1268-1369 కాలానికి సంబంధించిన వేదాంత దేశికులు అపర రామానుజవతారం అని భావిస్తారు. ఇతడు నూటపాతిక దాకా సంస్కృతలో వివిధ ప్రక్రియలలో రచనలు చేశాడు. వైష్ణవమత వ్యాప్తికి ఇతోధికంగా తోడ్పడ్డాడు. ఇతని అసలు పేరు వేంకటనాథుడు. తమిళంలో కూడా గొప్ప పండితుడు. గొప్ప దార్శనికునిగా సుప్రసిద్ధుడు.[1] "వేదాన్తాచార్య", "కవితార్కిక సింహ", "సర్వతంత్ర స్వతంత్ర" మొదలైన బిరుదులను పొందాడు. ఇరవై ఏడేళ్ళ వయసులోనే ఇతడు "దేశికాచార్య" "సర్వతంత్ర స్వతంత్ర" బిరుదులను అందుకొన్నాడు. శ్రీరంగం స్వామి రంగనాధుడు దేవి రంగనాయకి స్వయంగా ఇతని భక్తికి, కవితా శక్తికి, పాండిత్యానికి మెచ్చి వేదాన్తాచార్య బిరుదు ప్రదానం చేశారని అంటారు.

కాంచీపురంలో వేదాంతదేశికుల విగ్రహం

జీవిత విశేషాలు మార్చు

ఇతడు 1268 సా.శ. విభవ నామ సంవత్సరంలో కన్యామాసంలో శ్రవణ నక్షత్రములో జన్మించాడు[2]. ఇతని జన్మస్థలం కంచికి సమీపంలోనున్న తూప్పిల్ (తిరుత్తణ్ గా) గ్రామం. ఇతడు శ్రీవైష్ణవంలో వడగలై శాఖకు చెందినవాడు. ఇతని తల్లిదండ్రుల పేర్లు తోతారంబ, అనంతసూరి. తాత పుండరీకాక్షులు. వీరు విశ్వామిత్ర గోత్రీయులు.తోతారాంబ కడాంబి అప్పుల్లార్ యొక్క సోదరి.కడాంబి అప్పుల్లార్, కడాంబి అకన్ వంశజులు.వీరు భగవద్రామానుజుల శిష్యులలో ఒకరు. దేశికుల తల్లిదండ్రులు మొదట సంతానము లేక పరితపించుచు, సదా తిరుపతి వేంకటాచలపతిపై ధ్యాన తత్పురులై పుత్రకాములై ఉండేవారు.ఒకనాడు అనంతసూరులకు స్వప్నములో వేంకటాచలపతి బాలకుడుగా దర్శనమిచ్చి, ఆలయములోని ఒకగంటను చేతికిచ్చి ఈ గంటను నీభార్యచేత మింగించవలెను అని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యెను. అదే స్వప్నములో స్వామి ఆజ్ఞానుసారము శీలవతియగు తనభార్య గంటను మింగినట్లు చూచెను. మరునాటి ఉదయమున స్వప్న వృత్తాంతము భార్యకు చెప్పగా భార్య తనకుకూడా ఇదే స్వప్నము కలిగినని చెప్పెగా ఇరువురు విస్మృతులైరి.దేవాలయములోని గంట అదృశ్యమగుట అర్చకులు దెలిసికొని అధికారికి తెలుపగా అధికారి అర్చకులను నిర్భంధములో నుంచెను. వేంకటాచలపతి స్వయముగా యతిరాజమథములోని యతులకుకూడా స్వప్నమునందు ఈ వృత్తాంతమును కీర్తించుటచే, యతులు స్వప్నవృత్తాంతానుభూతి అధికారులకు తెలిపి అర్చకులను విముక్తల గావించిరి. ప్రధానాధికారికూడా స్వయముగా ఈపుణ్యదంపతుల నోటనుండి స్వప్న వృత్తాంతమువిని ఆశ్చర్య చకితుడయ్యెను. తోతారంబ గంటను 12సం.లు ధరించిన పిమ్మట వేదాంతదేశికులు జన్మించిరి.కావున దేశికులు గంటాంశ సంభూతులని శ్రీవైష్ణవుల ప్రగాఢ విశ్వాసము.దేసికుల జన్మనామము వేంకటాచార్య.

