భక్తప్రహ్లాద (1931 సినిమా)

1931 చిత్రం
(భక్తప్రహ్లాద (సినిమా) నుండి దారిమార్పు చెందింది)

భక్తప్రహ్లాద తొలి తెలుగు టాకీ చిత్రము. హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ఈ చిత్రము సెప్టెంబర్ 15, 1931న విడుదలైనది. హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ అర్దేషిర్‌ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక తెలుగు ‘భక్తప్రహ్లాద’ని , తమిళ 'కాళిదాసు'ని ఆయనకు అప్పజెప్పారు.

భక్తప్రహ్లాద
(1931 తెలుగు సినిమా)
దర్శకత్వం హెచ్.ఎం.రెడ్డి
ఎల్.వి.ప్రసాద్ (సహాయ దర్శకుడు)
నిర్మాణం హెచ్.ఎం.రెడ్డి
రచన సురభి నాటక సమాజము
తారాగణం మునిపల్లె సుబ్బయ్య,
సురభి కమలాబాయి,
షిండే కృష్ణారావు,
ఎల్.వి.ప్రసాద్,
దొరస్వామి నాయుడు,
బీ.వి.సుబ్బారావు,
చిత్రపు నరసింహారావు
సంగీతం హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
గీతరచన చందాల కేశవదాసు
ఛాయాగ్రహణం గోవర్ధన్ భాయి పటేల్
నిర్మాణ సంస్థ ‌భారత్ మూవీ టోన్
విడుదల తేదీ సెప్టెంబర్ 15, 1931
నిడివి 108 నిమిషాలు
భాష తెలుగు
పెట్టుబడి 20 వేలు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన "భక్త ప్రహ్లాద" నాటకాన్ని సురభి నాటక సమాజం వారు వేస్తుండేవారు. ఆ నాటకసమాజంవారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణామూవీటోన్ స్టూడియోలో తీశారు.

అప్పుడు ఈ చిత్ర నిర్మాణ వ్యయం 20వేల రూపాయలు. చిత్రం బాగా విజయవంతమయ్యింది.

తారాగణం మార్చు

 
మునిపల్లె సుబ్బయ్య

భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, హిరణ్యకశిపుని భార్య లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. సినిమాలో ప్రధానపాత్ర అయిన ప్రహ్లాదుని పాత్రను కృష్ణాజిరావు సింధే ధరించారు. ఇంద్రునిగా దొరస్వామినాయుడు, బ్రహ్మగానూ, చండామార్కుల్లో ఒకనిగానూ చిత్రపు నరసింహారావు నటించారు. ప్రహ్లాదుని సహాధ్యాయి అయిన ఓ మొద్దబ్బాయిగా తర్వాతికాలంలో దర్శకునిగా మారిన ఎల్.వి.ప్రసాద్ నటించారు. ఎల్.వి.ప్రసాద్ మొట్టమొదటి తమిళ టాకీ కాళిదాసులో కూడా నటించారు.[1]

పాటలు-పద్యాలు మార్చు

  1. తనయా ఇటులనే తగదురా బలుకా - కమలాబాయి
  2. పరితాప భారంబు భరియింప తరమా - రచన: కేసవదాసు - గానం: కమలాబాయి
  3. భీకరమగు నా ప్రతాపంబునకు - సుబ్బయ్య

మరికొన్ని విశేషాలు మార్చు

  • ఈ చిత్రంలో లీలావతిగా నటించిన సురభి కమలాబాయికి మొదట 500 రూపాయలు పారితోషికంగా నిర్ణయించారు. కాని ఆమె నటనను హర్షించి నిర్మాత వెయ్యినూటపదహార్లు బహూకరించి రైలు ఖర్చులు కూడా ఇచ్చారు.
  • ఇందులో ప్రహ్లాదుని పాత్ర పోషించిన కృష్ణారావుకు 400 రూపాయలు పారితోషికం. ఈ తెలుగు టాకీ హీరో అప్పటి వయసు 9 సంవత్సరాలు. తరువాత ఈయన కిరాణా కొట్టు నడుపుకున్నాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. 2001లో సినీ ఆర్టిస్టుల సంఘం ఈయనను సన్మానించి కొంత ఆర్థిక సహాయం అందజేశారు.
  • 1929 లో భారతదేశము తొలి టాకీ చిత్రాన్ని చూసింది. అది యూనివర్సల్ వారి 'ది మెలోడీ ఆఫ్ లవ్' అది విపరీతంగా ఆకర్షించడంతో, భారతీయ చిత్ర నిర్మాతలు తామూ శబ్ద చిత్రాలు తియ్యాలని ఉత్సాహ పడ్డారు. 'ఆలంఆరా' తిసిన "ఆర్దేషిర్ ఇరానీ" యే తెలుగు 'భక్త ప్రహ్లాద' కూడా తీశారు. అప్పుడు సంగీత దర్శకులు అంటూ లేరు. ఉన్న వరసల్నే, వాడుకున్నారు. హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి హార్మొనీ వాయిస్తూ అందరికీ పాట, పద్యం నేర్పారు. 'భక్త ప్రహ్లాద' లో 40 పాటలున్నాయి. పద్యాలు ఉన్నాయి. బొమ్మ సరిగా కనిపించక పోయినా, చాలా చోట్ల మాట వినిపించకపోయినా, ప్రేక్షకులు మాత్రం విరగ బడి చూశారు. ఈ రోజుల లెక్కల్లో అది ఆనాడు 'సూపర్ డూపర్ హిట్ సినిమ.బ్లాక్ మార్కెట్ వ్యవహారం ఇవాళ్టిది కాదు. 'భక్త ప్రహ్లాద" సమయంలోనే ఉంది. నాలుగు అణాల టిక్కట్లను, నాలుగు రూపాయలకి 'ఆలంఆరా' కి కొన్నట్టే, "భక్త ప్రహ్లాద"కీ కొన్నారు.

బయటి లింకులు, వనరులు మార్చు

మూలాలు మార్చు

  1. "1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు". ఆంధ్రజ్యోతి ఆదివారం: 4. 28 జనవరి 2007.