మీరట్ కుట్ర కేసు

మీరట్ కుట్ర కేసు బ్రిటీష్ ఇండియా 1929 మార్చిలో ప్రారంభించి, 1933లో నిర్ణయం వెలువడ్డ వివాదాస్పదమైన కోర్టు కేసు. భారత జాతీయోద్యమంపై కమ్యూనిస్టులు, కార్మిక ఉద్యమ ప్రభావాన్ని నిరోధించే లక్ష్యంతో ఈ కుట్ర కేసు ప్రారంభమైంది. భారతీయ రైల్వే సమ్మెను నిర్వహించినందుకు ముగ్గురు ఆంగ్లేయులు సహా పలువురు ట్రేడ్ యూనియన్ నాయకులపై కేసును పెట్టారు. సుమారు నాలుగున్నర సంవత్సరాల పైగా కొనసాగిన ఈ కుట్ర కేసు విచారణలో 27 మంది కమ్యూనిస్ట్ నాయకులను దోషులుగా ప్రకటించి వారికి ఖైదు శిక్షలు విధించారు.

మీరట్ కుట్ర కేసులో ప్రధాన నిందితులను జైలు వెలుపల వున్నప్పుడు తీసిన ఫోటో. వెనుక వరుస నుంచి (ఎడమ నుండి వరుసగా) కె.ఎన్. సెహగల్, ఎస్.ఎస్. జోష్, హచిన్సన్, షౌకత్ ఉస్మాని, బి.ఎఫ్. బ్రాడ్లే, ఎ. ప్రసాద్, ఫిలిప్ స్ప్రాట్, జి. అధికారి, మధ్య వరుసలో: రాధారమణ్ మిత్రా, గోపెన్ చక్రవర్తి, కిషోరి లాల్ ఘోష్, ఎల్.ఆర్. కాదం, డి.ఆర్. తెంగ్ డి, గౌరవ్ శంకర్, ఎస్. బెనర్జీ, కె.ఎన్. జోగ్లేకర్, పి.సి. జోషి, ముజఫర్ అహ్మద్, మొదటి వరుస: ఎం.జి. దేశాయ్, డి. గోశ్వామి, ఆర్.ఎస్. నింబ్ కార్, ఎస్.ఎస్. మీరజ్కార్, ఎస్.ఎ. డాంగే, ఎస్.వి. ఘటే, గోపాల్ బాసక్.

నేపథ్యం మార్చు

కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ప్రభావం అంతర్జాతీయంగా ముఖ్యంగా వలస పాలిత దేశాలలో నానాటికి పెరిగిపోతుండడంతో తీవ్రంగా ఆందోళన చెందిన బ్రిటీష్ ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేయాలని నిశ్చయించింది. తమ వలస దేశాలలో (భారతదేశంతో సహా) సార్వత్రిక సమ్మెలకు పిలుపు నివ్వడం ద్వారా వ్యవస్థలను స్తంభింపచేసి, చివరకు సాయుధ తిరుగుబాటును ప్రేరేపించి ప్రభుత్వాలను పడగొడుతుందన్న భయం బ్రిటీష్ ప్రభుత్వానికి ఆవరించింది. [1]అప్పటికే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (C.P.I) కార్మికులలో కమ్యూనిజం భావాలను, సోషలిజం భావాలను చురుకుగా ప్రేరేపిస్తూవుంది. 1929 నాటికి భారతదేశంలోని బ్రిటీష్ ప్రభుత్వం జాతీయోద్యమంపై కార్మిక ఉద్యమ ప్రభావాన్ని నిరోదించాలనే కృతనిశ్చయానికి వచ్చింది. దీనిలో భాగంగానే 1929 మార్చి 29 తేదీన బ్రిటీష్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మెరుపుదాడులు నిర్వహించి పలువురు కమ్యూనిస్ట్, ట్రేడ్ యూనియన్ నాయకులను వారితోపాటు భారతదేశంలో పర్యటిస్తున్న ముగ్గురు బ్రిటిష్ కమ్యూనిస్ట్దు నాయకులను కూడా అదుపులోకి తీసుకొంది. దేశవ్యాప్తంగా నిర్భందించిన కార్మిక, కమ్యూనిస్ట్ నాయకులను విచారణ నిమిత్తం మీరట్ నగరానికి తరలించారు. దీనినే చారిత్రాత్మకమైన మీరట్ కుట్రకేసుగా వ్యవహరిస్తారు. బ్రిటీష్ ఇండియాలో కార్మిక ఉద్యమాన్ని నాశనం చేయడం మరియి జాతీయోద్యమంలో కమ్యూనిస్టులను ఏకాకులను చేయడం అనే అజెండాతో ఈ కుట్ర కేసు రూపొందించబడినట్లు చరిత్రకారులు భావించారు.

