మాలిక్ కాఫుర్ ఢిల్లీ సుల్తాను అలావుద్దీన్ ఖిల్జీ (క్రీ. శ. 1296-1316) ఆస్థానములోని నపుంసక బానిస, సేనాధిపతి. వింధ్య పర్వతములకు దక్షిణమున గల హిందూ రాజ్యముల వినాశనముకు, ప్రాచీన దేవాలయముల విధ్వంసమునకు, లక్షలాది హిందువుల బలాత్కార మతమార్పిడికి, ఎనలేని సంపద కొల్లగొట్టి ఢిల్లీ చేర్చుటకు కారణభూతుడు.

మాలిక్ కపూర్ చివరి నాటకం

ఉపోద్ఘాతము మార్చు

సా.శ. 1296లో అలావుద్దీన్ తన మామ సుల్తాన్ ఫిరోజ్ షా అనుమతి లేకుండా దేవగిరి పై దండెత్తుతాడు. దాడి ఊహించని దేవగిరి రాజు రామచంద్ర ఎనలేని సంపద నొసగి సంధి చేసుకుంటాడు. విజయోత్సాహముతో తిరిగి వచ్చిన అలావుద్దీన్ మామను ఘాతుకముగా వధించి ఢిల్లీ పీఠమెక్కుతాడు. సా.శ. 1298లో గుజరాత్, మాళవదేశములపై దాడిచేసి సోమనాథ దేవాలయమును మరల విధ్వంసము గావించి అచటి లింగమును ముక్కలు చేస్తాడు[1]. ఈ పరంపరలో భాగముగా కంబయత్ (ప్రస్తుత కాంబే) పై చేసిన దాడిలో అలావుద్దీన్ కు ఒక నాజూకైన, అందగాడగు హిందూ బానిస దొరకుతాడు. ఈతనిని 'హజార్ దీనార్ కాఫుర్' అని కూడా పిలుస్తారు. వేయి దీనారముల వెలకు కొనబడ్డాడు కాబట్టి ఈ పేరు వచ్చింది. అతనిపై అలావుద్దీన్ మనసు పడుతుంది. ఆతనిని మతము మార్చి, నిర్వీర్యుని గావించి (castration) తన కొలువులో పెద్ద పదవులిస్తాడు. సుల్తాను కాఫుర్ తో స్వలింగ సంపర్కము చేసే వాడు[2]. రాజప్రాపకముతో కాఫుర్ సుల్తాను కొలువులో పలుకుబడి పెంచుకుంటాడు. అతిత్వరలో మాలిక్ నయీబ్ (సర్వ సేనాధిపతి) పదవి పొందుతాడు.

దేవగిరి పై దాడి మార్చు

సా.శ. 1307ఓ గుజరాత్ రాజు దేవగిరిలో ఆశ్రయము పొందుతాడు. దీనికి తోడు యాదవ రాజు ఢిల్లీకి చెల్లింపవలిసిన కప్పము సమయానికి కట్టలేదు. అలావుదీను పంపిన కాఫుర్ దేవగిరి నగరమును నాశనము గావించి రామచంద్రుని బందీచేసి ఢిల్లీ తీసుకుపోతాడు. సుల్తాను రామచంద్రుని విడిచి తిరిగి దేవగిరి పంపుతాడు. బదులుగా దక్షిణదేశ దండయాత్రలకు సహాయము చేయునటుల మాట తీసుకుంటాడు.

ఓరుగల్లు పై దాడి మార్చు

సా.శ. 1309లో కాఫుర్ దేవగిరి నుండి ఓరుగల్లు పై దాడికి సన్నాహాలు చేస్తాడు. అప్పటికి 18 ఏండ్ల క్రితము మార్కొ పోలో చైనా నుండి తిరిగి వెళ్ళుతూ దక్షిణ భారతము సందర్శించి భర్తను కోల్పోయిన కాకతీయ రాణి రుద్రమదేవి గురించి, ఆమె సంరక్షణలో పెరుగుతున్న ప్రతాపరుద్రుని గురించి, ఓరుగల్లులోని అమూల్యమైన సంపద గురించి వ్రాశాడు. కాఫుర్ వచ్చు సమయానికి ప్రతాపరుద్రుడు రాజ్యాధికారము చేబడతాడు. కాఫుర్ దేవగిరిమీదుగా పయనించి దారిలో సిరిపూరు కోటను స్వాధీనము చేసుకుంటాడు. విషయము తెలిసి ప్రతాపరుద్రుడు సైన్యమును సిద్ధముచేసి కోట సంరక్షణకు సన్నిద్ధుడవుతాడు. కాఫుర్ హనుమకొండను ఆక్రమించి ఓరుగల్లు ముట్టడించాడు. ఓరుగల్లు కోట శత్రు దుర్భేద్యమగు కట్టడము. బురుజునకొక నాయకుని చొప్పున తగు సైన్యముతో హిందువులు నెలరోజులు వీరోచితముగా కోటను కాపాడారు. తుదకు ముస్లిం సేనలు మట్టిగోడను చుట్టిఉన్న అగడ్తను దాటి లోపలికి ప్రవేశించగలిగాయి. ప్రతాపరుద్రుడు రాతికోటను సురక్షితముగా కాపాడగలిగాడు. విసిగి వేసారిన కాఫుర్ ఓరుగంటి పరిసరప్రాంతం, గ్రామాలు భస్మీపటలం చేసాడు. అమాయక ప్రజలను, ఆడువారిని, పిల్లలను, ముసలివారు అని కూడా చూడకుండ నరసంహారం చేశాడు. సైనికులు స్త్రీలపై అత్యాచారాలు చేశారు. ఇది తెలిసి ప్రతాపరుద్రుడు సంధికి ఒప్పుకొని అపారమైన ధనమును, గుర్రములను, ఏనుగులను బహూకరించాడు. కాఫుర్ నకు ఊహకందనంత సంపద దొరికింది. వేలాది గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు బహుభారముతో ఢిల్లీ చేరతాయి[3]. ఈ సంపదలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రము కూడా ఉన్నది[4].

