బల్వంత్ నాచ్నే

దహనూ అనే గ్రామంలో తాలూకా ఆఫీసులో గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవాడు శాంతారామ్ బల్వంత్ నాచ్నే. 1909 సం ॥ లో అతడి అన్నగారికి గొంతులో పుండు వచ్చింది. దాని శస్త్ర చికిత్స కోసం అతడిని బొంబాయి లో ఒక ఆస్పత్రిలో చేర్చారు . శాస్త్ర చికిత్స జరిగిన రోజున దహనూలో నాచ్నే ఇంటికి ఒక సన్యాసి భిక్ష కోసం వచ్చాడు . అతడు భోజనంలో బెండకాయ కూర మళ్ళీ మళ్ళీ వేయించుకుని తిని ,"బొంబాయిలో శస్త్ర చికిత్స బాగా జరిగింది " అని చెప్పి వెళ్ళిపోయాడు . అదే సమయంలో బొంబాయిలో ఆస్పత్రికి ఒక సాధువు వచ్చి నాచ్నే అన్నగారి కంఠం నిమిరి అతని బాధ త్వరలో తగ్గిపోతుందని ఆశీర్వదించాడు . దహనూలో నాచ్నే వద్దకు అతడి స్నేహితుడైన ఫన్సే వచ్చి ,"నీవేమి భయపడకు ,సాయిబాబా దయ మనపై తప్పక ఉంటుంది . బొంబాయిలో శస్త్ర చికిత్స బాగానే జరిగి ఉంటుంది "అని ధైర్యం చెప్పాడు . అప్పుడే నాచ్నే మొట్టమొదటిసారిగా బాబా గురించి విన్నాడు . బొంబాయిలో శస్త్ర చికిత్స బాగా జరిగిందని కబురు వచ్చింది . జరిగిన సంఘటనలు అతనికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి .

నాచ్నే తండ్రి ఒకరోజు దాసగణు చేసిన హరికథకు వెళ్లి బాబా గొప్పతనం గురించి విని ఆయన పటం తెచ్చి పూజించుకోసాగాడు . నాచ్నే బొంబాయి నగరంలో ఆదాయశాఖ లో స్ధిరమైన ఉద్యోగం పొందాలనే కోరికతో 1912 సం ॥ లో శిరిడీ చేరి బాబాను దర్శించాడు . బాబా అతనిని చూస్తూనే ,"మమల్తాదారు దగ్గర సెలవు తీసుకుని రావచ్చు కదా ?! ఇలా ఎప్పుడూ చేయవద్దు "అన్నారు . నిజానికి అతడు ఆఫీసులో సెలవు పెట్టకుండానే శిరిడీ వచ్చాడు . బాబా సర్వజ్ఞులని నాచ్నే కు అర్ధమైంది . నాచ్నే శిరిడీలో మూడు రోజులు గడిపాడు .

నాచ్నేకు ఉపవాసం చేయడం అలవాటులేదు . కానీ శిరిడీలో ఏకాదశి రోజు దాదాపు అందరూ ఉపవాసం చేస్తారు . ఒక ఏకాదశి రోజు అందరూ ఉపవాసముంటే నాచ్నే మొహమాట పడి ఏమి తినలేదు . బాబా నాచ్నేను మధ్యాహ్నం భోజనం చేసి రమ్మని ఆజ్ఞాపించారు . అతడు భోజనం చేసి వచ్చేవరకూ మధ్యాహ్న హారతి కూడా నిలిపివేశారు . బాబా తన ఆకలిని గుర్తించి అలా చేశారని నాచ్నేకు అర్ధమైంది . బాబా కరుణకు నాచ్నే చలించిపోయాడు .

ఒకరోజు బాబా తమ భక్తులకు నాచ్నేను చూపిస్తూ ,"నేనొకరోజు వీరింటికి భిక్షకు వెళ్లాను . అక్కడ బెండకాయకూర తిన్నాను "అన్నారు . మూడు సం ॥ ల క్రిందటే అంటే తానింకా సాయి చెంతకు రాకమునుపే బాబా ఆ సన్యాసి రూపంలో వచ్చి తన ఇంట భిక్ష చేశారని ,తన అన్నగారిని రక్షించినది వారేనని నాచ్నేకు అర్ధమైంది . బాబాను ఆశ్రయిస్తే బాబా మనలను మన ఆప్తులనూ జన్మజన్మలకూ కాపాడుతారన్నమాట .

నాచ్నే ప్రభుత్వ ఆదాయ శాఖలో స్ధిరమైన ఉద్యోగం కోసం పరీక్ష వ్రాశాడు . పరీక్షా ఫలితం గురించి బాబాను అడిగాడు నాచ్నే. ఆయన "అల్లా అచ్ఛాకరేగా ! ( భగవంతుడు మేలు చేస్తాడు )" అని ఆశీర్వదించారు . మూడవ రోజున సెలవు కోరడానికి మసీదుకు వెళ్ళాడు నాచ్నే . ఆయన నాచ్నేకు ఊదీ యిచ్చి , "నీవు బొంబాయిలో ఉద్యోగం చేయవచ్చుగా !" అన్నారు . ఆరు సంవత్సరాల తర్వాత బాబా ఆశీస్సులు ఫలించి అతనికి బొంబాయిలో స్ధిరమైన ఉద్యోగం వచ్చింది .

అప్పటినుంచే నాచ్నే తరచుగా బాబాను దర్శిస్తూ ఉండేవాడు . ఒకసారి బాబా నాచ్నేతో ,"పిచ్చివాళ్ళను నమ్మకు "అన్నారు . దహనూలో వారి ఇంటి వద్ద ఒక పిచ్చివాడుండేవాడు . అతడెప్పుడూ ఎవ్వరినీ ఏ ఇబ్బందీ పెట్టలేదు . కానీ ఒకరోజు నాచ్నే పూజ చేసుకుంటూ ఉంటే మీదపడి గట్టిగా గొంతు పిసికాడు . నాచ్నే అన్నగారు వెంటనే వచ్చి ఆ పట్టు విడిపించాడు . కానీ అప్పటికే నాచ్నేకు స్పృహ తప్పింది . మందులు వాడితే కొంతకాలానికి ఆరోగ్యవంతుడయ్యాడు నాచ్నే . తర్వాత బాబాను దర్శిస్తే ఆయన నాచ్నేను భక్తులకు చూపిస్తూ ," ఆ పిచ్చివాడి బారినుండి నేను ఇతనిని రక్షించాను . నా భక్తుల ప్రాణాలు నేనేగదా కాపాడవలసినది !" అన్నారు . బాబా కరుణకు నాచ్నే పులకించాడు .

బాబా నాచ్నేకు రెండు జతల వెండిపాదుకలనిచ్చి పూజించుకోమన్నారు . అంతేకాదు ,ఒకరోజు నాచ్నే తానేమి జపం చేయాలని అడిగితే ,"మీ పూర్వీకులు ఏమి చేశారో అదే చేయి "అన్నారు సాయి . నాచ్నే తన తండ్రిదగ్గరకు వచ్చి బాబా మాటలను చెప్పాడు . నాచ్నే పూర్వీకులంతా బాబా భాగవత్ అనే మహాత్ముని వంశస్ధుల నుండి ఉపదేశం పొందేవారని ,నాచ్నేను కూడా అలాగే చేయమని బాబా సూచించారని నాచ్నే తండ్రి వివరించారు . నాచ్నే బాబా ఆజ్ఞను పాటించి ధన్యుడయ్యాడు .