బి. ఎస్. ఎల్. హనుమంత రావు

ఆచార్య భట్టిప్రోలు శ్రీలక్ష్మీహనుమంతరావు (1924-93) ప్రముఖ విద్యావేత్త. చరిత్రకారుడు. ఆంగ్లంలోను, తెలుగులోను బహు గ్రంథ రచయిత. అనువాదకుడు. వీరు రాసిన గ్రంథాలలో “ఆంధ్రుల చరిత్ర” ఉత్తమ ప్రామాణిక చరిత్ర రచనగా నిలిచింది. మరో చారిత్రిక పరిశోదక గ్రంథం "రెలిజియన్ ఇన్ ఆంధ్ర" (Religion in Andhra) పండితలోకంలో విశేష ఖ్యాతిని పొందింది.

బి. ఎస్. ఎల్. హనుమంత రావు

జీవిత సంగ్రహం మార్చు

వీరు గుంటూరు జిల్లా లోని కొల్లూరు మండలానికి చెందిన దోనేపూడి గ్రామంలో 1924 జనవరి 4 తేదీన జన్మించారు.తల్లి వెంకటలక్ష్మి. తండ్రి రామకృష్ణయ్య.వీరి తండ్రి మూల్పూరు గ్రామకరణంగా పనిచేశారు. వీరి బాల్యం మూల్పూరు, తురుమెళ్ళ, తెనాలిలో గడిచింది. వీరి ఉన్నత విద్యాభ్యాసం గుంటూరు హిందూ కళాశాలలోను, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోను గడిచింది. అక్కడ వీరికి మారేమండ శ్రీనివాసరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, గొర్తి వెంకటరావు, ఓరుగంటి రామచంద్రయ్య మొదలైనవారు ఇతనికి గురువులు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చదివిన అనంతరం కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. చేసారు. 1946 లో తెనాలి పట్టణంలో కూచిపూడి హైస్కూల్‌లో చరిత్ర అధ్యాపక వృత్తి చేపట్టి, ఆ తరువాత గుంటూరు హిందూ కళాశాలలో 1983 వరకు చరిత్ర అధ్యాపకులుగా పనిచేసారు. 1983-87 మధ్య కాలంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో మహాయాన బౌద్ధపీఠానికి గౌరవ ఆచార్యులుగా పనిచేసారు. ‘ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్’, ‘ఇండియన్ ఎపిగ్రఫికల్ సొసైటీ’, ‘ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్’ లకు గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించారు. భార్య ప్రియంవద.

రచనలు మార్చు

స్వీయ రచనలు మార్చు

  • రెలిజియన్ ఇన్ ఆంధ్ర (Religion in Andhra) (1973)
  • ద ఏజ్ అఫ్ శాతవాహన (The Age of Sathavahana) (1976)
  • ఆంధ్రుల చరిత్ర (1983)
  • ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ (Indian History and Culture)- (3 volumes)
  • భారతీయ సంస్కృతి-ఒక పరిశీలన (1993)
  • బుద్ధిజం అండ్ జైనిజం ఇన్ ఆంధ్ర దేశ (Buddhism & Jainism in Andhra Desa) (1994)
  • బౌద్ధము ఆంధ్రము (1995)
  • సోషియో కల్చరల్ హిస్టరీ అఫ్ ఏన్షియంట్ అండ్ మెడివల్ ఆంధ్ర (Socio-Cultural History of Ancient & Medieval Andhra) (1995)
  • ఎస్సేస్ ఆన్ సోషల్ మొబిలిటీ ఇన్ మెడివల్ ఆంధ్ర (Essays on social Mobility in Medieval Andhra) (1995)
  • గుంటూరు త్ర్రో ఏజెస్ (Guntur Through Ages)
  • శ్రీశైలం-హిస్టరీ అండ్ కల్చర్ (Srisailam-History & Culture)
  • మోడ్రన్ ఐరోపా (Modern Europe)

