ముసునూరి కాపయ నాయుడు

ఆంధ్ర లేక తెలుగు దేశ చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖించ దగిన నాలుగు పేర్లు శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి, కాకతీయ గణపతిదేవ, ముసునూరి కాపానీడు, శ్రీ కృష్ణదేవరాయలు. వీరందరూ తెలుగుదేశ ఐక్యతకూ, తెలుగు వారి స్వాతంత్ర్యమునకూ, వారి ఉన్నతికీ పాటుబడిన యుగపురుషులు.

ముసునూరి కాపయనాయుడు

కాపానీడు లేక కాపయ నాయకుడు ముసునూరి నాయకులు వంశమునకు చెందిన ప్రోలయ నాయకుని పిన తండ్రి దేవ నాయకుని కుమారుడు. కాపానీడు ప్రోలయకు కుడి భుజము వంటివాడు. ప్రోలయ నాయకత్వము క్రింద తెలుగు నాయకులు చేసిన విముక్తి పోరాటము ఫలించి క్రీ.శ. 1326లో (ఫిబ్రవరి-ఏప్రిల్ మాసముల మధ్య) తీరాంధ్రదేశము విముక్తమైనది. హిందూధర్మము పునరుద్ధరింపబడింది. విలస తామ్ర శాసనములో ప్రోలయ ఘనత శ్లాఘించబడినది[1]. వయోభారముతో ప్రోలయ రాజ్యాధికారాన్ని కాపానీడుకు అప్పగించి రేకపల్లి కోటకు తరలిపోతాడు. ఆతని వాంఛ తెలుగు దేశమును పూర్తిగా మ్లేఛ్ఛుల నుండి విముక్తి చేయుట.

ఓరుగల్లు, కాపయ నాయుడి రాజధాని

తెలంగాణమునుకూడ ముస్లిములబారి నుండి విడిపించి అచట హిందూరాజ్యమును పునహ్ ప్రతిష్ఠాపించుటే కాపానీడు ఏకైక లక్ష్యము. ఇందు నిమిత్తము పొరుగు హిందూరాజులతో రాయబారములు నడిపి సైన్యమును వృద్ధిచేసుకొని తరుణమున కెదురుచూచుచుండెను. అద్దంకిలో వేమారెడ్డి, కృష్ణా-తుంగభద్ర అంతర్వేదిలో అరవీటి సోమదేవ రాజు, ద్వారసముద్రములో హోయసల బళ్ళాలుడు, కంపిలిలోని ప్రజలకు ఒకే ఆశయము-స్వాతంత్ర్యము. బళ్ళాలుని తిరుగుబాటు అణచుటకు మహమ్మద్ బీన్ తుగ్లక్ ఢిల్లీలో మతము మార్చబడి బందీలుగానున్న హరిహర, బుక్క సోదరులను పంపుతాడు. ఇదే సమయములో మధురలో జలాలుద్దీన్ స్వతంత్రుడవుతాడు. ఓరుగంటిలో కాపానీడు తిరుగుబాటు లేవదీస్తాడు. బళ్ళాలుడు అశ్వికదళమును, పదాతి సైన్యమును తోడంపుతాడు. కోట ముట్టడిలో భయంకర పోరు జరుగుతుంది. దుర్గపాలకుడు మాలిక్ మక్బూల్ అతికష్టముమీద పారిపోతాడు. క్రీ. శ. 1336లో ఓరుగంటికోటపై మరలా ఆంధ్ర పతాకము ఎగిరింది. ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్రసురత్రాణ బిరుదులతో కాపానీడు తెలుగు దేశానికి అధిపతి అయ్యాడు. కాపానీడు విజయముతో స్ఫూర్తినొంది, విద్యారణ్యుని ఆశీస్సులతో హరిహర-బుక్క సోదరులు కంపిలిలో స్వాతంత్ర్యము ప్రకటించుకుంటారు.

