బి.వి.ఎస్.రామారావు

బి.వి.ఎస్.రామారావు ప్రముఖ కథారచయిత. గోదావరి కథల ద్వారా ప్రసిద్ధుడయ్యాడు.

భావరాజు వెంకట సీతారామారావు
జననం1932
జాతీయతభారతీయుడు
విద్యఇంజనీరింగ్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
గోదావరి కథలు
జీవిత భాగస్వామిఅన్నపూర్ణ
పిల్లలువిజయ,
సత్యకళ
తల్లిదండ్రులుభావరాజు సత్యనారాయణ,
సత్యవతి

విశేషాలు సవరించు

భావరాజు వెంకట సీతారామారావు రాజమండ్రిలో 1932లో జన్మించాడు.[1] భావరాజు సత్యనారాయణ, సత్యవతి గారలు ఇతని తల్లిదండ్రులు. ప్రముఖ రచయిత బి.వి.రమణారావు, ప్రముఖ ఇంద్రజాలికుడు బి.వి.పట్టాభిరామ్, ప్రముఖ కార్టూనిస్ట్ సత్యమూర్తి ఇతని సోదరులు. ఇతడు మెకానికల్, సివిల్ విభాగాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. మద్రాసులోని కేసరి స్కూలులో చదువుకునే సమయంలో ఇతనికి ముళ్ళపూడి వెంకటరమణ, బాపులతో స్నేహం ఏర్పడి అది చివరిదాకా కొనసాగింది.

ఉద్యోగం సవరించు

ఇంజనీరింగ్ పూర్తి అయ్యాక ఇతడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా ఉద్యోగంలోనికి చేరాడు. గోదావరి ప్రాజెక్టులో 15 సంవత్సరాలు జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ తదితర హోదాలలో పనిచేశాడు. ఆ సమయంలో ఆనకట్టల రిపేర్లు, కొత్త ఆనకట్టల నిర్మాణం, బ్యారేజీ నిర్మాణం, హైడ్రాలిక్ గేట్ల నిర్మాణం వంటి పనులలో భాగస్వామ్యం వహించాడు. అనేక వర్క్‌షాపులను నిర్వహించాడు. తర్వాత హైదరాబాదుకు బదిలీ అయ్యి 4 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేశాడు. పిమ్మట ఒక ప్రయివేటు సంస్థలో పాతిక సంవత్సరాలకు పైగా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.

కుటుంబం సవరించు

ఇతనికి భార్య అన్నపూర్ణ, ఇద్దరు కుమార్తెలు సత్యకళ, విజయ ఉన్నారు. కుమార్తెలు ఇరువురూ వివాహం చేసుకుని హైదరాబాదులోనే స్థిరపడ్డారు.

రచనలు సవరించు

ఇతడు తన బాల్య స్నేహితుడు ముళ్లపూడి వెంకటరమణ, ఆంధ్రజ్యోతి సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్యశర్మల ప్రోద్బలంతో కథలు వ్రాయడం మొదలుపెట్టాడు. సంఖ్యాపరంగా తక్కువ కథలు వ్రాసినా అవి అన్నీ పాఠకుల మన్ననలను చూరగొన్నాయి. గోదావరీనది పరిసర ప్రాంతాలలో పనిచేసినప్పుడు అక్కడి మనుషులు, మనస్తత్వాలను గమనించి "గోదావరి కథలు" వ్రాశాడు. ఈ కథలలోని ఒక కథ ఆధారంగా మంచు లక్ష్మి గుండెల్లో గోదారి అనే సినిమాను నిర్మించింది.

ఇతడు రచించిన పాక్షిక కథల జాబితా[2]:

 1. అది వాడు చేప
 2. అద్దరి ఇద్దరి
 3. ఆఫీసులో ఆవకాయ గొంతులో వెలక్కాయ
 4. ఇదం బ్రహ్మం
 5. ఎసరు అత్తెసరు
 6. గంగి
 7. గుండెల్లో గోదారి
 8. తిప్పలు
 9. త్రిలోక సుందరి
 10. పునాది
 11. పుష్కరాల రేవులో పుల్లట్లు
 12. బైరాగి
 13. రాగిడబ్బు

సినిమాలు సవరించు

ఇతడు బాపు రమణ తీసిన సినిమాలలో సాక్షి, బుద్ధిమంతుడు, అందాల రాముడు,బంగారు పిచిక మొదలైన 19 సినిమాలకు అనధికార కళాదర్శకుడిగా పనిచేశాడు. 9 సినిమాలలో కథారచనలో భాగస్వామ్యం వహించాడు.

అవార్డులు, పురస్కారాలు సవరించు

 • ఇతడు ఉద్యోగరీత్యా 1958, 1961, 1970, 1982, 1987 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అవార్డులు అందుకున్నాడు.
 • 2014లో బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారి సర్ ఆర్థర్ కాటన్ స్మారక గోదావరి పురస్కారాన్ని స్వీకరించాడు.

మూలాలు సవరించు

 1. భావరాజు, పద్మిని. "బాపురమణల సీతారాముడు". అచ్చంగా తెలుగు. Archived from the original on 13 జూలై 2015. Retrieved 14 December 2016.
 2. కథానిలయంలో బి వి ఎస్ రామారావు కథల జాబితా