ప్రస్తుత ఘటనలు | 2006 ఘటనలు నెలవారీగా - |జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ | వికీపీడియా ఘటనలు | 2005 ఘటనలు
ఫిబ్రవరి 2006
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28

పతాక శీర్షికలు


2006 ఫిబ్రవరి 21, మంగళవారం మార్చు

  • అమ్మ భాష: మాతృభాషా దినం సందర్భంగా అనేక కార్యక్రమాలు జరిగాయి.
    • తెలుగు భాషోద్యమ సమాఖ్య ఉద్యమం: తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలని కోరుతూ తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యమం ప్రారంభమైంది. తెలుగుతల్లి విగ్రహానికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి ఉదయం ఎనిమిది గంటల సమయంలో పూలదండలు వేసి ప్రారంభించారు. ఇందులో మంత్రి సత్యనారాయణరావుతో పాటు వివిధ పార్టీలకు చెందిన శాసన సభ్యులు, తెలుగు భాషోద్యమ సమాఖ్య సభ్యుడు మండలి బుద్ధప్రసాద్‌, నగర మేయర్‌ తీగల కృష్ణారెడ్డి, పలువురు రచయితలు, మేధావులు, అధి కార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. తెలుగుతల్లి విగ్రహం నుంచి ఇందిరాపార్కు వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం నిరాహారదీక్షలు ప్రారంభించారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రముఖ సామాజికవేత్త లవణం వంటి వారితో పాటు తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్న 250 మంది నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. బిజెపి జాతీయ కార్య దర్శి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలుగుకు ప్రాచీన హోదా కల్పించే విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ప్రాచీన భాషగా గుర్తించేందుకు చేసే ఉద్యమానికి టిడిపి శాసన సభ్యులు పయ్యావుల కేశవ్‌, టిఆర్‌ఎస్‌ శాసన సభ్యులు మందాడి సత్యనారాయణరెడ్డి, సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి డాక్టర్‌ నారాయణ, సిపిఎం నాయకుడు వై.వి.రావు తమ మద్దతును ప్రకటించారు. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి మాట్లాడుతూ పాఠశాలల్లో పిల్లలకు తెలుగులోనే బోధన చేయాలనే దానిపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు ధర్మారావు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పని సరిగా తెలుగును అమలు చేయాలని కోరారు. విశాఖపట్నంలో 72 మునిసిపల్‌ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధన ప్రారంభించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయితలు జ్వాలాముఖి, నగ్నముని, కె.బి.తిలక్‌, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, మైసూరు విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్‌.వి.సుందరం, మల్లికార్జున శర్మ, సి.ధర్మారావు, తనికెళ్ళ భరణి తదితరులు పాల్గొన్నారు.
    • అధికార భాషాసంఘం కార్యక్రమం: హైదరాబాద్‌లో అధికార భాషాసంఘం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పాల్గొన్నాడు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని కోరుతూ శాసనసభలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది అని ఆయన వెల్లడించాడు. ఈ సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్న కవులు, రచయితలకూ, అధికారులకూ భాషా పురస్కారాలను అందజేశాడు. అనంతరం ప్రసంగించాడు. తమిళానికి ప్రాచీన భాష హోదా లభించింది. తెలుగుకూ ఈ గుర్తింపు కల్పించకముందే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను మార్చి ప్రాచీనతకు ఉండాల్సిన కాలాన్ని 1500 సంవత్సరాల నుంచి 2వేల ఏళ్లకు పెంచింది. దీనిపై కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి అర్జున్‌సింగ్‌తో మాట్లాడాను. న్యాయం జరిగేలా చూస్తానని ఆయన వాగ్దానం చేశారు. తెలుగు భాషకున్న ప్రాచీనతను అన్వేషించేందుకు మంత్రి ఎం.సత్యనారాయణ ఆధ్యర్యంలో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఇప్పటికే ఏర్పాటు చేశాం అని పేర్కొన్నాడు. రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి విద్యాబోధన తెలుగులోనే జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాథి అవకాశాల కోసం ఇంగ్లీషు, ఇతర భాషలను నేర్చుకోవడం తప్పుకాదనీ, తెలుగును మాత్రం ఎవరూ అశ్రద్ధ చేయకూడదని అన్నాడు. మన రాష్ట్రం భాషా ప్రాతిపదికన ఏర్పాటై 50 ఏళ్లు గడిచినా ఇంకా భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాడు.
