావరాలను స్థాపించే హక్కు సోవియట్ యూనియన్ కు దక్కింది. 1940 జూన్‌లో ఎర్ర సైన్యం, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా భూభాగాలన్నింటినీ ఆక్రమించి, కొత్త సోవియట్ అనుకూల తోలుబొమ్మ ప్రభుత్వాలను స్థాపించింది. 1940 జూలైలో మూడు దేశాల్లోనూ ఏకకాలంలో, రిగ్గింగ్ ఎన్నికలు (స్టాలినిస్ట్ అనుకూల అభ్యర్థులు మాత్రమే పోటీ చేయడానికి అనుమతించబడ్డారు) నిర్వహించారు. మూడు దేశాల్లో కొత్తగా సమావేశమైన "పార్లమెంట్లు" సోవియట్ యూనియన్‌లో చేరడానికి ఏకగ్రీవంగా దరఖాస్తు చేసుకున్నాయి. ఇవి 1940 ఆగష్టులో ఎస్టోనియన్ SSR, లాట్వియన్ SSR, లిథువేనియన్ SSR లుగా సోవియట్ యూనియన్‌లో విలీనమయ్యాయి.

బాల్టిక్స్‌లో ఆ తర్వాత అణచివేతలు, మరణశిక్షలు, సామూహిక బహిష్కరణలు జరిగాయి. [6] [7] బహిష్కరణలు, రష్యన్ భాషను మాత్రమే పని భాషగా స్థాపించడం వంటి మార్గాల ద్వారా సోవియట్ యూనియన్, ఈ ఆక్రమిత భూభాగాలను సోవియటీకరణ చేయడానికి ప్రయత్నించింది. 1940 - 1953 మధ్య, సోవియట్ ప్రభుత్వం బాల్టిక్స్ నుండి 2,00,000 కంటే ఎక్కువ మందిని సోవియట్ యూనియన్‌లోని మారుమూల ప్రాంతాలకు బహిష్కరించింది. అదనంగా, కనీసం 75,000 మంది గులాగ్‌లకు పంపింది. వయోజన బాల్టిక్ జనాభాలో సుమారు 10% మంది బహిష్కృతులయ్యారు లేదా లేబర్ క్యాంపులకు పంపబడ్డారు. [8]

బాల్టిక్ దేశాలపై 1941లో నాజీ జర్మన్ దాడి చేయడంతో ఇక్కడ సోవియట్ ఆక్రమణకు అంతరాయం కలిగింది. ప్రారంభంలో, చాలా మంది ఎస్టోనియన్లు, లాట్వియన్లు, లిథువేనియన్లు జర్మన్ సైన్యాన్ని తమ విముక్తిదారులుగా భావించారు. అయితే మూడు దేశాల ప్రజలూ తమ స్వాతంత్ర్య పునరుద్ధరణ జరుగుతుందని ఆశించారు. కానీ నాజీ జర్మన్ ఆక్రమణదారులు రీచ్‌స్కామిస్సరియట్ ఓస్ట్‌లాండ్ అని పిలువబడే పౌర పరిపాలనను స్థాపించారు. ఆక్రమణ సమయంలో నాజీ అధికారులు లిథువేనియా, లాట్వియాల్లో యూదు జనాభాపై ఘెట్టోయిజేషన్లు, సామూహిక హత్యలూ చేశారు. [9] 1,90,000 మందికి పైగా లిథువేనియన్ యూదులను (యుద్ధానికి పూర్వం లిథువేనియాలో ఉన్న యూదుల్లో 95%), 66,000 మంది లాట్వియన్ యూదులనూ హత్య చేసారు. 1944 చివరిలో ఆ దేశాలను మళ్ళీ రెడ్ ఆర్మీ ఆక్రమించేంత వరకు జర్మను ఆక్రమణ కొనసాగింది. యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ ల పరోక్ష ఆమోదంతో ఆ దేశాల్లో తిరిగి సోవియట్ పాలన మొదలైంది.

