భగవద్గీత-ఆత్మసంయమ యోగము

భగవద్గీత
GitaUpadeshTirumala.jpg
యోగములు
1. అర్జునవిషాద
2. సాంఖ్య
3. కర్మ
4. జ్ఞాన
5. కర్మసన్యాస
6. ఆత్మసంయమ
7. జ్ఞానవిజ్ఞాన
8. అక్షరపరబ్రహ్మ
9. రాజవిద్యారాజగుహ్య
10.విభూతి
11.విశ్వరూపసందర్శన
12.భక్తి యోగము
13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ
14.గుణత్రయవిభాగ
15.పురుషోత్తమప్రాప్తి
16.దైవాసురసంపద్విభాగ
17.శ్రద్దాత్రయవిభాగ
18.మోక్షసన్యాస
గీతా మహాత్యము
గీత సంస్కృత పాఠము
గీత తెలుగు అనువాదము
హిందూధర్మశాస్త్రాలు

గమనికఆత్మసంయమ యోగము, భగవద్గీతలో ఆరవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.కర్మఫలాన్ని కోరకుండా చేయవలసిన కర్మలను చేయువాడే నిజమైన సన్యాసి,యోగి.అంతేకాని అగ్నిహోత్రాదికర్మలు మానేసినంత మాత్రాన కాదు.సన్యాసమన్నా,యోగమన్నా ఒకటే. సంకల్పాలుకలవాడు యోగికాలేడు. యోగాన్ని కోరేవాడికి మొదట కర్మయే సాధనం,కొంత సాధన తర్వాత నివృత్తి(శమం)సాధనమంటారు. ఇంద్రియవిషయాలందు,వాటి కర్మలయందు కోరికలను, అన్ని సంకల్పాలను వదిలినవాడే యోగిగా చెప్తారు.

ఎవరికివారే ఉద్దరించుకోవాలి కాని పతనం కాకూడదు.ఆత్మకు ఆత్మే బంధువు(నిగ్రహం కలవారికి), శత్రువు(నిగ్రహంలేని వారికి). మానావమాన,శీతోష్ణ,సుఖదుఃఖాలను సమానంగా చూసేవాడు, సంపాదించిన అనుభవ జ్ఞానం చే సంతృప్తి గలవాడు,కూటస్థుడు యుక్తుడై,యోగియై మట్టీని,రాతిని,బంగారాన్ని ఒకేలా చూస్తాడు. శత్రువులయందు,మిత్రులయందు,బంధువులు,సాధువులు,దుర్మార్గుల యందు సమబుద్దికలిగిన యోగి శ్రేష్ఠుడు. ఆశలను వదిలి ఏకాంతప్రదేశంలో యోగాభ్యాసం చేయాలి.

ధ్యానపద్దతి: శుభ్రమైన ప్రదేశంలో మరీ ఎత్తు లేక తగ్గు కాని పీఠంపై దర్బలు,జింక లేక పులి చర్మము,దానిపై వస్త్రం పరచి ఆసనం ఏర్పరచుకోవాలి. దానిపై నిటారుగా కూర్చుండి నాసికాగ్రం(భ్రూమధ్యం)పై చూపు కేంద్రీకరించి మనసును ఏకాగ్రంగా నిలిపి,అదుపులో ఉంచుకొని భయపడకుండా,ప్రశాంతంగా నాయందు మనసు నిలిపి నిత్యం యోగాభ్యాసం చేయువాడు నన్ను,నా స్థితినీ పొందుతాడు.

నియమాలు: ఎక్కువగా తినరాదు.ఉపవాసం చేయరాదు.ఎక్కువగా నిద్రపోరాదు.జాగరణ చేయరాదు. అన్నిటియందు మితం కలిగినవారికి ఈ దుఃఖవినాశ యోగం సిద్దిస్తుంది. యోగసాధకుని మనసు గాలిలేనిచోట ఉంచిన దీపం వలె నిశ్చలంగా ఉంటుంది. యోగము అనగా: ఇంద్రియాతీతము,జ్ఞానం చే మాత్రం గ్రహించబడిన అనంతసుఖానుభూతి,నిత్య ఆత్మానుభూతి,సుఖదుఃఖాలచే చలింపకుండడం,దుఃఖాలు దరిచేరని స్థితిని యోగమంటారు. అన్ని కోరికలను వదిలి ఇంద్రియనిగ్రహంతో ప్రపంచవిషయాలనుండి బుద్దిని మరల్చి మనసును ఆత్మయందే నిలిపి అన్య ఆలోచనలను విడవాలి. చంచలమైన మనసును విషయాలపైనుండి ఆత్మ వైపుకు మరల్చాలి. ప్రశాంతమనసుగల యోగికి బ్రహ్మానందం తనకుతానే వరిస్తుంది. దోషభావాలులేని యోగి ఈ ఆనందాన్ని ఎప్పుడూ,నిరంతరాయంగా పొందుతాడు. ఈ యోగి సమదృష్టి కల్గి అన్నిప్రాణులను తనయందు,నాయందు, తనయందు అన్నిప్రాణులనూ,నన్ను దర్శిస్తాడు.అతడియందే నా దృష్టి,నాయందే నా దృష్టి ఉంటుంది.

అర్జునుడు: కృష్ణా మనసు స్వభావసిద్దంగా చంచలమైనది కదా.గాలిని నిరోధించడం లానే కష్టమైన మనసును ఎలా నిగ్రహించగలము?

కృష్ణుడు: నువ్వన్నది నిజమే.ఐనా అభ్యాస,వైరాగ్యాలచే దాన్ని నిరోధించవచ్చు.మనోనిగ్రహం లేనిదే యోగసాధన అసాధ్యము.ఉంటే ఏ ఉపాయాలచేనైనా యోగసిద్ది పొందవచ్చు.

అర్జునుడు: మరి శ్రద్ద ఉండికూడా ప్రయత్నంచేయనివాడూ,ఏ కారణాలచేనైనా మనసు చలించి సిద్దిపొందని వాడి గతి ఏమిటి?అతడు ఇహపరాల రెండింటికీ చెడ్డ రేవడు కాడు కదా?

కృష్ణుడు: మంచికర్మలు చేయువాడికి ఎన్నడూ దుర్గతి కలుగదు నాయనా.ఇహపరాలలో అతనికి ఏ వినాశమూ కలుగదు. యోగభ్రష్టుడు మరణించిన తర్వాత పుణ్యలోకాలు పొంది అక్కడ చాలా కాలం ఉండి తిరిగి సదాచారులైన ధనికుల ఇంట పుడతాడు.లేక జ్ఞానయోగుల వంశంలో పుడతాడు కాని అటువంటి జన్మ దుర్లభం.అతడు తిరిగి సాధన ప్రారంభిస్తాడు. ఇలా జన్మ పరంపర అభ్యాసం వలన పాపపుణ్యాలను అధిగమించి పరమాత్మను పొందుతాడు. కర్మలు చేయువారికంటే,జ్ఞానులకంటే,తాపసుల కంటే యొగియే సర్వశ్రేష్టుడు.కావున నువ్వు కూడా యోగివి కావాలి. నాయందే మనసు నిలిపి,శ్రద్దతో నన్నే సేవించువాడే యోగులందరిలో ఉత్తముడు అన్నది నిస్సంశయం.