శ్రావణ మంగళవారం వ్రతం

(మంగళ గౌరీ వ్రతం నుండి దారిమార్పు చెందింది)

శ్రావణ మంగళవారం వ్రతం ఆంధ్రప్రదేశ్ లో మహిళను చేసుకొనే ఒక పుణ్యవ్రతం. దీనిని శ్రావణమాసములో మంగళవారం నాడు జరుపుకుంటారు. దీనిని మంగళ గౌరీ వ్రతం అని కూడా అంటారు.

వ్రత విధానం

మార్చు

శ్రావణ మంగళవార వ్రతం పూనిన మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో యేడు పదిహేను మందినీ, నాలుగో ఏట ఇరవై మందినీ, అయిదవ సంవత్సరం ఇరవై అయిదు మంది ముత్తయిదువులనూ పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ కొబ్బరీ వగైరా వాయనాలివ్వాలి.

అయిదేళ్ళ తర్వాత ఉద్యాపన చేయాలి.

ఉద్యాపన

మార్చు

అయిదేళ్ళయ్యాక ముప్ఫయి మూడు జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి, ఆ పైన కొత్త రవికెల గుడ్డతో వాసెన గట్టి మట్టేలూ మంగళసూత్రాలూ వగైరా మంగళాభరణాలతో పెళ్ళి కూతురుకు వాయనమియ్యాలి. పద్ధతి లోపించినా ఫలితం లోపించదు.

వ్రత కథ

మార్చు

అనగనగా బ్రాహ్మణ దంపతులు. పెళ్ళయి చాలా కాలమయినా సంతతి కలగని కారణంగా, ఈశ్వరుడి గురించి తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై " అల్పాయుష్కుడైన కొడుకు కావాలా? అయిదవతనం లేని కూతురు కావాలా?” అని అడిగాడు.

అల్పాయుష్కుడైనప్పటికీ కొడుకునే యిమ్మ" ని ప్రార్థించారు వారు. “తథాస్తు" అని వరమిచ్చి శివుడు తరలిపోయాడు. శివుడిచ్చిన వర ప్రభావం వలన అచిరకాలంలోనే, ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి, సకాలానికి చక్కటి మగబిడ్డను ప్రసవించింది.

తక్షణమే యమభటులు వచ్చి, ఆ బిడ్డను తమతో తీసుకుపోబోయారు. బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ బోరున విలపించింది. లేక లేక కలిగిన బిడ్డ వీడు. పురుడు తీరేదాక ఆగి, తదుపరి తీసుకువెళ్ళ" మని కోరింది. ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయి, పురుడు తీరగానే వచ్చారు.

అప్పుడామె "తండ్రులారా! మాటలు రానిదే. మానవుడు కాలేడు గనుక, మా శిశువు నోరార అమ్మా, నాన్నా అని పిలిచే వరకూ ఆగి, ఆ ముచ్చటయినాక గైకొమ్మంది. “సరే" అని వెళ్ళిపోయారు కింకరులు.

ఈ విధంగా అనేక కారణాలు చూపసాగింది. ఒక రోజున తల్లి - బిడ్డకు తలంటుతూ త్వరలో మరల రాబోయే యమభటులను తలచుకుని దుఃఖించసాగింది.

తల్లి విచారిస్తున్నందని తెలుసుకున్న బిడ్డ "ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” అని అడగగా, ఆమె జరిగినదంతయు వివరించింది.

విషయం తెలుసుకున్న ఆ బాలుడు " అమ్మా! ఎలాగూ అల్పాయుష్కుడి నయ్యాను. పది కాలాలుండి పుణ్యం చేసే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్లి రావాలని వుంది. కనుక, నన్ను వెంటనే పంపించు. ఈ లోపల యమదూతలు వస్తే, నేను వచ్చేదాకా ఆగమను ” అని చెప్పి బయలుదేరాడు. బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లితండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపారు. వారిద్దరూ కాశీ వెడుతూ వెడుతూ మార్గమధ్యంలో ఒక పూలతోటలో బస చేశారు.