రాజ్యము

కాపానీడు తనకు సహకరించిన బంధువులకు, నాయకులకు పదవులిచ్చి తన స్థితిని కట్టుదిట్టము చేసుకుంటాడు. పినతండ్రి రాజనాయకుని కుమారుడు అనవోతానాయకుని మధ్యాంధ్రదేశానికి అధిపతిగా నియమిస్తాడు. ఈతనికి తొలుత తొయ్యేడు, పిదప రాజమహేంద్రవరము రాజధాని. గోదావరికి దక్షిణమున సబ్బినాటికి ముప్పభూపాలుని అధిపతి గావించాడు. కోరుకొండలో మంచికొండ కూనయ నాయకుని నియమించి తన మేనకోడలును కూనయ కుమారుడు ముమ్మడి నాయకునికిచ్చి వివాహము చేస్తాడు. అద్దంకిలో వేమారెడ్డి కాపయకు సామంతుడై పాలన సాగిస్తాడు. పిఠాపురము రాజధానిగా గోదావరీ తీర ప్రాంతము మొదలుకొని తుని వరకు కొప్పుల నామయ నాయకుడు పాలకుడు. ఈవిధముగా కాపయ రాజ్యము పశ్చిమాన కౌలాస్, బీదరు మొదలుకొని తూర్పున బంగాళాఖాతము వరకు, ఉత్తరమున కళింగము నుండి దక్షిణమున కంచి వరకు వ్యాపించియున్నది.

యుద్ధములు

కాపానీడు మనసులో ఢిల్లీ సుల్తాను మరలా ఎప్పుడు తెలుగు దేశముపై దండెత్తివచ్చునో అను సందేహము పోలేదు. ఓరుగల్లు మొదలైన ముఖ్య దుర్గములు పటిష్ఠము చేయించాడు. సేనలను వృద్ధి పరచాడు. ఈ సమయములో దక్కనులో జాఫర్ ఖాన్ హసన్ అనువాడు ఢిల్లీ సుల్తానుపై తిరుబాటు చేసి కాపానీడు సాయమడుగుతాడు. పదునైదు వందల పదాతి సేనను పొంది, సుల్తాను సేనలపై విజయము సాధించి గుల్బర్గా (కలుబరిగె) రాజధానిగా క్రీ. శ. 1347లో బహమనీ రాజ్యము స్థాపిస్తాడు. ఈతడే కాపానీడు పక్కలో బల్లెముగా కాబోయే జాఫర్ ఖాన్ అలావుద్దీన్ హసన్ గంగూ బహ్మన్ షా.

జాఫర్ ఖాన్ ఎంత కృతఘ్నుడో కాపానీడుకు త్వరలోనే తెలిసి వచ్చింది. పొరుగుననున్న హిందూ రాజ్యములను సాధించిన జాఫర్ ఖాన్ కాపానీడుపై దండెత్తుతాడు.

మొదటి పోరు

అత్యంత విషమ పరిస్థితిలో సహాయము చేసెనను కృతజ్ఞత కూడా లేకుండ జాఫర్ ఖాన్ అలావుద్దీన్ ఓరుగంటి రాజ్యముపై దండెత్తాడు. ఊహించని ఈ పరిణామములో కాపానీడు సేన ఓడిపోతుంది. విధిలేక కౌలస కోటను అప్పగించి కాపానీడు సంధి చేసుకుంటాడు.

