విశ్వనాథన్ - రామమూర్తి

విశ్వనాథన్ - రామమూర్తి దక్షిణ భారతీయ సినిమా సంగీత దర్శక ద్వయం. ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి జంటగా "విశ్వనాథన్ - రామమూర్తి" పేరుతో 1952 నుండి 1965 మధ్యకాలంలో 100కు పైగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలకు సంగీత దర్శకులుగా పనిచేశారు.

విశ్వనాథన్ - రామమూర్తి
ఎం.ఎస్.విశ్వనాథన్ (కుడి) - టి.కె.రామమూర్తి (ఎడమ)
వ్యక్తిగత సమాచారం
సంగీత శైలిసినిమా సంగీతం
వృత్తిసంగీత దర్శకులు
క్రియాశీల కాలం1952 (1952)–1965

ప్రారంభ జీవితం మార్చు

ఎం.ఎస్.విశ్వనాథన్ మార్చు

1928లో కేరళలో జన్మించిన విశ్వనాథన్ సినిమాలలో నటించాలనే, పాటలు పాడాలనే కోరికతో మద్రాసు చేరుకున్నాడు. మొదట కొన్ని చిన్నచిన్న వేషాలు వేసి, సంగీత దర్శకుడు ఎం.ఎస్.సుబ్బయ్యనాయుడు వద్ద హార్మోనిస్టుగా చేరాడు. అక్కడ ఇతనికి టి.కె.రామమూర్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సి.ఆర్.సుబ్బురామన్ వద్ద సహాయకులుగా చేరారు. ఇతడు సుబ్బురామన్ వద్ద హార్మొనీ వాయించేవాడు.హార్మొనీతో పాటు ఇతడు పియానో కూడా వాయించేవాడు.

టి.కె.రామమూర్తి మార్చు

తిరుచిరాపల్లి కృష్ణస్వామి రామమూర్తి ఒక సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి కృష్ణస్వామి పిళ్ళై, తాత మలైకోట్టై గోవిందస్వామి పిళ్ళై తిరుచిరాపల్లిలో పేరుపొందిన వయోలిన్ విద్వాంసులు. బాల్యంలో ఇతడు తన తండ్రితో కలిసి అనేక కచేరీలలో పాల్గొన్నాడు. 1940 ప్రారంభంలో ఎ.వి.ఎం. స్టూడియోలో ఆర్. సుదర్శనం వద్ద అనేక సినిమాలలో వయోలిన్ సహకారం అందించాడు. తరువాత హెచ్.ఎం.వి. రికార్డింగ్ సంస్థలో వయోలినిస్టుగా చేరాడు. 1940వ దశకం చివరలో సి.ఆర్.సుబ్బురామన్ వద్ద సహాయకుడిగా చేరి అనేక సినిమాలలో పనిచేశాడు.

జంటగా సంగీత ప్రస్థానం మార్చు

సి.ఆర్.సుబ్బురామన్ ట్రూపులో విశ్వనాథన్ హార్మోనియం, రామమూర్తి వయోలిన్ సహకారాన్ని అందించేవారు. వీరిద్దరూ సుబ్బురామన్‌ను తమ గురువుగా భావించేవారు. సుబ్బురామన్ 1952లో హఠాత్తుగా మరణించినప్పుడు అతడు సంగీత దర్శకత్వాన్ని పూర్తి చేయకుండా మిగిలి పోయిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిని వీరిద్దరూ చిత్తశుద్ధితో స్వరపరిచి సకాలంలో పూర్తి చేయగలిగారు. ఈ సందర్భంగా విశ్వనాథన్ హిందీ సినిమా సంగీత జంట శంకర్ - జైకిషన్ లాగా తాము కూడా జంటగా పనిచేద్దామని రామమూర్తికి ప్రతిపాదించాడు. మొదట రామమూర్తి అయిష్టత ప్రదర్శించినా తరువాత అంగీకరించాడు.[1]


1952 నుండి 1965 మధ్యలో వీరిద్దరూ కలిసి సుమారు 100 సినిమాలకు పైగా స్వరకల్పన చేశారు. వీరి సంగీత దర్శకత్వంలో పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, శీర్కాళి గోవిందరాజన్, ఎల్.ఆర్.ఈశ్వరి, ఘంటసాల, ఎం.ఎల్.వసంతకుమారి, రావు బాలసరస్వతీదేవి, పి.లీల, జిక్కి, కె.జమునారాణి, ఎ.పి.కోమల, కె.రాణి వంటి గాయకులు పాడారు. గాయక నటులు చిత్తూరు నాగయ్య, పి.భానుమతి, ఎస్.వరలక్ష్మి వంటి వారు కూడా ఈ జంట సంగీతదర్శకత్వంలో పాటలను పాడారు.

వీరు బి.ఆర్.పంతులు, బి.ఎస్.రంగా, కృష్ణన్ - పంజు, ఎ. భీమ్‌సింగ్, ఎ.సి.త్రిలోకచందర్, సి.వి.శ్రీధర్ వంటి దర్శకుల సినిమాలకు సంగీతాన్ని అందించారు.

1965లో ఈ జంట విడిపోయి వేరు వేరుగా సినిమాలకు సంగీతాన్ని అందించారు. తిరిగి 1995లో కలిసి ఒక తమిళ సినిమాకు సంగీతం అందించారు. వీరిద్దరూ కలిసి పనిచేసిన చిట్టచివరి సినిమా అది.

