బ్రాండ్ (ఆంగ్లం:Brand) అనగా ఒక వర్తకుని ఉత్పత్తిని, ఇతర ఉత్పత్తులతో ప్రత్యేకించి చూపే ఒక పేరు, పదసమూహం, లేదా ఇతర లక్షణం. బ్రాండ్ లు వ్యాపారంలో, విపణీకరణలో, ప్రకటనలలో వాడుతారు. పాశ్చాత్య దేశాలలో పూర్వం తమ పశుసంపదని ఇతరుల పశుసంపద నుండి వేరు చేయటానికి వాటి పై ముద్రలు వేసుకొనేవారు. దీనినే లైవ్ స్టాక్ బ్రాండింగ్ అంటారు. ఇదే విపణీకరణలో బ్రాండింగ్ అయినది.

భారతదేశానికి చెందిన టాటా బ్రాండ్

గణక శాస్త్రం ప్రకారం బ్రాండ్ అనేది సంస్థకు కంటికి కనిపించని సొత్తు అయిననూ, దాని యొక్క బ్యాలెన్స్ షీట్ పై మాత్రం బ్రాండ్ చాలా విలువైనది. బ్రాండ్ యొక్క వాటాదారుని విలువ పెంపొందిస్తూ ఉండటానికి బ్రాండ్ స్వంతదారులు నిత్యం కృషి చేస్తూ ఉంటారు. ఒక బ్రాండ్ కు విలువ కట్టటం (అనగా ధన రూపేణా దాని విలువను నిర్వచించటం) నిర్వహణలో ఒకానొక సాంకేతికాంశం. బ్రాండ్ కు విలువ కట్టే ఈ ప్రక్రియ విపణీకరణ పెట్టుబడులను నిర్వహించటానికి, వాటాదారుని విలువ పెంచటానికి ఉపయోగపడుతుంది. సంస్థ యొక్క బ్యాలెన్స్ షీట్ పైన అది సొంతం చేసుకొన్న బ్రాండ్ లు మాత్రమే కనిపిస్తాయి. బ్రాండ్ లను బ్యాలెన్స్ షీట్ పై చేర్చే సంస్థ ఆ బ్రాండ్ లను సుదీర్ఘకాలం కొనసాగించే, వాటి విలువలను నిర్వహించే ప్రణాళికలో ఉన్నదని తెలుపుతాయి.

భారతదేశంలో వాడుకలో లేకున్ననూ, పాశ్చాత్య దేశాలలో మోటారు వాహనాల బ్రాండ్ లను మర్క్వీ (Marque) లేదా మేక్ (Make) అని వ్యవహరిస్తారు. ఒక ఉత్పత్తి, సేవ లేదా వ్యాపారానికే పరిమితం కాకుండా బ్రాండ్లు నైరూప్యంగా కూడా ఉండవచ్చును. ఉదా: రొమ్ము క్యాన్సర్ పై అవగాహన లేదా పర్యావరణ పరిరక్షణ.

సాధారణంగా బ్రాండ్ ఒక లోగోతో సూచింపబడుతుంది.

చరిత్ర మార్చు

పురాతన జర్మను భాష ప్రకారం "brandr" అనగా కాల్చటం. అప్పట్లో ఉత్పత్తిదారులు వారి ఉత్పత్తుల గుర్తింపుకై వాటి పైన కాల్చిన ముద్రలు వేసేవారు.

భారతదేశంలో వైదిక కాలం నుండే బ్రాండ్ ల ఉపయోగం ఉంది. ఇక్కడే మూలికలచే తయారు చేయబడ్డ లేహ్యం, చ్యవన్ ప్రాశ్ బ్రాండ్ తో విపణీకరణ చేయబడింది. ఆరావళి పర్వత శ్రేణులలో ఉన్న ధోసి పర్వతం పై చ్యవనుడు ఈ లేహ్యాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తయారు చేశాడు.

దేశవిదేశాలలో బ్రాండ్ ఆయా స్థానిక స్థితిగతులను బట్టి విస్తరించింది. ప్యాకింగ్ చేయబడే సమయం నుండి బ్రాండింగ్ ఉన్నదని తెలుపవచ్చును. ఒక దేశపు వస్తువులు మరొక దేశానికి ఎగుమతి చేసేటప్పుడు తయారీదారు వారి బ్రాండునో, లోగోనో, ఇతర చిహ్నాలనో పీపాలపై ఏదో ఒక విధంగా వేసేవారు.

పారిశ్రామిక విప్లవం సమయంలో స్థాపించబడ్డ ఫ్యాక్టరీలు తాము చేసే అధికోత్పత్తిని విస్తృత విపణులలో విక్రయించటానికి, అంతకు మునుపు కేవలం స్థానిక ఉత్పత్తులను ఉపయోగించే వినియోగదారులను ఆకర్షించటానికి బ్రాండ్ ఉపయోగపడేది. పియర్స్ సబ్బు, కోకా కోలా, క్వేకర్ ఓట్స్, కెల్లాగ్స్ వంటివి ఆనాటి నుండె బ్రాండింగ్ మొదలు పెట్టాయి.

1900 ప్రాంతంలో జేమ్స్ వాల్టర్ థాంప్సన్ మొట్టమొదటి సారిగా ఒక వాణిజ్య ప్రకటన ఎలా ఉండాలి అనేది ప్రకటించాడు. ఇప్పటి బ్రాండింగ్ కు సంబంధించిన అప్పటి వాణిజ్యపరమైన విశ్లేషణగా దీనిని పరిగణించవచ్చును. అతి వేగంగా సంస్థలన్నీ ఉపశీర్షికలతో, చిహ్నాలతో, చిరు ధ్వనులతో రేడియో, టీవీలపై ప్రకటనలు చేయటం ప్రారంభించారు. 1940 నాటికి ఉత్పత్తిదారులు వినియోగదారులకు బ్రాండ్ లతో సంబంధబాంధవ్యాలు ఎలా ఏర్పడుతున్నాయో, వీటికి సాంఘిక, మానసిక, నృశాస్త్ర నేపథ్యాలను ఎలా ఆపాదించవచ్చునో గుర్తించటం ప్రారంభించాయి.

తయారీదారులు తొందరలోనే వారి వారి బ్రాండ్ల వ్యక్తిత్వాలకు యౌవనం, సరదా, విలాసాలను జోడించటం నేర్చుకొన్నాయి. వినియోగదారులు ఉత్పత్తికి బదులుగా బ్రాండును కొనే ఈ నాటి బ్రాండింగ్ కు ఇదే పునాది. ఈ ధోరణిని ఇప్పటి నిర్వాహక శాస్త్రంలో బ్రాండ్ విలువ (Brand Value), బ్రాండ్ ధర్మము (Brand Equity) గా కొలుస్తున్నారు.

ఇవి కూడా చూడండి మార్చు

ఇతర లంకెలు మార్చు

  1. భారతదేశంలో ప్రముఖ బ్రాండ్ ల పేర్లు ఎలా అవతరించాయో వివరించే లంకె http://muse.jhu.edu/journals/advertising_and_society_review/v009/9.3.o-barr.html

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=బ్రాండ్&oldid=2882713" నుండి వెలికితీశారు