అనువాదాలు మార్చు

  • మానవ నాగరికత
  • లోకాయుత వాద పరిశీలన
  • అశోకుడు-మౌర్య వంశ క్షీణత - ఇది ప్రఖ్యాత చరిత్రకారిణి రొమిల్లా దాపర్ రచన "Asoka and the Decline of the Mauryas"కి అనువాదం.
  • గతాన్ని గురించిన అపోహలు
  • ఎం. ఎన్. రాయ్ స్వీయ గాథలు

అముద్రితాలు మార్చు

  • బుద్ధిస్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్ర దేశ Buddhist Inscriptions of Andhra Desa
  • వార్ ఆఫ్ పల్నాడు-ఇట్స్ సోషియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ (War of Palnadu- It’s Socio-Political Significance)
  • వ్యూస్ అండ్ రివ్యూస్ (Views & Reviews) - ఇది జనరంజక వ్యాసాల సంకలనం.

ముఖ్య రచనల అవలోకనం మార్చు

రెలిజియన్ ఇన్ ఆంధ్ర (Religion in Andhra) (1973): ఇది ఆంధ్రదేశంలో ప్రజా ఉద్యమాలుగా విస్తరించిన బౌద్ధ, జైన మతాలపై రచయిత చేసిన విశేష కృషివల్ల వెలువడిన ఆంగ్ల సిద్ధాంత గ్రంథం. దీనిలో ప్రాచీన కాలం నుండి సా.శ.. 1325 వరకూ ఆంధ్రదేశంలో సంభవించిన మతపరిణామాలు విశ్లేషించబడ్డాయి. ఆంధ్రదేశంలో ప్రవేశించిన బ్రాహ్మణ, బౌద్ధ, జైన, హిందూ మతాల గురించిన లోతైన అధ్యయనంతో పాటు, ముఖ్యంగా బౌద్ధ, జైన ధర్మాల గురించి రచయిత వెల్లడించిన చారిత్రిక వాస్తవాల వల్ల ఈ గ్రంథానికి పండితలోకంలో విశేష ఖ్యాతి లభించింది. 1973 లో తొలిసారిగా ముద్రించబడిన ఈ గ్రంథం తరువాత ఆర్కియాలజీ డిపార్టుమెంటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 1993 తిరిగి ప్రచురించబడింది. తెలుగులో "ఆంధ్రదేశంలో మతపరిణామాలు" పేరిట ప్రచురించబడింది

ఆంధ్రుల చరిత్ర (1994): ఆంధ్రుల చరిత్రను రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కోణంలో విశ్లేషిస్తూ సంగ్రహంగా రాయబడిన ఈ గ్రంథం ప్రామాణిక చరిత్ర రచనా గ్రంథంగా నిలిచింది. అయితే రచయిత అకాల మరణం వల్ల 1910 కాలం నాటి వరకూ మాత్రమే ఆంధ్రల చరిత్రను ఈ గ్రంథంలో పొందుపరచబడింది. తొలిసారిగా 1983 లో ముద్రించబడిన ఈ గ్రంథం 1994 లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారిచే తిరిగి ప్రచురించబడింది.

బుద్ధిజం అండ్ జైనిజం ఇన్ ఆంధ్ర దేశ (Buddhism & Jainism in Andhra Desa) (1994): ఇది పరిశోధనాపత్రాల సంకలనం. ఈ సంకలన గ్రంథం ఆంధ్ర దేశంలో జైన బౌద్ధాల నేపథ్యం మొదలుకొని వాటి అవతరణను, శాఖీయ విస్తరణను, మహాయాన, వజ్రయాన వికాసాలను, ప్రసిద్ధ బౌద్ధ, జైన క్షేత్రాలను సంగ్రహంగా వివరిస్తుంది. దీనిని తెలుగులో "ఆంధ్రదేశంలో జైన, బౌద్ధ మతాలు" పేరుతొ తెలుగు అకాడమీ 1994 లో ప్రచురించింది. ఇంగ్లీష్‌లో తెలుగు విశ్వవిద్యాలయం 1997 లో ప్రచురించింది.

