రాజన్న తెలంగాణ రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో రూపొందిన 2011 నాటి సినిమా. ఈ సినిమాకు రచయిత వి.విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగార్జున, స్నేహ, బేబీ యాని ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించాడు. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పోరాట ఘట్టాలకు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఉత్తమ చిత్రం – రజత నంది తో సహా ఆరు నంది అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమా డిసెంబరు 22, 2011న విడుదలయింది.

రాజన్న
దర్శకత్వంవి.విజయేంద్రప్రసాద్
ఎస్.ఎస్.రాజమౌళి (పోరాట ఘట్టాలు)
రచనవి.విజయేంద్రప్రసాద్
జి. అజయ్ కుమార్ (మాటలు)
నిర్మాతఅక్కినేని నాగార్జున
తారాగణంఅక్కినేని నాగార్జున
స్నేహ
బేబీ యాని
Narrated byఅక్కినేని నాగేశ్వరరావు
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
అనిల్ బండారి
కాండ్రు పూర్ణ
కూర్పుకోటగిరి వేంకటేశ్వరరావు
సంగీతంఎం.ఎం.కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
డిసెంబరు 22, 2011
సినిమా నిడివి
129 నిమిషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

కథ మార్చు

ఈ కథ స్వతంత్ర భారతదేశంలో నిజాం ఉల్ ముల్క్ గా పిలవబడే హైదరాబాదు రాష్ట్రంలోని ఆదిలాబాదు జిల్లా నేలకొండపల్లి గ్రామ నేపథ్యంలో జరుగుతుంది. ఆ గ్రామం దొరసాని (శ్వేతా మీనన్) నిరంకుశ పాలనలో నలిగిపోతూవుంటుంది. అదే గ్రామంలో మల్లమ్మ (బేబీ యాని) ఆడుతూపాడుతూ అందరి ప్రేమను చూరగొంటూ తన తాత సాంబయ్య (సమ్మెట గాంధీ)తో నివసిస్తూవుంటుంది. గ్రామస్థులు తమ నాయకుడు రాజన్న సమాధిని ఓ తులసికోటలా నిర్మించుకుని పవిత్రంగా పూజిస్తుంటారు. దాని పట్ల ఆకర్షితురాలైన మల్లమ్మ తన తాత మాటను లెక్కచేయకుండా పదే పదే అక్కడికి వెళుతూవుంటుంది.

ఇదిలావుండగా, గ్రామంలోని పిల్లలు ఎవరైనా చదువుకోవాలంటే దొరసానికి చదువు పన్ను కట్టి పాఠశాలలో చేరాలి. అందుకోసం మల్లమ్మను దొర ఘడికి తీసుకొనివెళ్తాడు సాంబయ్య. అక్కడ దొరసాని కూతురు సంగీతం నేర్చుకుంటూవుండగా, దానికి ఆకర్షితురాలై పాట పాడిన మల్లమ్మను దొరసాని కొరడాతో కొట్టి, ఇకపై మల్లమ్మ పాట తనకు వినబడకూడదని చెబుతుంది.

ఓ రోజు, మల్లమ్మ తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటూ పాడే పాటను విన్న దొరసాని మల్లమ్మను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం నుండి తన మనవరాలిని కాపాడుకున్న సాంబయ్య దొరసానికి దొరకకుండా ఊరు వదిలి పారిపోవడానికి నిశ్చయించుకొని రైల్వేస్టేషనుకి వెళ్తాడు. మల్లమ్మ రైలు ఎక్కలేదని గ్రహించి తనని వెతుక్కుంటూ వెళ్ళగా, ఓ మూల కూర్చొని ఏడుస్తున్న మల్లమ్మను నిలదీస్తాడు. తమ ఊరిని, అందులోవున్న రాజన్నను వదిలి రాలేనని చెబుతుంది మల్లమ్మ. అప్పుడు మల్లమ్మ రాజన్న కూతురేనని చెబుతాడు సాంబయ్య. ఇంతలో వీరిద్దరి ఆచూకి తెలుసుకున్న దొరసాని సాంబయ్యను హతమార్చి, మల్లమ్మను గుడిసెలో బంధించి దానికి నిప్పు పెట్టిస్తుంది. రాజన్న సమాధిని కూల్చివేస్తుంది. తమ ఊరిలోని సంగీత మాష్టారు కులకర్ణి (నాజర్) సాయంతో మల్లమ్మ తప్పించుకుంటుంది. గుడిసెతో పాటు మల్లమ్మ కూడా కాలిపోయిందనుకొని దొరసాని వెళ్ళిపోతుంది.

