మలక్కా జలసంధి

మలేషియా ఇండోనేషియాల మధ్య ఉన్న జలసంధి

మలక్కా జలసంధి, మలేషియా లోని మలయ్ ద్వీపకల్పం, ఇండోనేషియా లోని సుమత్రా ద్వీపానికీ మధ్య నున్న సన్నని జలసంధి. దీని పొడవు 930 కి.మీ. [2] హిందూ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రాల మధ్య ప్రధాన నౌకా మార్గమిది. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన నౌకా మార్గాలలో ఒకటి. 1400 - 1511 మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన మలక్కా సుల్తానేట్ పేరే ఈ జలసంధికి పెట్టారు.

మలక్కా జలసంధి
మలక్కా జలసంధి, తూర్పున పసిఫిక్ మహాసముద్రాన్ని, పశ్చిమాన హిందూ మహాసముద్రాన్ని కలుపుతుంది
ప్రదేశంఅండమాన్ సముద్రం-సింగపూర్ జలసంధి
అక్షాంశ,రేఖాంశాలు4°N 100°E / 4°N 100°E / 4; 100 (Strait of Malacca)
రకంజలసంధి
ప్రవహించే దేశాలు
గరిష్ట పొడవు930 km (580 mi)
కనిష్ట వెడల్పు38 km (24 mi)
సరాసరి లోతు25 metres (82 ft) (కనిష్ఠ)[1]
ప్రాంతాలు

పరిధి మార్చు

ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ మలక్కా జలసంధి సరిహద్దులను క్రింది విధంగా నిర్వచించింది: [3]

పశ్చిమాన. సుమత్రా లోని ఉత్తరపు చివరన ఉన్న పెడ్‌రోపంట్‌ని (5°40′N 95°26′E / 5.667°N 95.433°E / 5.667; 95.433), లెమ్ వోలన్, సియామ్‌లోని ఫుకెట్ ఐలాండ్ (7°45′N 98°18′E / 7.750°N 98.300°E / 7.750; 98.300) నీ కలిపే రేఖ

తూర్పున. మలే ద్వీపకల్పం (1°16′N 103°31′E / 1.267°N 103.517°E / 1.267; 103.517) లోని తంజాంగ్ పియాయ్ (బులస్)ని, ది బ్రదర్స్ (1°11.5′N 103°21′E / 1.1917°N 103.350°E / 1.1917; 103.350 నీ, అక్కడ నుండి క్లెయిన్ కరీమోన్ (1°10′N 103°23.5′E / 1.167°N 103.3917°E / 1.167; 103.3917) నీ కలిపే రేఖ.

ఉత్తరాన. మలయ్ ద్వీపకల్పపు నైరుతి తీరం.

దక్షిణాన. సుమత్రా ఈశాన్య తీరం - తూర్పున ఉన్న టాంజాంగ్ కెడబు (1°06′N 102°58′E / 1.100°N 102.967°E / 1.100; 102.967), అక్కడి నుండి క్లీన్ కరీమోన్ వరకు.

చరిత్ర మార్చు

 
మలేషియాలోని మలక్కా నగరం నుండి చూస్తే మలక్కా జలసంధి. దూరంలో పులావ్ బెసర్ ('పెద్ద ద్వీపం') కనిపిస్తుంది.

అరేబియా, ఆఫ్రికా, పర్షియా, దక్షిణ భారతదేశం నుండి బయలుదేరిన తొలి వ్యాపారులు గ్వాంగ్‌జౌ చేరుకోవడానికి ముందు కెడా చేరుకున్నారు. కెడా మలయ్ ద్వీపకల్పంలో పశ్చిమ నౌకాశ్రయంగా పనిచేసింది. వారు గాజుసామాను, కర్పూరం, పత్తి వస్తువులు, బ్రోకేడ్లు, దంతాలు, చందనం, పరిమళ ద్రవ్యాలు, విలువైన రాళ్లతో వ్యాపారం చేశారు. ఈ వ్యాపారులు జూన్ - నవంబరు మధ్య రుతుపవనాల ద్వారా కెడాకు ప్రయాణించారు. వారు డిసెంబరు, మేల మధ్య తిరిగి వచ్చారు. కెడాలో వసతి, పోర్టర్లు, చిన్న ఓడలు, వెదురు తెప్పలు, ఏనుగులు మొదలైనవి లభించేవి. అలాగే మలయ్ ద్వీపకల్పంలోని తూర్పు ఓడరేవులైన లంకాసుకా, కెలాంటాన్‌ల వైపు చేసే రవాణా వస్తువులపై పన్నుల వసూళ్లకు కూడా అది కేంద్రంగా ఉండేది. పదవ శతాబ్దం తరువాత, చైనా నుండి నౌకలు ఈ తూర్పు వర్తక స్థావరాలు, ఓడరేవుల వద్ద వర్తకం చేయడం ప్రారంభించాయి. మలక్కా జలసంధిని వాణిజ్య మార్గంగా ఉపయోగించడం ప్రారంభించే ముందు, 6వ శతాబ్దం అంతటా కెడా, ఫునాన్‌లు ప్రసిద్ధ నౌకాశ్రయాలుగా విలసిల్లాయి.

