మహల్సాపతి

సాయి భక్తులలో అత్యంత ముఖ్యుడు మొదటివాడు మహల్సాపతి అతడు బంగారు పని చేసుకుంటూ శిరిడీలోని ఖండోబా ఆలయంలో పూజారిగా కూడా పనిచేసేవాడు బాబాను గొప్ప మహానీయుడని మొట్టమొదట గుర్తించినది మహల్సాపతే బాబాను మొదటి నించి చివరి వరకూ భక్తితోనూ విశ్వాసంతోనూ పట్టుదలతోనూ సేవించి తరించినవాడు మహల్సాపతి శిరిడీలో బాబా కనిపించిన క్రొత్తలో ఆయన పిచ్చి ఫకీరనే అందరూ తలచేవారు ఎందుకంటే ఆయన పిచ్చివాడిలా ప్రవర్తించేవారు తనలో తానె మాట్లాడుకునేవారు నిష్కారణంగా కోపించేవారు కానీ బాబాను చూడగానే మహల్సాపతి మాత్రం బాబా గొప్ప తనాన్ని గుర్తించి సేవించసాగాడు తన సమయమంతా ఆయన సన్నిధిలో సేవలోనే గడిపేవాడు.

బాబా మొదటిసారి శిరిడీలో ప్రకటమయ్యాక కొంతకాలం శిరిడీలో ఉండి తర్వాత ఎటో వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి ఒక పెళ్ళి బృందంతో కలిసి శిరిడీ చేరారు. బాబాను మహల్సాపతి వెంటనే గుర్తుపట్టి ఆయనను "యా సాయి" (రండి స్వామీ) అని ఆహ్వానించాడు. అప్పటి నుంచి ఆయనకు "సాయిబాబా" అనే దివ్యనామం స్ధిరపడింది.అంతేకాదు బాబా పూజను మొట్టమొదట ప్రారంభించినవాడు మహల్సాపతి అతడే మొదట బాబాను పూజించాడు అతడిని చూసి క్రమంగా అందరూ బాబాకు పూజ చేయడం ప్రారంభించారు అలా మనందరికీ బాబాను పూజించుకునే సంప్రదాయాన్ని మొదలు పెట్టాడు మహల్సాపతి.

మహల్సాపతి తన సమయమంతా బాబా సేవలోనే గడిపేవాడు రాత్రి పూట కూడా బాబా సన్నిధిలోనే నిద్రించేవాడు ప్రతిరాత్రి తన దగ్గర ఉన్న ఒక గుడ్డను మహల్సాపతి నేలమీద పరచేవాడు దాని మీద ఒక ప్రక్క బాబా ఒక ప్రక్క మహల్సాపతి పడుకునేవారు బాబా అతనితో "భగత్" నీవు లేచి కూర్చుని నా గుండె మీద నీ చేతి నుంచి నా హృదయంలో నిరంతరం జరుగుతూ ఉండే అల్లాహ్ నామస్మరణను గమనిస్తూ ఉండు అది ఆగిపోతే నన్ను నిద్రలేపు అన్నారు కానీ నామస్మరణ ఎప్పుడూ ఆగనేలేదు అలా బాబా మహల్సాపతి రాత్రింబవళ్ళూ నిద్రించేవారు కాదు బాబా హృదయంలో నిరంతరం జరిగే నామస్మరణను గమనిస్తూ గడిపే అవకాశము అదృష్టము ఒక్క మహల్సాపతికే దక్కాయి.

ఒకసారి బాబా మహల్సాపతికి రూ ॥ 3/-లు ఇచ్చి "రోజూ నేనిచ్చే డబ్బులు తీసుకుంటూ ఉండు త్వరలోనే గొప్ప ధనవంతడవౌతావు "అన్నారు ఎంతో పేదవాడైనప్పటికీ మహల్సాపతి ఏ మాత్రమూ చలించలేదు అతడెంతో వివేకంతో "బాబా నాకు అవేవీ వద్దు నాకు మీ నిరంతర పాదసేవ మాత్రమే కావాలి" అన్నాడు అంతటి గొప్ప విరాగి వివేకవంతుడు మహల్సాపతి.

సం: 1886 లో ఒకసారి బాబా మహల్సాపతి తొడమీద తన తల ఉంచి, "భగత్" నేను అల్లా వద్దకు వెళుతున్నాను మరలా మూడు రోజులలో తిరిగివస్తాను అప్పటి వరకూ నా శరీరాన్ని జాగ్రత్తగా సంరక్షించు ఆ తర్వాత కూడా నేను రాకపోతే వేపచెట్టు క్రింద సమాధి చెయ్యి "అని చెప్పి తన శరీరాన్ని వదిలివేశారు బాబా మీద విశ్వాసంతో మూడు రోజులపాటు కొంచెం కూడా కదలకుండా అలాగే కూర్చున్నాడు మహల్సాపతి ఆ తర్వాత బాబా తిరిగి జీవించారు అంతటి బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాడు మహల్సాపతి.

బాబా అతనిని అడుగడుగునా కాపాడుతూ ఉండేవారు అంతేకాదు బాబా అతని భక్తికి మెచ్చి అతనికి తమ పాదుకలు, కఫ్నీ, రూపాయి నాణాలు మూడు, ఒక బెత్తము ప్రసాదించారు.అతడు వాటిని భక్తితో భద్రపరచుకున్నాడు.బాబా మహాసమాధి చెందిన 4 సం:లకు ఒక పవిత్రమైన రోజున తన కుటుంబ సభ్యులకు తాను ఆ రోజు స్వర్గానికి వెళుతున్నానని చెప్పి మహల్సాపతి భోజనం ముగించి తాంబూలం వేసుకుని కఫ్నీ ధరించి అందరినీ రామనామం జపించమన్నాడు. తర్వాత తన కుమారుడైన మార్తాండ్ ను పిలిచి "భక్తి మార్గంలో జీవితం గడుపు" అని చెప్పి రామనామం జపిస్తూ ప్రాణం వదిలాడు అంతటి ఉత్తమమైన మరణాన్ని మహల్సాపతికి ప్రసాదించారు బాబా అలా బాబా అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన మహాభక్తుడు మహల్సాపతి.