    • ఈ కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఇంగ్లీషు మీడియం పాఠశాలలను అనుమతించకండి, ఇంగ్లీషు మాధ్యమంలో పాఠశాలలను అనుమతించడాన్ని ఆపివేయాలని, ఉన్నవాటిని క్రమంగా తెలుగు మాధ్యమంలోకి మార్చాలని కోరాడు. పాఠశాలల్లో తెలుగు భాషోపాధ్యాయుల నియామకాలను తప్పనిసరి చేయాలని కోరాడు. తెలుగు కోసం జారీ అయిన జీవోను అమలు చేయాలని సూచించాడు.
    • మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు పరిరక్షణ, ప్రాచీనహోదా కోరుతూ మంగళవారం ఇందిరా ఉద్యానవనం వద్ద తెలుగు భాషోద్యమ సమాఖ్య ఒకరోజు నిరాహారదీక్షలు చేపట్టింది. సి.ధర్మారావు, మల్లాది సుబ్బమ్మ, చుక్కా రామయ్య, పాత్రికేయుడు వరదాచారి తదితరులు ఇందులో పాల్గొన్నారు. రాత్రి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు వారి వద్దకు వచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ "ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమికస్థాయిలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరధోరణి. దీనివల్ల గ్రామాల్లో కూడా తెలుగు మాట్లాడే పరిస్థితుండదు పసివారి ప్రతిభ దెబ్బతింటుంది. తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించడానికీ, భాషా పరిరక్షణ చర్యల కోసం రాజకీయాలకతీతంగా అందరూ కలిసి రావాల"ని పిలుపునిచ్చాడు. "ఈ అంశంపై బుధవారం శాసనసభలో వాయిదా తీర్మానం కోసం పట్టుపడతాం. ప్రభుత్వాన్ని ఒప్పించి తెలుగుకు ప్రాచీనహోదా కోరుతూ కేంద్రానికి తీర్మానం పంపుతాం. అవసరమైతే ఢిల్లీ పోదాం. నేనూ మీతో వస్తా" అని ఆయన అన్నాడు.
  • ప్రత్యేక తెలంగాణ: ప్రత్యేక తెలంగాణపై పార్టీలో చర్చించాకే తమ నిర్ణయం వెల్లడిస్తామని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశాడు. దీనిపై ఒకటి రెండు వారాల్లో ముఖ్య నాయకుల భేటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర శాఖతో మాట్లాడతామన్నాడు. తెరాస అగ్రనేతలు కె.చంద్రశేఖరరావు, నరేంద్రలు మంగళవారం ఢిల్లీలో రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. ఆయన నివాసంలో దాదాపు 45 నిమిషాలపాటు చర్చించారు. 'కాకినాడ తీర్మానం' పార్టీ రాష్ట్ర శాఖదేనని, దీనిపై జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తెలిపారు. తెరాసతో జట్టుకట్టాలని ఇప్పటిదాకా ఎవరూ ప్రతిపాదించలేదని తెలిపారు. రాజ్‌నాథ్‌తో భేటీ వివరాలను వెల్లడించేందుకు కేసీఆర్‌ నిరాకరించారు. తనకు అత్యవసర సమావేశం ఉందని, బుధవారం మాట్లాడదామని అంటూ వెళ్లిపోయారు.
  • బర్డ్‌ఫ్లూ: బర్డ్‌ఫ్లూ భయం దేశమంతటా పట్టుకుంది. అన్ని చోట్లా ముందు జాగ్రత్తలు చేపట్టారు. సైనికులకు చికెన్‌, కోడిగుడ్లను పక్షం రోజుల పాటు ఇవ్వకూడదని నిర్ణయించారు. రైళ్లలో చికెన్‌ వంటకాల సరఫరాను నిలిపివేశారు. పార్లమెంటు క్యాంటీన్‌లో చికెన్‌, కోడిగుడ్ల వంటకాల్ని వండకూడదని నిర్ణయించారు. ఇంకోవైపు కర్ణాటకలో కూడా బర్డ్‌ఫ్లూ వ్యాపించిందని మంగళవారం వదంతులు వచ్చాయి. అలాంటిదేమీ లేదని కర్ణాటక ప్రభుత్వం, కేంద్రం కొట్టిపారేశాయి. బర్డ్‌ఫ్లూ ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోని నవాపూర్‌ ప్రాంతంలో బర్డ్‌ఫ్లూ వైరస్‌ సోకినట్లుగా భావిస్తున్న 8 మందిని మంగళవారం ఆసుపత్రిలో చేర్చారు.
  • కొల్లేరు ప్రక్షాళన: పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లా కలెక్టర్ల సామ, దాన, దండోపాయాల ప్రయోగాలతో తీరు మార్చుకున్న కొల్లేరు లంక గ్రామాల వారు... ఇన్నాళ్లు ఏ చెరువుల విధ్వంసాన్ని వ్యతిరేకించారో అదే పనిలో పాలుపంచుకోవడానికి ముందుకు వచ్చారు.

