సితార పూర్ణోదయా మూవీస్ పతాకంపై వంశీ దర్శకత్వంలో, సుమన్, భానుప్రియ, శరత్ బాబు, శుభలేఖ సుధాకర్ ప్రధానపాత్రల్లో నటించిన 1984 నాటి తెలుగు చలనచిత్రం.

సితార
(1984 తెలుగు సినిమా)

సితార చిత్ర ప్రచార చిత్రం
దర్శకత్వం వంశీ
నిర్మాణం ఏడిద నాగేశ్వరరావు,
ఏడిద రాజా
కథ వంశీ (నవల - "మహల్‌లో కోకిల")
తారాగణం సుమన్,
భానుప్రియ,
శుభలేఖ సుధాకర్,
శరత్ బాబు,
ఏడిద శ్రీరాం,
జె.వి. సోమయాజులు,
మల్లికార్జునరావు,
రాళ్ళపల్లి,
సాక్షి రంగారావు
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి. శైలజ,
ఎస్. జానకి,
పి. సుశీల
నృత్యాలు పారుపల్లి శేషు
గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి
సంభాషణలు సాయినాధ్
ఛాయాగ్రహణం ఎం.వి. రఘు
కూర్పు అనిల్ మల్నాడ్
నిర్మాణ సంస్థ పూర్ణోదయా మూవీ క్రియెషన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఒకప్పుడూ గొప్పగా వెలిగి ఆరిపోయిన రాజాస్థానాలలో ఒకదాని యజమాని చెల్లెలు సితార (భానుప్రియ). ఆమెను గొప్ప జమిందారుకు ఇచ్చి పెళ్ళీ చేయాలని అనుకుంటాడు ఆమె అన్న. ఆ సంస్థానానికి పగటి వేషగాళ్ళుగా వచ్చిన వారిలో కల ఒక వ్యక్తిని (సుమన్) ప్రేమిస్తుంది సితార. కాని అతడితో పెళ్ళి మాత్రం సాద్యపడదు. తదనంతర కాలంలో ఆమె గొప్ప నటి అవుతుంది. ఆఖరున ఆమెను అతడు కలవడంతో కథ సుఖాంతమవుతుంది.

మంచు పల్లకి సినిమా ద్వారా తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమైన వంశీ రెండో సినిమా ఇది. భానుప్రియ ఈ సినిమా ద్వారానే నాయికగా పరిచయమైంది. వంశీ తానె రాసుకున్న మహల్లో కోకిల అనే నవలను కొద్దిపాటి మార్పులతో రూపొందించిన సితార 1984 లో విడుదలై ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకుంది. వెన్నెల్లో గోదారి అందం పాటకు గాను ఎస్.జానకికి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం లభించింది.

సంక్షిప్త చిత్రకథ మార్చు

ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ దేవదాస్ (శుభలేఖ సుధాకర్) రైలులో ప్రయాణం చేస్తూ, టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి (భానుప్రియ) కి సహాయం చేయడం కోసం టికెట్ కలెక్టర్ కి ఆమెని తన భార్య సితారగా పరిచయం చేస్తాడు. ఆమెకి ఎవరు లేరని తెలుసుకుని తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఆమె మోడలింగ్ అవకాశాలు ఇస్తాడు. తన గతాన్ని గురించి అడగరడనే కండిషన్ పై అతనితో కలిసి పనిచేస్తుంటుంది సితార. ఆమెకు సినిమా అవకాశాలు రావడంతో తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారుతుంది. డబ్బు, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించినా, తన గతాన్ని తల్చుకుని బాధపడే సితారకి ఆ బాధని తనతో పంచుకోమని సలహా ఇస్తాడు తిలక్.

