శ్యామయ్య అయ్యంగార్

భారత రాజకీయ నాయకులు

హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ కాలంలో పోలీసు, పోస్టాఫీసు మంత్రి. పోస్టాఫీసు ఇంటెలిజెన్స్ విభాగంగా కూడా పనిచేసేది. అతణ్ణి అంచే శ్యామయ్య అని కూడా అంటారు. [1] వాసుదేవ అయ్యంగార్ కుమారుడు. [1] అతను కర్ణాటక, కోలార్ జిల్లా, బంగారపేట లోని బుడికోటె వద్ద గల శూలికుంటె గ్రామానికి చెందినవాడు.[1] శ్యామయ్య యువకుడిగా ఉన్నప్పుడు హైదర్‌ను కలిశాడు. 1776 లో తపాలా కార్యాలయం, పోలీసు (యాంచె గురితన) అధిపతిగా నియమితుడయ్యాడు. ఈ పదవిలో అతను అత్యున్నత స్థాయికి ఎదిగాడు (కొంతమంది చరిత్రకారులు ఈ తేదీని 1779 అని అంటారు). అతన్ని గొడుగు, పతకం, ముత్యాల హారంతో సత్కరించారు. హైదర్ అలీ నుండి 5000 వరహాలను బహుమతిగాను 1000 వరహాలను భత్యంగానూ పొందాడు.

టిప్పు సుల్తాన్ కాలంలో, 1783 లో టిప్పును పడగొట్టడానికీ, తిరిగి హిందూ రాజును స్థాపించడానికీ కుట్ర జరిగింది. దానికి శ్యామయ్య నాయకుడని నమ్మారు. చాలా మంది కుట్రదారులను తక్షణమే చంపేసారు. శ్యామయ్యకు ఆ శిక్ష ఎందుకు పడలేదో తెలియదు. టిప్పు అతన్ని భారీ ఇనుప గొలుసులతో ఉంచమని ఆదేశించాడని, అప్పుడప్పుడూ ఆహారం ఇచ్చేవారని, బహిరంగంగా కొట్టేవారని, వీపు పైన కారం అద్దేవారనీ, ఆ తరువాత కళ్ళు పీకేసారనీ భావిస్తారు.

శ్యామయ్య, అతని సోదరుడు రంగయ్య తిరుగుబాటులో తమకు ఎటువంటి ప్రమేయమూ లేదని చివరి వరకూ ఖండిస్తూనే ఉన్నారు. దర్బారులోని ఇతర మంత్రులు అతడిపై అసూయతో వేసిన రాజకీయ కుట్రకు శ్యామయ్య బలయ్యాడని ఆయన కుటుంబ అనుచరులు భావిస్తారు. 1784 లో శ్యామయ్యను చంపేసారని కొన్ని కథనాలు చెబుతున్నాయి, అయితే 1793 లో శూలికుంటే వద్ద సాంటే (వీక్లీ మార్కెట్) నడపడానికి టిప్పు నుండి సనద్ (అనుమతి / మంజూరు) అందుకున్నాడనీ, 1821 లో అతనికి ఒక కుమారుడు జన్మించాడని ఇనామ్ రికార్డ్స్ చూపిస్తున్నాయి.

చివరి ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో శ్యామయ్య కుమారుడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి, ఛాతీలో తుపాకీ కాల్పుల కారణంగా చనిపోయినప్పుడు టిప్పు శ్యామయ్యను క్షమించాడని గిడ్వానిస్ పుస్తకం సూచిస్తుంది. [2] శ్యామయ్య అన్నయ్య రంగయ్య అయ్యంగార్ కూడా టిప్పు కింద పనిచేసిన ఉన్నతాధికారి. [1] అతని తమ్ముడు అప్రమేయకు కూడా ప్రభుత్వంలో స్థానం లభించింది.

అతన్ని అనేక రికార్డులలో అంచే శ్యామయ్య, ఇంచివాలా, అంచెవాలా, షామియా అని కూడా ప్రస్తావించారు. రంగయ్యను కూడా బంగియా, రగియా అని చాలా రికార్డులలో పేర్కొన్నారు.

టిప్పు సుల్తాన్ కి వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించినది మీర్ సాదిక్. ప్రమాదవశాత్తు టిప్పు సుల్తాన్ మీర్ సాదిక్ ని కాకుండా శ్యామయ్యని అనుమానించడం జరిగింది.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 Hayavadana, Rao Conjeeveram. Mysore Gazetteer: Compiled for Government. Bangalore: Government, 1930. Print.
  2. Bhagwan S. Gidwani, The Sword of Tipu Sultan ISBN 81-291-1475-5 .