2006 ఫిబ్రవరి 14, మంగళవారం మార్చు

  • పోలవరం ప్రాజెక్టుపై అఖిలపక్షం సమావేశం: పోలవరం ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశంలో జరిగిన చర్చలో సీపీఎం రాష్ట్రకార్యదర్శి బీవీ రాఘవులు మాట్లాడుతూ పోలవరంపై ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పూర్తిగా అబద్దాలతో కూడుకున్నదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పార్టీ సూచించిన విధంగా ప్రత్యామ్నాయంపై తన నిర్ణయాన్ని ప్రకటించాలని పట్టుబట్టింది. కాని ప్రభుత్వం వైపునుంచి సరైన సమాధానం రాకపోవటంతో అఖిలపక్ష సమావేశంనుంచి సీపీఎం నాయకులు వెళ్ళిపోయారు.
  • పోలవరం ప్రాజెక్టు ద్వారా ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని తగ్గించాలని డిమాండ్‌చేస్తూ తెలంగాణా రాష్ట్రసమితి ప్రభుత్వం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంనుంచి వాకౌట్‌ చేసింది. సమావేశంలో తెరాస లేవనెత్తిన పలు అంశాలకు ప్రభుత్వం సరిగా స్పందించకపోవటంతో చర్చనుంచి నిష్క్రమిస్తున్నామని పార్టీ ప్రతినిధి నాయని నర్సింహారెడ్డి చెప్పాడు
  • కొల్లేరు శుద్ధి: కొల్లేరులో ఆక్రమించుకున్న చేపల చెరువులన్నంటిని మార్చి31లోగా ధ్వంసం చేయాలని సుప్రీంకోర్టు ఎంపవర్‌ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్రమణదారులు ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకపోతే వారిపై కోర్టు ధిక్కార కేసులు నమోదుచే యాలని కమిటీ ఆదేశించింది. పరిరక్షణ చర్యల సమీక్ష కోసం మార్చి8న ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని కమిటీ తెలిపింది.
  • పెళ్ళిళ్ళకు తప్పనిసరి రిజిస్ట్రేషన్: దేశంలో జరిగే వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలంటూ (రిజిస్ట్రేషన్‌) సంబంధిత నియమాలను మూడు నెలల్లోగా సవరించాలని కేంద్రాన్ని, రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
  • సిక్కింలో భూకంపం: సిక్కిం రాష్ట్రాన్ని మంగళవారం 12 సెకన్లపాటు భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై 5.7గా నమోదైంది. ప్రకంపనల ధాటికి రాజ్‌భవన్‌, సచివాలయ భవనం, పోలీసు కేంద్ర కార్యాలయం, 150 ఏళ్ల నాటి ఎన్షే మఠంసహా పలు కట్టడాలు బీటలు వారాయి. చాలా ప్రధాన రహదారులు పగుళ్లిచ్చాయి. రాజ్‌భవన్‌ కింది, మొదటి అంతస్తులు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం కలిగింది. భూకంప ప్రభావం తూర్పు సిక్కింలో ఎక్కువ కనిపించింది. ఇక్కడ దాదాపు 12 వేల అడుగుల ఎత్తున కొండపై ఉన్న ఇద్దరు సైనికులు.. ప్రకంపనల వల్ల దొర్లివచ్చిన బండరాళ్ల కిందపడి మరణించారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పారు. ఉత్తర బెంగాల్‌, గౌహతిల్లోని పలు ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం కనిపించింది.
  • ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ రామేశ్వర్‌ ఠాకూర్‌ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి.

2006 ఫిబ్రవరి 13, సోమవారం మార్చు

  • మూడో ప్రత్యామ్నాయం పగటి కల': కేంద్రంలో కాంగ్రెస్‌, బిజెపియేతర మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని వామపక్షాలు కంటున్న కలలు పగటి కలలు గానే మిగిలిపోతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించాడు.
  • అస్తిత్వం కోసమే కె.సి.ఆర్ ప్రకటనలు: పోలవరాన్ని ఆపి తీరుతామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించడంపై పిసిసి అధ్యక్షుడు కే. కేశవరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆయన తన అస్తిత్వం నిలుపుకోవడం కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు.