వ్యవసాయాన్ని బలవంతంగా సమష్టిగా చెయ్యడం 1947లో ప్రారంభమైంది. 1949 మార్చిలో సామూహిక బహిష్కరణ తర్వాత పూర్తయింది. ప్రైవేట్ పొలాలను జప్తు చేసారు. రైతులను సామూహిక పొలాలలో చేర్చారు. మూడు దేశాలలో ఉన్న లాట్వియన్ జాతీయ పక్షపాతులు, లిథువేనియన్ పక్షపాతులు (అందరినీ కలిపి ఫారెస్ట్ బ్రదర్స్ అని అంటారు) తమ దేశాల స్వాతంత్ర్యాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో తదుపరి ఎనిమిది సంవత్సరాలు సోవియట్ ఆక్రమణకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధాన్ని చేసారు. అది సఫలం కాలేదు. సోవియట్ వ్యతిరేకుల సాయుధ ప్రతిఘటన 1953 వరకు కొనసాగింది. సాయుధ ప్రతిఘటన ఓడిపోయినప్పటికీ, జనాభా మాత్రం సోవియట్ పాలనకు వ్యతిరేకంగానే ఉండేది.

 
డౌన్ టౌన్ టాలిన్

యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, NATO, అనేక ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలూ లిథువేనియా, లాట్వియా, ఎస్టోనియాలను సోవియట్ ఆక్రమణలో ఉన్నట్లు పరిగణించాయి. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, లిథువేనియా, లాట్వియాలు వాషింగ్టన్ DCలో రాయబార కార్యాలయాన్ని నిర్వహించగా, ఎస్టోనియాకు న్యూయార్క్ నగరంలో ఒక కార్యాలయం ఉండేది. ఈ కార్యాలయాల్లో సిబ్బందిగా, సోవియట్ యూనియన్ ఆక్రమణకు ముందు నాటి ప్రభుత్వాలలో పనిచేసిన దౌత్యవేత్తలే ఉండేవారు.

స్వాతంత్ర్య పునరుద్ధరణ మార్చు

1980ల చివరలో, సోవియట్ పాలనకు వ్యతిరేకంగా భారీ యెత్తున పౌర ప్రతిఘటన ప్రారంభమైంది. దీనిని గాన విప్లవం అంటారు. 1989 ఆగస్టు 23 న, బాల్టిక్ వే అనే పేరుతో ఇరవై లక్షల మందితో కూడిన మానవ గొలుసు, టల్లిన్ నుండి విల్నియస్ వరకు 600 కి.మీ. దూరం మేర ఏర్పాటు చేసారు. ఈ ప్రచారం నేపథ్యంలో, బాల్టిక్ రిపబ్లిక్‌ల నిష్క్రమణ "అనివార్యమైంది" అని గోర్బచేవ్ ప్రభుత్వం అంతర్గతంగా నిర్ధారించింది. ఈ ప్రక్రియ సోవియట్ యూనియన్ కూలిపోవడానికి దోహదపడింది. ఇతర సోవియట్ రిపబ్లిక్‌లు సోవియట్ యూనియన్ నుండి విడిపోవడానికి ఒక ఉదాహరణగా నిలిచింది. సోవియట్ యూనియన్ 1991 సెప్టెంబరు 6 న మూడు బాల్టిక్ రాష్ట్రాల స్వాతంత్య్రాన్ని గుర్తించింది. 1993 ఆగస్టు నుండి, ఈ ప్రాంతం నుండి (లిథువేనియాతో మొదలుపెట్టి) దళాలను ఉపసంహరించింది. 1994 ఆగస్టులో ఆఖరి రష్యన్ సేనలు అక్కడి నుండి వెళ్ళిపోయాయి. బాల్టిక్స్‌లో ఉన్న స్క్రుందా-1, అనే చివరి రష్యన్ సైనిక రాడార్, 1998 ఆగస్టులో అధికారికంగా కార్యకలాపాలను నిలిపివేసింది.

ఆర్థిక వ్యవస్థలు మార్చు

 
డౌన్ టౌన్ రిగా

రాజకీయ మార్పులు ప్రజాస్వామ్య పరివర్తనకు సమాంతరంగా, ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా చట్టం ద్వారా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలుగా రూపాంతరం చెందాయి. బడ్జెట్ నియమాలు, జాతీయ ఆడిట్, జాతీయ కరెన్సీ, సెంట్రల్ బ్యాంక్ వంటి ప్రధానమైన స్థూల ఆర్థిక కారకాలను ఏర్పాటు చేయడం లేదా పునరుద్ధరించడం జరిగింది. త్వరలోనే ఆ దేశాలు అధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగం, తక్కువ ఆర్థిక వృద్ధి, అధిక ప్రభుత్వ రుణం తదితర సమస్యలను ఎదుర్కొన్నాయి. 2000 నాటికి ద్రవ్యోల్బణం రేటు 5% కంటే తక్కువకు పడిపోయింది. ఈలోగా, ఈ ఆర్థిక వ్యవస్థలు స్థిరపడి, 2004లో అవన్నీ యూరోపియన్ యూనియన్‌లో చేరాయి. వారికి కొత్త స్థూల ఆర్థిక అవసరాలు తలెత్తాయి; మాస్ట్రిక్ట్ ప్రమాణాలు విధిగా మారాయి.