7వ శతాబ్దంలో సుమత్రాలోని పాలెంబాంగ్‌లో ఉన్న శ్రీవిజయ సముద్ర సామ్రాజ్యం అధికారంలోకి వచ్చింది. దాని ప్రభావం మలయ్ ద్వీపకల్పం లోను, జావా వరకు విస్తరించింది. సాగరిక ఆగ్నేయాసియాలోని రెండు ప్రధాన చోక్ పాయింట్లైన మలక్కా జలసంధి, సుండా జలసంధి లపై ఈ సామ్రాజ్యం నియంత్రణను సాధించింది. జలసంధికి ఇరువైపులా ప్రత్యర్థి నౌకాశ్రయాలపై వరుస దాడులు చేసి, శ్రీవిజయ ఈ ప్రాంతంలో తన ఆర్థిక, సైనిక ఆధిపత్యాన్ని స్థాపించుకుంది. ఇది సుమారు 700 సంవత్సరాల పాటు కొనసాగింది. శ్రీవిజయ లాభదాయకమైన మసాలా వ్యాపారం నుండి గొప్ప ప్రయోజనాలను పొందింది. చైనాతో సామంత వాణిజ్య వ్యవస్థ, భారతీయ అరబ్ వ్యాపారులతో వ్యాపారం దీనికి ఉదాహరణలు. మలక్కా జలసంధి భారతదేశం, చైనాల మధ్య ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గంగా మారింది. గ్లోబల్ ట్రేడ్ నెట్‌వర్క్‌లలో మలక్కా జలసంధి యొక్క ప్రాముఖ్యత 15వ శతాబ్దంలో మలక్కా సుల్తానేట్, జోహార్ సుల్తానేట్, ఆధునిక సింగపూర్‌ల పెరుగుదలలతో తరువాతి శతాబ్దాలలో బాగా విస్తరించింది.

17వ శతాబ్దం నుండీ ఈ జలసంధి, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల మధ్య ప్రధాన నౌకామార్గంగా ఉంది. వివిధ ప్రధాన ప్రాంతీయ శక్తులు వివిధ చారిత్రక కాలాల్లో ఈ జలసంధిని నియంత్రించాయి. [4]

19వ శతాబ్దం ప్రారంభంలో, డచ్చి, బ్రిటిషు సామ్రాజ్యాలు జలసంధిలో ఏకపక్షంగా సరిహద్దు రేఖను గీసాయి. తమతమ వైపున ఉన్న సముద్రపు దొంగలను వేటాడతామని వాగ్దానం చేశాయి. ఆ రేఖయే మలేషియా ఇండోనేషియా మధ్య నేటి సరిహద్దుగా మారింది. [5]

ఆర్థిక ప్రాముఖ్యత మార్చు

 
కౌలా సెలంగోర్‌లోని బుకిట్ మెలావతి నుండి చూసినట్లుగా, మలక్కా జలసంధిలో ప్రయాణిస్తున్న ఓడ.

ఆర్థిక, వ్యూహాత్మక దృక్కోణంలో మలక్కా జలసంధి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన నౌకామార్గాల్లో ఒకటి.

