యజ్ఞశ్రీ శాతకర్ణి

యజ్ఞశ్రీ శాతకర్ణి సా.శ.167 నుండి 196 వరకు భారతదేశాన్ని పరిపాలించిన శాతవాహన చక్రవర్తి. పురాణాలలోని యజ్ఞశ్రీ శాతకర్ణి ఆంధ్ర శాతవానులలో చివరి గొప్ప చక్రవర్తిగా పరిగణించబడ్డాడు. శాసనాలు, నాణేలు ఇతన్ని గౌతమీపుత్ర శ్రీయజ్ఞ శాతకర్ణి అనివ్యవహరిస్తున్నవి. నాసిక్, కన్హేరీ, చిన గంజాములలో ఈయన కాలపు శాసనాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, బేరార్, కొంకణ్, సౌరాష్ట్ర, మహారాష్ట్రలలో ఇతని నాణేలు లభించినవి. అందుచేత యజ్ఞశ్రీ శాతవాహన సామ్రాజ్య బలగౌరవాలను పునరుద్ధరించాడని భావించవచ్చు. క్షహరాట వంశములో జీవదాసు, రుద్రసింహుల మధ్యవచ్చిన అంతఃకలహాన్ని అవకాశంగా తీసుకొని యజ్ఞశ్రీ కొంకణ, సౌరాష్ట్ర ప్రాంతాలను జయించాడు. మత్స్య పురాణంలోని రాజవంశాల జాబితా ఈయన ప్రసక్తిని బట్టి 29 సంవత్సరాల పాటు పాలించినట్టు తెలుస్తున్నది. ఈయన పాలనాకాలంలో వాసిష్టీపుత్ర శాతకర్ణి కాలంలో శకులకు కోల్పోయిన కొంత రాజ్యాన్ని తిరిగి సాధించాడు. పశ్చిమ క్షత్రాపుల (క్షహరాటులు) ఓడించి, వారి దక్షిణ, పశ్చిమ ప్రాంతాలను జయించి, పశ్చిమ క్షత్రాప వంశ నాశనానికి నాందిపలికాడు.

యజ్ఞశ్రీ శాతకర్ణి
శాతవాహన
యజ్ఞశ్రీ శాతకర్ణిచే ముద్రించబడిన నాణెం. బ్రిటీషు మ్యూజియం.
Reign167-196
యజ్ఞశ్రీ శాతకర్ణి (పా. సా.శ.167-196) నాణెం.

యజ్ఞశ్రీ బౌద్ధమతం పట్ల ఆసక్తి వహించి నాగార్జునాచార్యునుని పోషించాడని బలమైన సాంప్రదాయం ఉంది. నాగార్జుని పోషించిన రాజును త్రిసముద్రాధీశ్వరుడని బాణకవి హర్ష చరిత్రలో వ్రాసినాడు. చివరి శాతవాహనులలో ఈ బిరుదుకు అర్హుడు యజ్ఞశ్రీ ఒక్కడే. టిబెట్, చైనా చరిత్రకారుల రచనలను బట్టి నాగార్జునికై యజ్ఞశ్రీ శ్రీ పర్వతంలో మహాచైత్యవిహారాలను నిర్మించాడు.

యజ్ఞశ్రీ పునరుద్దరించిన శాతవాహన వైభవం తాత్కాలికమే అయింది. శాతవాహన వంశం క్రమంగా బలహీనమై, యజ్ఞశ్రీ మరణానంతరం అనతి కాలానికే నశించింది.

మూలాలు మార్చు

  • ఆంధ్రుల చరిత్ర - డా. బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేజీ.67