మూడు దేశాలూ యూరోపియన్ యూనియన్ లోను, యూరోజోన్‌లోనూ సభ్య దేశాలు. ప్రపంచ బ్యాంకు వీటిని అధిక-ఆదాయ ఆర్థిక వ్యవస్థలుగా వర్గీకరించింది. వీటి మానవ అభివృద్ధి సూచికను అధికం. మూడూ OECD లో సభ్యులు. [10] యూరో కరెన్సీని ఎస్టోనియా 2011 జనవరిలో, లాట్వియా 2014 జనవరిలో, లిథువేనియా 2015 జనవరిలో స్వీకరించాయి

భాషలు మార్చు

మూడు బాల్టిక్ దేశాల భాషలు రెండు విభిన్న భాషా కుటుంబాలకు చెందినవి. లాట్వియన్, లిథువేనియన్ భాషలు ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవి. బాల్టిక్ భాషా సమూహంలో (లేదా మరింత ప్రత్యేకంగా, బాల్టిక్ యొక్క తూర్పు బాల్టిక్ ఉప సమూహం) నేటికీ నిలిచి ఉన్న భాషలు ఈ రెండే. లాట్గాలియన్, సమోగిటియన్‌లను ప్రత్యేక భాషలుగా గానీ, లాట్వియన్, లిథువేనియన్ భాషల్లోని మాండలికాలుగా గానీ గుర్తిస్తారు.

ఎస్టోనియన్ భాష, పొరుగున ఉన్న ఫిన్లాండ్ లోని ఫిన్నిష్ భాష లాంటి ఫిన్నిక్ భాష. ఇది ఇప్పుడు దాదాపుగా అంతరించిపోయిన లివోనియన్ భాషకు సంబంధించినది. లాట్వియాలో కొన్ని డజన్ల మంది ప్రజలు దీన్ని రెండవ భాషగా మాట్లాడతారు.

స్థానిక భాషలతో పాటు, 13వ శతాబ్దం నుండి మొదటి ప్రపంచ యుద్ధం వరకు ఎస్టోనియా లాట్వియాల్లో విద్య, వృత్తులలోను, ఉన్నత సమాజంలోనూ జర్మన్ ఆధిపత్య భాషగా ఉంది. పోలిష్ భాష, లిథువేనియాలో ఇదే స్థానంలో ఉంది. అనేక స్వీడిష్ పదాలు ఎస్టోనియన్ భాషలోకి వచ్చాయి; 17వ శతాబ్దంలో స్వీడిష్ పాలనలోనే పాఠశాలలు స్థాపించారు. ఎస్టోనియాలో స్వీడిష్ అవశేష భాషలు మాట్లాడతారు - ప్రత్యేకించి ఎస్టోనియన్ స్వీడిష్ మాండలికం ఉత్తర ఎస్టోనియా ద్వీపాలలోని ఎస్టోనియన్ స్వీడిష్ మాండలికం మాట్లాడతారు. ఎస్టోనియాతో భాషాపరమైన సంబంధం ఉండడం వలన, సోవియట్ కాలంలో ఫిన్నిష్ ప్రసారాలు వినడం వలనా ఎస్టోనియాలో ఫిన్నిష్ భాషలో గణనీయమైన నైపుణ్యం ఉంది.

సాధారణ గణాంకాలు మార్చు

2004 మే 1 న యూరోపియన్ యూనియన్‌లో ఏకకాలంలో చేరిన మూడు దేశాలు, EET / EEST టైమ్ జోన్ ను పాటిస్తాయి. యూరో కరెన్సీని వాడతాయి.

