సైన్య సహకార ఒప్పందం

ఒక ఆధిపత్య దేశం మరియు అది ఆధిపత్యం కలిగిన దేశం మధ్య కూటమి

స్వాతంత్ర్య పూర్వ భారతదేశంలో ఒక స్థానిక రాజ్యాన్ని గానీ సంస్థానాన్ని గానీ, తమకు సామంతులుగా మార్చుకునేందుకు ఫ్రెంచి వారు, ఆ తరువాత బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రయోగించిన కూటనీతి, సైన్య సహకార ఒప్పందం. సైన్య సహకార ఒప్పందం వ్యవస్థకు ఆద్యుడు ఫ్రెంచ్ గవర్నర్ జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లే. 1740 ల చివరలో అతడు హైదరాబాద్ నిజాంతోను కర్ణాటిక్ తోనూ ఈ ఒప్పందాలు చేసుకున్నారు. [1]

అనుబంధ పొత్తుల వ్యవస్థకు మార్గదర్శకత్వం వహించిన జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్స్ యొక్క లిథోగ్రాఫ్.

1757 ప్లాసీ యుద్ధం తరువాత రాబర్ట్ క్లైవ్, బెంగాల్‌కు చెందిన మీర్ జాఫర్ పై వరుస షరతులు విధించడం ద్వారా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ పద్ధతినే అనుసరించింది. అలాగే, 1764 బక్సర్ యుద్ధంలో విజయం సాధించాక కుదుర్చుకున్న 1765 అలహాబాద్ ఒప్పందంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. క్లైవ్ వారసుడు, రిచర్డ్ వెల్లెస్లీ మొదట్లో స్థానిక రాజ్యాల పట్ల జోక్యం చేసుకోని విధానాన్ని అవలంబించాడు. కాని తరువాత దానిని తోసిరాజని సైన్య సహకార ఒప్పందానికే మొగ్గు చూపాడు. అతడు దానికి కొన్ని మార్పులు చేసి, మెరుగుపరిచాడు. ఈ మార్పు యొక్క ఉద్దేశాన్ని, ఆశయాన్నీ ఫిబ్రవరి 1804 లో హైదరాబాద్‌లోని ఈస్ట్ ఇండియా కంపెనీ రెసిడెంటుకు పంపిన లేఖలో పేర్కొన్నాడు [2] :

భారతదేశంలోని ప్రధాన రాష్ట్రాలతో అనుబంధ పొత్తులను స్థాపించడంలో, గవర్నర్ జనరల్ విధానం ఏమిటంటే, ఆ రాష్ట్రాలను బ్రిటిషు శక్తిపై ఆధారపడే స్థాయిలోనే ఉంచడం, ఏదైనా చర్యలను తీసుకునే అవకాశాలు లేకుండా చెయ్యడం. బ్రిటిషి సామ్రాజ్య భద్రతకు ప్రమాదం కలిగించే పొత్తులను కుదుర్చుకోకుండా ఉంచడం, ఆ రాజ్యాలపై నియంత్రణను తెచ్చుకుని భారతదేశంలో ప్రశాంతత ఉండేలా చూసుకోవడం. భారత ద్వీపకల్పంలో నిరంతర యుద్ధాలకు, కల్లోలాలకు, అశాంతికీ కారణాలుగా ఉన్న, ఆసియా ప్రభుత్వాల సహజ లక్షణాలైన, దురాశ హింసలను నివారించడం -రిచర్డ్ వెల్లెస్లీ, 4 ఫిబ్రవరి 1804

సైన్య సహకార ఒప్పందం కుదుర్చుకున్న పాలకుడు మరే ఇతర పాలకుడితో చర్చలు, ఒప్పందాలు చేసుకోవడానికి అనుమతి లేదు. వారికి స్వతంత్ర సాయుధ దళం ఉండటానికి కూడా వీలు లేదు. ఆ రాజ్యాలు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి సంరక్షణలో ఉంటాయి. దీనికయ్యే ఖర్చులను ఆ రాజ్యమే భరించాలి భారతీయ పాలకులు చెల్లింపు చేయడంలో విఫలమైతే, వారి భూభాగంలో కొంత భాగాన్ని జరిమానాగా కంపెనీ వారు తీసుకుంటారు. ఉదాహరణకు, అవధ్ నవాబు 1801 లో తన భూభాగంలో సగాన్ని కంపెనీకి ఇచ్చుకోవలసి వచ్చింది. బ్రిటిషు అధికారి చెప్పిన కారణం - దుష్పరిపాలన. హైదరాబాదు కూడా ఇలాంటి కారణాలతోనే భూభాగాలను వదులుకోవలసి వచ్చింది.

