బోయి విజయభారతి

తెలుగు రచయిత్రి

బోయి విజయభారతి (1941 - 2024, సెప్టెంబరు 26) తెలుగులో ప్రముఖ రచయిత్రి. ప్రముఖ కవి బోయి భీమన్న కూతురు.[1] తెలుగు సాహిత్యం, చరిత్ర, వివిధ సామాజిక అంశాలపై దాదాపు 20 పుస్తకాలు రాసింది.[2] భారతీయ కులవ్యవస్థ ఆధారంగా పురాణ, ఇతిహాసాలపై విశ్లేషణాత్మక వ్యాఖ్యానాలు రాసింది. ‘సత్యహరిశ్చంద్రుడు’, ‘వ్యవస్థను కాపాడిన రాముడు’, ‘షట్చక్రవర్తులు’, ‘రామాయణ మునులు’, ‘దశావతారాలు’, ‘నరమేధాలు - నియోగాలు’, ‘ఇతిహాసాలు మహాభారతం’, ‘పురాణాలు - మరోచూపు’, ‘ఇతిహాసాలు - రామకథ’ తదితర రచనలు వెలువడ్డాయి.[3]

బోయి విజయభారతి
జననం1941
మరణం2024 సెప్టెంబరు 26(2024-09-26) (వయసు 82–83)
జాతీయత భారతీయురాలు
వృత్తిరచయిత్రి, సామాజిక కార్యకర్త
జీవిత భాగస్వామిబొజ్జా తారకం
పిల్లలురాహుల్‌ బొజ్జా, మహిత
తల్లిదండ్రులుబోయి భీమన్న, నాగరత్నమ్మ

జీవిత విశేషాలు

మార్చు

బాల్యం

మార్చు

విజయ భారతి తూర్పు గోదావరి జిల్లా, రాజోలులో 1941లో జన్మించింది. ఈమె తండ్రి ప్రముఖ రచయిత బోయి భీమన్న, తల్లి నాగరత్నమ్మ. ఈమె తన తాత అంబేద్కర్, గాంధీలచే ప్రభావితుడైన క్రైస్తవ మిషనరీ పాఠశాలల స్థాయిలో పాఠశాలలను స్థాపించాడు. ఈమె చిన్నతనం నుండే కుసుమ ధర్మన్న వంటి ప్రముఖ దళితోద్యమ నాయకులతో పరిచయమున్న కుటుంబ వాతావరణంలో పెరిగింది.[4]

విద్య, ఉద్యోగం

మార్చు

విజయభారతి కాకినాడలోని పిఠాపురం ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ విద్యను అభ్యసించింది. కోఠిలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాలలో పోస్టుగ్రాడ్యుయేషన్ (ఎంఏ తెలుగు) చేసింది. ఈమె ' దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయం - సాంఘిక పరిస్థితులు ' అను అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందింది.[5] ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో డాక్టరేటు పొందిన ద్వితీయ మహిళ విజయభారతే. ‘ప్రాచీన సాహిత్యకోశం’, ‘ఆధునిక సాహిత్యకోశం’ ఆమె సంపాదకత్వంలోనే వెలువడినవి. ఈమె 1968లో ప్రముఖ హేతువాది, దళిత నాయకుడు, న్యాయవాది బొజ్జా తారకంను వివాహం చేసుకుంది.

కొద్దికాలం సమాచార, పౌరసంబంధాల శాఖలో అనువాదకురాలిగా సేవలందించింది. నిజామాబాద్‌ మహిళా కళాశాల అధ్యాపకురాలిగా, వైస్‌ ప్రిన్సిపల్‌గా 1965 నుంచి78 వరకు పనిచేసింది. తెలుగు అకాడమీలో రీసర్చి ఆఫీసరుగా, డిప్యూటీ డైరెక్టరుగా బాధ్యతలు నిర్వర్తించారు. అకాడమీ నుండి రాష్ట్రస్థాయి ఇంటర్‌ పాఠ్యపుస్తకాలు ఇంగ్లీషు మాధ్యమంలో రాయించే ప్రయత్నాలు చేసింది. ఇన్‌చార్జి డైరెక్టర్‌గా 1999లో పదవీ విరమణ పొందింది.[3]