మరుసటిరోజున, దొరసానికి దొరకకుండా ఊరు వదిలి వెళ్ళిపొమ్మని గ్రామస్థులు తమ దగ్గరున్న ధనమిచ్చి మల్లమ్మను సాగనంపుతారు. వెళ్ళే సమయంలో తన తల్లిదండ్రుల సమాధి నుండి మట్టిని తీసుకొని బయలుదేరుతుంది మల్లమ్మ. దొరసాని నుండి తమ ఊరిని విడిపించగల అధికారం భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కి మాత్రమే ఉందని ఒకసారి కులకర్ణి చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని ఢిల్లీకి బయలుదేరుతుంది మల్లమ్మ. దారిలో ఓ దొంగ మల్లమ్మ దగ్గరున్న డబ్బుని కాజేయడంతో కాలినడకనే ఢిల్లీకి పయనమవుతుంది. దారిలో అనేక ఇబ్బందులు ఎదురుకొని చివరకు ఢిల్లీ చేరుతుంది. అక్కడ ఓ తెలుగు దంపతులు మల్లమ్మను చేరదీస్తారు. నెహ్రు ప్రతి నెల ఒకటోతారీఖున ప్రజలను కలుస్తారని తెలుసుకొని, వారింట్లోనే ఉండి పని చేసుకుంటూ ఒకటోతారీఖు రాగానే నెహ్రుని కలవడానికి వెళ్తుంది మల్లమ్మ. కానీ జనం మధ్య తొక్కిసలాటలో కలవలేకపోతుంది. తరువాత మల్లమ్మను గమనించిన నెహ్రు సన్నిహితుడు శ్యామశాస్త్రి (విజయకుమార్) నెహ్రు పుట్టినరోజున జరిగే పాటల పోటిలో మల్లమ్మ చేత పాడించే ఏర్పాటు చేస్తాడు.

జరిగిన విషయమంతా మల్లమ్మ కులకర్ణికి ఉత్తరం వ్రాస్తుంది. కానీ ఆ ఉత్తరం కులకర్ణికంటే ముందే దొరసానికి చేరగా, కులకర్ణిని తీసుకొని మల్లమ్మను చంపడానికి ఢిల్లీకి బయలుదేరుతుంది దొరసాని. మల్లమ్మను చేరదీసిన దంపతులను కొట్టి, కులకర్ణి, మల్లమ్మలను ఓ గదిలో బంధించి పాటల పోటి ముగిసేవరకు వదలద్దని తన మనుషులకు చెబుతుంది. నిరాశపడిన మల్లమ్మను ఊరడించడానికి, రాజన్న గురించి చెప్పడం మొదలుపెడతాడు కులకర్ణి.

బ్రిటీషువారిని ఎదిరించి పోరాడి భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో తనదైన పాత్ర వహించిన రాజన్న (అక్కినేని నాగార్జున) ఆదిలాబాదు జిల్లా నేలకొండపల్లిలో అడుగుపెడతాడు. నిజాం నిరంకుశత్వంలో నలిగిపోతున్న ప్రజల కష్టాలను గమనిస్తాడు. ఓ చోట ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ నవాబు చేయి నరికి అందరిని కాపాడతాడు. ఆ నవాబు రాజన్న ఉన్న ఊరి మీద మళ్ళీ దాడికి రాగా, తన పాటతో అక్కడి ప్రజలను ప్రేరేపించి దొరలను తరిమికొట్టిస్తాడు. లచ్చువమ్మ (స్నేహ)ను చెరపట్టిన నవాబుని లచ్చువమ్మతోనే చంపిస్తాడు. దాంతో ఊరి ప్రజల నమ్మకాన్ని సంపాదించిన రాజన్న తన పాటలతో ప్రజలను ప్రేరేపిస్తూ, దొరలపై తిరగబడేలా చేస్తూ దొరలకు ఆటంకంగా మారుతాడు. మరోప్రక్క, లచ్చువమ్మను పెళ్ళి చేసుకుంటాడు రాజన్న.

రాజన్నను అడ్డుకోవడానికి దొరలు రజాకార్ల సాయం తీసుకుంటారు. గ్రామస్థులను కాపాడడానికి బ్రిటిషువారితో పోరాటంలో తనకు సాయపడిన మిత్రులను కూడగట్టి రజాకార్లని అంతం చేసి, ఆ పోరులో తమ మిత్రులతో కలిసి ప్రాణాలు విడుస్తాడు రాజన్న. రాజన్న మరణం తరువాత నేలకొండపల్లి తిరిగి దొరల ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ ఊరి ప్రజలు రాజన్నను తమ దేవుడిగా పూజిస్తూవుంటారు. ఇదిలావుండగా, గర్భిణి అయిన లచ్చువమ్మ మల్లమ్మకు జన్మనిచ్చి దొరల చేతిలో మరణిస్తుంది. లచ్చువమ్మను దొరలకు దొరకకుండా రహస్యంగా పెంచుకుంటాడు సాంబయ్య.