18 వ శతాబ్దం చివరి నాటికి, మరాఠా సామ్రాజ్యం బలహీనపడడంతో, భారత ఉపఖండంలో చాలా చిన్న, బలహీనమైన రాజ్యాలు ఏర్పడ్డాయి. చాలా మంది పాలకులు వెల్లెస్లీ రక్షణను అంగీకరించారు. ఎందుకంటే ఇది వారి పొరుగువారి దాడికి వ్యతిరేకంగా వారికి భద్రతను ఇచ్చింది. వారి భూభాగాలను బ్రిటిషు వారు స్వాధీనం చేసుకోవచ్చు కాబట్టి కంపెనీ వారు, ఈ సైన్య సహకార ఒప్పందాన్ని పాలకులపై బలవంతంగా రుద్దారు

నిబంధనలు మార్చు

  1. బ్రిటిషు వారితో పొత్తులోకి ప్రవేశించే భారతీయ పాలకుడు తన భూభాగంలో బ్రిటిషు దళాల మోహరింపును అంగీకరిస్తాడు. వాటి నిర్వహణకు అయ్యే సొమ్మును చెల్లిస్తాడు.
  2. పాలకుడు తన రాష్ట్రంలో ఒక బ్రిటిషు అధికారి (రెసిడెంటు) ని అంగీకరిస్తాడు.
  3. పొత్తులోకి ప్రవేశించిన పాలకుడు బ్రిటిషు వారి అనుమతి లేకుండా మరే ఇతర శక్తితో ఏ కూటమిలోనూ చేరడు. ఏ శక్తికీ వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడు.
  4. పాలకుడు తన వద్ద బ్రిటిషేతర యూరోపియన్లు ఎవరైనా ఉంటే, వారిని తొలగిస్తాడు. కొత్తవారిని నియమించడు.
  5. ఇతర రాజ్యాలతో ఏదైనా వివాదం ఏర్పడినపుడు దాని పరిష్కారం బ్రిటిషు వారికి వదలివేస్తాడు.
  6. ఈస్ట్ ఇండియా కంపెనీని భారతదేశం లోని అత్యున్నత శక్తిగా పాలకుడు అంగీకరిస్తాడు.
  7. పాలకుడి రాజ్యానికి బయటి నుండి వచ్చే ప్రమాదాల నుండి, అంతర్గత కల్లోలాల నుండి బిటిషు వారు రక్షించాలి.
  8. పొత్తు ఖర్చులు చెల్లించడంలో పాలకుడు విఫలమైతే, అతడి భూభాగంలో కొంత భాగాన్ని జరిమానాగా తీసుకుంటారు.

స్వీకరణ మార్చు

బ్రిటిషు రక్షణలో ఉన్న భారతీయ పాలకులు తమ విదేశీ వ్యవహారాల నియంత్రణను బ్రిటిషు వారికి అప్పగించారు. చాలా మంది సబార్డినేట్లు తమ స్థానిక సైన్యాలను రద్దు చేసి, వారి రాజ్యాల రక్షణను బ్రిటిషు దళాలకు అప్పజెప్పారు. కాని బ్రిటిషు శక్తి పెరిగేకొద్దీ భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఇది చాలా అరుదుగా మారింది.

1764 లో బక్సార్ యుద్ధం తరువాత,అవధ్ రాజ్యం ఈపొత్తు కుదుర్చుకుంది. ఈ విధంగా కూటమిలోకి ప్రవేశించిన మొదటి రాజ్యం అదే. మైసూర్ రాజ్యానికి చెందిన టిప్పు సుల్తాన్ ఈ పొత్తు కుదుర్చుకోడానికి నిరాకరించాడు. కాని నాల్గవ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో బ్రిటిషు విజయం తరువాత మైసూరు, కంపెనీకి అనుబంధ రాజ్యంగా మారింది. హైదరాబాద్ నిజాం సైన్య సహకార ఒప్పందానికి అంగీకరించాడు. మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం తరువాత, మరాఠా పాలకుడు బాజీ రావు II కూడా ఒప్పందానికి అంగీకరించారు.

తంజావూరు / మైసూర్ (1799), అవధ్ (1801), పేష్వా (1802), భోంస్లే (1803), సింధియా (1804) ఈ పొత్తులో చేరిన ఇతర రాజ్యాలు.

1818 లో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరించిన ఇండోర్ చివరి మరాఠా సమాఖ్య.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Adrian Carton (6 August 2012). Mixed-Race and Modernity in Colonial India: Changing Concepts of Hybridity Across Empires. Routledge. pp. 47–49. ISBN 978-1-136-32502-1. Retrieved 4 June 2018.
  2. Charles Lewis Tupper (1893). Our Indian Protectorate. Longmans, Green and co. pp. 36–41. Retrieved 5 June 2018.