ఇతడు తన మేనమామ అయిన ఆత్రేయ రామానుజాచార్యుల వద్ద సకల వేద విద్యలు అభ్యసించాడు. దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని తిరువయిందిర పురమ్లో గురువు ఆజ్ఞతో గడిపి గరుడాళ్వారును సేవించి అనుగ్రహం పొంది హయగ్రీవ మంత్రాన్ని ఉపాసించి అనుగ్రహానికి పాత్రుడైనాడు. అప్పటి నుంచి లక్ష్మీహయగ్రీవ భక్తుడై జీవితాన్ని చరితార్ధం చేసుకొన్నాడు. ఆసేతుహిమాచల పర్యంతం తీర్ధయాత్రలు చేసి విశిష్టాద్వైత మతప్రచారం చేశాడు. శ్రీరంగాన్ని మధురై సుల్తాన్ ఆక్రమించగా విజయనగరరాజ్య స్థాపకుడు దేశికుల సహవిద్యార్థి అయిన విద్యారణ్యస్వామి శ్రీరంగం వచ్చి ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి గోపనార్యుడు అనే బ్రాహ్మణ సైన్యాధ్యక్షునికి దక్షిణభారత దేశాన్ని ముస్లిం పాలన నుండి విముక్తి కలిగించమని ఆదేశించాడు. గోపనార్యుడు ముందుగా జెంజిని జయించి స్వాధీనపరచుకొని, తిరుపతి లోఉన్న శ్రీరంగని విగ్రహాన్ని అక్కడికి తాత్కాలికంగా తెప్పించాడు. ఆ వెంటనే శ్రీరంగంలోని సుల్తాన్ సైన్యంపై విజృంభించి ఓడించి, శ్రీరంగానాథుడిని మరల శ్రీరంగంలో ప్రతిష్ఠించాడు.

దేశికులు గృహస్థులు. వీరిభార్య తిరుమంగై. వీరి కుమారులు వరదాచార్య.వీరిగురించి పిళ్ళయ్ అంతలి అను తమిళ గ్రంథమును 20 పద్యాలలో వ్రాసిరి. దేశికులు తిరుమహేంద్రపురము, శ్రీరంగం, కాంచీపురాలలో వేతాంత తత్త్వాంశ సమాయుక్త భక్తి ప్రపత్తి రచనలను సాయించుచు జీవితమును ప్రబల వైరాగ్యానుష్ఠాన చింతనలతో గడిపి 100 సం. జీవించిరి. యమునాచార్యులు, రామానుజాచార్యులు కేవలము తమిళములోనే ప్రబంధముల సాయించిరి. కాని వేదాంత దేశికులు సంస్కృతములోను, తమిళములోను, మణి ప్రవాళము లోను (సంస్కృత, తమిళముల మిశ్రమము) 108 రచనలవరకు చేసిరి. సంస్కృతములో 28 స్తోత్రములు, 4 కావ్యములు, 1 నాటకము హయగ్రీయస్తోత్రము, సుదర్శనాష్టకము రచించారు.

మాలికాఫరు దండయాత్ర కాలములో దేశికులు అభీతిస్తవము రచించి రంగనాధుల ఉత్సవ విగ్రహములను, సుదర్శన భట్టర్ విరచిత శ్రుతప్రకాశిక అను శ్రీభాష్య ప్రసిద్ధ వ్యాఖ్యానమును కాపడగలిగిరి.

