బాబ్-ఎల్-మండేబ్, అరేబియా ద్వీపకల్పంలోని యెమెన్, ఆఫ్రికా కొమ్ములోని జిబౌటి, ఎరిట్రియాల మధ్య నున్న జలసంధి. ఇది ఎర్ర సముద్రాన్ని ఏడెన్ సింధుశాఖతో కలుపుతుంది.

బాబ్-ఎల్-మండేబ్
బాబ్-ఎల్-మండేబ్ ప్రాంతం
అక్షాంశ,రేఖాంశాలు12°35′N 43°20′E / 12.583°N 43.333°E / 12.583; 43.333
ప్రవహించే దేశాలుజిబౌటి, ఎరిట్రియా, యెమెన్
గరిష్ట పొడవు31 mi (50 km)
సరాసరి లోతు−609 ft (−186 m)
ద్వీపములుసెవెన్ బ్రదర్స్, డౌమీరా, పెరిమ్

పేరు మార్చు

 
దిగువ కుడివైపున బాబ్-ఎల్-మండేబ్ ను చూపించే ఎర్ర సముద్రపు బాతిమెట్రిక్ మ్యాప్

బాబ్-ఎల్-మండేబ్ అంటే దుఃఖ ద్వారం అని అర్థం. ఈ జలసంధిని దాటడంలో ఎదురయ్యే ప్రమాదాల వలన గానీ, లేదా అరబ్ పౌరాణిక గాథల ప్రకారం, అరేబియా ద్వీపకల్పాన్ని ఆఫ్రికా కొమ్ము నుండి వేరు చేసిన భూకంపంలో పెద్దసంఖ్యలో జీవులు మునిగిపోవడం వలన గానీ దానికి ఆ పేరు వచ్చింది.

భౌగోళిక శాస్త్రం మార్చు

బాబ్-ఎల్-మండేబ్ ఎర్ర సముద్రం, సూయజ్ కాలువల ద్వారా హిందూ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రాన్నీ కలుపుతుంది. 2006లో, రోజూ 33 లక్షల బ్యారెళ్ళ చమురు ఈ జలసంధి గుండా రవాణా జరిగింది. ప్రపంచం మొత్తమ్మీద జరిగిన రోజువారీ చమురు రవాణా 4.3 కోట్ల్ బ్యారెళ్ళు . [1]

జలసంధి వెడల్పు, యెమెన్‌లోని రాస్ మెన్హేలీ నుండి జిబౌటీలోని రాస్ సియాన్ వరకు 32 కి.మీ. ఉంటుంది. పెరిమ్ ద్వీపం ఈ జలసంధిని రెండు మార్గాలుగా విభజిస్తుంది. వీటిలో తూర్పు వైపు మార్గాన్ని, బాబ్ ఇస్కెండర్ (అలెగ్జాండర్స్ స్ట్రెయిట్) అని పిలుస్తారు. ఇది 3.2 కి.మీ. వెడల్పు, 29 మీ. లోతు ఉంటుంది. పశ్చిమ మార్గాన్ని డాక్ట్-ఎల్-మయూన్ అంటారు. దీని వెడల్పు 26 కి.మీ. లోతు 310 మీ. ఉంటుంది. జిబౌటీ తీరానికి సమీపంలో " సెవెన్ బ్రదర్స్ " అనే పేరున్న చిన్న ద్వీపాల సమూహం ఉంది. తూర్పు ఛానెల్‌లో ఉపరితల ప్రవాహం ఉంటుంది. పశ్చిమ ఛానెల్‌లో బలమైన అండర్‌కరెంట్ ఉంది.