అదే వేళకు ఆ పూలతోటలో పూలు కోసుకునే నిమిత్తం వచ్చిన, ఆ ఊరి రాజు కూతురూ, ఆమె చెలుల మధ్య తగవు వచ్చి, ఒకరినొకరు తిట్టుకోసాగారు. అందుకు కోపగించిన రాజు కూతురు "నాకీ రాత్రి పెండ్లి కాబోతూ వుంది. అదీగాక, మా అమ్మ శ్రావణ మంగళవారము నోము నోచుకుని నాకు వాయనమిస్తుంది. ఆ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలు, తిట్లు ఫలించవు ” అంటూ చేతిలో పూలను నేలమీద పారబోయగా, ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అతుక్కుని పోయాయి. అది చూసిన బ్రాహ్మణ బాలుడు "ఆ పిల్ల తన భార్యయైతే బాగుండును" అనుకున్నాడు. ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెళ్ళి కుమార్తెను చేయించాడు. రాణీ ఆమెకు శ్రావణ మంగళవారం నోము వాయనమిచ్చింది. అందరూ పెళ్ళివారి రాక కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో పెళ్ళి కుమారునికి సుస్తీగా వున్నందున, పెళ్ళి మరొక ముహుర్తానికి వాయిదా వేయవలసినదిగా మగ పెళ్ళివారి నుండి కబురు అందుతుంది.

వివాహాన్ని వాయిదా వేయడం రాజుకి ఇష్టము లేదు. తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవడం పరువు తక్కువగా భావించి, పొరుగూరికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదనే తలంపుతో మేనమామ మేనల్లుళ్ళలను ఒప్పించి, ఆ మేనల్లుడికి తన కూతురునిచ్చి పెళ్ళి జరిపించాడు. ఆ రాత్రి కలలో మంగళ గౌరీ కనిపించి "అమ్మాయీ! ఈ రాత్రే నీ భర్తకు పాము గండము వుంది. జాగ్రత్తగా వుండి, ఆ పామును... నీ తల్లి నీకు వాయనమిచ్చిన కుండలోనికి పట్టి గట్టిగా మూత నుంచమని ఆజ్ఞాపించింది.

ఆ పిల్ల ఉలిక్కిపడి లేచి చూసేసరికి, అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ, పెండ్లి కొడుకు మంచం దగ్గరకు పాకుతూ కనిపించింది. వెంటనే రాజకుమార్తె అటకమీద వున్న నోము కుండను తీయబోయింది. అది అందని కారణంగా, వరుని తొడపై నిలిచి, ఆ కుండను దింపి, పాము నందులోనికి పట్టి, ఒక రవికెల గుడ్డతో దాని మీద గట్టి వాసెనకట్టు కట్టి, మరలా అటకపై భద్రపరిచి, తాను నిశ్చింతగా నిద్రపోయింది. తెలతెలవారే వేళ, మేనమామ వచ్చి, పెండ్లి కుమారుడిని నిద్రలేపి, తనతో కాశీ తీసుకు వెళ్ళిపోయాడు.

కొన్ని రోజుల అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు. రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేయబోగా, రాకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు. మొదటి ముహూర్తమున తాళి గట్టినవాడే తన భర్త అని ప్రకటించింది. ఎవరెంత చెప్పినా మారు మనువుకు అంగీకరించలేదు. “ అసలా కాశీకి పోయిన వాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు" అని పెద్దలు అడిగారు.

అందుకా చిన్నది "తండ్రీ ! నువ్వొక సంవత్సరం అన్నదానం చెయ్యి. నేనా సంవత్సరమంతా తాంబూలం దానం చేస్తాను. అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను" అంది. అందుకు రాజు అంగీకరించాడు. తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించసాగాడు. ఆ భోక్తలందరికీ రాకుమార్తె తాంబూలదాన మీయసాగింది.