దేశికులు విద్యారణ్యుడు బాల్య స్నేహితులు.విద్యారణ్యులు విజయనగర రాజ్యమునకు మంత్రిగానున్న కాలములో ఒకసారి దేశికులను విజయనగరమునకు రమ్మనగా బుక్కరాజుని శిష్యునిగా చేసెదనని లేఖపంపెను.దానికి దేశికులు: భూభాగములో ఒకానొక మూలలోని శతాంశ భాగమును పాలించు గర్వాతిశయులైన రాజులకు స్తోత్రపద్యములను వ్రాసినవారిని ధన్యులుగా భావించను. పిడికెడు అటుకులకు సకలశ్వర్యములను కుచేలమునికి ప్రసాదించిన దయాసింధువగు శ్రీకృష్ణ పరమాత్మనే సేవించుటకు నిశ్చయము చేసికొంటిని అని వ్రాసినారు. దానికి విద్యారణ్యులు ఉపాయాంతరముగా రాజసేవ చేయనక్కరలేదు నగరమునకు వెలుపల యోజన దూరములో వేంచేసినయడల రాజు స్వయముగా వచ్చి మీపాదములవద్ద ధనమును సమర్పించి సేవించుకొనెరని వ్రాసినారు. దానికి మరల్ దేశికులు: దుష్టప్రభువుల యొక్క గృహద్వారమునకు వెలుపల అరుగులమీద కూర్చున్నవారల కొక నమస్కారము.కాటుకవంటి కాంతికలిగిన పార్ధరధి భూషణమే నాకునిరపాయమైన ధనము అని వ్రాసినారు.

కావున వీరి వైరాగ్యము, ధైర్యము, జ్ఞానము, దయ, క్షమ శమ దమ భక్తి సుదృఢత్వములకు విద్యారణ్యులు అమితాశ్చర్యము నొందిరి.

రచనలు మార్చు

వేదాంత దేశికులు సర్వార్ధ సిద్ధి, న్యాయ పరిశుద్ధి, న్యాయ సిద్ధాంజన, మీమాంసా పాదుక, అధికరణ సారావళి, శాత దూషిణి, సచ్చరిత్ర రక్ష, నిషేపరాక్ష, పంచరాత్ర రక్ష మొదలైన దార్శనిక సంబంధమైన సంస్కృత గ్రంథాలను రచించాడు. రామానుజుల "శ్రీ భాష్యా" నికి తత్వటీకను, తాత్పర్య చంద్రికలను, యామునాచార్యుల గీతార్థసంగ్రహ రక్షను, రామానుజుల గద్య త్రయానికి రహస్య రక్షను, ఈశావాస్యోపనిషత్ భాష్యం అనే వ్యాఖ్యానాన్ని రాశాడు. ద్రావిడ ప్రబంధమైన ‘’తిరువాయి మొలి’’ని సంస్కృతీకరించాడు. యాదవాభ్యుదయం అనే మహా కావ్యాన్ని, సంకల్ప సూర్యోదయం అనే నాటకాన్ని, హంస సందేశం అనే లఘుకావ్యాన్ని ,పాదుకా సహస్రం, వరదరాజ పంచాశతి, గరుడ దండకం అనే ముక్తక కావ్యాలను వ్రాశాడు. ఇతడు రామాయణ కథాసారాన్ని "రఘువీర గద్య"గా సంస్కృతంలో వ్రాశాడు. అచ్యుత శతకాన్ని ప్రాకృతంలో రచించాడు. ఇతడు సంకల్ప సూర్యోదయం అనే నాటకాన్ని వ్రాశాడు. ఇది దార్శనికతకు ప్రతీకాత్మకమైన నాటకం. ఇతడు రహస్య గ్రంథాలైన తత్వ పదవి, రహస్య పదవి, తత్వ నవనీతం, రహస్య నవనీతం, తత్వ మాతృక, రహస్య మాతృక, తత్వ సందేశం, రహస్య సందేశవివరణం, తత్వ రత్నావళి, తత్వ రత్నావళి ప్రతిపాద్య సంగ్రహం, రహస్య రత్నావళి, రహస్య రత్నావళి హృదయం, తత్వ త్రయ చూలకం, రహస్య త్రయ చూలకం, అభయ ప్రదానసారం, రహస్య శిఖామణి, అంజలి వైభవం, ప్రదాన శతకం, ఉపహార సంగ్రహం, సార సంగ్రహం, మునివాహన భోగం, మధురకవి హృదయం, పరమపద సోపానం, పరమత భంగం, హస్తిగిరి మహాత్మ్యం, శ్రీమత్ రహస్య త్రయ సారం, సారసారం, పరిహారం ఇత్యాదులను రచించాడు.