నిందితులు మార్చు

మీరట్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన భారతీయ కమ్యూనిస్ట్, ట్రేడ్ యూనియన్ నాయకులలో కె.ఎన్. సెహగల్, ఎస్.ఎస్. జోష్, షౌకత్ ఉస్మాని, ఎ. ప్రసాద్, జి. అధికారి, రాదారామన్ మిత్రా, గోపెన్ చక్రవర్తి, కిషోరి లాల్ ఘోష్, ఎల్.ఆర్. కాదం, డి.ఆర్. తెంగ్ డి, గౌరవ్ శంకర్, ఎస్. బెనర్జీ, కె.ఎన్. జోగ్లేకర్, పి.సి. జోషి, ముజఫర్ అహ్మద్, ఎం.జి. దేశాయ్, డి. గోశ్వామి, ఆర్.ఎస్. నింబ్ కార్, ఎస్.ఎస్. మీరజ్కార్, ఎస్.ఎ. డాంగే, ఎస్.వి. ఘటే, గోపాల్ బాసక్ మొదలైన వారున్నారు. అరెస్ట్ అయిన వీరితోపాటు భారతదేశంలో కార్మిక ఉద్యమం పురోగతిని పరిశీలించే నిమిత్తం వచ్చిన బ్రిటీష్ కమ్యూనిస్ట్ నాయకులు ఫిలిప్ స్ప్రాట్ (Philip Spratt), బ్రాడ్లే (Benjamin Francis Bradley), హచిన్సన్ (Hutchinson) లు కూడా ఉన్నారు.

కేసు విచారణ మార్చు

ఎస్. ఎ. డాంగే, షౌకత్ అహ్మద్, ముజఫర్ అహ్మద్ లు కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ (కొమింటెర్న్-COMINTERN) యొక్క శాఖను భారతదేశంలో స్థాపించడానికి 1921 లో కుట్ర పన్నారని, ఈ కుట్రలో వారికి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ తరుపు నుంచి వచ్చిన ఫిలిప్ స్ప్రాట్, బెంజమిన్ ఫ్రాంకిస్ బ్రాడ్లీ సహా పలువురు వ్యక్తులు సహాయం చేశారని ఈ కేసులో ప్రధాన ఆరోపణలు చేయబడ్డాయి. నేరారోరోపణలు చేయబడిన వారందరూ కమ్యూనిస్ట్లు కారు. అయినప్పటికీ బ్రిటీష్ వారు వారందరినీ బోల్షెవిక్కులు గానే జమకట్టారు. ముద్దాయిలపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) లోని 121 A సెక్షన్ ల క్రింద విచారణ చేపట్టారు. మీరట్ సెషన్స్ కోర్ట్ లో ఈ కుట్ర కేసు విచారణ సుదీర్ఘకాలం జరిగింది. లక్షల రూపాయలు మంచినీళ్ళ ప్రకారంగా ప్రభుత్వం ఖర్చుచేసింది. దేశంలోనే కాక విదేశాలనుండి సాక్షులను, పత్రాలను సమీకరించింది. ముద్దాయుల తరుపున జవహర్ లాల్ నెహ్రూ. కె.ఎన్. కట్జూ, అన్సారీ, ఎం.సి. చాగ్లా వంటి దిగ్గజాలు వాదించారు. కేసు రిపోర్టు, డిఫెన్సు వాదనలకు అనువైన డాక్యుమెంట్ పత్రాల తయారీలో కేసులో నిందితులైన పి.సి. జోషి వంటి న్యాయశాస్త్రకోవిదులు కూడా పాలు పంచుకొన్నారు. కేసు విచారణా కాలంలో మహాత్మా గాంధీ నిర్బందిత నాయకులను పరామర్శించారు. కేసు విచారణను ఎదుర్కొంటున్న నిందితులకు అన్ని వర్గాల జాతీయ నాయకుల నుంచి సానుభూతి, సహకారాలు లభించాయి.

చివరకు 1933 జనవరిలో 27 మంది నాయకులను దోషులుగా ప్రకటించి ఖైదు శిక్షలు విధించారు. ముజఫర్ అహ్మద్ కు యావజ్జీవిత ఖైదు శిక్ష విధించబడింది. డాంగే, ఘటే, జోగేల్కర్, నింబ్ కార్, స్ప్రాట్ 12 సంవత్సరాల శిక్ష విధించారు. మీరట్ సెషన్స్ కోర్ట్ విధించిన శిక్షపై అలహాబాద్ హైకోర్ట్ లో 1933 ఆగస్టులో అప్పీలు చేయగా నాటి ప్రధాన న్యాయమూర్తి సర్ షా సులేమాన్ అప్పటివరకూ నిందితులు జైలులో గడిపిన కాలాన్ని శిక్షగా పరిగణించి ముజఫర్ అహ్మద్, డాంగే, ఉస్మానీలకు 3 సంవత్సరములకు శిక్ష తగ్గించారు.[2] అదేవిధంగా ఇతరులకు కూడా శిక్షా కాలం తగ్గించబడింది.[1] ఎం.జి. దేశాయ్, హచిన్సన్, మిత్రా, జబ్వాలా, కె.ఎన్. సెహగల్, ఖాస్లె, గౌరవ్ శంకర్, కదారా, ఆల్వే లపై నేరారోపణలను కూడా ఈ అప్పీల్లో తిరస్కరించారు.

