మాయా దర్పణ్ కుమార్ సహానీ దర్శకత్వం వహించి నిర్మించిన హిందీ సినిమా. ఈ చిత్రం 1972లో నిర్మించబడిన సినిమాలలో ఉత్తమ హిందీ సినిమాగా జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని పొందింది.[1]

మాయా దర్పణ్
దర్శకత్వంకుమార్ సహానీ
కథనిర్మల్ వర్మ
నిర్మాతకుమార్ సహానీ
తారాగణంఅదితి
అనిల్ పాండ్య
కాంతా వ్యాస్
ఇక్ బల్ కౌల్
ఛాయాగ్రహణంకె.కె.మహాజన్
సంగీతంభాస్కర్ చందావర్కర్
విడుదల తేదీ
1972 (1972)
దేశంభారతదేశం
భాషహిందీ

నటీనటులు మార్చు

  • అదితి
  • అనిల్ పాండ్య
  • కాంతావ్యాస్
  • ఇక్‌బల్‌కౌల్

సాంకేతిక వర్గం మార్చు

  • నిర్మాత : కుమార్ సహానీ
  • దర్శకత్వం : కుమార్ సహానీ
  • కథ : నిర్మల్ వర్మ
  • సంగీతం : భాస్కర్ చందావర్కర్
  • ఛాయాగ్రహణం : కె.కె.మహాజన్

చిత్రకథ మార్చు

శిథిలమై బూజుపట్టిన చావిడి, పాతకాలపు తలుపులు, గోడలూ గల ఆ ఇంటి మధ్యకు చూస్తే ఒక యువతి కనిపిస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఒక చిన్న ఎస్టేట్‌కు దివాన్‌గా పనిచేసిన ముసలాయన చిన్నకూతురు ఆమె. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నది. ఇంకా ఆమెకు వివాహం కాలేదు. ఆమె అన్న తండ్రితో పాట్లాడి, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయి అస్సాం టీ తోటలలో పనిచేస్తున్నాడు. అతను ఆమెకు తరచు ఉత్తరాలు రాస్తూ వుంటాడు. ఆ ఉత్తరాలు చదివినప్పుడల్లా బూజు పట్టి దుమ్ముకొట్టుకొని వున్న ఆ యింటిని విడిచిపెట్టి, ఆ పచ్చని, ప్రశాంతమైన వాతావరణంలోకి పారిపోవాలని ఆమె అనుకుంటూ వుంటుంది. కాని, వృద్ధాప్యంలో వున్న తండ్రితో గల అనుబంధం ఆమెను కదలనివ్వడం లేదు. కాని, ఆమె మాత్రం, ఆ అనుబంధాన్ని తెంపుకుని వెళ్ళిపోవాలనకుంటూ వుంటుంది. స్వేచ్ఛని కోరుకుని వెళ్ళాలనుకుంటూ వుంటుంది. తండ్రి తాను కోరుకున్న అబ్బాయితో అంతస్తుల కారణంగా చూపి వివాహం జరిపించలేదు. ఆ కారణంతో తండ్రి తన యౌవనాన్ని వృథా చేస్తున్నాడు. ఆమె సహించలేకపోయింది. అయితే, వదిలి వెళ్ళడానికీ ఆమెకు మనస్కరించడం లేదు. వితంతువైన ప్రేమ; తండ్రి పరిస్థితీ ఆమెను కదలనివ్వకుండా చేస్తున్నాయి.

తనలో మార్పు రావాలనుకున్నదామె. తను మారాలి అని నిశ్చయించుకుంది. ఆమెలో ఏవో ఘర్షణలు చెలరేగుతున్నాయి; ఏవో తుఫానులు రేగుతున్నాయి...

దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటపు నీడలు ఆమెకు కనిపిస్తున్నాయి. పోరాడిన వారి శౌర్యసాహసాలు ఆమెకు కనిపిస్తున్నాయి. చారిత్రాత్మకమైన నిక్షేపాలూ, వర్తమానపు విశేషాలూ మసకమసకగా ఆమె కళ్ళ ముందు ప్రతిబింబిస్తున్నాయి.

నిశ్చితాభిప్రాయాలు గల ఒక యువక ఇంజినీరు ఆమెకు తారసపడ్డాడు. ఆమెను ఆకర్షించాడు. అతని అభిప్రాయాలు ఆమెలో స్వేచ్ఛాభావాలను చిగిరింపజేస్తున్నాయి. "అవసరం వున్నదనుకున్నప్పుడు - స్వతంత్రించడంలో తప్పులేదు" అన్న సిద్ధాంతాన్ని అతను ప్రతిపాదించాడు; ఆ ప్రతిపాదన ఆమెకు సబబుగానే కనిపించింది. తన స్వవిషయంలోనే కాదు - చరిత్రలో కూడా అలాంటి మార్పు రావాలని ఆమె ఆశించింది. తన అవసరాన్ని తన తండ్రి గుర్తించాలి; అయితే తను ఆయన సేవలను వదిలిపెట్ట కూడదు! కాని, చివరి వరకూ తండ్రి తన పట్టు వదలకుండానే కనిపించాడు. తండ్రి నిస్సహాయత, తన ప్రేమ, స్చేచ్ఛా స్వాతంత్ర్యాలు - ఆమెను ఎటూ కదలనివ్వకుండా చేస్తున్నాయి. చివరికి ఆమె ఒక నిర్ధారణకు రాగలిగింది. అస్సాం ప్రాంతాల వున్న పచ్చదనం దూరపు కొండల్లా కనిపించింది. తండ్రి స్థితిని తలచుకుని, తాను అక్కడే వుండిపోవడానికి నిర్ణయించుకుంది. ఇంజినీరుతో స్నేహాన్ని పెంచుకోవాలని కూడా నిర్ణయించుకుంది. తన చుట్టూ వున్న జీవిత వాతావరణమే ఆమెకు నచ్చింది. ప్రజలతో కలిసి నవ సమాజ నిర్మాణానికి దోహదం చెయ్యాలని నిర్ణయించుకుంది. కొత్త వూహలు, పాత బంధాలు ఒక్క చోటనే కలిపి - పాత కొత్తల మేలు కలయికతో నవసామ్రాజ్యస్థాపనకు కృషి చెయ్యలనుకున్నది.

పురస్కారాలు మార్చు

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
1972 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం - హిందీ కుమార్ సహానీ గెలుపు
1972 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రాహకుడు (వర్ణ చిత్రం) కె.కె.మహాజన్ గెలుపు
1972 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు క్రిటిక్స్ ఛాయిస్ - ఉత్తమ చిత్రం కుమార్ సహానీ గెలుపు

మూలాలు మార్చు

  1. సంపాదకుడు (1974-04-01). "మాయాదర్పణ్". విజయచిత్ర. 8 (10): 52–53.

బయటిలింకులు మార్చు