హోయసాలులపై దాడి మార్చు

సా.శ. 1310లో కాఫుర్ కన్ను సంపదతో తులతూగుతున్న హోయసల సామ్రాజ్యముపై పడింది. చిరకాల శత్రువులగు హోయసాలులపై పగతీర్చుకొనుటకు రామచంద్రునకు మంచి అవకాశము చిక్కింది. దేవగిరి సాయముతో కాఫుర్ నకు బళ్ళాలుని జయించుట కష్టము కాలేదు. కదంబులు, చాళుక్యులు, హోయసలులు నిర్మించిన అతి ప్రాచీన దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ముస్లిం చరిత్రకారుడు ఫెరిష్తా ప్రకారము కాఫుర్ హలేబీడులో మసీదులు నిర్మించి కర్ణాట రాజ్యములో ఇస్లాము స్థాపించాడు.

దక్షిణ దేశ దాడులు మార్చు

కర్ణాట దేశమునుండి కాఫుర్ దండయాత్ర తమిళ దేశము ప్రవేశించింది. ఇచట ఆతని యాత్ర నల్లేరుపై బండి నడకలా సాగింది. పాండ్య రాజు జాడే లేడు. నెల దినములపాటు ఏవిధమగు ఎదురు లేక మధుర, శ్రీరంగము, చిదంబరము మున్నగు దేవాలయాలు ధ్వంసము చేయబడ్డాయి[5]. బ్రాహ్మణులు వేలాదిగా మతము మార్చబడ్డారు. బంగారు విగ్రహాలు, వజ్రవైఢూర్యాలు మొదలగు ఎనలేనంత సంపద దొరికింది.

"He then determined to raze the magnificent temple to the ground. The beauty of this shrine was such that you might say it was the paradise of Shaddad.......The roof was covered with rubies and emeralds, and in short, it was a holy place of Hindus. Nevertheless, Malik Kafur dug it up from foundations, and the head of the Brahmans and idolaters danced from their necks and fell to the ground at their feet and blood flowed in torrents"

చిట్టచివరిగా సా.శ. 1311లో రామేశ్వరము చేరుకొని అచటి దేవాలయము లూటీ చేసి తిరుగు బాట పట్టాడు[6]

ఢిల్లీ తిరిగి వచ్చిన కాఫుర్, అతడు తెచ్చిన ఐశ్వర్యము చూసిన జియాఉద్దీన్ బరానీ లెక్క ప్రకారము 20,000 గుర్రములు, 612 ఏనుగులు, 96 మణుగుల బంగారము, వజ్రాలు, ముత్యములతో నిండిన లెక్కలేనన్ని పెట్టెలు ఉన్నాయి. ఇప్పటి లెక్క ప్రకారము 241 టన్నుల బంగారము[7].

"The old inhabitants of Delhi remarked that so much gold had never before been brought into Delhi. Noone could remember anything like it, nor was there anyhing like it recorded in history"

అంతము మార్చు

సా.శ. 1316లో అలావుద్దీన్ మరణించాడు. 35 దినముల తరువాత కాఫుర్ అంటే గిట్టని వారి చేతులలో క్రూరముగా వధించబడతాడు[8].

మూలాలు మార్చు

  1. India: A History, John Keay, 2001, Grove Press, 2001, p. 257; ISBN 0802137970
  2. Same-Sex Love in India: Readings from Literature and History, Ruth Vanita and Saleem Kidwai, Palgrave, 2001, p. 132; ISBN 0312293240
  3. విజ్ఞాన సర్వస్వము, దేశము-చరిత్ర, సంపుటి 2, తెలుగు విశ్వవిద్యాలయము, 1990, హైదరాబాదు
  4. A History of India, Hermann Kulke and Dietmar Rothermund, Edition: 3, Routledge, 1998, p. 160; ISBN 0415154820
  5. History of India: Vol. V - The Mohammedan Period as Described by Its Own Historians, Sir H. M. Elliot, 2008, Cosimo, Inc., p. 151; ISBN 1605204986
  6. History of Medieval India: From 1000 A. D. to 1707 A. D. Chaurasia, R.S., 2002, Atlantic Publishers & Distributors, p.36;ISBN 8126901233
  7. Studies in Islamic History and Civilizaion, David Ayalon, BRILL, 1986, p.271; ISBN 965264014X
  8. The History of India: As Told by its own Historians, Eliott H.M. and Dowson, H, 1867, Adamant Media Corporation; ISBN 1402182120