గుంటూరు త్ర్రో ఏజెస్ (Guntur Through Ages) : ఆదిమమానవ యుగం నుంచి ఆధునిక యుగం దాకా గుంటూరు చరిత్రను రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కోణంలో విశ్లేషించి యుగయుగాలలో గుంటూరు చరిత్రను పరిశోధనాత్మకంగా రచించారు. తెలుగులో "గుంటూరు ప్రశస్తి" పేరుతొ రెండు భాగాలుగా ప్రచురించబడింది. మొదటి భాగంలో ఆంగ్ల వ్యాసాలు, రెండవ భాగంలో తెలుగు వ్యాసాలు ఉన్నాయి.

ద ఏజ్ అఫ్ శాతవాహన (The Age of Sathavahana) (1976): ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారిచే 1976 ప్రచురించబడిన ఈ గ్రంథంలో శాతవాహనరాజుల కాలం నాటి రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితుల విశ్లేషణ కూలంకుషంగా చేయబడింది.

బౌద్ధము ఆంధ్రము (1995): ఇది వ్యాస సంకలనం. ఈ గ్రంథంలో బౌద్ధం ఆంధ్ర దేశాన్ని, ఆంధ్ర జాతిని, ఆంధ్ర సంస్కృతిని ప్రభావితం చేసిన చారిత్రిక పరిశోధనాంశాలు వివరించబడ్డాయి. ఆంధ్రదేశాన్ని పాలించిన రాజులు బౌద్ధాన్ని ఆదరించిన తీరును, బౌద్ధం జనజీవితాన్ని, సాహితీ సంస్కృతులను, ముఖ్యంగా శిల్పకళను ప్రభావితం చేసిన తీరుతెన్నులను, ఆంధ్ర బౌద్ధ శిల్పం ప్రపంచ శిల్పరీతికి దోహదం చేసిన వైనాన్ని ఈ గ్రంథం విశ్లేషిస్తుంది. ఆ గ్రంథాన్ని తొలిసారిగా 1995 లో తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురించింది.

పురస్కారాలు మార్చు

బి. ఎస్. ఎల్. హనుమంత రావు చరిత్రలో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా కుండ కుండ జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు.

మరణం మార్చు

వీరు 1993 జూన్ 8 తేదీన హైదరాబాద్లో మరణించారు.

చరిత్రకారునిగా వ్యక్తిత్వం-అంచనా మార్చు

ప్రామాణిక పరిశోధనకు, నిశిత విశ్లేషణకు బి. ఎస్. ఎల్. హనుమంత రావు పెట్టింది పేరు. చరిత్ర రచనలో ఈయనిది నిష్పాక్షిక దృష్టిగా పేరుపొందింది. సంకుచిత భావాలకు ఏమాత్రం చోటివ్వకుండా సత్యాన్వేషణ దృష్టితో, విమర్శనాత్మక దృష్టితో వీరి చరిత్ర రచన కొనసాగడం కనిపిస్తుంది. ముఖ్యంగా చరిత్రలోని భిన్న వాదాలను సమగ్రంగా చర్చిస్తూ, సమన్వయం చేసుకొంటూ పరిశోధనాత్మకంగా సాగిపోవడం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కులమత సమస్యలను తీవ్ర సమస్యలుగా పరిగణించిన వీరు కులతత్వ మూలాలను సమగ్రంగా పరిశోధన చేసిన ఆంధ్ర చరిత్రకారులలో అగ్రగణ్యులు.

ఈయన దృష్టిలో "చరిత్ర కేవలం రాజకీయ సంఘటనల పట్టిక కాదు. భిన్న రంగాలలో మానవ కృషి, ఆ కృషి ఫలితంగా మానవ జీవితంలో, దృక్పధంలో వచ్చిన పరిణామాలు అంటే నాగరికతా సంస్కృతుల కథనం." తానూ నమ్మిన చారిత్రిక యథార్థాలను తన రచనల ద్వారా నిర్మొహమాటంగా వెల్లడించిన బి. ఎస్. ఎల్. హనుమంత రావు చరిత్ర బోధనలో, రచనలో, పరిశోధనలో లౌకికవాదిగా, మానవ వాదిగా, ఉదారవాదిగా ప్రత్యేక వ్యక్తిత్వం నిలుపుకొన్నాడు.

రిఫరెన్సులు మార్చు

మూలాలు మార్చు