కుట్ర కేసు ప్రభావం మార్చు

మీరట్ కేసు విచారణ భారతదేశంలో కమ్యూనిజం భావజాల వ్యాప్తి పట్ల బ్రిటీష్ ప్రభుత్వానికిగల భయందోళనలను ప్రతిబింబించింది. పండిత నెహ్రూ ఈ కేసును వివరిస్తూ 'కార్మికోద్యమంపై బ్రిటీష్ వారు ప్రారంభించిన దాడి యొక్క తొలిదశగా మీరట్ కుట్రకేసు' అని వ్యాఖ్యానించారు. బ్రిటీష్ ఇండియాలో కార్మిక ఉద్యమాన్ని నాశనం చేసే లక్ష్యంతో రూపొందించబడిన మీరట్ కుట్రకేసు చివరకు బ్రిటీష్ వారికి అనుకున్న ఫలితాలను చేకూర్చలేకపోయింది. వారనుకున్నట్లుగా జాతీయోద్యమంలో కమ్యూనిస్టులు ఏకాకులు కాలేదు సరికదా అన్ని వర్గాలకు చెందిన జాతీయ నాయకుల నుంచి సహకారాన్ని పొందగలిగారు.

నాలుగున్న సంవత్సరాల సుదీర్ఘ విచారణ సమయంలో కుట్ర కేసు నిందితులు తమ కారణాలను వివరించడానికి కోర్ట్ హాలును ఒక బహిరంగ విచారణ వేదికగా సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం జరిగింది. మీరట్ కుట్రకేసు విచారణ వల్ల కమ్యూనిస్ట్ లకు మన దేశంలో మంచి ప్రచారం లభించింది. దీని ఫలితంగా భారతదేశంలో కమ్యూనిజానికి పటిష్ఠమైన స్థానం లభించింది.

కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ హరికిషన్ సింగ్ సుర్జీత్ మాటలలో చెప్పాలంటే మీరట్ కుట్ర కేసు ఖైదీలు 1933 లో విడుదలైన తరువాతనే కమ్యూనిస్ట్ పార్టీ ఒక కేంద్రీకృత బలంతో బయటకు వచ్చింది. చివరకు ఈ కేసు కమ్యూనిస్టులకు వారి ఆలోచనలను ప్రచారం చేయడానికి చక్కని అవకాశం కల్పించినట్లయ్యింది. దీని ఫలితంగా కమ్యూనిస్ట్ పార్టీ తన సొంత మేనిఫెస్టోతో, 1934 లో కమ్యూనిస్ట్ ఇంటెర్నేషనల్ కు అనుబంధంగా రాగలిగింది.[3]

కేసు విచారణ ప్రారంభమైన మొదటినుంచి ఇంగ్లాండు దృష్టిని ఆకర్షించింది, మాంఛెస్టర్ వీధి థియేటర్ గ్రూప్ అయిన రెడ్ మెగాఫోన్స్ వారు 1932 లో ప్రదర్శించిన మీరట్ నాటకానికి కథా వస్తువు అయింది, దీనిలో వలసవాదం, సామ్రాజ్యవాదం, ఇండస్ట్రియలైజేషన్ వంటివాటి దుష్ప్రభావాలు ప్రతిబింబించారు.[4]

రిఫరెన్సులు మార్చు

  • Meerut 1929-1932: Statement given in his own defence at Meerut Court, India, against a charge of " Conspiracy against the King " by Lester Hutchinson. Manchester Meerut Defence Committee, 1932.
  • Meerut: Release the Prisoners! A Statement Upon the Meerut Trial and Sentences, by National Joint Council. Published by National Joint Council, 1933.
  • Conspiracy at Meerut, by Lester Hutchinson. Ayer Publishing, 1972, ISBN 0-405-04154-3.
  • Meerut Conspiracy Case & the Left-wing in India, by Pramita Ghosh. Published by Papyrus, 1978.
  • The Great Attack: Meerut Conspiracy Case, by Sohan Singh Josh. Published by People's Pub. House, 1979.
  • Meerut Conspiracy Case and the Communist Movement in India, 1929-35, by Devendra Singh. Published by Research India, 1990.
  • Judgment on the Meerut Communist Conspiracy Case, by Meerut (India). Sessions Court, R. L. Yorke, Adhir Chakravarti, State Archives of West Bengal. Published by State Archives of West Bengal, Education Dept., Govt. of West Bengal, 1991.
  • "Meerut - the trial". working class movement library. Retrieved 5 November 2017.

వెలుపలి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 meerut-the trial.
  2. In S.H. Jhabwala And Ors. vs Emperor decided on 3 August 1933 AIR All 690 or 145 Ind Cas 481 http://indiankanoon.org/doc/1416180/
  3. Surjeet, Harkishan Singh 75th Anniversary of the Formation of the Communist Party of India, an article in The Marxist, New Delhi, Volume: 2, No. 1 Issue: January- March 1984
  4. Meerut 1932 play, by Manchester street theatre group the Red Megaphones Archived 2008-03-03 at the Wayback Machine Working Class Movement Library.