ఇంకొన్నాళ్ళలో సంవత్సరం పూర్తవుతుందనగా, కాశీకి వెళ్ళిన మేనమామా మేనల్లుళ్ళు స్వగ్రామానికి తిరిగి వెడుతూ మధ్య మార్గంలోని పూర్వపు పూలతోటలోనే బస చేసి అక్కడి సత్రంలో భోజనాలు చశారు. అనంతరం రాకుమార్తె వద్ద తాంబూల దానం పరిగ్రహిస్తుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుడిని గుర్తు పట్టి అతని చేతిని పట్టుకొని "ఇతడే నా పెనిమిటి అని యెలుగెత్తి పలికింది. పెద్దలందుకు ఋజువు కోరగా, పెళ్ళినాడు పాత్రలో నుండి తీసి తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది. అది సరిగ్గా సరిపోయింది. పిమ్మట ఆ రాత్రి కలలో మంగళగౌరీ చెప్పిన పాము విషయం చెప్పి, అటు తరువాత పామును దాచి వుంచిన కుండను తీసి చూపించగా, అందులో పాము బంగారు పామై కనిపించింది. అన్ని ఋజువులూ సరిపోవడం వలన, పెద్దలామె వాదనను అంగీకరించారు. రాజు యథావిధిగా వివాహం చేశాడు. అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోము నోయించి ఆ కాటుక నొక భరిణిలోభద్రపరిచి ఇచ్చింది.

అక్కడి బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించిన వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి, ఆ కారణంగా అంధులై సేవలు చేసేవారు గానీ క్షేమమడిగేవారు లేక నిత్య దుఃఖితులై వున్నారు. అటువంటి సందర్భంలో పెండ్లి కూతురుతో సహా పెండ్లి కుమారుడి లాంఛనాలతో వూరిలోనికి వచ్చిన బ్రాహ్మణ యువకుడిని చూసి, గ్రామస్థులందరూ విప్రదంపతుల వద్దకు వెళ్లి "మీ కష్టాలు తీరాయి. మీ కుమారుడు, రాజవైభవాలతో మీకు కోడలిని తీసుకు వస్తున్నాడు ” అని చెప్పారు.

ఆ మాటతో వారికి ఆనందం కలిగినా నమ్మకం కలగని కారణంగా ప్రజలు తమని పరిహస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు.

అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభినందనం చేశాడు. జరిగింది తెలుసుకుని వాళ్ళు ఆనందించారు. కాని, కొడుకునీ కోడలినీ చూసుకునే అదృష్టం లేనందుకు దిగులుపడగా, రాకుమార్తె తనతో తెచ్చిన శ్రావణ మంగళవారపు నోము కాటుకను అత్తమామల కళ్ళకు పూసింది.అదే తడువుగా వాళ్లకు చూపు వచ్చి, కొడుకునూ, కోడల్నీ చూసుకుని సంబరపడిపోయారు. ఈ మహాత్మ్యానికి ఆశ్చర్యపడిన యిగురుపొరుగు వారంతా "ఇంత మహిమ కలగడానికి ఏం నోము నోచేవమ్మా" అని అడగగా "శ్రావణ మంగళవారపు నోము"అని చెప్పిందామె.

అది మొదలా వూరిలోని మహిళలందరూ ఆ నోము నోచుకుని తరగని సిరులతో, చెరగని సౌభాగ్యలతో చెప్పలేనంత కాలం సుఖసౌభాగ్యలు అనుభవిస్తూ జీవించారు. ఇదే కథని పాట రూపంలో పాడుతూ ఆచరించడం కొందరికి సంప్రదాయం. ఆ నోము మంగళ గౌరీ వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణమాసంలో మంగళవారాలు ఈ నోము నోచుకుంటారు.