ఫ్రెంచి విప్లవంలో స్త్రీల పాత్ర
ఫ్రెంచ్ విప్లవంలో స్త్రీలు ఎలా పాల్గొన్నారు, వారి ప్రభావం ఇప్పటికీ ఫ్రెంచి స్త్రీలపై ఎలా ఉందనేది చరిత్రకారులు 20వ శతాబ్దం నుంచీ చర్చిస్తూనే ఉన్నారు. విప్లవానికి ముందు ఫ్రాన్స్లో స్త్రీలకు రాజకీయ హక్కులు లేవు. వారిని పాసివ్ పౌరులుగానే లెక్కిస్తూ వచ్చారు. పురుషులపై ఆధారపడటం మాత్రమే స్త్రీ చేయగలిగే ఉత్తమమైన పనిగా అప్పటి ఫ్రెంచి సమాజం భావించేది. కానీ ఈ పరిస్థితి అత్యంత ఆశ్చర్యకరంగా, నాటకీయంగా మారిపోయింది. అప్పటి నుంచీ స్త్రీవాదం ముందుకి వచ్చిందని చెప్పాలి. సామాజిక, రాజకీయ మార్పుల కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా పారిస్లో స్త్రీవాదం తెరపైకి వచ్చింది. మొదట పురుషులతో సమానత్వాన్ని కోరిన స్త్రీలు, పోను పోనూ పురుషాధిక్యతకు అంతం కావాలని పోరాటం ప్రారంభించారు. వారి పోరాటానికి కరపత్రాలూ, విమెన్ క్లబ్బులూ వేదికలుగా నిలిచాయి. ముఖ్యంగా ఆ సమయంలోనే ప్రారంభమైన సొసైటీ ఆఫ్ రివల్యూషనరీ రిపబ్లికన్ విమెన్ అనే రాజకీయ క్లబ్ ప్రత్యేక వేదికగా చెప్పుకోవాలి. అయితే అక్టోబరు 1793లో జేకొబిన్ క్లబ్ మిగిలిన విమెన్ క్లబ్బులన్నింటినీ రద్దు చేసి, వాటి నాయకులందరినీ అరెస్టు చేయడంతో విప్లవాన్ని అణిచివేశారు. రాణి మేరీ యాంటోనేట్టే రాజ్య వ్యవహారాల్లో జోక్యం కల్పించుకోవడాన్ని అప్పటి సంప్రదాయ పురుషాధిక్య భావన ఉన్నవారు జీర్ణించుకోలేకపోయారు.[1] ఒక దశాబ్దం తరువాత నెపోలియన్ ప్రవేశపెట్టిన ఫ్రెంచి సివిల్ కోడ్ లో స్త్రీలనో రెండో తరగతి పౌరులుగానే ప్రకటించారు.[2]
స్త్రీల సంప్రదాయ పాత్రలు
మార్చువిప్లవానికి ముందు ఫ్రాన్స్ లో మహిళలకు రాజకీయ హక్కు లేదు. వారికి ఓటు హక్కుగానీ, రాజకీయ కార్యాలయాన్ని నడిపే హక్కుగానీ లేదు. పురుషులపై ఆధారపడటమే స్త్రీలు చేయగలిగిన అత్యుత్తమ పనిగా అప్పటి సమాజ భావన. వారిని రెండో తరగతి పౌరులుగా, పాసివ్ పౌరులుగా లెక్కించేవారు. ఈ నియమాలన్నిటినీ పురుషులే రూపొందించి, ఆడవారికి విధించేవారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో స్త్రీలు పురుషాధిక్యాన్ని ఒప్పుకు తీరాల్సి వచ్చేది.[3]