2006 ఫిబ్రవరి 4, శనివారం మార్చు

  • ఇరాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఓటు: ఇరాన్‌ అణు అంశాన్ని భద్రతామండలికి నివేదించారు. కాకపోతే ఇరాన్‌పై తక్షణం కఠిన చర్యలు తీసుకోకుండా నెలరోజుల పాటు వెసులుబాటు కల్పించారు. ఇరాన్‌ అణు అంశాన్ని భద్రతామండలికి నివేదించడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) బోర్డు శనివారం ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ఐరోపా సమాజం ప్రతిపాదించింది. తీర్మానానికి భారతదేశం మద్దతు పలికి, ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓటేసింది.
  • నెలన్నరలో తెలంగాణా రాకుంటే రాజీనామా - నరేంద్ర : "తెలంగాణ సాధన పోరాటం అంతిమ దశకు వచ్చింది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. ఒకటిన్నర మాసాల్లో అటోఇటో తేల్చుకుంటాం. తెలంగాణ రాకుంటే మంత్రి పదవులకు రాజీనామా చేసి బయటికి వస్తాం. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంటి ఎదుటే ధర్నా చేసి అక్కడి నుంచే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం. ఇక అప్పుడు అగ్నిగుండమే" అని తెరాస అగ్రనేత, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఆలె నరేంద్ర హెచ్చరించాడు.
  • అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో రథసప్తమి: వెలుగులరేడు సూరీడు జయంత్యుత్సవాలు (రథసప్తమి) శనివారం శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. సప్తమీ ఘడియలు శనివారం ఆరంభమవడంతోనే భక్తులు తండోపతండాలుగా అరసవల్లి చేరుకున్నారు. సుమారు లక్ష మంది భక్తులు స్వామిని దర్శించారని అంచనా. దాదాపు 12 సంవత్సరాల అనంతరం స్వామి వారికి అర్చకులు స్వర్ణాభరణాలంకృతుని చేశారు.

2006 ఫిబ్రవరి 3, శుక్రవారం మార్చు

  • కుమార పట్టాభిషేకం: మధ్యాహ్నం 12.21 గంటలకు హర్దనహళ్ళి దేవెగౌడ కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. తండ్రి దేవెగౌడ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. పూర్వపు ముఖ్యమంత్రి ధరం సింగ్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ఉపముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీకు చెందిన యడిఐరోపాప ప్రమాణస్వీకారం చేసాడు.
  • తెదేపా పాదయాత్రపై కాంగ్రెసు కార్టూన్లు: తెలంగాణ ప్రాజెక్టుల సాధన కోసం తెలుగుదేశం నేతలు చేపట్టిన పాదయాత్రను విమర్శిస్తూ ఏడు కార్టూన్లను కాంగ్రెసు రూపొందించింది. రెండు లక్షల కార్టూన్ల పోస్టర్లను ముద్రించి, శనివారం నుంచే గ్రామ గ్రామాన ప్రజల్లోకి వెళ్లనుంది.
  • బయోటెక్నాలజీ బైపీసీ విద్యార్థులకు కాదు: బయోటెక్నాలజీలో బైపీసీ విద్యార్థుల ప్రవేశానికి ఆలిండియా కౌన్సిల్‌ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) నిరాకరించింది. దీంతో ఎంసెట్‌ కమిటీ కూడా బైపీసీ విద్యార్థులకు ప్రవేశం కల్పించాలనే తన నిర్ణయాన్ని మార్చుకొంది.
  • హేరామ్‌: మహాత్మా గాంధీ మరణించే ముందు అన్నది 'హేరామ్‌' కాదనీ, 'రామ్‌రామ్‌' అని మధ్య ప్రదేశ్ లోని అంబాలా సీనియర్‌ ఎస్పీ రాజ్‌బీర్‌ దేస్వాల్‌ చెబుతున్నాడు. గాంధీ హత్య కేసు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) ను తాను చదివానని శుక్రవారం ఇక్కడ ఆయన ప్రకటించాడు. మహాత్మాజీ రామ్‌రామ్‌ కర్తే హుయే పీఛే గిర్‌ గయే (మహాత్ముడు రామ్‌రామ్‌ అంటూ వెనక్కు పడిపోయారు) అని నంద్‌లాల్‌ మెహతా అనే వ్యక్తి చెప్పినట్లు అందులో ఉందని పేర్కొన్నాడు.