గోదావరి తీరంలోని ఓ పల్లెటూళ్ళో రాజుగారుగా పిలవబడే చందర్ (శరత్ బాబు) చెల్లెలు కోకిల. పాడుబడ్డ భవంతిలో ఆ అన్నాచెల్లెళ్ళు మాత్రమే ఉంటూ ఉంటారు. ఆస్తులు పోయినా, పరువుకి ప్రాణం ఇచ్చే చందర్, ఓ కోర్ట్ కేసు గెలవడం ద్వారా ఆస్తులు తిరిగి సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. రాణివాసంలో ఉండే కోకిలకి బయటి ప్రపంచం తెలీదు. చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతం, నాట్యాలతో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. కోర్ట్ కేసు నిమిత్తం చందర్ ఓ పది రోజులు కోట విడిచి వెళ్తాడు. అదే సమయంలో ఊళ్లోకి వచ్చిన పగటి వేషగాళ్ళ నృత్యాలను కోటలోంచి రహస్యంగా చూస్తూ ఉంటుంది కోకిల. ఆ బృందంలో రాజు (సుమన్) ని ఇష్టపడుతుంది. రాజుతో ఆమె పరిచయం ఊరి జాతరకి రహస్యంగా అతనితో కలిసి వెళ్ళడం వరకు వస్తుంది. కోర్ట్ కేసు ఓడిపోవడంతో కోటకి తిరిగి వచ్చిన చందర్ కి కోకిల ప్రేమ కథ తెలియడంతో రాజుని చంపించి, తను ఆత్మహత్య చేసుకుంటాడు.

తన పుట్టు పూర్వోత్తరాలు రహస్యంగా ఉంచమని కోకిలనుంచి మాట తీసుకుంటాడు చందర్. తిలక్ కి సితార తన గతాన్ని చెప్పడం విన్న తిలక్ స్నేహితుడైన ఓ జర్నలిస్టు (ఏడిద శ్రీరామ్) ఆమె కథని ఓ పుస్తకంగా ప్రచురిస్తాడు. తన గతం అందరికి తెలియడానికి తిలక్ కారణమని నమ్మిన సితార అతన్ని ద్వేషిస్తుంది. ఐతే ఆ పుస్తకం కారణంగా రాజు బ్రతికే ఉన్నదని తిలక్ కి తెలుస్తుంది. జర్నలిస్టు సహాయంతో ఆటను రాజుని వెతికి, ఆత్మహత్య చేసుకోబోతున్న సితారతో కలిపి ఆమెని రక్షించడంతో సినిమా ముగుస్తుంది.

తారాగణం మార్చు

నిర్మాణం మార్చు

అభివృద్ధి మార్చు

ఇది దర్శకునిగా వంశీ రెండవ సినిమా. అప్పటికి రీమేక్ గా మంచుపల్లకి తీశారు. అయితే తనకు రీమేక్ ఇష్టం లేకపోయినా రీమేక్ గా దాన్ని తీయాల్సివచ్చింది, పైగా సినిమాలో తనకు నచ్చినట్టు సంగీతాన్ని చేయించుకునే స్వేచ్ఛ కూడా కొరవడింది. అలాంటి నేపథ్యంలో రెండో సినిమాకు కథను కూడా అంతకుముందు తానే రాసిన నవల నుంచి తీసుకున్నారు. వంశీ తనకు చతుర నవలల పోటీలో బహుమతి మహల్లో కోకిల నవల కథను తీసుకుని సితార సినిమాగా రాసుకున్నారు.[1] నవలలోని కొన్ని పాత్రలను తగ్గించి, అందులోని మెలోడ్రామా వంటి లోపాలను దిద్దుకుని స్క్రిప్ట్ తయారుచేసుకున్నారు వంశీ. నవల ముగింపును కూడా మార్చుకుని సినిమాకు వేరే క్లైమాక్స్ రాసుకున్నారు. నవలారచయితే సినిమాకు రచన, దర్శకత్వం చేయడంతో తన నవలలో ఆత్మను నిలబెట్టుకుంటూనే అవసరమైన మార్పులు చేయగలిగారు.[2] సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు ప్రముఖ రచయిత, దర్శకుడు జంధ్యాల సహాయకుడు సాయినాథ్ తో రాయించారు.[3]

నటీనటుల ఎంపిక మార్చు

సినిమాలో కథానాయికగా నటించిన భానుప్రియకు తెలుగులో ఇదే తొలిచిత్రం.[4] నిర్మాత కొడుకు ఏడిద శ్రీరాం, తిలక్ అనే జర్నలిస్టుగా నటించాడు. సుమన్‌కు సాయికుమార్, భానుప్రియకు ఎస్.జానకి సోదరి లక్ష్మి డబ్బింగ్ చెప్పారు.[3]