రాజన్న కథ విన్న మల్లమ్మ తన ఊరికి దొరసాని పీడను వదిలించాలన్న సంకల్పంతో కులకర్ణి సాయంతో తప్పించుకొని పాట పోటికి వెళ్తుంది. కానీ ఆ సమయానికే పోటి ముగిసిపోగా, ఎవరు లేని హాలులో గొంతెత్తి పాడుతుంది మల్లమ్మ. అది విన్న నెహ్రు మల్లమ్మను కలిసి తన సమస్యను గురించి తెలుసుకుంటాడు. సైన్యాన్ని పంపి నేలకొండపల్లిని దొరసాని నుండి విడిపించి అక్కడ అభివృద్ది కార్యక్రమాలు చేపడతాడు.

రాజన్న విగ్రహాన్ని ఊరిలో ప్రతిష్ఠించి మల్లమ్మ దానికి పూలమాల వేయడంతో సినిమా ముగుస్తుంది.

నటినటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

నిర్మాణం మార్చు

నటీనటుల ఎంపిక మార్చు

రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించనున్నారని 2010లో ప్రకటించాడు.[1] నాగార్జునకు జోడిగా స్నేహను ఎంచుకోవడం జరిగింది. శ్రీరామదాసు సినిమా తరువాత నాగార్జున, స్నేహ కలిసి నటించిన సినిమా ఇది.[2][3] మలయాళం నటి శ్వేతా మీనన్ ను దొరసాని పాత్ర కోసం ఎంచుకున్నారు.[4] బేబీ యానిని మరో ముఖ్యపాత్ర కోసం ఎంచుకున్నారు.[5]

చిత్రీకరణ మార్చు

ఈ సినిమాలోని పోరాట ఘట్టాలకు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కళా దర్శకుడు ఎస్.రవీందర్ ప్రొడక్షన్ డిజైనరుగా పని చేశాడు. తెలుగు సినిమాలో మొదటిసారి ప్రొడక్షన్ డిజైనరు ఈ సినిమాకే పని చేయడం జరిగింది. ప్రొడక్షన్ డిజైనరు సెట్లు, మేకప్, దుస్తులు, సినిమా ప్రేక్షకుడికి ఇచ్చే అనుభూతి, ఇలా పలు విషయాల్లో బాధ్యత వహించాల్సి ఉంటుంది.[6] 1940లలోని తెలంగాణ వాతావరణం ప్రతిబింబించేలా రవీందర్ నేతృత్వంలో ఒక గ్రామాన్ని, ఓ దొర ఘడిని నిర్మించాడు. ఏప్రిల్ 5, 2011న ఆ సెట్లో అగ్నిప్రమాదం జరిగి 70 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. మరో రెండు వారల తరువాత ఆ సెట్లో షూటింగ్ మళ్ళీ ప్రారంభించారు.[7]

సంగీతం మార్చు

ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాటలు వేల్ రికార్డ్స్ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలయ్యాయి. తెలంగాణ జానపదం శైలిలో సాగే ఈ పాటలు శ్రోతల ఆదరణతో పాటు విమర్శకుల మెప్పుని కూడా పొందాయి.

"కాలిగజ్జె" అనే పాటను తెలంగాణ జానపద గాయకుడు "మెట్టపల్లి సురేందర్" రచించి, స్వరపరచడం జరిగింది. “కరకురాతి గుండెల్లో” అనే పాటను ఆల్బమ్ కోసం కీరవాణి, కైలాష్ ఖేర్ కలిసి పాడినప్పటికీ సినిమాలో కీరవాణి పాడిన వెర్షన్ ఉంచడం జరిగింది. కైలాష్ ఖేర్ పాడిన వెర్షన్ తనకి అమితంగా నచ్చినప్పటికీ, దర్శకుడు విజయేంద్రప్రసాద్, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రియల ప్రోద్బలంతో తను పాడిన వెర్షనునే సినిమాలో ఉంచాడు కీరవాణి. సుద్దాల అశోక్ తేజ వ్రాసిన “వెయ్ వెయ్” అనే పాటలో మొదటి వాక్యాలు తన తండ్రి సుద్దాల హనుమంతు రచనల్లోంచి తీసుకొని ఈ సినిమాకు తగ్గట్టుగా మార్చాడు.[8]