రెండవ పోరు

క్రీ. శ. 1351లో ముహమ్మద్ బిన్ తుగ్లక్ చనిపోయాడు. దీనితో అలావుద్దీన్ కు ఏ భయమూ లేకుండా పోయింది. రాజ్యవిస్తరణాకాంక్షతో, కాపానీడుని సామంతుడిగా చేసుకొనుటకు యుద్ధము ప్రకటిస్తాడు. తురుష్క యుద్ధ తంత్రములో భాగముగా కోటల బయటనున్న సామాన్య ప్రజలను హింసించుట, నిస్సహాయులైన వృద్ధులను, బాలలను సంహరించుట, స్త్రీలపై అత్యాచారములు చేయుట, గ్రామములు తగులబెట్టుట మొదలగు అకృత్యాలు చూసి భరించలేక కాపానీడు సంధికి ఒడబడి ఢిల్లీ సుల్తానుకు ఎంత కప్పం కట్టేవాడో అంత చెల్లించుటకు ఒప్పుకుంటాడు. అలావుద్దీన్ భువనగిరి కోట స్థావరముగా ఒక సంవత్సరము పాటు తెలంగాణములో ఉండి దేశమంతయూ ధ్వంసం కావించాడు. మాలిక్ కాఫుర్ దాడి పిదప మిగిలిన దేవాలయములు కూడా ధ్వంసము చేసి వాటి స్థానములో మసీదులు కట్టించాడు.

మూడవ పోరు

క్రీ.శ. 1359లో అలావుద్దీన్ చనిపోయాడు. ఆతని కొడుకు మహమ్మద్ షా రాజ్యానికొస్తాడు. ఈ సందర్భమున విజయనగర రాజు బుక్కరాయలు, ఆంధ్రదేశాధిపతి కాపానీడు తండ్రి అలావుద్దీన్ తమవద్దనుండి లాగుకొనిన రాజ్యమును తిరిగి ఇవ్వవలసిందిగా మహమ్మద్ షా వద్దకు రాయబారులను పంపుతారు. షా తెలివిగా రాయబారులను ఒక సంవత్సరము ఆపి వుంచి, తనకు పంపవలసిన కప్పము ఎందుకు పంపలేదని అడుగుతాడు. ఉగ్రుడైన కాపానీడు పెద్ద సేనతో, కొడుకు వినాయక దేవుని కౌలస కోట పట్టుకొనుటకు పంపుతాడు. సాయముగా బుక్కరాయలు 20,000 అశ్వికులను పంపుతాడు. మహమ్మద్ షా మొదట విజయనగర సైన్యమును ఓడించి, దేశమును కొల్లగొట్టి, గుర్రాలతో గుల్బర్గాకు తిరిగివెళ్ళుతూ వినాయకదేవునితో తలపడి ఓడిపోతాడు. భువనగిరి తిరిగి ఓరుగల్లు వశమయ్యింది. వెనువెంటనే మహమ్మద్ షా సేనాధిపతి బహాదూర్ ఖాన్ వినాయకదేవునిపై దాడిచేసి ఓడించాడు. ఆతడు పట్టణము పారిపోయి దాక్కుంటాడు. బహాదూర్ ఖాన్ ఓరుగల్లు వరకు దేశము పాడు చేశాడు. అపారధనము, అమూల్యాభరణాలు, 25 ఏనుగులు ఇచ్చి కాపానీడు సంధి చేసుకుంటాడు.

నాలుగవ పోరు

క్రీ.శ. 1362లో మహమ్మద్ షా మరలా వినాయకదేవునిపై దండెత్తుతాడు. తనకు దక్కవలసిన అరబ్బీ గుర్రాలను దారి మరల్చాడని పోరు సాకు. నాలుగువేల అశ్వికులతో ఆకస్మికముగా పట్టణము పైబడి అచటి హిందువులందరినీ దారుణముగా క్రూరవధ పాలు చేశాడు. కోటను ముట్టడించి వినాయకదేవుని బంధించాడు. నిర్భయముగా ఎదురు సమాధానము చెప్పిన ఆతని నాలుక కోయించి, క్రింద రగిల్చిన మంటలో పడునట్లు కోట బురుజు పైనున్న ఫిరంగివాత నుండి విసిరివేయించాడు.