చిత్రీకరణ మార్చు

సితారకు సినిమాటోగ్రాఫర్ గా ఎం.వి.రఘు పనిచేశారు.[3] సినిమాలో కనిపించే జమీందారు కోట, అందులోని సన్నివేశాలు వెంకటగిరి ప్రాంతంలోని ఓ పాడుబడ్డ కోటలో చిత్రీకరించారు. దాంతో బంగళాలోంచి చూస్తే గోదావరి కనిపించే షాట్ చిత్రీకరించాలని దర్శకుడు వంశీ ఎంతగానో అనుకున్నా అది సాధ్యపడలేదు. సినిమాలో దేవీపట్నంలోని కంపెనీ రేవు నుంచి మొదలుపెట్టుకుని గోదావరి నది పొడవునా షూటింగ్ చేసుకుంటూ అలాగే పాపికొండలు వరకూ వెళ్ళిపోయారు చిత్రబృందం. ఆ క్రమంలోని సినిమాలో గోదావరి నది కనిపించే షాట్లు, ఆ నదీతీరంలో కనిపించే పలు సన్నివేశాలు తీశారు.[5] సినిమా చిత్రీకరణకు రౌండ్ ట్రాలీ వంటి అప్పటికి కొత్త టెక్నాలజీ ఉపయోగించారు. దక్షిణ భారతదేశంలో అప్పటికి రౌండ్ ట్రాలీ షూటింగ్ లో ఉపయోగించిన తొలి చిత్రంగా నిలిచింది సితార.[1] "కుకుకూ" పాట చిత్రీకరణలో చివరి నిమిషంలో మార్పులు చేసారట వంశీ. ఇందుకు కారణం పాటలో నర్తించే జూనియర్ ఆర్టిస్ట్ లు కొంచం వయసు మళ్ళిన వాళ్ళు కావడమే. షూటింగ్ ఆపటం ఇష్టం లేక, వారి ముఖాలు చూపకుండా కేవలం చేతులు మాత్రం చూపుతూ పాటని చిత్రీకరించారు.[2] వాళ్ళ కోసం ఖరీదైన కాస్ట్యూంస్ కుట్టించారు, సరిగ్గా సమయానికి చూస్తే వాళ్ళు దర్శకుడు అనుకున్నదాని కన్నా వయసుమళ్ళిన వాళ్ళు. షూటింగ్ నిలిపివేయడం ఇష్టం లేక వంశీ వాళ్ళకే ఆ దుస్తులు తొడిగి చేతులు, కాళ్ళు చూపిస్తూ ముఖాలు చూపించకుండా చిత్రీకరించారు. ఇదే పాటకు వంశీ వందలాది చిలకలు ఎగురుతూండగా అద్భుతమైన దృశ్యాలతో తీయాలని ఊహించుకున్నారు. అయితే నిర్మాత అన్ని చిలకలు తీసుకురావడం సాధ్యం కాదని, ఓ పాతిక చిలకు ఇచ్చారు. దాంతో ఉన్న చిలకలతోనే కెమెరా, షాట్ డివిజన్లో తెలివిగా చేసి చాలా చిలకలున్నట్టు భ్రమింపజేసి తీశారు.[3] ఇళయరాజాతో పాటలు ట్యూన్ చేయించుకోవడంలో ఒక్క పాట మాత్రం ట్యూన్ చేయించుకోవడం అవ్వలేదు. దాంతో సినిమాలో మొట్టమొదట వచ్చే ఆ పాటను ముందు తన అంచనా ప్రకారం చిత్రీకరించేసి, దాన్ని ఇళయరాజాకు వేసి చూపిస్తే ఆయన ట్యూన్ కట్టారు. అదే జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన పాట.