యాదవాభ్యుదయం మార్చు

ఇతని యాదవాభ్యుదయం కావ్యంలో ఇరవైనాలుగు సర్గాలున్నాయి. శ్రీకృష్ణ చరిత్రకావ్యం ఇది. కృష్ణుని జీవితం లోని ప్రతి సంఘటన వెనుక ఉన్న దార్శనికార్ధాన్ని కమ్మని శైలిలో వర్ణించాడు. ఈ కావ్యానికి అప్పయ్య దీక్షితులు వ్యాఖ్యానం రాయటం మరో విశేషం. వర్ణనలలో వేదాన్తపర మైన ఉపమానాలను వాడటం దేశికుల ప్రత్యేకత. ఉదా:- ‘’వివిధ ముని గణోప జీవయా తీరదా విగామిత సర్ప గణా పరేణ పుంసా –అభిజిత యమునా విశుద్ధ ముగ్ర్యాం శమిత మహిర్మాట సంప్లవా త్రయీవ ‘’- అర్థం:- మూడు వేదాలని చదువుకొన్న వాడి చేత ఇతర మతాలూ ఏ విధంగా శమింపచేయ బడతాయో అదే విధంగా యమునానది సర్పాలనన్నిటిని పారద్రోలిన తర్వాత పరిశుద్ధమై విశుద్ధంగా ప్రకాశిస్తోంది.

హంస సందేశం మార్చు

రాముడు హంస ద్వారా సీతా దేవికి సందేశం పంపటం ఇందులోని వృత్తాంతం. దక్షిణదేశం గుండా హంస పర్యటించి, సముద్రం మీద రామబాణం లాగా దూసుకు వెళ్లి యెగిరి లంక చేరి రామ సందేశాన్ని సీతకు అందజేస్తుంది.

పాదుకా సహస్రం మార్చు

వేదాంతదేశికుల ‘’పాదుకా సహస్రా"న్ని ‘’మాగ్నం ఓపస్’’గా భావిస్తారు. ఇది1008 శ్లోకాల భక్తిమాల. ఇందులో ముప్ఫై రెండు పదాదిలు ఉన్నాయి. రోజుకు ఒకటి చొప్పున ముప్ఫై రెండు రోజులలో దీన్ని భక్తితో పఠిస్తే కోరికలు తీరి మోక్షం లభిస్తుంది అని భక్తుల నమ్మకం. చిత్ర పదాలతో లలితసుందరంగా రాసిన భక్తి కుసుమమాల ఇది. ముఖ్యంగా శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీ రంగనాధస్వామి పాదపద్మాలపై రాసిన శ్లోక సముదాయం. ఇది చదివితే ఆత్మజ్ఞానం లభిస్తుందంటారు.

మూలాలు మార్చు

  1. "గీర్వాణకవుల కవితాగీర్వాణం - గబ్బిట దుర్గాప్రసాద్". Archived from the original on 2016-06-30. Retrieved 2016-12-28.
  2. సకల విద్యాప్రదాయని .. కంచి నారాయణుని సన్నిధి - జి.ఎల్.నరసింహప్రసాద్[permanent dead link]