ఫరహాబాద్ దృశ్య కేంద్రం

ఫరహాబాద్ దృశ్య కేంద్రం మహబూబ్ నగర్ జిల్లా, మన్ననూర్ మండలంలో నల్లమల అడవుల సోయగాన్ని దర్శించుటకు సందర్శకుల కొరకు అటవీ శాఖ ఏర్పాటు చేసిన దృశ్య స్థావరం (వ్యూ పాయింట్). ఇది హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే జాతీయ రహదారి మార్గంలో తారసపడే దట్టమైన అటవీ ప్రాంతంలో మన్ననూర్‌కు 26 కిలోమీటర్ల దూరంలో, ఫరహాబాద్ చౌరస్తాకు 10 కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు చేయబడింది[1]. ఈ ప్రాంతం 3,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం వన్యప్రాణి అభయారణ్యం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ రాజీవ్ టైగర్ ప్రాజెక్టు ఉంది. నిజాం కాలంలో 1932 లో నిర్వహించబడిన సర్వే ప్రకారం ఇక్క 63 పులులు ఉన్నట్లు తేలింది. ఈ ప్రాంతం అసంఖ్యాకమైన వృక్షజాలంతో, అరుదైన జంతుజాలంతో, మౌలికమైన ఔషధ మొక్కలతో నిండి ఉంటుంది. ఎత్తైన, సుందరమైన నల్లమల కొండల శ్రేణులు ఇక్కడ కనువిందు చేస్తాయి. వీటిని పాలమూరు పాపికొండలుగా పిలుస్తారు. రకరకాల పక్షులు, లోతైన లోయలు, చిన్నచిన్న నీటి ప్రవాహాలు, పరుగులు తీసే కృష్ణమ్మ నడకలు పర్యాటకులను మంత్రముగ్ఢులను చేస్తాయి. వీటన్నిటిని దర్శించటానికి సందర్శకుల కొరకు అటవీ శాఖ ఇక్కడ ఒక దృశ్యకేంద్రాన్ని ( వ్యూ పాయింట్‌ను) ఏర్పాటుచేసింది. ఈ దృశ్య కేంద్రం ఒక కొండ అంచు ప్రాంతం. ఇక్కడి నుండి నల్లమల అడవుల సౌందర్యం చూడటం ఓ మధురానుభూతిని మిగులుస్తుంది. పర్యాటకుల కొరకు ఇక్కడ చిన్న చిన్న రిసార్టులను కూడా ఏర్పాటుచేశారు.

బయటి లింకుసవరించు

ఫరహాబాద్

మూలాలుసవరించు

  1. ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 50