చరిత్ర మార్చు

 
జలసంధి ద్వారా పెట్రోలియం ఉత్పత్తులు, ద్రవీకృత సహజ వాయువు రవాణా, 2014–2018

మయోసీన్ యుగంలో పాలియో-పర్యావరణ, టెక్టోనిక్ సంఘటనల కారణంగా యెమెన్, ఇథియోపియాల మధ్య లింకును ఏర్పరచిన భూ వంతెన, డానాకిల్ ఇస్త్మస్‌ ఏర్పడింది. [2] గత 1,00,000 సంవత్సరాలలో, యూస్టాటిక్ సముద్ర మట్టంలో జరిగిన హెచ్చుతగ్గుల కారణంగా జలసంధి నిండడం, ఎండిపోవడం జరిగాయి. [3] ఇటీవలి ఆఫ్రికా మూలం పరికల్పన ప్రకారం, ఆధునిక మానవుల తొలి వలసలకు బాబ్-ఎల్-మండేబ్ జలసంధి సాక్ష్యంగా నిలిచి ఉండవచ్చు. అప్పుడు మహాసముద్రాల మట్టాలు చాలా తక్కువగా ఉండేవని, జలసంధి లోతు బాగా తాక్కువగా ఉండడం గానీ, లేదా అసలే ఎండిపోయి గానీ ఉంటుందని భావిస్తున్నారు. దీని వలన ఆసియా దక్షిణ తీరం వెంబడి వరుసగా మానవ వలసలు జరిగాయి.

ఇథియోపియన్ ఆర్థోడాక్స్ తెవాహెడో చర్చి సంప్రదాయం ప్రకారం, బాబ్-ఎల్-మండేబ్ జలసంధి ద్వారానే ఆఫ్రికాలోకి సెమిటిక్ గీజ్ మాట్లాడేవారి తొలి వలసలు జరిగాయి. ఇది సుమారు సా.పూ. 1900 లో, దాదాపు హీబ్రూ పాట్రియార్క్ జాకబ్ కాలంలో జరిగింది. [4] హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో అక్సుమ్ రాజ్యం ఒక ప్రధాన ప్రాంతీయ శక్తిగా ఉండేది. ఇస్లాం ఆవిర్భావానికి కొంతకాలం ముందు, ఈ ప్రాంతాన్ని హిమ్యరైట్ రాజ్యం జయించడంతో జలసంధి అంతటా అది తన పాలనను విస్తరించింది.

బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ తన భారత సామ్రాజ్యం తరపున 1799 లో పెరిమ్ ద్వీపాన్ని ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంది. బ్రిటన్ ప్రభుత్వం 1857లో దానిపై తమ యాజమాన్యాన్ని నిర్థారించింది. 1861 లో అక్కడ ఒక లైట్‌హౌస్‌ను నిర్మించింది. దానిని ఉపయోగించి ఎర్ర సముద్రం, సూయజ్ కాలువ ద్వారా వాణిజ్య మార్గాలపై ఆధిపత్యం చెలాయించింది. 1935 వరకు దీన్ని ఆవిరి ఓడల్లో ఇంధనం నింపడానికి బొగ్గు స్థావరంగా ఉపయోగించారు. ఇంధనంగా బొగ్గు వినియోగం తగ్గడంతో ఈ పని లాభదాయకం కాకుండా పోయింది. [5]

1800 లలో లండన్‌లోని స్కిన్నర్స్ కంపెనీ ఉన్ని వ్యాపారం చేసేది. వారు 1887లో టన్‌బ్రిడ్జ్ వెల్స్‌లో స్కిన్నర్స్ స్కూల్‌ని స్థాపించినప్పుడు, పాఠశాల గేయంలో (చిరుతపులి పాట) బాబ్ ఎల్ మండేబ్ జలసంధికి సంబంధించిన ప్రస్తావన ఉండాలని నిర్ణయించుకున్నారు. వారు అక్కడి నుండే చిరుతపులి చర్మాలను కొని తెచ్చుకున్నారు. తరువాతి సంవత్సరాలలో ప్రధానోపాధ్యాయుల కార్యాలయం వెలుపల ఉన్న కారిడార్‌ను బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి ("ది గేట్స్ ఆఫ్ గ్రీఫ్") అని పేరు పెట్టుకున్నారు. [6]

1967 లో ఈ ద్వీపం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ సౌత్ యెమెన్‌లో భాగమైంది. అప్పటి వరకు అక్కడ బ్రిటిష్ ఉనికి కొనసాగింది. యెమెన్‌కు అప్పగించే ముందు బ్రిటిషు ప్రభుత్వం, ఈ ద్వీపాన్ని అంతర్జాతీయీకరించడానికి ఒక ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ముందు పెట్టింది [7] బాబ్-ఎల్-మండేబ్‌లో మార్గం, ప్రయాణాలకు నిరంతర భద్రత కలిగించేందుకు గాను దీన్ని ప్రతిపాదించింది. కానీ అది వీగిపోయింది.

