భగవద్గీత
GitaUpadeshTirumala.jpg
యోగములు
1. అర్జునవిషాద
2. సాంఖ్య
3. కర్మ
4. జ్ఞాన
5. కర్మసన్యాస
6. ఆత్మసంయమ
7. జ్ఞానవిజ్ఞాన
8. అక్షరపరబ్రహ్మ
9. రాజవిద్యారాజగుహ్య
10.విభూతి
11.విశ్వరూపసందర్శన
12.భక్తి యోగము
13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ
14.గుణత్రయవిభాగ
15.పురుషోత్తమప్రాప్తి
16.దైవాసురసంపద్విభాగ
17.శ్రద్దాత్రయవిభాగ
18.మోక్షసన్యాస
గీతా మహాత్యము
గీత సంస్కృత పాఠము
గీత తెలుగు అనువాదము
హిందూధర్మశాస్త్రాలు

గమనిక


కర్మ యోగము, భగవద్గీతలో మూడవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అర్జునుడు కర్మయోగం కన్న జ్ఞానం గొప్పదని కృష్ణుడు అభిప్రాయపడుతున్నాడని తలచి తనను యుద్ధం ఎందుకు చేయమంటున్నాడో తెలియక అయోమయానికి లోనై కృష్ణుడిని అడిగాడు. అప్పుడు కృష్ణుడు " ఈ ఒకే యోగాన్ని సాంఖ్యులకు జ్ఞాన యోగంగానూ, యోగులకు కర్మయోగంగానూ చెప్పాను. కర్మలు (పనులు) చేయకపోవడం వలనో లేక సన్యసించడంవలనో ముక్తి లభించదు. కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. బయటికి నిగ్రహపరుడుగా ఉండి మనసులో మాత్రం విషయలోలుడిగా ఉంటాడో అతడిని డాంబికుడు అంటారు. ఇంద్రియ నిగ్రహం కలిగి, ప్రతిఫలాపేక్ష లేక తన కర్తవ్యాలను నిర్వహించేవాడే ఉత్తముడు. యజ్ఞకర్మలు మినహా మిగిలినవి బంధ హేతువులు. బ్రహ్మదేవుడు యజ్ఞాల వలన ప్రజలు వృద్ది పొందుతారని ఉపదేశించాడు.

యజ్ఞాల ప్రాముఖ్యత: యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి చెంది మన కోరికలు తీరుస్తారు. యజ్ఞశేషాన్ని తిన్నవారు పాపాలనుండి విముక్తులవుతారు. కర్మల వలన యజ్ఞాలు, యజ్ఞం వలన వర్షం, వర్షం వలన అన్నం ఆ అన్నం వలన సకలభూతాలు పుడుతున్నాయి. పరమాత్మ వలన వేదాలు, వాటి వలన కర్మలు సంభవించాయి. ఈ కర్మచక్రాన్ని అతిక్రమించి, ఆచరించని వారు పాపులు. ఆత్మజ్ఞానికి చేయవలసిన కర్మలు లేవు. అతడు సర్వస్వతంత్రుడు ఐన కారణంగా కర్మలు చేయడం వలన అతనికి లాభం కానీ, చేయకపోవడంవలన అతనికి నష్టం కాని ఉండవు. నీవు కూడా నిష్కామంగా కర్మలు చేయి. జనకుడు మొదలగువారు కూడా నిష్కామ కర్మలు చేసారు. ఉత్తముల కర్మలను, ప్రమాణాలను లోకులు ప్రమాణంగా తీసుకొని ప్రవర్తిస్తారు. నాకు కూడా మూడు లోకాలలోనూ ఏ విధమైన కర్మలు చేయనవసరం లేనప్పటికీ లోకం కోసం, లోకులు నన్ను చూసి చెడిపోకుండా ఉండడం కోసం నేను కర్మలు చేస్తున్నాను. ఓ అర్జునా అజ్ఞానులు ఫలితం కొరకు కర్మలు చేస్తున్నట్ట్లే, జ్ఞానులు లోకక్షేమం కోసం కర్మలు చేయాలి. జ్ఞాని పనిచేసేవారి బుధ్ధి చలింపచేయకుండా తను పనిచేస్తూ వారి చేత కూడా పని చేయించాలి. అన్ని కర్మలూ ప్రకృతి ద్వారా జరుగుతుండగా అజ్ఞాని తనే చేస్తున్నానని తలుస్తాడు. కాని జ్ఞానికి అసలు విషయం తెలిసి అహంకార రహితంగా ఉంటాడు. అలా ఆసక్తి కలిగినవారి మార్గాన్ని జ్ఞానులు ఆటంక పరచరాదు. అన్ని కర్మలనూ నాకే సమర్పించి, కోరికలనూ, అహంకారాన్ని వదిలి దుఃఖాన్ని వదిలి వివేకవంతుడవై యుద్ధం చేయి. పై విధంగా చేసినవారు సమస్తకర్మ దోషాల నుండి విముక్తులవుతారు. మిగిలినవారు భ్రష్ఠులు. మహాజ్ఞాని కూడా ప్రకృతిపరంగా ప్రవర్తిస్తున్నప్పుడు నిగ్రహం వల్ల ఒరిగేదేముంది? రాగద్వేషాలు జ్ఞానానికి శత్రువులు. నైపుణ్యంచే చేసే పరధర్మం కన్నా గుణరహితమైన స్వధర్మం మేలు. అందువలన మరణించినా ఫర్వాలేదు.

కామం యొక్క ప్రభావం: అప్పుడు అర్జునుడు ఇష్టం లేకపోయినా మనిషి పాపాలు చేయడానికి ప్రేరణ ఏమిటని అడిగాడు. కృష్ణుని సమాధానం రజోగుణం నుండి పుట్టే కామక్రోధాలే దీనికి కారణం. పొగ చే అగ్ని, మాయచే పిండము కప్పబడినట్లు కామంచే జ్ఞానం కప్పబడి ఉంది. ఈ కామం మనస్సును ఆవరించి, వివేకాన్ని హరించి మనుషులను భ్రమింప చేస్తోంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహంతో కామాన్ని విడువు. శరీరం కంటే ఇంద్రియాలు, వాటి కన్నా మనసు, మనసు కన్నా బుధ్ధి, బుధ్ధి కన్నా ఆతమ గొప్పది. ఆత్మ వీటన్నిటి కన్నా పైన ఉంటుంది. కాబట్టి బుధ్ధితో మనసుని తద్వారా కామాన్ని జయించు.