సాహిత్యకృషి

మార్చు

విజయభారతి అంబేద్కర్‌ను, జ్యోతిబా ఫూలేను బాగా అధ్యయనం చేసింది. ఆ ప్రభావాలతో భారతీయ కుల వ్యవస్థ స్వరూప స్వభావాల గురించి పురాణాలు, ఇతి హాసాలు ఆధారంగా విశ్లేషణలు చేస్తూ రచనలు చేసింది. వాటిని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. వాటిలో మొదటిది పురాణాలు-కులవ్యవస్థ, సత్యహరిశ్చంద్రుడు (2002) దీని తొలి రూపం. జ్యోతిబా ఫూలేని ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమాలకు, తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన రచయిత్రి విజయభారతి. ఆమె రాసిన ‘షట్చక్రవర్తులు’ అనే పుస్తక శృంకలానికి 2003వ సంవత్సరంలో కెనడాలోని ‘డాక్టర్‌ అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ మిషనరీస్‌’, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్వ అవార్డులు వచ్చినవి.

బోయి విజయభారతి 1990ల నుండి విశేషంగా దళిత సాహిత్య విమర్శపై కృషిని కొనసాగించింది. విజయభారతి వ్యాసాలలో రెండు రకాల ధోరణులు కనిపిస్తాయి. ఆధునిక దళిత సాహిత్యాన్ని విశ్లేషించటం ఒక ధోరణి కాగా, ప్రాచీన సాహిత్యాన్ని దళిత, స్త్రీవాద కోణాల నుండి విశ్లేషించటం మరొక ధోరణి. 1990లో నలుపు పత్రికలో దళిత సాహిత్యంపై వచ్చిన ఈమె వ్యాసంలో సాంఘిక సమానత్వం, ఆర్థిక ప్రగతి, మానవ స్వేచ్ఛ వంటి రంగాలలో సమాజం నుంచి వేరుగా చేయబడిన వారు దళితులని నిర్వచించి, కుల, మతపరమైన నిషేధాలవల్ల, ఆర్థిక వ్యత్యాసాల వల్ల వేరుగా చూడబడ్తూ, సామాజిక దౌష్ట్యానికి గురి అవుతూ, నిస్సహాయంగా జీవితాలు వెళ్ళదీస్తున్న వారికోసం ఆవేదన చెందటం, సమస్యలు చిత్రించటం, మెరుగు పర్చటానికి పరిష్కార మార్గాలు సూచించటం దళిత సాహిత్య ముఖ్య లక్షణంగా పేర్కొన్నది.

రచనలు

మార్చు
  1. రాముని కృష్ణుని రహస్యాలు
  2. మహాత్మ జ్యోతి బాపూలే
  3. బాబాసాహెబ్ అంబేద్కర్
సంపాదకత్వం
  1. అంబేద్కర్ రచనలు
  2. అంబేద్కర్ ప్రసంగాలు
  3. సాహిత్య కోశం (1,2 సంపుటాలు)

జీర్ణకోశ సమస్యకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయభారతి తన 84వ ఏట 2024, సెప్టెంబరు 26న ఉదయం 6గంటలకు తుదిశ్వాస మరణించింది.[2][3]

మూలాలు

మార్చు
  1. హక్కుకు దిక్సూచి బొజ్జా తారకం - సాక్షి, జనవరి 04, 2014
  2. 2.0 2.1 "ప్రముఖ రచయిత్రి విజయభారతి కన్నుమూత". EENADU. 2024-09-29. Archived from the original on 2024-09-29. Retrieved 2024-10-04.
  3. 3.0 3.1 3.2 ABN (2024-09-29). "Boyi Vijayabharati: ప్రఖ్యాత రచయిత్రి, సాహిత్య పరిశోధకురాలు బోయి విజయ భారతి ఇకలేరు". Andhrajyothy Telugu News. Archived from the original on 2024-09-29. Retrieved 2024-10-04.
  4. A History of Telugu Dalit Literature By Thummapudi Bharathi
  5. 10 వ తరగతి తెలుగు వాచకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ ,2012, పుట-116