శైలి మార్చు

గోదావరి పట్ల వంశీకి ఉన్నమక్కువ టైటిల్స్ నుంచి చాలా చోట్ల కనిపిస్తుంది. అలాగే పాటల చిత్రీకరణలో వంశీ మార్కును చూడవచ్చు. కోకిలని పంజరంలో చిలుక లా చూపే సింబాలిక్ షాట్స్, చందర్ అసహాయతను చూపే సన్నివేసాలు, సినీ తార గతం పట్ల జనానికి ఉండే ఆసక్తిని చూపించే షాట్స్ వంటివి దర్శకుని ముద్రను పట్టిస్తాయి.[2]

స్పందన మార్చు

సితార సినిమా 12 సెంటర్లలో 100రోజులు ఆడింది.[3] విడుదల అయిన కొన్నాళ్ళ వరకూ సినిమాకి హిట్ టాక్ రాలేదు. క్రమంగా పుంజుకుని ప్రజాదరణ పొంది వందరోజుల చిత్రంగా నిలిచింది. సినిమా పాటల ఎడిటింగ్, రీరికార్డింగ్ పూర్తికాకుండా మిగతా సినిమా ఎడిటింగ్ చేసి డైలాగ్ వెర్షన్ తో ప్రొజెక్షన్ నిర్మాత కోరికపై వేసి చూసుకున్నారు. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు సినిమా చూసి నీరసించిపోయారు. శంకరాభరణం, సాగర సంగమం, సీతాకోకచిలుక లాంటి గొప్ప సినిమాలు, సూపర్ హిట్లు తీసిన తన ప్రొడక్షన్ లో సినిమాని ఈ కొత్త కుర్రాడి చేతికి అప్పగించి దెబ్బతినిపోయానని అనేశారు. దాంతో దర్శకుడు వంశీని కూడా నిరాశ ఆవహించేసింది, ఇక తాను ఎవరైనా దర్శకుడి కింద అసిస్టెంట్ గా పనిచేస్తూ బతకాల్సిందే తప్ప సినిమా దర్శకుడిగా నిలదొక్కుకోలేనన్న భావన ఏర్పడిపోయింది. రీరికార్డింగ్ చేయడానికి ఇళయరాజాకి ముందు సినిమా చూపించేందుకు ఆయన థియేటర్లోనే ప్రొజెక్షన్ వేశారు. దర్శకుడు వంశీ, నిర్మాత ఏడిద నాగేశ్వరరావులతో ఇళయరాజా ఆ సినిమా టాకీపార్ట్ చూశారు. మొత్తం సినిమాని మౌనంగా చూసిన ఇళయరాజా పూర్తయ్యాకా, వంశీని పిలిచి చాలా అద్భుతంగా తీశావు.. నేను రీరికార్డింగ్ చేసేందుకు మంచి అవకాశం దొరికింది అంటూ అభినందించారు.[6] దాంతో సినిమాకు ప్రశంసల పరంపర ప్రారంభమైంది. వంశీ దర్శకత్వ ప్రతిభతో పటు, ఇళయరాజా సంగీతం, భానుప్రియ నటన ఈ సినిమాలో మంచి ప్రశంసలు పొందాయి. విమర్శకులు సినిమాను మాస్టర్ పీస్ గా పరిగణించారు. సితారగా, కోకిలగా రెండు వైవిధ్యభరితమైన ఛాయల్లో భానుప్రియ నటనకు మంచి పేరువచ్చింది. ముఖ్యంగా తన గతం ప్రపంచానికి అంతటికీ తెలిసిపోయిన తర్వాత సితార పాత్ర ఒంటరిగా పాడుపడ్డ ఇంట్లోకి వెళ్ళి కుమిలిపోయే సన్నివేశాల్లో ఆమె నటన ప్రశంసలు అందుకుంది.[2] సినిమా విజయవంతమయ్యాకా రష్యాలో కూడా సబ్ టైటిల్స్ తో విడుదల చేసి ప్రదర్శించారు. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా ఈ సినిమా చూసి వంశీ టేకింగ్ చూసి అసూయ కలిగిందని ప్రశంసించారు.[1]