పురస్కారాలు మార్చు

1963లో ఈ జంటకు శివాజీ గణేశన్ చేతుల మీదుగా "మెల్లిసై మన్నార్గళ్" (సంగీత చక్రవర్తులు) అనే బిరుదును మద్రాస్ ట్రిప్లికేన్ కల్చరల్ అకాడమీ అందజేసింది.[2] 2006లో సత్యభామ యూనివర్సిటీ ఈ జంటకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.[3] 2012లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ జంటకు "తిరై ఇసై చక్రవర్తి" అనే బిరుదును ప్రదానం చేసింది.[4][5][6]

ఫిల్మోగ్రఫీ మార్చు

విశ్వనాథన్ - రామమూర్తి సంగీత దర్శకత్వం వహించిన తెలుగు సినిమాల జాబితా
సంవత్సరం సినిమా పేరు దర్శకుడు నిర్మాణ సంస్థ వివరాలు
1953 అమ్మలక్కలు డి.యోగానంద్ కృష్ణ పిక్చర్స్ సి.ఆర్.సుబ్బురామన్‌తో కలిసి
1953 దేవదాసు వేదాంతం రాఘవయ్య వినోదా పిక్చర్స్ బ్యాక్‌గ్రౌండ్ సంగీతం
1954 ప్రజారాజ్యం ఏ.కాశీలింగం పరిమళం పిక్చర్స్
1954 మా గోపి బి.ఎస్.రంగా విక్రమ్‌ ప్రొడక్షన్స్‌ గడి పాఠ్యం
1955 విజయగౌరి డి.యోగానంద్ కృష్ణ పిక్చర్స్ జి.రామనాథన్‌తో కలిసి
1955 సంతోషం సి.పి.దీక్షిత్ జుపిటర్ పిక్చర్స్
1956 తెనాలి రామకృష్ణ బి.ఎస్.రంగా విక్రమ్ ప్రొడక్షన్స్
1957 భక్త మార్కండేయ బి.ఎస్.రంగా విక్రమ్ ప్రొడక్షన్స్
1957 కుటుంబ గౌరవం బి.ఎస్.రంగా విక్రమ్ ప్రొడక్షన్స్
1958 మహాదేవి సుందరరావు నాదకర్ణి శ్రీగణేశ మూవీటోన్
1959 రాజా మలయసింహ బి.ఎస్.రంగా విక్రమ్ ప్రొడక్షన్స్
1961 ఇంటికి దీపం ఇల్లాలే వి.ఎన్.రెడ్డి ఆర్.ఆర్.పిక్చర్స్
1962 ఆశాజీవులు బి.ఎస్.రంగా విక్రమ్ ప్రొడక్షన్స్
1962 పెళ్ళితాంబూలం బి.ఎస్.రంగా విక్రమ్ ప్రొడక్షన్స్
1962 ప్రజాశక్తి ఎ.సి.త్రిలోక చందర్ మురుగన్ బ్రదర్స్
1963 మంచి చెడు టి.ఆర్.రామన్న ఆర్.ఆర్.పిక్చర్స్
1963 విజయనగర వీరపుత్రుని కథ రట్టిహళ్లి నాగేంద్రరావు ఆర్.ఎన్.ఆర్.పిక్చర్స్ జి.కె.వెంకటేష్‌తో కలిసి
1964 ఆదర్శ సోదరులు ఎ. భీమ్‌సింగ్ శ్రీ బాలాజీ ప్రొడక్షన్స్ టి.వి.రాజుతో కలిసి
1964 దొంగనోట్లు కె.శంకర్ రమణి పిక్చర్స్ పెండ్యాల శ్రీనివాస్‌తో కలిసి
1965 ఆడ బ్రతుకు వేదాంతం రాఘవయ్య జెమినీ స్టూడియో
1965 మారని మనసులు సి.వి.శ్రీధర్ విశ్వశాంతి పిక్చర్స్ పామర్తితో కలిసి
1965 సింగపూర్ సిఐడి దాదా మిరాసి శ్రీనివాసా మూవీస్ పామర్తితో కలిసి
1966 సర్వర్ సుందరం కృష్ణన్ - పంజు టైగర్ ప్రొడక్షన్స్ పామర్తితో కలిసి

మూలాలు మార్చు

  1. Ramachandran, T. M. (17 August 1963). "Kings of Light Melody". Sport and Pastime. Vol. 17. p. 43.
  2. "Why did Viswanathan and Ramamurthy break-up their". Tfmpage.com. Archived from the original on 11 ఏప్రిల్ 2012. Retrieved 27 February 2012.
  3. "Tamil Nadu / Chennai News : Honorary doctorates for seven eminent personalities". The Hindu. Chennai, India. 4 September 2006. Archived from the original on 3 December 2007. Retrieved 6 March 2012.
  4. "Amma confers title of Thiraiyisai Chakravarthy on legendary MSV". ChennaiOnline. 30 ఆగస్టు 2012. Archived from the original on 27 సెప్టెంబరు 2013. Retrieved 12 జూన్ 2013.
  5. ExpressNewsService (30 August 2012). "CM confers Thirai Isai Chakravarthy on MSV". The New Indian Express. Archived from the original on 6 ఆగస్టు 2013. Retrieved 12 June 2013.
  6. "After Padma snub, Jaya says one day Centre will listen". Indian Express. 31 August 2012. Archived from the original on 28 మే 2021. Retrieved 12 June 2013.

బయటి లింకులు మార్చు