సం.పాటపాట రచయితగానంపాట నిడివి
1."గిజిగాడు"కె.శివశక్తిదత్తసంజీవ్ చిమ్మల్గి,కాలభైరవ2:53
2."రా రీ రో రేలా"అనంత శ్రీరాంరేవంత్,సాహితి, శ్రావణ భార్గవి, మధుమిత,అమృతవర్షిణి,రమ్య3:34
3."కరకురాతి గుండెల్లో"కె.శివశక్తిదత్తఎం.ఎం.కీరవాణి, కైలాష్ ఖేర్3:32
4."లచ్చువమ్మ లచ్చువమ్మ"సుద్దాల అశోక్ తేజదీపు, శ్రావణ భార్గవి4:57
5."చిట్టిగువ్వ"అనంత శ్రీరాంసంజీవ్ చిమ్మల్గి,వేణు, శివాని,రమ్య3:17
6."ఒక్క క్షణం"అనంత శ్రీరాంరాహుల్ నంబియార్, దీపు, రేవంత్, బాలాజీ, పృథ్వీ చంద్ర1:52
7."గూడు చెదిరి కోయిల"కె.శివశక్తిదత్తశ్వేత పండిట్3:39
8."కాలిగజ్జె"మెట్టపల్లి సురేందర్మెట్టపల్లి సురేందర్, చైత్ర1:35
9."వెయ్ వెయ్"సుద్దాల అశోక్ తేజరేవంత్3:17
10."దొరసాని కొరడా" ఎం.ఎం.కీరవాణి, అమృతవర్షిణి1:11
11."మేలుకోవే చిట్టితల్లి"చైత్రన్య ప్రసాద్సుదర్శిని2:12
12."అమ్మ అవని"కె.శివశక్తిదత్తమాళవిక4:38
Total length:36:38

అవార్డులు మార్చు

నంది అవార్డులు
మిగతా అవార్డులు

సైమా –స్పెషల్ అప్రేసియేషన్ అవార్డు (ఉత్తమ నటుడు) – అక్కినేని నాగార్జున[9]

సినీ’మా’ అవార్డు – స్పెషల్ జ్యూరీ అవార్డు (ఉత్తమ నటుడు) – అక్కినేని నాగార్జున[10]

మూలాలు మార్చు

  1. "Nagarjuna | Rajanna | Vijayendra Prasad | Rajamouli | Annapurna Studios". CineGoer.com. 1 January 2008. Archived from the original on 27 ఆగస్టు 2010. Retrieved 28 August 2010.
  2. "Sneha joins Nagarjuna in Rajanna". Sify.com. Retrieved 28 August 2010.[permanent dead link]
  3. Andhravilas.net (24 August 2010). "Sneha to romance Nagarjuna once again? – Andhravilas.com -Telugu Cinema, Telugu Movies, India News & World News, Bollywood, Songs:". Andhravilas.com. Archived from the original on 7 జూలై 2011. Retrieved 28 August 2010.
  4. "Shwetha Menon in Negative role in Rajanna". Supergoodmovies.com. Archived from the original on 9 నవంబరు 2011. Retrieved 7 November 2010.
  5. Sify.com (24 August 2011). "Rajanna child artist". Sify.com. Archived from the original on 18 ఏప్రిల్ 2012. Retrieved 24 August 2011.
  6. idlebrain.com (22 December 2011). "Telugu Movie review - Rajanna". idlebrain.com. Retrieved 30 September 2018.
  7. indiaglitz.com (5 April 2011). "Rajanna Set Fire". indiaglitz.com. Archived from the original on 8 ఏప్రిల్ 2011. Retrieved 5 April 2011.
  8. idlebrain.com (20 December 2011). "Rajanna Set Fire". idlebrain.com. Retrieved 1 October 2018.
  9. SIIMA: Nagarjuna and others for Telugu nominations – IBNLive Archived 2014-10-20 at the Wayback Machine. Ibnlive.in.com (5 June 2012). Retrieved on 2015-11-28.
  10. Kamal Haasan graces CineMAA awards 2012 – Bollywood News & Gossip, Movie Reviews, Trailers & Videos at Archived 2018-09-12 at the Wayback Machine. Bollywoodlife.com (18 June 2012). Retrieved on 2015-11-28.
"https://te.wikipedia.org/w/index.php?title=రాజన్న&oldid=4090884" నుండి వెలికితీశారు