మహమ్మద్ షా చేసిన క్రూర దారుణ చర్యలకు కోపించిన తెలుగు ప్రజలు, సైన్యము షా దారికాచి తురుష్కులను పీడించారు. పట్టణ సంపద కొల్లగొట్టి, దేశమంతయూ తగులబెట్టమని ఆజ్ఞాపించి త్వరితముగా కౌలస కోట చేరతాడు. సైన్యములో మూడవ వంతు మాత్రమే మిగిలింది. మహమ్మద్ షా భుజానికి తీవ్ర గాయమయ్యింది. కౌలసలో సాయమునకొచ్చిన కొత్త సేన వలన బ్రతికిపోతాడు. గుల్బర్గా వరకు మిగిలిన ప్రయాణము శాంతముగా సాగిపోయింది[2].

ఐదవ పోరు

వినాయకదేవుని మరణ వార్త విని కాపానీడు విచారముతో క్రుంగి పోతాడు. బహమనీ రాజ్యము కూల్చుటే ఆతని ధ్యేయము. విజయనగర తోడ్పాటుతో, క్రీ. శ. 1363లో ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుఘ్లక్ బహమనీ రాజ్యముపై దండెత్తి వచ్చినచో తమ సాయముండునని వార్త పంపుతాడు. కాని తుఘ్లక్ పట్టించుకోడు. విషయము తెలిసి మహమ్మద్ షా ఉగ్రుడవుతాడు. పెద్ద సైన్యముతో కౌలస కోటకు వచ్చి, ఆజం హుమాయూన్ ను గోలకొండకు, సఫ్దర్ ఖాన్ ను ఓరుగల్లుకు పంపి బహాదూర్ ఖాను తోడుగా యుద్ధానికి తరలుతాడు. ఇదే సమయాన విజయనగరములో బుక్కరాయలు మరణిస్తాడు. క్షీణించిన సైన్యముతో కాపానీడు అడవులను ఆశ్రయిస్తాడు. మహమ్మద్ షా తెలంగాణమునంతయూ దోచుకున్నాడు. దేశము సర్వనాశనము గావించాడు. గత్యంతరము కానక కాపానీడు క్రీ. శ. 1364లో మరలా సంధి చేసుకుంటాడు. ఈ సంధి ప్రకారము 33 లక్షల రూపాయలు, 300 ఏనుగులు, 50 గుర్రములు, గోలకొండ కోట శాశ్వతముగా వదలుకుంటాడు. వజ్రవైఢూర్యములు పొదగబడిన బంగారు సింహాసనము (తఖ్త్-ఇ-ఫిరూజీ) షాకు సమర్పించుకుంటాడు. అటుపిమ్మట ఆతనికి బహమనీలతొ ఇబ్బంది కలుగలేదు.

చివరి పోరు

కాపానీడుకు బహమనీల బెడద తప్పిననూ రేచెర్ల వెలమల బాధ తప్పలేదు. మహమ్మద్ షాతో యుద్ధములందు మునిగి ఉన్న సమయములో రేచెర్ల సింగమ నాయకుడు స్వాతంత్ర్యము ప్రకటించి పిల్లలమర్రి, అనుమనగల్లు ప్రాంతము జయింప బూనగా కాపానీడు ఆతనిని అణచాడు. ఇదే విధముగా అద్దంకి వేమారెడ్డి పై సింగమ చేసిన దాడిలో వేమారెడ్డికి సాయపడ్డాడు. క్రీ. శ. 1361లో జల్లిపల్లి కోట ముట్టడిలో సింగమ నాయకుడు క్షత్రియుల చేతిలో హతుడయ్యాడు. పిమ్మట ఆతని కుమారులు అనవోతా నాయకుడు, మాదా నాయకుడు రాజ్యకాంక్షతో కాపానీడుపై దండెత్తుతారు. బహమనీల యుద్ధములవల్ల బలహీనపడి, ధనకోశము, సైన్యము సన్నగిల్లి, పుత్రుని కోల్పోయి, విషణ్ణుడైన కాపానీడు తోటి తెలుగు వారితో యుద్ధము చేయక తప్పలేదు. ఓరుగల్లు సమీపములో భీమవరము వద్ద జరిగిన మహాసంగ్రామములో తెలుగు దేశమును పారతంత్ర్యమునుండి విడిపించిన మహా యోధుడు ముసునూరి కాపయ నాయకుడు క్రీ. శ. 1368లో హతుడయ్యాడు.