2008లో తారెక్ బిన్ లాడెన్ యాజమాన్యంలోని ఒక కంపెనీ యెమెన్‌ను జిబౌటీతో కలుపుతూ జలసంధి మీదుగా బ్రిడ్జ్ ఆఫ్ ది హార్న్స్ పేరుతో వంతెనను నిర్మించే ప్రణాళికలను వెల్లడించింది. [8] మిడిల్ ఈస్ట్ డెవలప్‌మెంట్ LLC ఎర్ర సముద్రం మీదుగా బ్రిడ్జిని నిర్మించాలని నోటీసును జారీ చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన సస్పెండెడ్ వంతెన ఉన్న పాసింగ్ అవుతుంది. [9] డెన్మార్క్‌కు చెందిన ఆర్కిటెక్ట్ స్టూడియో డిస్సింగ్+వెయిట్లింగ్ సహకారంతో ఇంజనీరింగ్ కంపెనీ COWI కి ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పగించారు. 2010లో మొదటి దశ ఆలస్యమైందని ప్రకటించారు. అయితే, 2016 మధ్య నాటికి ఈ ప్రాజెక్టు గురించి ఇంకేమీ వినబడలేదు.

ఉప ప్రాంతం మార్చు

జిబౌటి, యెమెన్, ఎరిట్రియాలను కలిగి ఉన్న బాబ్-ఎల్-మండేబ్, అరబ్ లీగ్‌లో ఒక ఉప ప్రాంతం. 

జనాభా వివరాలు మార్చు

బాబ్-ఎల్-మండేబ్: [10]
దేశం వైశాల్యం(కిమీ 2 ) జనాభా
(2016 అంచనా. )
జన సాంద్రత
(చకిమీ)
రాజధాని GDP (PPP) $M USD తలసరి GDP (PPP) $ USD
  యెమెన్ 5,27,829 2,73,92,779 44.7 సనా $58,202 $2,249
  ఎరిత్రియా 1,17,600 63,80,803 51.8 అస్మరా $9.121 $1,314
  జిబౌటీ 23,200 8,46,687 37.2 జిబౌటి సిటీ $3.327 $3,351
మొత్తం 6,68,629 3,46,20,269 29.3 / కిమీ 2 $70,650 $1841

జనాభా కేంద్రాలు మార్చు

బాబ్-ఎల్-మండేబ్ కు రెండు వైపులా ఉన్న జిబౌటి, యెమెన్ లలో ఉన అత్యంత ముఖ్యమైన పట్టణాలు, నగరాలు:

జిబౌటీ మార్చు

  • ఖోర్ 'అంగర్
  • మౌల్‌హౌల్
  • ఫగల్

యెమెన్ మార్చు

  • అట్ టర్బా
  • చీక్ సైద్

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. World Oil Transit Chokepoints Archived ఫిబ్రవరి 18, 2015 at the Wayback Machine, Energy Information Administration, US Department of Energy
  2. The Nile: Origin, Environments, Limnology and Human Use. Springer Science & Business Media.
  3. Climate in Earth History. National Academies.
  4. Official website of EOTC Archived జూన్ 25, 2010 at the Wayback Machine
  5. Gavin, p. 291.
  6. Old Skinners School pupil
  7. Hakim, pp. 17-18.
  8. BBC NEWS | Africa | Tarek Bin Laden's Red Sea bridge
  9. Tom Sawyer (May 1, 2007). "Notice-to-Proceed Launches Ambitious Red Sea Crossing". Engineering News-Record.
  10. "CIA World Factbook". The World Factbook. Langley, Virginia: Central Intelligence Agency.