సితార ప్రభావం మార్చు

సితార సినిమాతో తెలుగులో మొదటి సినిమా, కెరీర్లో రెండవ సినిమా చేసిన భానుప్రియకి గొప్ప పేరువచ్చింది. ఆమె హీరోయిన్ గా నిలదొక్కుకుంది.[4] దర్శకుడు వంశీ అప్పటికి మంచుపల్లకి తీసినా అది పరాజయం పాలైంది, పైగా డైరెక్టర్ గా స్వంత నవలను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా విజయం వంశీ కెరీర్ ని కూడా నిలబెట్టింది. పాటలు గొప్పగా తీస్తాడన్న పేరు వచ్చింది. ఇళయరాజాతో వంశీ పనిచేసిన తొలిచిత్రం ఇది. ఈ సినిమాతో వారిద్దరి అనుబంధం బలపడి ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించారు. వంశీ-ఇళయరాజా కాంబినేషన్లో అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల మొదలైన 11 సినిమాలు వచ్చాయి. ఎన్నో పాటలు అజరామరంగా నిలిచిపోయాయి.[1]

పురస్కారాలు, గౌరవాలు మార్చు

ఆ సంవత్సరం విడుదల అయిన ఆనంద భైరవి సినిమాకే ఎక్కువగా నంది అవార్డులు రావడంతో సితార నిర్మాత ఏడిద నాగేశ్వరరావు చాలా నిరుత్సాహపడ్డారు. అయితే జాతీయ సినిమా పురస్కారాలకు పంపితే మూడు అవార్డులు రావడంతో చాలా సంతోషించారు.[6][7]

సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1985 వంశీ జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు చిత్రం గెలుపు
ఎస్. జానకి ("వెన్నెల్లో గోదారి అందం" గానమునకు) జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ గాయనిమణి గెలుపు
అనిల్ మల్నాడ్ జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ కూర్పు గెలుపు
  • అవార్డులు
    • ఉత్తమ ప్రాంతీయ చిత్రం
    • ఉత్తమ ప్రాంతీయ భాష గాయని (ఎస్. జానకి)
    • ఉత్తమ ఆడియోగ్రాఫర్ (ఎస్.పి. రామనాధన్)

పాటలు మార్చు

కిన్నెరసాని వచిందమ్మవెన్నెల పైటేసి పాటను మొదట సాగర సంగమం సినిమా కోసం రికార్డు చేసారు. ఆ సినిమాలో ఉపయోగించలేక పాదంతో అదే సంస్థ నిర్మించిన ‘సితార’లో ఆ పాటను ఉపయోగించారు.[2]

అన్ని పాటల రచయిత వేటూరి సుందరరామ్మూర్తి, ఈ చిత్రం లోని అన్ని పాటలు స్వరపరిచి సంగీతం అందించింది ఇళయరాజా.

క్రమసంఖ్య పేరుగానం నిడివి
1. "అర్జున మంత్రం అపురూప"  ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం  
2. "కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి"  ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ  
3. "కుక్కు కూ .. కుక్కు కూ"  ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం  
4. "జిలిబిలి పలుకుల మైనా మైనా"  పి. సుశీల  
5. "నీ గానం"  ఎస్. జానకి  
6. "వెన్నెల్లో గోదారి అందం"  ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి  

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 కె., సతీష్ బాబు. "'వెన్నెల్లో గోదారి అందం'కు 30ఏళ్ళు". గోతెలుగు.కాం. Retrieved 20 August 2015.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 నెమలికన్ను, మురళి. "సితార". నవతరంగం. నవతరంగం నిర్వాహకులు. Archived from the original on 24 మార్చి 2015. Retrieved 20 August 2015.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "సినీగోయర్.కమ్". Archived from the original on 2009-10-05. Retrieved 2009-08-02.
  4. 4.0 4.1 ఎస్.ఆర్.అశోక్ కుమార్ (2006-10-01). "ఫర్ భానుప్రియ ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ నౌ". ది హిందూ. Retrieved 2015-08-20.
  5. వంశీ (19 జూన్ 2015). "వయ్యారి గోదారమ్మా." ఆంధ్రజ్యోతి. Retrieved 20 August 2015.[permanent dead link]
  6. 6.0 6.1 వంశీ (1 March 2015). "వంశీ.. ఇళయరాజా". ఫన్ డే (సాక్షి ఆదివారం). Archived from the original on 7 జూలై 2015. Retrieved 20 August 2015.
  7. "32nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 6 January 2012.

బయటి లింకులు మార్చు