భారత హోంరూల్ ఉద్యమం

బ్రిటీష్ ఇండియాలో ఐరిష్ హోమ్ రూల్ ఉద్యమం తరహాలో ఉద్యమం

బ్రిటిష్ పాలన నుండి విముక్తిపొంది భారతదేశానికి స్వపరిపాలన సాధించడంకోసం ప్రారంభించబడిన ఉద్యమమే భారత హోంరూల్ ఉద్యమం. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నకాలంలో యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా ఉన్న ఉడ్రోవిల్సన్‌ స్వయం పరిపాలనాధికారం సూత్రాన్ని ప్రకటిస్తూ ప్రతిదేశం లేదా ప్రతిజాతి తమకనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపాడు. ఆ సూత్రమాధారంగా బాలగంగాధర్ తిలక్, అనీ బిసెంట్ ఆధ్వర్యంలో 1916 సంవత్సరంలో హోమ్‌రూల్‌ ఉద్యమం ప్రారంభించబడింది.[1]

హోంరూల్ ఉద్యమ జెండా

కార్యక్రమాలు మార్చు

 
భారత హోంరూల్ ఉద్యమ పుస్తక ముఖచిత్రం

అనిబిసెంట్ వివిధ ప్రాంతాలు తిరిగి ఉద్యమ ప్రచారంతో, జాతీయతను గురించి ప్రజలకు వివరించింది. భారత స్వాతంత్రోద్యమంలో హోంరూల్ ఉద్యమం ఒక ప్రధాన ఘట్టంగా నిలిచింది. ఈ ఉద్యమం దేశమంతటా కొనసాగుతూ, ప్రజల్లో రాజకీయ చైతన్యం, జాతీయ దృక్పథం పెంపొందింపజేయటమేకాకుండా ఉద్యమ ప్రభావంవల్ల జాతీయవాదులను సంతృప్తిపర్చడానికి ప్రభుత్వం 1919లో మాంటేగ్ ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు చేపట్టింది. గాంధీ నాయకత్వంలో జరిగిన ఉద్యమాలకు ఈ ఉద్యమం ఇక పునాది అయింది.

ఆంధ్రదేశంలో హోంరూల్ ఉద్యమం మార్చు

దేశవ్యాప్తంగా జరుగుతున్న హోంరూల్ ఉద్యమం గురించి ఆంధ్రపత్రిక, దేశమాత, శశిరేఖ మొదలైన ఆంధ్ర పత్రికలు అనేక వ్యాసాలు ప్రచురించాయి. ఆంధ్రదేశంలో కూడా ఈ ఉద్యమాన్ని ప్రచారంచేయడంకోసం ఒక శాఖను ఏర్పాటుచేయడం జరిగింది. దానిని హోంరూల్ లీగ్ శాఖ అంటారు. ఈ శాఖకి గాడిచర్ల హరిసర్వోత్తమ రావు కార్యదర్శిగా ఉండగా, కె. నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, కె.వి.రెడ్డి నాయుడు మొదలైనవారు ఈ శాఖలో సభ్యులుగా ఉన్నారు. స్వపరిపాలనం యొక్క ప్రాధాన్యతను, ఆవశ్యకతను ప్రచారం చేశారు.

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ (17 June 2018). "జాతీయోద్యమం-హింసావాదం". Archived from the original on 11 August 2018. Retrieved 11 August 2018.