ప్రాముఖ్యత

మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి మాటలలో: "ముసునూరి వారు పూర్తిగా అర్ధ శతాబ్దమైనను తెలుగు దేశమును పరిపాలింపలేదు. ఈ వంశములో పరిపాలనము నెరపిన వారు ప్రోలయ నాయక, కాపయ నాయకులు తెలుగుదేశచరిత్రలో వారు వహించిన పాత్ర అనుపమానమైనది. వింధ్యకు దక్షిణమందుండిన గొప్ప హిందూ రాజ్యములన్నియూ ఢిల్లీ సుల్తాను మహమ్మదు బిన్ తుగ్లకుకు పాదాక్రాంతములై ఆ చక్రవర్తి మగటిమిని, సామ్రాజ్యబలమును తలయెత్తి ఎదిరింపలేని కాలమున, పూర్వపు సూర్యవంశ, చంద్రవంశజులైన క్షత్రియుల రాజ్యములన్నియు క్రుంగి కూలారిపోయిన కాలమున అంతటి మహాబలవంతుడైన ఢిల్లీ చక్రవర్తిపై కత్తికట్టి అతని యధికారమును ధిక్కరించి స్స్వాతంత్ర్యోద్యమమును లేవదీసి దానిని విజయవంతముగా నడిపిన కీర్తిప్రతిష్ఠలు తెలుగు ప్రజానీకమువి; తెలుగు నాయకులవి; అందును ముఖ్యముగా ముసునూరి ప్రోలయ, కాపయనాయకులవి. వీరు హిందూరాజ్య పునరుద్ధరణమునకు దీక్షాకంకణములు కట్టి యవనవారధి నిమగ్నమైన తెలుగుభూమిని ఉద్ధరించినపిదపనే దక్షిణదేశమున నుండిన ఇతర రాజ్యములకు ధైర్యము కలిగి ఢిల్లీ సుల్తానుపై తిరుగుబాటులు కావించి విజయలక్ష్మీసంపన్నములైనవి. హిందూదెశచరిత్రలో తెలుగు నాయకుని అధిపత్యమున తమకు తామై ప్రజలే తమ శ్రేయోభాగ్యములకొరకు అపూర్వ ధైర్యోత్సాహములతో విమత బలములను ఎదిరించి పోరాడి స్వరాజ్యమును స్థాపించుకొనిన అపూర్వ, అద్భుత ప్రకరణమిది; ప్రాచీనచరిత్రలో అశ్రుతపూర్వమైనది. ముసునూరినాయకులకు విజయమే లభించి యుండకపొయినచో మన తెలుగుదేశ చరిత్ర మరియొకతెన్నున నడచియుండెడిది. అందువలన ముసునూరి నాయకుల పరిపాలనాకాలము కొద్దిదైనను అది మహాసంఘటనాకలితమైనది. ముసునూరివారి స్వాతంత్ర్యవిజయముతో తెలుగుదేశములో నూతన యుగము ఆరంభమైనది. తెలుగుదేశచరిత్ర ఉత్తరమధ్యయుగములో పడినది".[3]

మూలాలు

  1. విలస తామ్ర శాసనము: Venkataramanayya, N. and Somasekhara Sarma, M. 1987, Vilasa Grant of Prolaya Nayaka, Epigraphica Indica, 32: 239-268
  2. మహమ్మద్ కాసిం ఫెరిష్తా, Translation by John Briggs, History of the Rise of Mahomedan Power in India, Vol. 2, 1829, pp. 310-319, Longman and others, London
  3. ముసునూరి వంశీయులు; విజ్ఞాన సర్వస్వము, మొదటి సంపుటము, తెలుగు సంస్కృతి (దేశము-చరిత్ర), తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1990; పుటలు 348-362