2006 ఫిబ్రవరి 2, గురువారం మార్చు

  • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభం: ప్రతిష్ఠాత్మక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా బండ్లపల్లె గ్రామంలో ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ప్రధానితో పాటు, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కేంద్రమంత్రులు రఘువంశ ప్రసాద్‌సింగ్‌, మణిశంకర్ అయ్యర్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి తదితరులు ప్రసంగించారు.
  • 5వేల కోట్ల సాయం చెయ్యండి: సత్వర సాగునీటి పథకం కింద ఆర్థిక సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ కు రూ.5వేల కోట్లు మంజూరు చేయాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కోరాడు.
  • చంద్రబాబు హయాంలో పట్టణాల కంటే గ్రామాల్లోనే ఉపాధి పెరిగింది: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పట్టణాల కంటే గ్రామాల్లోనే ఉపాధి పెరిగి, పేదరికం తగ్గిందన్నది సామాజిక అభివృద్ధి మండలి, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదిక సారాంశం.
  • కాలుష్య నియంత్రణ మండలి (పీసీపీబీ) సభ్య కార్యదర్శి ఎస్‌.కె.సిన్హా. బాధ్యతలు చేపట్టిన ఆరునెలల లోనే బదిలీ అయ్యాడు. సిన్హా ముక్కుసూటిగా వ్యవహరించే అధికారి. పరిశ్రమల కాలుష్యాన్ని చూస్తూ వూరుకునే తత్వం కాదు. ముఖ్యమంత్రి బంధువులకు చెందిన ఓ పురుగుల మందు తయారీ కర్మాగారంపై రూ.కోటి జరిమానా విధించారు. పరిశ్రమను మూయించారు. సీఎం కార్యాలయం నుంచి ఒత్తిళ్లు వచ్చినా లొంగలేదు. ఇప్పుడు సిన్హా సమర్థతకు బదిలీనే నజరానాగా ఇచ్చారు. ఈనాడు వార్త[permanent dead link]

2006 ఫిబ్రవరి 1, బుధవారం మార్చు

  • ఇంగ్లీషులో బోధన వద్దు -అధికార భాషా సంఘం: మాతృభాషా మాధ్యమ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆంధ్ర ప్రదేశ్‌ అధికార భాషా సంఘం విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో ఇంగ్లీషు మాధ్యమ పాఠశాలలకు అనుమతి ఇవ్వకూడదని డిమాండ్‌ చేసింది. కలెక్టర్ల సమావేశంలో ఇంగ్లీషు మాధ్యమం చదువులపై ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చేసిన ప్రకటనపై సంఘం అధ్యక్షుడు ఎ.బి.కె.ప్రసాద్‌ ప్రతిస్పందించాడు.
  • తెలుగును కాపాడుకుందాం: కన్నతల్లినీ, మాతృభాషనీ, జన్మభూమినీ ఎవరైతే కీర్తిస్తారో వాళ్లే ధన్యులని ప్రముఖ సినీ గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి అన్నాడు. తల్లి తర్వాత అంతటి ప్రాముఖ్యం ఉన్న భాషను ప్రస్తుతం కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ మనలో భాషాభిమానం చాలా తక్కువ. నాకు సరైన స్థాయి, డబ్బు వస్తే భాషాభివృద్ధి కోసం ఉద్యమం చేస్తానని అన్నాడు. దీనిపైన స్పందించిన నటుడు ఆర్‌.నారాయణమూర్తి తెలుగు ఉద్యమం అంటున్నవాళ్లు మొదట వాళ్ల పిల్లల్ని ఇంగ్లిష్‌ స్కూళ్లలో చేర్చడం మానుకోవాలి. కీరవాణి వెనుక మేం అందరం ఉంటాం అని వ్యాఖ్యానించాడు.
  • ప్రాచీన భాష హోదా కోసం కోర్టుకు -తెదేపా: తమిళానికి ప్రాచీన భాష హోదా కల్పించి, తెలుగుకు ఇవ్వకపోవడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టును ఆశ్రయించాలని తెదేపా నిర్ణయించింది. పార్లమెంట్‌లో గళమెత్తడంతోపాటు రాష్ట్రంలో ఉద్యమించాలని కూడా ఆ పార్టీ నాయకులు భావిస్తోంది.
  • ఆధారాలు సేకరిస్తాం -మంత్రి: తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాల్సిన అవసరముందని పాఠశాల విద్యాశాఖ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు. ప్రాచీన భాషగా కేంద్రం గుర్తింపు పొందడానికి కావలసిన ఆధారాలు పూర్తిగా లేకపోవడంతో 'ప్రాచీన భాష' హోదాకు తెలుగు నోచుకోలేకపోయిందన్నారు. తాళపత్ర గ్రంథాల సేకరణకు చేస్తున్న కృషిలో ఆధారాలు లభించగలవనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 20 నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ప్రారంభించాలని ఆర్కివ్స్‌ శాఖ తలపెట్టింది.