భారతదేశం, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాం, చైనా, జపాన్, తైవాన్, దక్షిణ కొరియా వంటి ప్రధాన ఆసియా ఆర్థిక వ్యవస్థలను కలుపుతూ హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల మధ్య ఈ జలసంధి ప్రధాన నౌకా మార్గంగా ఉంది. మలక్కా జలసంధి చైనా తీరం నుండి భారతదేశపు దక్షిణ కొన వైపుగా వెళ్ళి, మొంబాసా వరకు సాగే సముద్ర సిల్క్ రోడ్‌లో భాగం. అక్కడి నుండి ఎర్ర సముద్రం గుండా సూయజ్ కాలువ ద్వారా మధ్యధరా, అక్కడ ఎగువ అడ్రియాటిక్ ప్రాంతం నుండి ఉత్తర ఇటలీ రేవు ట్రైస్టే వరకు వెళుతుంది. [6] [7] [8] [9] 2008 లో 94,000 నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించాయి, [10] చమురు, చైనా ఉత్పత్తులు, బొగ్గు, పామాయిల్, ఇండోనేషియా కాఫీతో సహా ప్రపంచంలోని 25% వాణిజ్య వస్తువులను మోసుకెళ్తుంది. [11] ప్రపంచంలో సముద్రం ద్వారా రవాణా అయ్యే మొత్తం చమురులో నాలుగింట ఒక వంతు (ప్రధానంగా పెర్షియన్ గల్ఫ్ సరఫరాదారుల నుండి ఆసియా మార్కెట్లకు) ఈ జలసంధి గుండా వెళుతుంది. [12] 2007 లో జలసంధి ద్వారా రోజుకు 13.7 మిలియన్ బారెల్స్ చమురు రవాణా అయింది. 2011లో ఇది రోజుకు 15.2 మిలియన్ బ్యారెల్స్‌కు పెరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకామార్గ చోక్ పాయింట్‌లలో ఒకటి, ఎందుకంటే ఫిలిప్ ఛానల్ వద్ద ఇది కేవలం 2.8 కి.మీ. వెడల్పు మాత్రమే ఉంటుంది. [12]

ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద నౌకలకు అవసరమైన లోతు (ఎక్కువగా చమురు ట్యాంకర్లు) జలసంధి యొక్క కనిష్ట లోతు 25 మీటర్లు (82 అడుగులు) కంటే ఎక్కువగా ఉంటుంది. లోతు అత్యంత తక్కువగా ఉండే స్థానం సింగపూర్ జలసంధిలో ఉంది. మలక్కా జలసంధి గుండా వెళ్ళగల ఓడ గరిష్ట పరిమాణాన్ని మలాక్కామాక్స్ అంటారు. తూర్పున ఉన్న తదుపరి సమీప మార్గం, సుమత్రా - జావా మధ్య ఉన్న సుండా జలసంధి దీనికంటే తక్కువ లోతుతో, మరింత సన్నగా ఉంటుంది. అంటే మలక్కామాక్స్‌ను మించిన పరిమాణమున్న నౌకలు కొన్ని వేల నాటికల్ మైళ్లు పక్కదారి పట్టి, లాంబాక్ జలసంధి, మకస్సర్ జలసంధి, సిబుటు పాసేజ్, మిండోరో జలసంధి గుండా వెళ్ళాల్సి ఉంటుంది.

షిప్పింగ్ ప్రమాదాలు మార్చు

జలసంధిలో సముద్రపు దొంగలు ఒక సమస్య. 2001 సెప్టెంబరు 11 నాటి సంఘటనల తర్వాత పైరసీ మరింత పెరిగింది. 2004 మొదటి అర్ధభాగంలో దాడులు మళ్లీ పెరిగిన తర్వాత, ప్రాంతీయ నౌకాదళాలు 2004 జూలైలో ఈ ప్రాంతంలో తమ గస్తీని పెంచాయి. తదనంతరం, మలక్కా జలసంధిలో నౌకలపై దాడులు 2005లో 79కి 2006 50కి తగ్గాయి. [13] ఇటీవలి సంవత్సరాలలో దాడులు దాదాపు సున్నాకి పడిపోయాయి. [14]

ఈ జలసంధిలో దాదాపు 34 నౌకలు మునిగిపోయాయి ఉన్నాయి. వీటిలో కొన్ని స్థానిక 1880ల నాటివి. ఇరుకైన, లోతులేని జలసంధిలో ఈ మునిగిపోయిన ఓడలు ఢీకొనే ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. [15]

2017 ఆగస్టు 20 న, యునైటెడ్ స్టేట్స్ నేవీ డిస్ట్రాయర్ USS John S. McCain పూర్తి స్టీరింగ్ సామర్థ్యాలు కోల్పోయిన సమయంలో జలసంధికి తూర్పున కొద్ది దూరంలో ఉన్న ఆల్నిక్ MC అనే వ్యాపార నౌకను ఢీకొనడంతో USS John S. McCain సిబ్బందిలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నంలో ఓడ అనేక పొరపాట్లను చేసింది. [16]