ఎస్టోనియా లాట్వియా లిథువేనియా మొత్తం
కోట్ ఆఫ్ ఆర్మ్స్      
జెండా      
రాజధాని టాలిన్ రిగా విల్నియస్
స్వాతంత్ర్యం
  • 13వ శతాబ్దం వరకు
  • 1918 ఫిబ్రవరి 24
  • 1991 ఆగస్టు 20 న పునరుద్ధరించబడింది
  • 13వ శతాబ్దం వరకు
  • 1918 నవంబరు 18
  • 1991 ఆగస్టు 21న పునరుద్ధరించబడింది
  • 18వ శతాబ్దం వరకు
  • 1918 ఫిబ్రవరి 16
  • 1990 మార్చి 11 న పునరుద్ధరించబడింది
రాజకీయ వ్యవస్థ పార్లమెంటరీ రిపబ్లిక్ పార్లమెంటరీ రిపబ్లిక్ అర్ధ అధ్యక్ష గణతంత్రం
పార్లమెంట్ రిగికోగు సైమా సీమాస్
ప్రస్తుత అధ్యక్షుడు అలార్ కారిస్ ఎగిల్స్ లెవిట్స్ గిటానాస్ నాసెడా
జనాభా (2021) 1,328,000 [11] 1,893,000 [12] 2,799,023 [13] 6,000,000
ప్రాంతం 45,339 కిమీ 2 64,589 కిమీ 2 65,300 కిమీ 2 175,228 కిమీ 2
సాంద్రత 30.9/కిమీ 2 = 80/చ. మై 29/కిమీ 2 = 76/చ. మై 43/కిమీ 2 = 110/చ. మై 34/కిమీ 2 = 88/చ. మై
నీటి ప్రాంతం % 4.56% 1.5% 1.35% 2.47%
GDP (నామమాత్రం) మొత్తం (2021) [14] €30.660 బిలియన్ €32.917 బిలియన్ €55.326 బిలియన్ €118.902 బిలియన్
తలసరి GDP (నామమాత్రం) (2021) [14] €23,060 €17,480 €19,740 €20,000
సైనిక బడ్జెట్ (2022) €748 మిలియన్ [15] €758 మిలియన్ [16] €1.2 బిలియన్ [17] €2.7 బిలియన్
గిని సూచిక (2019) [18] 30.5 35.2 35.4
HDI (2019) [19] 0.882 ( చాలా ఎక్కువ) 0.854 ( చాలా ఎక్కువ) 0.869 (చాలా ఎక్కువ)
ఇంటర్నెట్ TLD .ee .lv .lt
కాలింగ్ కోడ్ +372 +371 +370

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Republic of Estonia. "Baltic Cooperation". Ministry of Foreign Affairs. Archived from the original on 6 May 2017. Retrieved 28 May 2018.
  2. "Colombia and Lithuania join the OECD". France 24. 30 May 2018.
  3. "Colombia and Lithuania join the OECD". France 24. 30 May 2018.
  4. Republic of Estonia. "Baltic Cooperation". Ministry of Foreign Affairs. Archived from the original on 6 May 2017. Retrieved 28 May 2018.
  5. Hough, William J.H. (2019-09-10). "The Annexation of the Baltic States and Its Effect on the Development of Law Prohibiting Forcible Seizure of Territory". DigitalCommons@NYLS.
  6. "These Names Accuse—Nominal List of Latvians Deported to Soviet Russia". latvians.com. Archived from the original on 8 February 2012. Retrieved 28 May 2018.
  7. The white book: losses inflicted on the Estonian nation by occupation regimes, 1940–1991.
  8. "Communism and Crimes against Humanity in the Baltic states". 13 April 1999. Archived from the original on 20 July 2011. Retrieved 27 May 2018.
  9. "Murder of the Jews of the Baltic States". Yad Vashem.
  10. "Colombia and Lithuania join the OECD". France 24. 30 May 2018.
  11. "Population | Statistikaamet".
  12. "Main Lithuanian indicators".
  13. "Main Lithuanian indicators". 21 December 2021.
  14. 14.0 14.1 "Eurostat - Tables, Graphs and Maps Interface (TGM) table".
  15. "Defense budget to increase by €103 million". news.err.ee/. 23 September 2021.
  16. "Aizsardzības nozares budžets". mod.gov.lv.
  17. "2022 METŲ KAM BIUDŽETAS". kam.lt. Archived from the original on 2020-01-14. Retrieved 2022-05-31.
  18. "GINI index (World Bank estimate) | Data". World Bank. Archived from the original on 22 April 2018. Retrieved 28 May 2018.
  19. "| Human Development Reports". Archived from the original on 14 September 2018. Retrieved 14 September 2018.