మేల్పత్తూరు నారాయణ భట్టతిరి

మేల్పత్తూరు నారాయణ భట్టతిరి నారాయణీయము గ్రంథ రచయితగా మిక్కిలి ప్రసిద్ధులు.[1]

రచయిత కాలమానాలు మార్చు

వీరు క్రీస్తు శకం 1580 ప్రాంతంలో తిరునావాయ దేవస్థానం సమీపంలో జన్మించారు. తన 27వ ఏట నారాయణీయం రచించారు. భట్టతిరి వారు నిండు 106 సంవత్సరాలు జీవించారుట. ఈ విషయంలో కొంత వివాదం ఉన్నా కనీసం 86 సంవత్సరాలు జీవించారన్నది నిర్వివాదాంశం. వీరి జీవిత కాలం క్రీస్తు శకం 1560 నుండి 1646/1666 అంటారు.

రచయిత విశిష్టత మార్చు

భట్టతిరి వారి రచనలలో అత్యున్నత ప్రాశస్త్యం పొందినది నారాయణీయం కాగా, “ప్రక్రియసర్వస్వం” అనే సంస్కృత వ్యాకరణం సిద్ధాంత కౌమొదితో సరితూగేది అని పేరుపొందింది. ఇది నారాయణీయం కన్నా ముందు వ్రాయబడింది అంటారు. సిద్ధాత కౌమొది వ్రాసిన భట్టోజీ దీక్షితారు వారు ప్రక్రియసర్వస్వం గురించి విని భట్టతిరి వారిని కలవాలని బయలుదేరా రని, కాని వారు భౌతికకాయం వీడారని తెలియడంతో నిరాశగా వెనుతిరిగా రని అంటారు.

భట్టతిరి వారి నారాయణీయం మార్చు

నారాయణీయం మూల సంస్కృత భాగవత పురాణానికి అపూర్వమైన సంక్షిప్త రూపం. చక్కటి శ్లోకాలుగా, భాగవత పురాణ సారంగా ఎంత ప్రసిద్ధమో, మహిమాన్వితమైన పారాయణ గ్రంథంగా అంత ప్రసిద్ధి పొందిన రచన ఈ నారాయణీయం. అంటుకున్నవి ఎంతటి భౌతిక రోగాలైనా మానసిక రోగాలైనా ఈ పారాయణ ఇట్టే కరిగించేస్తుంది అన్న నమ్మకం మలయాళ, తమిళ వారిలోనే కాకుండా తెలుగు వారిలో కూడా ఎప్పటినుంచో ఉంది అంటారు. గురువాయూరు దేవస్థానంలో ప్రతి ఏటా నారాయణీయం జయంతి నాడు నారాయణీయ సప్తాహం చేసే ఆచారం కొనసాగుతోంది. ఇతర దినాలలో భక్తుల కోరికపై నిర్వహించడం జరుగుతోంది. ఈ సంప్రదాయం 1950 ప్రాంతాలలో ప్రారంభమైంది. వారం రోజులపాటు ఉదయం మొదలు పెట్టి చేసే ఈ పారాయణ ప్రవచనంలో శ్లోకాల పఠనానికి అయిదు గంటలు, విడమరిచి, వివరించి చెప్పడానికి నలభైఅయిదు గంటలు పడుతుంది అంటారు. సౌందర్యరాశి గురువాయురప్ప దివ్య సన్నిధిలో ఆలకించడం అనిర్వచనీయమైన అనుభవ మట. శ్రీమన్నారాయణుని కథ కనుక నారాయణీయం అయింది. వెయ్యి అంకెను కలిగి ఉండడం లోని విశిష్టత విషయంలో విష్ణుసహస్రనామ స్తోత్రంతో పోలిక యాధృచ్చికమే కావచ్చు. అంతేకాక సంస్కృత గ్రంథాలలో అంతటి విశిష్టస్థానాన్ని అందుకుంది. విషయ విశిష్టతతో బాటు అద్భుతమైన రచనా శైలి దీని ప్రత్యోకత. అయ్యప్ప కరియత్తు అనే వైద్యునిచే రచింపబడిన “నారాయణీయం సహస్రనామాలు” అనే రచన యందు నారాయణీయంలో చెప్పబడిన విష్ణుమూర్తి వెయ్యి నామాలను స్కంధాల వారీ అదే వరుసలో సంకలనం చేయబడిందిట.

శ్రీమన్నారాయణీయం పుట్టుక మార్చు

కేరళలోని గురువాయూరు గ్రామంలో ఉన్న గురువాఐరోపాప దేవస్థానం బాగా ప్రసిద్ధి పొందినది. నారాయణీయం గ్రంథం ఆవిర్భావం గురించి ఈ కృష్ణాలయానికి చెందిన బహు ఆసక్తి కరమైన చరిత్ర ప్రజలలో ప్రచారంలో ఉంది. భట్టతిరి వారి గురువుగారు “అచ్యుత పిషారది” వారు. వారు పక్షవాత వ్యాధి పీడితులు అయ్యారు. వారి బాధ చూసి సహించలేని భట్టతిరి వారు గురువుకు స్వాస్థ్యం చేకూర్చమని, ఆ వ్యాధి తన దేహం పైకి స్వీకరిస్తానని వేడుకోగా శ్రీకృష్ణుడు అనుగ్రహించారట. అలా స్వీకరించిన వ్యాధితో పీడింపబడుతూ ఆ బాధ భరించలేక గురువాయరప్పన్ ను శరణుకోరుతూ నారాయణీయం వ్రాసారట. ఈ వ్యాధి నుండి నన్ను రక్షించు అంటూ మొర పెట్టుకోవడం ఈ గ్రంథంలో కనిపించడం అందుకేనట. ఇలా దశకాల రూపంలో రచిస్తూ వాటితో గురువాయరప్పన్ ను స్తుతిస్తూ వంద దశకాలూ పూర్తి చేసేటప్పటికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించిందట. ఆ అనుగ్రహంతోనే నిండు జీవితం జీవించారు అంటారు.