జలసంధిలో ట్రాఫిక్ ఉపశమన ప్రతిపాదనలు మార్చు

జలసంధి లోని ట్రాఫిక్‌ను, తద్వారా దాని ఆర్థిక ప్రాముఖ్యతనూ మళ్లించడానికి థాయ్‌లాండ్ ప్రణాళికలను అభివృద్ధి చేసింది. థాయ్ ప్రభుత్వం అనేకసార్లు ఇస్త్మస్ ఆఫ్ క్రా ద్వారా కాలువను తవ్వాలని ప్రతిపాదించింది. దాంతో రెండు మహాసముద్రాల మధ్య ప్రయాణ దూరంలో 960 కి.మీ. తగ్గుతుంది. 2004లో ది వాషింగ్టన్ టైమ్స్‌కి లీక్ అయిన నివేదిక ప్రకారం, దానికయ్యే ఖర్చులను భరించడానికి చైనా ముందుకొచ్చింది. అయినప్పటికీ, అనేకమంది థాయ్ రాజకీయ నాయకుల మద్దతు ఉన్నప్పటికీ, విపరీతమైన ఆర్థిక, పర్యావరణ ఖర్చులు అటువంటి కాలువను నిర్మించకూడదని సూచిస్తున్నాయి.

దీనికి ఒక ప్రత్యామ్నాయం, ఇస్త్మస్ ఆఫ్ క్రాపై ఒక పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసి, అవతలి వైపు వేచి ఉన్న ఓడలకు చమురును అందించే ఆలోచన. ఇది ఆసియాకు చమురు డెలివరీ ఖర్చును బ్యారెల్‌కు సుమారు $0.50 తగ్గించగలదని ప్రతిపాదకులు లెక్కించారు. మయన్మార్ కూడా ఇదే పైప్‌లైన్ ప్రతిపాదన చేసింది.

మూలాలు మార్చు

  1. Malaccamax. As the name suggests, Malaccamax ships are the largest ships that can pass through the Strait of Malacca which is 25 m (82 ft) deep at its shallowest. As per the current permissible limits, a Malaccamax vessel can have a maximum length of 400 m (1,312 ft), beam of 59 m (193.6 ft), and draught of 14.5 m (47.6 ft). Comparison of Tanker sizes Archived 2021-05-03 at the Wayback Machine
  2. Winn, Patrick (27 Mar 2014). "Strait of Malacca Is World's New Piracy Hotspot". NBC News. Archived from the original on 2017-03-15. Retrieved 14 March 2017.
  3. Limits of Oceans and Seas (PDF) (3rd ed.). International Hydrographic Organization. 1953. p. 23. Retrieved 2018-12-03.
  4. Pineda, Guillermo. "The Strait of Malacca as one of the most important geopolitical regions for the People's Republic of China".
  5. Winn, Patrick (27 Mar 2014). "Strait of Malacca Is World's New Piracy Hotspot". NBC News. Archived from the original on 2017-03-15. Retrieved 14 March 2017.
  6. Marcus Hernig: Die Renaissance der Seidenstraße (2018) pp 112.
  7. Mantoan, Benedetta (2019). "The Maritime Silk Road in South-East Asia". www.southworld.net (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-02-07.
  8. Sutton, H. I. (8 July 2020). "Could The Indian Navy Strangle China's Lifeline In The Malacca Strait?". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2022-02-07.
  9. "Can Singapore's shipping hub survive China's Maritime Silk Road?". Supply Chain Asia (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-03-30. Retrieved 2022-02-07.
  10. Strait of Malacca - World Oil Transit Chokepoints Archived 2014-11-22 at the Wayback Machine, Energy Information Administration, U.S. Department of Energy
  11. The Straits of Malacca: Gateway or Gauntlet?.. A book review citing this information can be found at University of Toronto Quarterly, Volume 74, Number 1, Winter 2004/5, pp. 528-530
  12. 12.0 12.1 "World Oil Transit Chokepoints" (PDF). www.eia.gov. U.S. Energy Information Administration (EIA). 2014. Archived (PDF) from the original on 22 November 2014. Retrieved 28 April 2018.
  13. Piracy down 3rd year in row: IMB report Archived 2013-12-17 at the Wayback Machine, Journal of Commerce Online, January 23, 2007
  14. "Drastic drop in piracy in Malacca Straits". maritimesecurity.asia. 21 April 2011. Archived from the original on 7 November 2017. Retrieved 28 April 2018.
  15. Ali, Sharidan Mohd Ali (2 January 2006). "34 wrecks in sealane threaten passing ships". thestar.com.my. Archived from the original on 12 October 2008. Retrieved 28 April 2018.
  16. Affairs, This story was written by U.S. 7th Fleet Public. "UPDATE: USS John S. McCain Collides with Merchant Ship". navy.mil. Archived from the original on 5 November 2017. Retrieved 28 April 2018.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)