నారాయణీయం రచనా శైలి మార్చు

ఈ సద్గ్రంథం 100 దశకాలతో అలరారుతోంది. ఒక్కొక్క దశకంలో సుమారు 10 శ్లోకాలు చొప్పున 1034 శ్లోకాలు ఉన్నాయి. గురువాయూరు పురాధీశుడు శ్రీకృష్ణుడు. ఆ గురువాయరప్పన్ కృపను కోరుకుంటూ తాదాత్మ్యం చెందిన నారాయణ భట్ఠతిరి వారు చేసుకున్న విశిష్ట వేడుకోలు ఈ గ్రంథంగా రూపుదిద్దుకుంది. భాగవత పురాణంలోని వివిధ ఘట్టాలలో ముఖ్య విషయాన్నంతా రంగరించి భట్టతిరి వారు చేసిన మధుర రచన యిది. దీనిలో వారి ఆర్తిని హృదయాన్ని గురువాఐరోపాప పాదాలవద్ద పరచిన తీరు అపూర్వం.

పూంథానంతో స్నేహం మార్చు

నారాయణ భట్టతిరి గురువాయూర్ ఆలయంలో నారాయణీయం రచిస్తున్నప్పుడు, గురువాయరప్ప భగవంతుని యొక్క మరొక గొప్ప భక్తుడు, మలయాళంలో భగవంతుని గురించి అనేక గొప్ప రచనలు చేసిన కవి పూంథానం కూడా గురువాయరప్పన్‌ను ఆరాధించడానికి అక్కడికి వచ్చారు. ఒకరోజు పూంథానం తాను వ్రాసిన జ్ఞానప్పన అనే గ్రంథాన్ని తప్పులేమైనా ఉంటే సరిదిద్దటానికి భట్టిత్తిరి వద్దకు తీసుకువెళ్లాడు, అయితే పూంథానమ్‌కు సరైన అర్థవివరిణ తెలిసిన పదాలు తెలియదని అందుకుగాను భట్టతిరి దానిని వ్యాఖ్యానించనని కొట్టిపారేశాడు. ఇలాంటి పిచ్చి వ్రాతలకు తన సమయాన్ని వృధా చేసుకోను అని చెప్పి పంపించివేస్తాడు. ఆ తర్వాత అదేరోజు రాత్రి భగవాన్ గురువాయరప్పన్ స్వయంగా భట్టత్తిరి కలలో కనిపించి, తన జ్ఞానం కంటే పూంథానం భక్తికు తాను బద్ధుడునని విమర్శిస్తాడు. ఆమరుసటి రోజు కనువిప్పు కలిగిన భట్టితిరి పూంథానానికి క్షమాపణలు చెప్పి, తప్పులు సరిదిద్దుకుని స్నేహితులవుతారు.

రచయిత యితర రచనలు మార్చు

భట్టతిరివారు ఇతర రచనలు స్తోత్రపూరితమైనవే కాక “మనమేయోదయ” అనే పూర్వ మిమాంశ గ్రంథము మఱియు మహారాజు వైభవాన్ని కీర్తిస్తూ పనేగిరికుత్సు అనే రచన చేసారుట.

  • నారాయణీయం
  • క్రియాక్రమం లేదా అశ్వాలయనక్రియాక్రమం
  • ప్రక్రియాసర్వస్వ
  • శ్రీపాదసప్తతి (అతని చివరి రచనగా భావించబడుతుంది)
  • ధాతుకావ్య
  • స్వాహాసుధాకర
  • మత్స్యావతారం
  • రాజసూయ
  • ఉత్తర ట్రావెన్‌కోర్‌లోని వైకోమ్‌లోని వైకోమ్ శివాలయం కృతిగై నెలలో (నవంబరు-డిసెంబరు) జరుపుకునే అష్టమికంపు (అష్టమి పండుగ యొక్క చక్కని వివరణ.
  • దూతవాక్య
  • సుభద్రధారణ
  • పాంచాలిస్వయంవర

మూలాలు మార్చు

  1. Full Text in Sanskrit Wikisource
  2. Narayaneeyamu Srimadbagavatha Kadha

వనరులు మార్చు

  • శ్రీమన్నారాయణీయము, (భాగవత సారము), (శ్లోక - తాత్పర్యములు), (తెలుగు), అనువాదకులు - శ్రీమాన్ ఎన్ నరసింహాచార్యులు, ప్రచురణ - గీతాప్రెస్, గోరఖ్ పూర్, ఉత్తర ప్రదేశ్.ఏడవ పునర్ముద్రణ 2014